భూమి నుంచి ప్లూటో దాకా… -17

0
3

అధ్యాయం 46: త్రికాల గ్రంథం- 2

నాకెంతో దప్పికగా అనిపించింది, నేను బాగా అలసిపోయినట్లు భావించాను. నాకు మంచి నీళ్ళు కావాలి. కానీ ముగంబ, బెనోత్‌మన్ నన్ను కనుగొని – ఈ త్రికాల గ్రంథాన్ని నా నుంచి లాక్కోక ముందే నేనా పుస్తకంలోకి ప్రవేశించాలి.

పెట్టె తెరవగానే పలచని గాలి వెలువడింది. లోపల ఒక తెర, దానిపై టచ్ బటన్స్ ఉన్నాయి.

పేరు?

హనీ ఆమ్రపాలి అని టైప్ చేశాను.

పాస్‍వర్డ్?

తికమకకి లోనయ్యాను. నాకే పాస్‌వర్డ్ తెలియదు. నేను ఊహించలేకపోయాను.

“మీ పాస్‌వర్డ్ మరిచిపోయినట్లయితే, మీ గ్రామం పేరు, టెర్రిటరీ నెంబర్ ఎంటర్ చేయండి” అని సూచన కనబడింది.

నేను ఆమ్రపాలి అని పేరు టైప్ చేసి, టెర్రిటరీ నెంబర్‌ని ఎంటర్ చేశాను.

కాసేపు నిశ్శబ్దం. తరువాత కొన్ని క్షణాల పాటు వేణుగానం వినవచ్చింది. ఆ సంగీతం నన్నెప్పటికీ వెంటాడుతుంది. ఆపై అకస్మాత్తుగా తెరపై “జోస్యాల త్రికాల గ్రంథానికి స్వాగతం! మీకు కావలసిన తేదీని ఎంటర్ చేయండి!” అని కనబడింది.

ముందుగా దీనిని ధ్రువీకరించుకోడానికి పాత తేదీలను ఎంటర్ చేశాను. ఒక పొడవాటి అలమారా కనబడింది. దానిలో పుస్తకాలు, టీవీ, మానిటర్లు, రియల్ ప్లే థియేటర్లు ఉన్నాయి. ఇవి నాకు భూమిపై మనిషి చరిత్రని పాతరాతియుగం నుంచి క్రీ.శ. 3999 నాల్గవ సహస్రాబ్ది చివరి వరకూ చూపించాయి. నాగరికతలు, సామ్రాజ్యాల ఉత్థానపతనాలు, స్పేస్ యుగం, గ్రహ కాలనీల అభివృద్ధి, పతనం… అన్ని వివరాలు లభించాయి. మాంత్రిక కాలనీల కోసం అడిగినప్పుడు, నేను మొత్తంగా మాంత్రిక లోకానికే వెళ్ళినట్టు అనిపించింది. వారి శక్తి, దుష్టులు, మంచివారు, ఇంకా వాళ్ళ మధ్య యుద్ధాలు… నేను వర్తమానం వివరాలు అడిగాను, అది ఖచ్చితమైన వివరాలే అందించిందని నిర్ధారించుకొన్నాను.

సమూరా పాలనలో ఉన్న భూమిని చూశాను. ఆమ్రపాలి గురించి అడిగితే, ఓ శిథిలావస్థలో ఉన్న గ్రామం గోచరించింది, పొలాలలో ఎడ్లతో శ్రమిస్తున్న రైతులు, వాళ్ళని పర్యవేక్షిస్తున్న తెల్లగడ్డం సాధువులు కనబడ్డారు.

ఆహార దుకాణాల ముందు పొడవాటి వరుసలు ఉన్నాయి. ఎక్కడ చూసినా పేదరికమే! ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిలా, వేదనతో ఉన్నవారిలా నడుస్తున్నారు.

సాధారణ పౌరులు – అణగద్రొక్కబడినవారిలా, ఆకలితో ఉన్నవారిలా, సర్వం కోల్పోయిన వారిలా చలిస్తున్నారు.

వర్తమానాన్ని తెలిపే అనేక చిత్రాలు కనబడ్డాయి. న్యూ హోప్ ఓటమి, కుజుడిపై చక్రవర్తిగా సమూరా పట్టాభిషేకం. నన్ను విస్మయానికి గురిచేసిన అంశం మరొకటి – ద్రోహులుగా ప్రకటించి అరుణ భూములలోని ఓ కూడలిలో కొందరిని తల నరికి చంపడం! హతులైన వారిలో నా మిత్రుడు మీరోస్ కూడా ఉన్నాడు. ఇక చాలు!

ఇదంతా సంక్లిష్టంగా ఉంది. టచ్ స్క్రీన్‌పై నేను చివరి ప్రశ్న అడిగాను.

చివరి అద్భుత వస్తువు ఏది? సమూరాను చంపడానికి… భూమి మీద, కుజుడి మీద మానవ పాలనను పునరుద్ధరించడానికి అంతిమ ఆయుధం ఏది?

ఒక సొరంగం ద్వారా భవిష్యత్‍లోకి ప్రయాణం చేసినట్లుగా తెరపై ఓ ప్రవాహంలా సమాధానాలు వచ్చాయి.

నేను అలసిపోయాను. ఆ పెట్టెని మూసివేశాను. నేను నా పాఠాలను నేర్చుకొన్నాను, నా జవాబులను కనుగొన్నాను. నాకెంతో నిరాశ కలిగింది. నన్ను నేనో  జీవచ్ఛవంగా భావించాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here