అధ్యాయం 47: స్వాతంత్ర్యపు మొదటి ప్రకటన
రాత్రి చల్లగా, మరీ చీకటిగా ఉంది. ఇది బహుశా మరొక ఆరు నెలలు ఇలాగే ఉంటుంది. నేను వెళ్ళలేనంతగా అలసిపోయాను. ఆత్మలు దూరంగా వెళ్ళిపోయినట్లున్నాయి. తిరిగి వెడుతున్నప్పుడు మార్గంలో అవి నన్ను అభినందించలేదు.
సమస్యేంటంటే త్రికాల గ్రంథం ఉన్న పది చదరపు అడుగుల భారీ వెడల్పున్న ఆ పెట్టెని మోసుకురావడం. అది నా శక్తికి మించినది, పైగా నాకు అవసరం కూడా లేదు. అన్ని నా మనసులో ఉన్నాయి.
కాబట్టి ఆ అద్భుత వస్తువు లేకుండానే వెనక్కి మళ్ళాను. ట్రైటాన్ భూగర్భ రక్షణ కేంద్రాల వైపు సగం దూరం వెళ్ళేసరికి, రెండు నల్లని పొడవాటి ఆకారాలు, వాటి వెనక కొందరు సైనికులు నా వైపు పరిగెత్తుకు రావడం గమనించాను.
“హనీ! ఏం? ఏం జరిగింది? నువ్వు దానిని కనుగొన్నారా? “
నేను సమాధానం చెప్పలేదు. ఏం చెప్పాలో కూడా తెలియలేదు.
రెండు లేజర్ తుపాకులను నా ఛాతీకి ఎడమవైపు గురిపెట్టాయి. నా గుండె ఛాతీలో కుడి వైపున ఉందని వాళ్ళకి తెలియదు. నేను 50 క్రోమోజోములు కలిగి ఉన్నాను. పైగా నేను చనిపోవాలని అనుకోవడంలేదు.
వాళ్ళకీ ఏమీ తెలియదు.
“నేనా వస్తువుని గుర్తించాను! రండి! నాతో రండి!” అన్నాను
“ఎలా? ఎలా మరియు ఎక్కడ?”
వారు ఆత్రుతగా ఉన్నారు, ఉత్కంఠతో ఉన్నారు. గొంతు వణుకుతోంది.
“నాతో రండి!” అన్నాను. ఒక పరిష్కారం వెతకడానికి నా మనస్సు పరుగులు తీస్తోంది. సమారా యొక్క ఈ భయంకరమైన ఏజెంట్ల నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాను.
మేము మళ్లీ వెనక్కి నడిచాము.
“నేను ఇక్కడ త్రవ్వాను, ఇక్కడే కనిపించింది” అంటూ మంచు శిఖరం వద్ద ఒక స్థానం చూపాను.
వారు నలుమూలలా పరుగెత్తి, పైకి క్రిందికి చూసారు.
“నాతో మాట్లాడిన దయ్యాలు ఎక్కడ ఉన్నాయి? వారు నాకు సహాయం చేస్తారా?” అని నేను ఆలోచిస్తున్నాను.
కానీ అక్కడ ఏమీ లేదు. తెల్ల గడ్డం తాంత్రికులు లేరు, దయ్యాలు, లేదా ఏడుపు శబ్దాలు ఏవీ లేవు.
“ఇక్కడ ఏమీ లేదు! మానవ పంది! నువ్వు అబద్దం చెపుతున్నావు! ఇక్కడ మంచు మాత్రమే ఉంది. అంతకు మించి మాకేమీ కనబడడం లేదు!”
నేను ఆశ్చర్యపోయినా, సంతోషించాను.
అప్పుడు తట్టింది నాకు. వారు దానిని చూడలేరు. నేను ఒక్కడినే చూడగలను! నేను ఎంపికైన వ్యక్తిని. బహుశా శాపగ్రస్థుడిని? నేను 50 క్రోమోజోములున్న లేదా నీలి కాంతిని ఇంకా అద్భుత వస్తువులను చూడగల కళ్ళు కలిగిన ఉత్పరివర్తిని.
ఏం చేయాలో నాకు తెలుసు.
“నేను దాన్ని చూసాను. మీరు చూడలేక పోతే, మీ ఖర్మ. మీ ఆల్ఫా సెంటౌరీ వాళ్ళు పనికిరాని చెత్త, కనీసం మాయల కాంతివలయాన్ని సైతం గుర్తుంచలేని దద్దమ్మలు. మీరు నన్ను హేళన చేస్తారా?” అన్నాను.
“ఓయ్ మానవ నక్క! నువ్వు కనుగొన్నదాని గురించి చెప్పు! అది బాంబా? కత్తా? విల్లంబులా? ఏంటి?”
ఇద్దరు నల్లటి తాంత్రికులు, వారి సెక్యూరిటీ గార్డుల వెనుక నేను ఏనిమోయిడ్, డిమిట్రీ, ఇంకా చీర ధరించిన ప్రకృతి నీడలను చూశాను.
టెలిపతీ ద్వారా నేను వారికి ‘దాడి’ చెయ్యమని సందేశాన్ని ఇచ్చాను.
‘యురేకస్! అటాక్!’ అంటూ నేను నా వేళ్లను వాళ్ళవైపు తిప్పాను.
ఇరువైపుల నుంచి ఎర్రటి కాంతులతో, తెల్లని ధారల శక్తికిరణాలు ప్రయాణించాయి. యురేకస్ వెనుక నుండి వారిపై దాడి చేయగా, నేను ఆల్ఫా సెంటారీ మాంత్రికుల తలలో నా కిరణాలతో దాడి చేశాను.
ఆ గ్రంథంలో చెప్పారు – వాళ్ళని నిర్మూలించాలంటే తలలో కాల్చి, వారి కార్టెక్స్‌ని నాశనం చేయమని. భద్రతా దళాలు కూడా దాడి చేయడానికి ప్రయత్నించాయి, కాని యురేకస్ ముందుగానే వాళ్ళపై దాడి చేసింది.
ఇంకా నా జట్టులోని ముగ్గురు సభ్యులు తమ చేతి వేళ్ళ నుండి లేజర్ కిరణాలను పంపారు.
ఒక నిమిషంలో పోరాటం ముగిసిపోయింది. చనిపోయిన గార్డుల నుండి లేజర్ తుపాకీలను తీసుకుని, రక్షణ కేంద్రానికి పరిగెత్తాను.
“ట్రైటాన్ రక్షణ కేంద్రాన్ని మా ఆధీనంలోకి తీసుకుంటున్నాం” అని అరిచాను. “ఇది స్వాతంత్ర పోరాటం” అన్నాను.
“మొదట, కమ్యూనికేషన్ ప్యానెల్స్‌ని దెబ్బతీయండి! తర్వాత గార్డుల తలలకు గురి పెట్టండి! తుపాకులు, ఇంకా విశ్వశక్తిని ఉపయోగించండి! స్వేచ్ఛ పొందేందుకు ఇదే చివరి అవకాశం!” అంటూ ఆదేశాలిచ్చాను.
మేము మెట్లు దిగి క్రిందికి వెళ్ళాము. మేం నలుగురం, ఇంకా లోహ యంత్రం యురేకస్… గార్డులు తుపాకీలతో వస్తున్నారు, మాపై కాల్పులు జరుపుతున్నారు.
బీభత్సమైన యుద్ధం.
తుపాకీ కాల్పులు జరుపుతూనే నేను అరిచాను. “స్వేచ్ఛను కోరుకునేవారు కాల్పులు జరపకండి. సమూరా పట్ల విశ్వాసం లేని వాళ్ళు దయచేసి మాతో చేతులు కలపండి. లేదంటే అందరినీ చంపవలసి వస్తుంది.”
వారంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు, ఒక్కరు తప్ప మిగతా అందరూ తుపాకీలను వదిలేసి, చేతులు పైకెత్తారు.
ఏనిమాయిడ్ ఒకే ఒక షాట్‌తో తుపాకీ పట్టుకున్న ఆ ఒక్కడినీ కాల్చేసాడు.
“కమ్యూనికేషన్ ప్యానెల్స్‌ని నాశనం చెయ్యండి! ఈ వార్తలు ఏవీ బయటకు పొక్కకూడదు. మేము అంతరిక్షకేంద్రానికి వెళ్ళి, ఏదైనా వాహనాన్ని స్వాధీనం చేసుకొంటాం” అన్నాను.
ట్రైటాన్ భూగర్భ రక్షణ కేంద్రానికి నిప్పుపెట్టాం. అక్కడ నిలిపి ఉంచిన వాహనాలెక్కి స్పేస్‌పోర్ట్‌కు దారి తీసే హైవే మీదకి మళ్ళించాం.
బహుళ జాతి మానవులు నిశ్శబ్దంగా ఉన్నారు, కానీ ఎట్టకేలకు వారి ముఖాలపై చిరునవ్వు వెలసింది.
“మనమందరం హైజాక్ లేదా బెదిరింపులు ద్వారా తప్పించుకోవాల్సి ఉంటుంది. స్పేస్ ప్లాట్‌ఫామ్‌కి చేరుకుని మనమో స్పేస్ షటిల్‌ని స్వాధీనం చేసుకుందాం. అక్కడ నుండి భూమికి చేరుకుందాం. లేదా త్వరిత ప్రయాణం కోసం టేకియన్ హైపర్ స్పేస్ ఫ్లయిట్‌ని పట్టుకుంటాము” అని చెబుతూ, కొన్ని క్షణాలు ఆపాను.
“మీరు ప్రక్రియలో మీరు చనిపోవచ్చు లేదా బ్రతికిపోవచ్చు. మాతో చేరడానికి ముందు బాగా ఆలోచించుకోండి. సరేనా?”
పన్నెండో ఇంకాస్త ఎక్కువగా ఉన్న సిబ్బంది ఏకగళంతో ఇలా అన్నారు:
“మేము మీతోనే ఉంటాము!”
“ఎంపిక చేయబడిన వ్యక్తి నెప్ట్యూన్ యొక్క ట్రైటాన్‌ని స్వాధీనం చేసుకుంటాడు. మానవుల మొదటి స్వాతంత్ర్య సమరపు ప్రకటన వెలువరిస్తాడు” అని త్రికాల గ్రంథం చెప్పింది.
నేను అలాగే చేశాను. ఆల్ఫా సెంటారీ తాంత్రికులు నశించాకా నా ఆత్మవిశ్వాసం, పట్టుదల తిరిగి వచ్చాయి. నా ప్రతీకారం కొద్దిగా నెరవేరింది.
“యో-హో! ‘భూమి వైపుకు!’ అది మన మిషన్ పేరు” అంటూ అరిచాను.
ఇక మా రోవర్‌క్రాఫ్ట్ నక్షత్ర కాంతితో నిండిన నిశీధిలో ముందుకు సాగిపోయింది.