అధ్యాయం 57: ఒయాసిస్ ది తైబెత్ – సహారా ఎడారి
మేము తిరుగుబాటుదారుల వద్దకు వెళ్ళితీరాలి.
ఘనమైన సహారా ఎడారికి మేము వెళ్ళాలి.
ఇక్కడ అమెరికాలో సమూరా రహస్య వేగులు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మాయమంత్రాలలో పారిపోవడానికీ వీల్లేదు, ఎందుకంటే ఇప్పుడు మంత్రగాళ్ళే పాలకులు. విమానాశ్రయాలలో మా పత్రాలను సమర్పించవలసి ఉన్నందున మేము మారువేషంలో వెళ్ళలేము.
అవును, ఆఫ్రికాలోని ఒకప్పటి అల్జీరియాలోని ‘విలాయ డి ఔర్‌గ్లా’ లోని ఒయాసిస్‌కి మేము వెళ్ళవలసి ఉంది.
ఫ్రాన్స్‌లోని పారిస్‌కి వెళ్ళడం ఉత్తమం. అక్కడ విమానమెక్కి ఆల్జీర్స్‌కి, అక్కడనుండి ఔర్‌గ్లాకు వెళ్ళి, తిరుగుబాటుదారులను కలవాలి.
కానీ ఎలా?
చర్చల మధ్య రాత్రి గడిచిపోయింది. ఒకే మార్గం – వంచన, అబద్ధాలు ద్వారా సాధ్యం.
కాబట్టి, మరుసటి రోజు నేను న్యూ హోప్ సిటీలో మాకు లైజాన్ వ్యక్తిగా ఉన్న సమూరా వ్యక్తిగత కార్యదర్శికి ఒక సందేశాన్ని పంపాను.
“సరే, ఒప్పుకుంటున్నాను! దక్షిణాసియా పరిపాలకుడిగా సమూరా సామ్రాజ్యానికి సేవలందించడం నాకు సంతోషంగా ఉంటుంది. నాకు ఉత్తర్వులు ఇవ్వండి!”
తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి.
కుజగ్రహపు అరుణభూముల చిహ్నంతోనూ, రెండు కత్తులు చిహ్నంతో ఉన్న లెటర్‌హెడ్‌పైల్ క్లుప్తంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలని వ్రాసి పంపాడు సౌర వ్యవస్థ చక్రవర్తి సమూరా. ఎరుపు, బంగారు రంగుల సీల్డ్ కవర్‌లో కార్యదర్శి సంతకం చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్తర్వు, అనేక ఉపనిబంధనలు, ప్రకరణలతో నా విధులు, బాధ్యతలను తెలిపారు.
చివరగా సమూరాచే సంతకం చేయబడింది.
కార్యదర్శి కుజగ్రహానికి చెందిన హ్యుమనాయిడ్. తలపై యాంటెనాతో నెరిసిన జుట్టుతో బాగా అనుభవజ్ఞుడిలా ఉన్నాడు. చురుకైన చూపులున్న అతను ఉదయం 10.00 గంటలకు స్వయంగా మా గదికి వచ్చి, ఉత్తర్వులు నాకు అందించాడు. కొద్దిమంది అధికారిక విలేఖరులతో టివి కవరేజ్, వార్తా నివేదికలు తయారు చేయబడ్డాయి.
“గవర్నర్ హనీ ఆమ్రపాలి! మీకు అన్ని హక్కులు ఉంటాయి. మీరు న్యూఢిల్లీ లోని రాయల్ ప్యాలెస్ (గతంలో బ్రిటీష్ పాలనలో వైస్రాయి హౌజ్, స్వతంత్ర్య భారతదేశంలో రాష్ట్రపతి భవన్ అని పిలవబడింది) నివాసముంటారు, అక్కడి నుంచే బాధ్యతలు నిర్వహిస్తారు. అన్ని రక్షణ వ్యవస్థలు, ఆర్ధిక వ్యవస్థలపై మీరు నియంత్రణను కలిగి ఉంటారు. మీరు కోరుకున్నట్టుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తారు. ఈ సామ్రాజ్యంలో మీరు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చు, మీకు దౌత్యపరమైన రక్షణ ఉంటుంది…”
స్పష్టంగా చివరి నిబంధన నన్ను ఆకట్టుకుంది. నేను నా ప్రణాళికలను సిద్ధం చేసాను.
“చక్రవర్తికి ధన్యవాదాలు! నేను బాధ్యతలు తీసుకోడానికి ముందు ఒక వారం రోజులు సెలవు తీసుకుంటాను.”
“మీ ఇష్టం. సామ్రాజ్యం మీ పట్ల సంతోషంగా ఉంది. మీరు బాధ్యతలు చేపట్టిన మరుక్షణం, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, ఇంకా అఘోర బలగాల తాంత్రికులు మీ నియంత్రణలో ఉంటారు. మీ ఆజ్ఞలు పాటిస్తారు. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక్కడే మీకో సలహాదారుని నియమించాం. అతనితో కలసి మీరేం చేయాలో నిర్ణయించుకోవచ్చు. అతని పేరు రణసింహ. ఆయన న్యూఢిల్లీ ఉండే మా ఏజంట్, మీతో ఉంటాడు. అతను చాలా ఉన్నత స్థాయి మాంత్రికుడు. ఆయన కూడా మీ లాగే ఒక ఎంపిక చేయబడిన వ్యక్తి. ఆయన సామ్రాజ్యానికి చాలా విశ్వసనీయుడు” అంటూ ఓ క్షణం ఆపాడు. “గవర్నర్ గారూ, మీ లానే! మా సామ్రాజ్యంలో విధేయత కీలకం” అన్నాడు.
“రెండు కాళ్ళూ, రెండు చేతులు, రెండు కళ్ళు, మామూలు మెడడు ఉన్న సాధారణ మనుషుల శ్రేయస్సు మీకు ముఖ్యం కాదు” అనుకున్నాను.
“అవును, వాళ్ళు మన బానిసలు, అసమర్థులు. వాళ్లతో కఠినంగానే ఉండాలి. సామ్రాజ్య రాజ్యాంగం ప్రకారం సాధారణ పౌరులకు హక్కులు లేవు. విశ్వశక్తిని ప్రయోగించగల్గినవారే పాలకులు.”
దేవుడా! ఈ మనిషి నా మనస్సును చదివేస్తున్నాడు. ఇతనో టెలీపాత్.
“ఒక వారం సెలవు. అది చాలు” అని అన్నాడు.
నియామక పత్రాన్ని నాతోనే ఉంచుకున్నాను.
నేను సెలవులో పారిస్ వెళ్ళేందుకు టిక్కెట్లు కొనడానికి ఇప్పటికీ నా దగ్గర కొంత డబ్బు ఉంది.