అధ్యాయం 59: మధ్య మరియు దక్షిణ ఆసియా గవర్నర్ జనరల్
అక్కడి దీపాలు ఆరిపోగానే మేం వెనక్కి వచ్చాం.
నాయకులు కాంతి కిరణాల రూపంలో లోపలికి రాగానే, ఫ్లయింగ్ సాసర్ ఆకాశంలో అదృశ్యమయ్యింది. అంతకుముందే నీడల్లా ఉన్న ప్రేక్షకులు దూరంగా వెళ్లి ఎడారిలోని చీకట్లలో కలిసిపోయారు. మేము కూడా మినుకు మినుకుమంటూ వెలుగుతున్న నక్షత్రాలున్న ఆకాశం కింద ఉన్న మా టెంట్ హోటల్‌కి తిరిగి వెళ్ళిపోయాము.
మర్నాడు ఉదయం మేము వీలయినంత త్వరగా గది ఖాళీ చేశాము. మేము ఒక టాక్సీలో వర్గలా విమానాశ్రయానికి చేరాం. రాజధాని అల్జీర్స్‌కి 11:00 గంటకు బయల్దేరే ఏకైక విమానం ఎక్కాం.
అల్జీర్స్ నుండి పారిస్ చేరాం. పారిస్ విమానాశ్రయంలో న్యూఢిల్లీకి వెళ్లడానికి వేచి ఉన్నప్పుడు – కాబోయే గవర్నర్ జనరల్‍నయిన హనీ ఆమ్రపాలి అనే నేను – ఢిల్లీ చేరుకుంటున్నానని అధికారులకు సందేశాన్ని పంపాను.
ఢిల్లీలోని స్వామి భూతనాథ్ విమానాశ్రయంలో దిగగానే ఘనస్వాగతం లభించింది. ఏదో అనామక గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ నుండి నా హోదా – మధ్య మరియు దక్షిణ ఆసియా గవర్నర్ జనరల్‌గా మారిపోయింది. నేనిప్పుడు స్థానిక అఘోరా మాంత్రిక సలహాదారుకీ, చక్రవర్తి సమూరాకి మాత్రమే జవాబుదారీని. నాకు సైన్యం నుంచి, అఘోరీ నాయకుల నుంచి గన్ శాల్యూట్, సైనిక వందనం లభించాయి.
విధి ఎలా మలుపులు తిరుగుతుందో, ఆ మార్పులను మానవ మనస్సు ఎలా స్వీకరిస్తుందో అంతా చిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులపై తిరుగుబాటు కూడా చేస్తుంది!
గతంలో ఒకసారి నేను ఈ విమానాశ్రయానికి వచ్చినప్పుడు, అప్పుడు అది వీర ఎయిర్‌పోర్ట్ అని పిలవబడింది. అప్పుడు నేను నా గతాన్ని అన్వేషిస్తున్న సాధారణ పౌరుడిని, పైగా కిడ్నాప్ చేయబడ్డాను. ఇప్పుడో…. నా చూపు ఎక్కడ పడితే అక్కడి రాజుని.
ప్రకృతికి చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఇక్కడ ఆమె ఆకుపచ్చ పట్టు చీర, బంగారురంగు అంచులున్న ఎరుపు రవిక ధరించింది. గులాబీలు, మల్లెలు ఆమె సిగని అలంకరించాయి. ప్రథమ మహిళగా తన స్థాయికి తగ్గట్టుగా పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో తనకి ఓ వజ్రాల ఉంగరమో లేక బంగారు గొలుసో కొందామంటే మా దగ్గర డబ్బు లేదు. కాబట్టి ఆ అంతరాన్ని పువ్వులు పూరించాయి, ఆమె అందాన్ని మరింత పెంచాయి. అయితే, ఇది ఎక్కువ కాలం ఉండదని మాకు తెలుసు. అధికారులు మమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచేందుకు, రాచదంపతుల వలె మర్యాదలందించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ మేము అందుకు తగము.
అంతా త్వరలో నశించిపోయే కల ఇదని నాకు తెలుసు. పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఈ హోదా పొందానని నాకు తెలుసు… హిందీలో ఏదో సామెత చెప్పినట్టు “ఏక్ దిన్ కా సుల్తాన్” నేను! రెండు వారాలలో అంతా మారిపోతుంది.
పైగా నేను ట్రైటాన్‌లో త్రికాల గ్రంథం చదివాను!
మేము ఏనిమాయిడ్, యురేకస్‌లతో కలసి రాయల్ ప్యాలెస్‌లో అడుగుపెట్టాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం దీన్ని “వైస్రాయి హౌస్” అనీ, ఆ తరువాత “రాష్టప్రతి భవన్” అని పిలిచేవారు. శతాబ్దాలు గడిచే కొద్దీ ఆ భవనం మరింత ప్రాచీనతని సంతరించుకుంది, కానీ అది ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంది మరియు పాతకాలపు విలువ పొందింది. కానీ ఇప్పుడది బలోపేతం చేయబడిన, అత్యంత రక్షణ గల కట్టడం. నేను లోపలికి ప్రవేశిస్తుండగా లేజర్ తుపాకీలతో కూడిన దళాలు, క్లోన్డ్ సైనికులు కవాతు చేశారు. యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ మోహరించబడ్డాయి. భద్రత కోసం గగనతలం నుంచి నేలని సర్వే చేస్తున డ్రోన్‌లను గమనించాను.
రెండు రోజుల్లో రాజభోగం! నా మనస్సాక్షి అత్యాశకి గురైంది, వెనకటి పట్టుదల సడలింది.
వేకువ జామున మేము “ఆసియా ప్రభువుకు వందనాలు” వంటి ప్రశంసా గీతాలతో మేల్కొన్నాము. సేవకులు వినయ విధేయతలతో వడ్డిస్తుంటే మేము రుచికరమైన అల్పాహారం ముగించాం. అప్పుడు వివిధ వ్యవహారాల కార్యదర్శులచే ప్రపంచ వార్తల వివరణ, అనంతరం స్థానిక నాయకులతో మరియు పాలకులతోనూ చర్చలు!
భోజనం మరియు మధ్యాహ్న సమయాలు ఏకాంత వ్యవహారం.
సాయంత్రాలు సాధారణ వివరణల తర్వాత వినోదశాలలో నృత్యాలు మరియు పాటలతో గడిచిపోయాయి.
ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. వెంటనే నేను మహత్వోన్మాదిలా అనుభూతి చెందడం ప్రారంభించాను.
విలక్షణ మామిడిపళ్ళ డెజర్ట్, ఇంకా ఐస్‌క్రీం తింటూ – ప్రకృతితో ఇలా చెప్పాను:
“ప్రకృతీ, నన్ను నేను ఓ రాజులా భావిస్తున్నాను, నువ్వు నా రాణివి. మనం ఇలాగే కొనసాగుదాము. మన పిల్లలు రాకుమారులుగా ఉంటారు. పైగా మనం ఎలాగూ మాంత్రికులమే. మనం ప్రజలను వివేకంతో పరిపాలిద్దాం.”
ఇదే దురాశ – గతంలో ఒలంపస్ పర్వత శిఖరం నుంచి అమృత ఔషధాన్ని తెచ్చినప్పుడు; వెండి కొవ్వొత్తిని చేతిలో ఉంచుకున్నప్పుడూ నన్ను ముంచెత్తింది. అద్భుత వస్తువులని నేను సాధించినప్పుడు కలిగిన దురాశ మళ్ళీ నన్ను వివశుడిని చేస్తోంది.
నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె చంద్రబింబం లాంటి వదనాన్ని నా చేతుల్లోకి తీసుకుని – “మనం చక్రవర్తికి సేవలు అందిద్దాం. యుద్ధం ముగిసింది. అతను గెలిచాడు. అతను మనకు అధికారం ఇచ్చాడు. ఇంక… మానవులు మనల్ని ఎన్నటికీ అంగీకరించరు; వారు మనల్ని ఎల్లప్పుడూ బయటివారిగా లేదా ‘విశ్వశక్తిని ప్రయోగించేవారిగా’ లేదా ‘దుష్టమాంత్రికులు’ గానే పరిగణిస్తారు!”
ప్రకృతి బిత్తరపోయి చూస్తోంది.
“హనీ, నీకేమయింది? నీ కళ్ళు ఎర్రగా మారాయి. నీ ముఖంలో దురాశ మరియు దుర్మార్గం కనబడుతోంది. జరిగినదంతా నువ్వు మర్చిపోయావా?” అడిగింది ప్రకృతి.
అత్యంత ఖరీదైన షాండిలియర్స్‌తో అలకరించబడిన గదిలో వేల దీపాల కాంతి ప్రసరిస్తుండగా పచార్లు చేస్తున్నాను. గది చివర్లో ఎరుపు దుస్తులు ధరించిన సేవకుడు నా ఆదేశాల కోసం సిద్ధంగా ఉన్నాడు.
“లేదు. నేను మర్చిపోలేదు. కానీ సమూరా నన్ను నా దేశానికి రాజుగా చేశాడు – చూడు… అతడు చేసిన నష్టానికి బదులు చెల్లించాడు. ఇప్పుడు మనం విజేతల పక్షాన ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకు కాకూడదు… ఇలా ఎందుకు కొనసాగకూడదు? అతనికి సహాయం ఎందుకు చేయకూడదు? మూర్ఖపు ఎర్త్ కౌన్సిల్ నన్ను ఓ మిషన్ పై పంపింది, కానీ మధ్యలో నన్ను వదిలేసింది. వాళ్ళు తమ అసమర్ధతతో యుద్ధంలో ఓడారు. నేను సంవత్సరాల పాటు సుదూర అంతరిక్ష వేదికలోని జైలులో ఖైదు చేయబడ్డాను. వారు నన్ను రక్షించలేదు.”
“ఆపు!” అరిచింది ప్రకృతి.
ఏనిమాయిడ్ కంగారుగా, నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. యురేకస్ కూడా వచ్చింది. దానిపై ఉన్న ఆకుపచ్చ, ఎరుపు దీపాలు వెలుగుతున్నాయి, బీప్ ధ్వనులు వస్తున్నాయి.
“మాస్టర్, మాస్టర్ మీరిలా వాదించకూడదు. కెమెరాలు, మైక్రోఫోన్లు ఉన్నాయి. పైగా మిమ్మల్ని గమనిస్తున్నారు!” అంది యురేకస్.
నేను కోపంగా వున్నాను. “ఈ ఇనుప ముక్క నాకు సలహా ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నేను దీనిని విడదీసి, రీ-ప్రోగ్రామ్ చేస్తాను. నేను ఆసియా పాలకుడిని, అంగారక చక్రవర్తికి మాత్రమే జవాబుదారీని! ఎంతటి శక్తివంతుడ్ని నేను! “
దురాశ నన్ను ముంచెత్తింది. అధికారం నాకు మత్తెక్కించింది. నా తల్లిదండ్రుల హత్యకి పగ తీర్చుకునే ఆలోచనలన్నింటిని మరచిపోయాను. గొప్ప మానవతా విలువలని విస్మరించాను. విచిత్రమైన అఘోరీల వింత నియమాలతో గ్రామాలలో బానిసలుగా వ్యవహరించబడుతున్న మనుష్యుల దుస్థితిని మర్చిపోయాను.
గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. అందరూ మౌనంగా తమ తమ పడక గదులకు వెళ్ళిపోయారు.
ప్రకృతి రోదిస్తోంది. ఏనిమాయిడ్ గుర్రుమంటూ వెళ్ళిపోయాడు.
రోబోలు దుఃఖించవు. కాబట్టి యురేకస్ నిశ్శబ్దంగా ఉంది. ఈ రకంగా జీవితం మరొక రెండు వారాలు గడిచింది.
(సశేషం)