Site icon Sanchika

భూమి నుంచి ప్లూటో దాకా… -20

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 56: తిరుగుబాటుకి పిలుపు

[dropcap]ఆ[/dropcap]క్రమిత రాజధాని న్యూ హోప్ సిటీలో మనుషులు అసలేమీ జరగనట్టే మసలుకొంటున్నారు. లేదా అసలే తప్పులు జరగనట్టుగా ఉన్నారు. కార్లు, సిక్స్ లేన్ హైవేలు, అప్పుడప్పుడు పైన ఆకాశంలో ఎగిరే విమానాలతో అంతా మామూలుగానే ఉన్నట్టుంది. ఒకప్పటి ప్రసిద్ధమైన టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రేమికులు నవ్వుతూ తిరుగుతున్నారు.

మేము మా హోటల్ గెస్ట్ రూమ్‌కి వచ్చేశాం. వివిధ అలంకరణలు ఉన్న పెద్ద స్యూట్ అది. సోఫా సెట్స్, ఇంటర్ గెలాక్టిక్ నెట్ బ్రౌజింగ్, ఎల్.ఇ.డి. టివిలు, ఇంకా ఉచిత సెక్రెటేరియల్ సేవలు…

నేనూ, ప్రకృతి బెడ్ రూమ్‌లో నిద్రించాం, యురేకస్‌తో కలసి ఏనిమోయిడ్ డ్రాయింగ్ రూమ్‌లో నిద్రపోతున్నాడు. అప్పటికే మేము బాగా అలసిపోయి ఉన్నాం, నేను కోరుకునేదల్లా చక్కని నిద్రే. ఐజి నెట్ కనెక్షన్ ఉన్న ఒక పెద్ద కంప్యూటర్‍‌ని యురేకస్ కనెక్ట్ చేసింది, రాత్రి సమయంలో యురేకస్ తనని తాను చార్జింగ్ చేసుకుంది.

“సమూరా రేపు కుజగ్రహానికి వెళ్ళిపోతున్నాడు!” అంది ప్రకృతి.

“అతడు తనతో చేతులు కలిపేందుకు మనకి సమయం ఇచ్చాడు. కానీ అతను తన ఏజెంట్లతో మనల్ని గమనిస్తున్నాడని నాకు తెలుసు. అతనికి వ్యతిరేకంగా ఏ సంస్థాగత లేదా వ్యవస్థీకృత ఉద్యమం లేకుండా అతనితో ఎలా పోరాడగలం? పైగా అతని సేవలో మనం ఎలా చేరుతాం?” అంది.

ఫ్రిజ్‌లోంచి దానిమ్మపండ్ల రసం తీసుకుని కొద్దిగా తాగాను. “నాయకులందరూ ఎక్కడ ఉన్నారు? రక్షణ వ్యవస్థ ఏమైంది? దౌత్యవేత్తలేరి? పాత్రికేయులు, గొప్ప అమెరికన్ మేధావులు, ధనవంతులైన పారిశ్రామికవేత్తలు? ఎందుకు వీళ్ళెవరూ అతనితో పోరాడడం లేదు?”

“వారు రహస్యంగా దాక్కుని ఉంటారు, లేదా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. రహస్య విప్లవం ద్వారా ఈ మంత్రగాడి పాలనని అంతం చేయడానికి సత్వరంగా చర్యలు తీసుకోవాలి.”

“అణ్వాస్త్రాలు, ఇతర ఆయుధ వ్యవస్థలు సమూరా మనుషులు నియంత్రణలో ఉన్నాయని తెలిసింది. దౌత్యవేత్తలు మరియు సలహాదారులు నమ్మకమైన ‘విశ్వశక్తి’ నిర్వాహకులు. వారి ఆదేశాలను పాటించడం తప్ప మరే ఇతర అవకాశంలేని మానవులు మాత్రమే ఉన్నారు.”

“చరిత్రంతా వైరుధ్యంతో నిండి ఉంది, ఒకపక్క క్రూరుడైన నియంత, మరోవైపు తెలియని భయంతో అణచివేయబడ్డ మొత్తం నాగరికతలు ఉన్నాయి. విచిత్రమేంటంటే ఆ క్రూరుడు ఒక హాస్యాస్పదమైన వికారమైన ముసలి అస్థిపంజరం” అన్నాను.

ఉన్నట్టుండి యురేకస్ తన లోహ స్వరంతో చప్పుడు చేసింది. “మాస్టర్! నేను లోపలికి రావొచ్చా? ఇక్కడ ఒక సమాచారం…” అంది.

అది అక్కడ కంప్యూటర్‌ని బ్రౌజ్ చేస్తోంది.

“రా యురేకస్!” అన్నాను. “కొత్త సంగతి ఏమిటి?”

“మీ కోసం ఎన్‌క్రిప్టెడ్, డబుల్ ఎన్‌క్రిప్టెడ్ కోడ్ సందేశాలొచ్చాయి. లక్షల ప్రస్తారాలు సంయోగాలను ప్రయత్నించాకా, వీటి అర్థం గ్రహించాను. ఒకప్పటి ఎర్త్ కౌన్సిల్ ఛైర్మన్ మిస్టర్ చెన్ లీ, అతని డిప్యూటీ మిస్టర్ లింకన్ నుండి వచ్చాయీ సందేశాలు. వచ్చి చూడండి! నేను వాటిని గ్లోబల్ పొజిషనింగ్ ద్వారా గుర్తించాను” చెప్పింది యురేకస్.

“వారు అమెరికాలో ఉన్నారా?”

“లేదు. మీరు నమ్మరు. వారు ఆఫ్రికాలో సహారా ఎడారిలో ఉన్నారు, ఖచ్చితంగా చెప్పాలంటే… ఒయాసిస్ ది తైబెత్  వద్ద ఉన్నారు. “

యురేకస్ విడమరిచిన సందేశాలను చదవడానికి మేము కంప్యూటర్ వద్దకు పరిగెత్తాం.

“హనీ అమ్రాపాలి! మానవులకి మీరు అవసరం. మేము ఆశ్చర్యపోయాం. మా సొంతవాళ్ళే మాకు ద్రోహం చేశారు. మేము పారిపోవలసి వచ్చింది. కానీ మేం మళ్ళీ జట్టుకడుతున్నాం. మేము తిరుగుబాటు చేయబోతున్నాము. తుది యుద్ధంలో మీరు మాకెంతో అవసరం. సాధ్యమైనంత త్వరగా, ఎలాగోలా మా దగ్గరకి రండి. మనకున్న సమయం పదిహేను రోజులు మాత్రమే! అతి రహస్యం. త్వరగా రండి లేదంటే వారు మిమ్మల్ని చంపేస్తారు.”

అధ్యాయం 57: ఒయాసిస్ ది తైబెత్ – సహారా ఎడారి

మేము తిరుగుబాటుదారుల వద్దకు వెళ్ళితీరాలి.

ఘనమైన సహారా ఎడారికి మేము వెళ్ళాలి.

ఇక్కడ అమెరికాలో సమూరా రహస్య వేగులు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మాయమంత్రాలలో పారిపోవడానికీ వీల్లేదు, ఎందుకంటే ఇప్పుడు మంత్రగాళ్ళే పాలకులు. విమానాశ్రయాలలో మా పత్రాలను సమర్పించవలసి ఉన్నందున మేము మారువేషంలో వెళ్ళలేము.

అవును, ఆఫ్రికాలోని ఒకప్పటి అల్జీరియాలోని ‘విలాయ డి ఔర్‌గ్లా’ లోని ఒయాసిస్‌కి మేము వెళ్ళవలసి ఉంది.

ఫ్రాన్స్‌లోని పారిస్‌కి వెళ్ళడం ఉత్తమం. అక్కడ విమానమెక్కి ఆల్జీర్స్‌కి, అక్కడనుండి ఔర్‌గ్లాకు వెళ్ళి, తిరుగుబాటుదారులను కలవాలి.

కానీ ఎలా?

చర్చల మధ్య రాత్రి గడిచిపోయింది. ఒకే మార్గం – వంచన, అబద్ధాలు ద్వారా సాధ్యం.

కాబట్టి, మరుసటి రోజు నేను న్యూ హోప్ సిటీలో మాకు లైజాన్ వ్యక్తిగా ఉన్న సమూరా వ్యక్తిగత కార్యదర్శికి ఒక సందేశాన్ని పంపాను.

“సరే, ఒప్పుకుంటున్నాను! దక్షిణాసియా పరిపాలకుడిగా సమూరా సామ్రాజ్యానికి సేవలందించడం నాకు సంతోషంగా ఉంటుంది. నాకు ఉత్తర్వులు ఇవ్వండి!”

తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి.

కుజగ్రహపు అరుణభూముల చిహ్నంతోనూ, రెండు కత్తులు చిహ్నంతో ఉన్న లెటర్‌హెడ్‌పైల్ క్లుప్తంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలని వ్రాసి పంపాడు సౌర వ్యవస్థ చక్రవర్తి సమూరా. ఎరుపు, బంగారు రంగుల సీల్డ్ కవర్‌లో కార్యదర్శి సంతకం చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్తర్వు, అనేక ఉపనిబంధనలు, ప్రకరణలతో నా విధులు, బాధ్యతలను తెలిపారు.

చివరగా సమూరాచే సంతకం చేయబడింది.

కార్యదర్శి కుజగ్రహానికి చెందిన హ్యుమనాయిడ్. తలపై యాంటెనాతో నెరిసిన జుట్టుతో బాగా అనుభవజ్ఞుడిలా ఉన్నాడు. చురుకైన చూపులున్న అతను ఉదయం 10.00 గంటలకు స్వయంగా మా గదికి వచ్చి, ఉత్తర్వులు నాకు అందించాడు. కొద్దిమంది అధికారిక విలేఖరులతో టివి కవరేజ్, వార్తా నివేదికలు తయారు చేయబడ్డాయి.

“గవర్నర్ హనీ ఆమ్రపాలి! మీకు అన్ని హక్కులు ఉంటాయి. మీరు న్యూఢిల్లీ లోని రాయల్ ప్యాలెస్ (గతంలో బ్రిటీష్ పాలనలో వైస్రాయి హౌజ్, స్వతంత్ర్య భారతదేశంలో రాష్ట్రపతి భవన్ అని పిలవబడింది) నివాసముంటారు, అక్కడి నుంచే బాధ్యతలు నిర్వహిస్తారు. అన్ని రక్షణ వ్యవస్థలు, ఆర్ధిక వ్యవస్థలపై మీరు నియంత్రణను కలిగి ఉంటారు. మీరు కోరుకున్నట్టుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తారు. ఈ సామ్రాజ్యంలో మీరు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చు, మీకు దౌత్యపరమైన రక్షణ ఉంటుంది…”

స్పష్టంగా చివరి నిబంధన నన్ను ఆకట్టుకుంది. నేను నా ప్రణాళికలను సిద్ధం చేసాను.

“చక్రవర్తికి ధన్యవాదాలు! నేను బాధ్యతలు తీసుకోడానికి ముందు ఒక వారం రోజులు సెలవు తీసుకుంటాను.”

“మీ ఇష్టం. సామ్రాజ్యం మీ పట్ల సంతోషంగా ఉంది. మీరు బాధ్యతలు చేపట్టిన మరుక్షణం, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, ఇంకా అఘోర బలగాల తాంత్రికులు మీ నియంత్రణలో ఉంటారు. మీ ఆజ్ఞలు పాటిస్తారు. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక్కడే మీకో సలహాదారుని నియమించాం. అతనితో కలసి మీరేం చేయాలో నిర్ణయించుకోవచ్చు. అతని పేరు రణసింహ. ఆయన న్యూఢిల్లీ ఉండే మా ఏజంట్, మీతో ఉంటాడు. అతను చాలా ఉన్నత స్థాయి మాంత్రికుడు. ఆయన కూడా మీ లాగే ఒక ఎంపిక చేయబడిన వ్యక్తి. ఆయన సామ్రాజ్యానికి చాలా విశ్వసనీయుడు” అంటూ ఓ క్షణం ఆపాడు. “గవర్నర్ గారూ, మీ లానే! మా సామ్రాజ్యంలో విధేయత కీలకం” అన్నాడు.

“రెండు కాళ్ళూ, రెండు చేతులు, రెండు కళ్ళు, మామూలు మెడడు ఉన్న సాధారణ మనుషుల శ్రేయస్సు మీకు ముఖ్యం కాదు” అనుకున్నాను.

“అవును, వాళ్ళు మన బానిసలు, అసమర్థులు. వాళ్లతో కఠినంగానే ఉండాలి. సామ్రాజ్య రాజ్యాంగం ప్రకారం సాధారణ పౌరులకు హక్కులు లేవు. విశ్వశక్తిని ప్రయోగించగల్గినవారే పాలకులు.”

దేవుడా! ఈ మనిషి నా మనస్సును చదివేస్తున్నాడు. ఇతనో టెలీపాత్.

“ఒక వారం సెలవు. అది చాలు” అని అన్నాడు.

నియామక పత్రాన్ని నాతోనే ఉంచుకున్నాను.

నేను సెలవులో పారిస్ వెళ్ళేందుకు టిక్కెట్లు కొనడానికి ఇప్పటికీ నా దగ్గర కొంత డబ్బు ఉంది.

అధ్యాయం 58: ఒయాసిస్ ది తైబెత్, వర్గలా, అల్జీరియా

మొత్తానికి ఇక్కడకి చేరాం. విశాలమైన సహారా ఎడారిలో ఒక చిన్న గ్రామం! అల్జీర్స్‌కి దక్షిణ దిశగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో… వర్గలా పట్టణానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. న్యూ హోప్, ప్యారిస్, అల్జీర్స్ విమానాశ్రాయలలో ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ సులభంగా అయిపోయాయి.

అవును. నేను ఇప్పుడు చక్రవర్తి యొక్క గవర్నర్ కాబోతున్నవాడిని. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ వద్ద తనిఖీలు లేకుండా స్వేచ్ఛగా తిరగగలిగే ఒక దౌత్యవేత్తని. పారిస్‌లో ఉన్నా లేదా లండన్‌లో ఉన్నా లేదా అల్జీర్స్‌లో ఉన్నా – నేను పాలక వర్గానికి చెందినవాడిని. విమానం వర్గలా విమానాశ్రయంలో దిగగానే, కొద్ది దూరంలో… విశాలమైన గోధుమరంగు ఇసుక తిన్నెల మధ్య ఆకుపచ్చ ఖర్జూరం చెట్లు, తాటి చెట్లు కనిపించాయి.

మేము ఓ టాక్సీ మాట్లాడుకుని, 200 కిలోమీటర్ల దూరంలోని తూగోర్ట్‌కి వెళ్ళమని అడిగాము. తైబెత్ తూగోర్ట్‌ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం.

మా ప్రయాణం సాగుతున్నంత సేపు మా మనస్సులలో ఒకే ఒక్క ఆలోచన మెదులుతోంది – అది ఏమిటంటే తిరుగుబాటుదారులను ఎలా సంప్రదించాలనే. ఇటువంటి సుదూర ఎడారిలో సౌకర్యాలు ఏ మాత్రంలేని ప్రాంతాలలో ఎక్కడ దాక్కుని ఉంది ఉంటారు? మిస్టర్ చెన్ లీకి ఒక సందేశం పంపమని యురేకస్‌కి చెప్పాను.

“మేము అల్జీరియన్ సహారాలో తూగోర్ట్‌ లోని హోటల్ బెడుయిన్‌లో ఉన్నాము”.

ఇది ఫ్రెంచ్ మాట్లాడే దేశం. ప్రజల ఫ్రెంచ్, అరబిక్ రెండు భాషలు ఉపయోగిస్తారు.

“చెన్ లీ నుండి సందేశం – ‘స్వాగతం’ అంటున్నారు” చెప్పింది యురేకస్.

అవును. తిరుగుబాటుదారుల నుంచి స్వాగత సందేశం ఫ్రెంచి భాషలో వచ్చింది.

“విశ్రాంతి తీసుకోండి! రేపు అర్ధరాత్రిలో ఎడారిలో తైబెత్‌కు తూర్పుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాయింట్ వద్దకు రండి. కో-ఆర్డినేట్స్ పంపుతున్నాము. తుది ప్రణాళికలు అక్కడే చెబుతాం. అత్యంత గోప్యత అవసరం.”

ఈ హోటల్ – ఎడారిలో ఒక రహదారి పక్కన వేసిన భారీ టెంట్ లాగా ఉంది. ఈ రహదారి తూగోర్ట్‌ నుండి తూర్పున ఉన్న ఎల్ వెడ్‌ పట్టణానికి దారితీస్తుంది. మేము టెంట్లలో ఉండి ఫ్రెంచ్ రొట్టెలు, ‘వియాన్డే’, ఖర్జూరాలు తిన్నాం. టిన్‌లలోని పాలు తాగాం. ఇక్కడ ఇప్పుడు శీతాకాలం. పగటి ఉష్ణోగ్రతలు భరించగలిగేడట్టే ఉన్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం 4 డిగ్రీల సెల్సియస్‌గా ఉండడంతో రాత్రుళ్ళు చాలా చల్లగా ఉన్నాయి.

కానీ ఇది ట్రైటాన్ భూగర్భ కాలనీలతో పోలిస్తే వెచ్చగా ఉన్నట్టే. ఇక్కడ మేం ఆక్సిజన్ మోసుకుంటూ తిరగక్కరలేదు, గ్రావిటి సూట్లు వేసుకోనక్కరలేదు, హెల్మెట్లు పెట్టుకోనక్కరలేదు. ఇది మా భూమి. ఘనమైన సహారా ఎడారి. పశ్చిమాన సూర్యాస్తమయం అవుతున్న సమయంలో కాంతులీనుతున్న ఎరుపు రంగుతో మెరుస్తున్న ఇసుకలలో ఒంటెలు బారులు తీరి నడుస్తున్నాయి. అదొక సుందరమైన ప్రకృతి దృశ్యంగా భాసిల్లింది.

కుజగ్రహం మీదా ఇదే సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుని పై ఉదయించేదీ ఇదే సూర్యుడే.  ప్లూటో నుండి ఒక చిన్న చుక్కలా కనిపించేదీ ఈ సూర్యుడే.

ఇది భూమి యొక్క సౌర వ్యవస్థ. సహారా ఎడారి స్థలాకృతి కుజగ్రహాన్ని పోలి ఉంది, కాకపోతే ఇక్కడ ప్రాణాలతో ఉండడానికి అవసరమైన ఆక్సిజన్ ఉంది, తగినంత గురుత్వాకర్షణ ఉంది.

“భూమి అంటే నాకెంతో ఇష్టం” అనుకున్నాను ఆ రాత్రి – బెడుయిన్ డేరాలో నక్షత్రాలు నిండిన ఆకాశంకింద నిద్రకి ఉపక్రమిస్తూ.

***

తూర్పున ఎరుపురంగులో సూర్యుడు ఉదయించడంతో మరుసటి రోజు ప్రారంభమైంది.  చల్లని గాలి వీస్తోంది, కాఫీ ఘుమఘుమలు, ‘ఖుబ్జ్’ అరబిక్-ఫ్రెంచ్ రొట్టె సువాసనలు వస్తున్నాయి. అల్పాహారం కోసం ఉడికించిన గుడ్లు, పాలు, సిద్ధమవుతున్నాయి. ఆఖర్న తినడానికి ఖర్జూరాలు ఉండనే ఉంటాయి.

హోటల్ వాళ్ళు వినిపిస్తున్నఅరబిక్ సంగీతాన్ని వింటూ విశ్రాంతిగా ఉన్నాము. నవ్వుతూ, ‘సుభా ఎల్ ఖేర్’ అనో, ‘బోన్జౌర్’ అంటూనో అరబిక్, ఫ్రెంచ్ భాషలలో పలకరించే హోటల్ సిబ్బందితో కూడా మేం పెద్దగా మాట్లాడడం లేదు.

మేము టాక్సీలను పంపించేశాము. ఎడారి సమావేశ స్థలానికి నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాము.

రహస్యంగా ఉంచడం అవసరం. పైగా హోటల్ సిబ్బంది కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు, ఎందుకంటే ఎడారిలో సాహసకృత్యాల కోసం ఎందరూ శ్వేత పర్యాటకులు అక్కడికి తరచూ వస్తూనే ఉంటారు.

సాహసం కోసం ఎడారిలో అరుదుగా నడిచిన గోధుమ వర్ణపు ఆసియన్లు మేమే.

“Attention! Il’ya des scorpions – et risqué de perdre votre route!”

రిసెప్షనిస్ట్ ఫ్రెంచ్ భాషలో చెప్పినదానికి – “ఇసుకలో విషపూరితమైన తేళ్ళు ఉన్నాయి, పైగా మీరు సహారా ఎడారిలో తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది!” అని అర్థం.

“కొన్ని నెలల క్రితం కొంతమంది సాహసికులు దారి తప్పి దప్పికతో మరణించారు. తన కారు రేడియేటర్‌‍లో నీటిని తాగి, తరువాత తన స్వంత మూత్రాన్ని తాగి ఒకే ఒక వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు!” చెబుతూ ఆమె నవ్వింది.

“పర్వాలేదు, మేము… గనీమీడ్, ట్రైటాన్, ఇంకా టైటాన్ వంటి ఇంతకంటే ప్రమాదకరమైన ప్రదేశాలలో తిరిగాం. ఏ సమస్య ఉండదు…” ఆమెకు చెప్పాను.

సాయంత్రం 6.00 గంటలకు, మా రోబోకి కోఆర్డినేట్లను ఇవ్వడం ద్వారా మేము ఎడారి నడక ప్రారంభించాము.

టార్చిలైట్లు, బ్యాక్‌ప్యాక్‌లలో నీరు, రొట్టెలు, పాలు భద్రపరుచుకున్నాం.

చీకటి పడింది కానీ ఆకాశంలో నక్షత్రాలు నిండి ఉన్నాయి. నెలవంక చంద్రుడు మిలమిలలాడుతున్నాడు. మేం – నేను, ప్రకృతి, ఏనిమోయిడ్, ఇంకా యురేకస్ నడుస్తున్నాం. యురేకస్ మాకు రేఖాంశాలు, అక్షాంశాల వివరాలు తెలియజేస్తూ, ఇసుకలో క్రుంగుతున్న తన లోహ పాదాలను ఈడ్చుకుంటూ నడుస్తోంది. దాదాపు అర్ధరాత్రి అయ్యేవరకూ నడిచాం. కాసేపయ్యాక, “మాస్టర్ ఆగండి! మనం చేరాల్సిన ప్రదేశం ఇదే” చెప్పింది యురేకస్.

అక్కడ చీకటిగా ఉంది, అలా అనీ మరీ దట్టంగా లేదు.

అక్కడంతా ఇసుక! అలా అనీ తిన్నెలు తిన్నెలుగా లేదు. ఉన్నట్టుండి ఆ ప్రాంతంలోని ఎడారి అంతా మనుషులతోనూ, చిన్న చిన్న దీపాలతోనూ నిండిపోయినట్లు అనిపించింది. టోపీలు, తలపాగాలు ధరించిన చీకటి ఆకారాలు… గడ్డమున్న మగవాళ్ళు, ముసుగులు ధరించిన స్త్రీలు… చీకటిగా ఉన్న సినిమా థియేటర్‌లో జనాలు ఎలా అయితే నెమ్మదిగా కనబడతారో…. అలాగా క్రమక్రమంగా మా దృష్టిపథంలోకి వచ్చారు.

ఉన్నట్టుండి ఆకాశంలో పెద్ద వెలుగు. మిరుమిట్లుగొల్పుతూ గోళాకారంలో ఉన్న ఎగిరే వస్తువు చాలా దూరం నుంచీ కనిపిస్తోంది. నెమ్మదిగా క్రిందకి దిగుతూ క్రమంగా పెద్దదిగా, ఇంకా పెద్దదిగా అయింది.

“ఫ్లైయింగ్ సాసర్!” అంది ప్రకృతి.

“వెనుకటి రోజుల్లోని యు.ఎఫ్.ఓ.లాంటిదే” అన్నాను. ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లుతూ అది ఆకాశంలో నిశ్చలంగా ఉంది.

దాని దిగువ భాగం నుంచి ఫోటాన్‌లు భూమి పైకి ప్రసరిస్తున్నాయి.

ఇంతలో ఒక పెద్ద వేదిక, దానిపై అమర్చిన స్పీకర్లు కనిపించాయి.

“పైనుండి మనుషులను కాంతి రూపంలో కిందకి పంపుతున్నారు” చెప్పింది యురేకస్. “ఈ సాంకేతికత గ్రహాంతరజీవులది. కానీ ఇప్పుడు వీళ్ళు అదే రహస్య పద్ధతిని పాటిస్తున్నారని అనుకుంటున్నాను” చెప్పింది.

కాసేపటిలో స్పేస్‌షిప్ లాంటి ఆ వాహనం నుండి అర డజను మంది పురుషులు, ఒక స్త్రీ – అయాన్ల నుండి మానవాకృతి దాల్చారు.

అక్కడున్న జనాలంతా చప్పట్లతో స్వాగతం పలికారు.

“మనం ముందుకు వెళ్దాం!” చెప్పాను. వేదికకి బాగా దగ్గరగా ముందు వరుసలోకి చేరాం.

వ్యాఖ్యాత గంభీర స్వరం ఎడారిలో మారుమ్రోగింది. “శుభ సాయంత్రం! బోన్‌సార్! అందరికీ స్వాగతం. బదులు తీర్చుకోవాల్సిన రోజు వచ్చింది. ముందుగా మిస్టర్ చెన్ లీ మాట్లాడుతారు, ఆ తర్వాత మిస్టర్. లింకన్, మిస్ జీన్ పాల్, అబ్దుర్ రహీం, మార్గరెట్ మాట్లాడతారు” చెప్పాడా వ్యాఖ్యాత. ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన నాయకులు ఉన్నట్టున్నారు.

నేను మొదటిసారి కలిసినప్పటికే… ఎర్త్ కౌన్సిల్ అధ్యక్షుడిగా చెన్ లీ అందరికీ సుపరిచితుడు. ఆయన ప్రసంగం అప్పుడు ప్రారంభమైంది. అందరినీ కదిలించిదీ, ఉత్తేజితులని చేసింది. చిరస్మరణీయంగా నిలిచిపోయే ఉపన్యాసమది.

“మిత్రులారా! మనది పరాజిత గ్రహం. సంక్షోభంలో ఉన్న గ్రహం! అతీంద్రియ శక్తుల ఆధీనంలో ఉన్న గ్రహం. మనం ఒక దశాబ్దానికి పైగా బాధలు పడ్డాము. మాంత్రికులని పిలువబడ్డ వారు మనలో బలహీనమైన వ్యక్తులను మోసగించారు, మనల్ని ఓటమి వైపుకి నడిపించారు. విశ్వశక్తి లేదా అయానిక్ మాస్ అనేది అన్ని సౌర వ్యవస్థల యొక్క వాతావరణంలోనూ ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. అతీంద్రియ దుష్ట తాంత్రికులు ఈ అయానిక్ మాస్‌ని – వినాశనానికి, శక్తిని సృష్టించడానికి,  అన్ని సహజ విపత్తులను సృష్టించడానికి, ఇంకా మనస్సులను కూడా ప్రభావితం చేయడానికి ఉపయోగించారు. భూమిపై, వివిధ గ్రహ కాలనీలలో… అన్ని చోట్లా ఉత్పరివర్తులు ఉన్నారు, వీరిలో కొందరు మంత్రగాళ్ళ చీకటి శక్తులకు విశ్వాసపాత్రులుగా మారిపోయారు. ఇది విజ్ఞాన శాస్త్రం, మాయాజాలం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, వాక్ స్వాతంత్రం, మానవ హక్కులకు మేము విలువిస్తాము. విశ్వశక్తి యొక్క అధ్యయనాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకున్నాము. ప్రజలు వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. మేము ఈ విషయాన్ని దర్యాప్తు చేసి, సత్యాన్ని కనుగొనడానికి మంచివాళ్ళయిన ఎంపిక చేసిన వ్యక్తులను  కొందరిని పంపాము. కానీ, అయ్యో, మన స్వంతవాళ్ళే, డబుల్ ఏజంట్లుగా వ్యవహరించి, వాళ్ళకి విశ్వసనీయులై మనల్ని దుష్ట శక్తులు తరిమేసేలా చేశారు. ఇప్పుడు మనం అందరం తిరిగి కలిసాం. తిరుగుబాటును నిర్వహించడానికి అన్ని గ్రహ కాలనీలు సమన్వయంతో ఉన్నాయి. ఇక చివరి యుద్ధం ప్రారంభం కానుంది. ఇది రక్తాన్నీ, త్యాగాలనూ బలికోరే భయంకరమైన యుద్ధం. తమ శక్తిని ఉపయోగించుకునే ఉత్పరివర్తులు, మాయలు చేసేవారు అయినప్పటికీ… మన విలువలు పట్ల విశ్వాసం ఉన్నవారు సాంప్రదాయ సైనిక మరియు వైమానిక దళాలతో పాటు మనతో పోరాడతారు… “

ఒకరి తరువాత ఒకరు అందరు నాయకుల ఉపన్యాసాలు దాదాపుగా ఇలానే ఉన్నాయి.

“ఇక, ఎంపికజేసిన వ్యక్తులు మాత్రం తిరుగుబాటు నాయకులతో ఒక వ్యక్తిగత సమావేశం కోసం ఇక్కడ ఉంటారు.” వ్యాఖ్యాత గంభీర స్వరంలో ప్రకటించాడు. “మిగతావాళ్ళు  తమ గమ్యస్థానాలకు వెళ్ళాలి. అనుకున్న రోజు వచ్చే వరకు దీని గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడకూడదు, ఏమీ తెలియనట్టే ఉండాలి. అంతిమ నిర్ణయ దినం, విప్లవం జరగబోయే రోజు…”

చాలామంది ఎంత నిశ్శబ్దంగా వచ్చారో, అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.

గాలి గింయుమంటోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకొచ్చాయి.

“విశ్వశక్తి, మాయలు ఎడారిలో సరిగా పనిచేయవు. అందుకే వారు సమావేశాన్ని ఇక్కడ నిర్వహించారు. సమూరా రహస్య వేగులు, ఆకాశంలో సర్వాంతర్యామిగా ఉన్న సమూరా రహస్య సేవకుల ద్వారా పట్టుబడకుండా భద్రత కోసం…” చెప్పింది యురేకస్.

వేదికకి ఎదురుగా సుమారు 50 మంది ఉన్నారు. వేదికపై ఎర్త్ కౌన్సిల్ సభ్యులు నారింజ రంగు కాంతి వలయంలో నిలబడి ఉన్నారు. పైన స్పేస్ వెహికల్ వేదిక మీదుగా ఆకాశంలో నిలిచిఉంది. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే వారిని కాంతి రూపంలో పైకి… స్పేస్ వెహికల్‌లోకి పంపేస్తారు.

“ఇప్పుడు మన లక్ష్యం కోసం కీలకమైన ఎంపిక చేసిన వ్యక్తులను పిలుస్తాము.”

“గ్రీస్‌కి చెందిన ఆండ్రోపోలిస్”.

“యుకె నుండి జాక్ స్ట్రాంగ్”.

“జపాన్ నుండి యొమాకుట హిటాచీ”.

వారు ఒక్కొక్కరుగా వేదికపైకి వెళ్లారు, నేతలతో సంభాషించి, చీకట్లలోకి జారుకున్నారు.

నేను నాలుగోవాడిని. “హనీ అమ్రాపాలి”, ఐదు “ప్రకృతి అమరాపాలి” – “మీ రోబోతోనూ, గ్రహాంతర స్నేహితుడితోనూ రండి!”

నాలో ఏదో భయం. వింత ఆందోళనని అనుభూతి చెందుతూ వేదికపైకి వెళ్లాను.

మేం నలుగురం వేదిక పైకి వెళ్తుంటే ఎర్త్ కౌన్సిల్ సభ్యులు మమ్మల్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.

ఇక అద్భుతాలలోకే అద్భుతం – ఎర్త్ కౌన్సిల్ అధ్యక్షుడు మిస్టర్ చెన్ లీ ముందుకు వచ్చి నన్ను హత్తుకున్నారు. నా వీపు తట్టారు.

“హనీ! మీరు చాలా బాధలు పడ్డారు. నేను మీకు, మీ భార్యకు, ఇంకా మిషన్ సభ్యులకు వందనం చేస్తున్నాను. మీ పాత్రలో ఇప్పుడు అంతిమ బాధ్యతకి సమయం వచ్చింది. మీరో ఉత్పరివర్తి (mutant),  విశ్వశక్తిని ఉపయోగించగల ఎంపికైన వ్యక్తి మాత్రమే కాదు, మీరు మాకు అత్యంత విశ్వసనీయులు. సమూరాను చంపగల ఏకైక వ్యక్తి మీరు మాత్రమే. ఆ పని మీరు చేసి తీరడం విహితమే. దైవవాణి, మాంత్రికుల భవిష్యవాణి సాహిత్యం ఈ విషయాన్నే సూచిస్తున్నాయి!

హనీ! మాకున్న ఆశ మీరొక్కరే. సమూరాని నాశనం చేయడంలో మీరే కీలకం. అన్ని గ్రహాలూ మాంత్రిక ప్రభుత్వాలతో పోరాడుతుంటే, మీరు చంపడానికి ఒంటరిగా కుజగ్రహానికి వెళ్ళవలసి ఉంటుంది. నియంతని చంపడానికి, సౌర వ్యవస్థల నాగరికతలను రక్షించడానికి!”

అధ్యాయం 59: మధ్య మరియు దక్షిణ ఆసియా గవర్నర్ జనరల్

అక్కడి దీపాలు ఆరిపోగానే మేం వెనక్కి వచ్చాం.

నాయకులు కాంతి కిరణాల రూపంలో లోపలికి రాగానే, ఫ్లయింగ్ సాసర్ ఆకాశంలో అదృశ్యమయ్యింది. అంతకుముందే నీడల్లా ఉన్న ప్రేక్షకులు దూరంగా వెళ్లి ఎడారిలోని చీకట్లలో కలిసిపోయారు. మేము కూడా మినుకు మినుకుమంటూ వెలుగుతున్న నక్షత్రాలున్న ఆకాశం కింద ఉన్న మా టెంట్ హోటల్‌కి తిరిగి వెళ్ళిపోయాము.

మర్నాడు ఉదయం మేము వీలయినంత త్వరగా గది ఖాళీ చేశాము. మేము ఒక టాక్సీలో వర్గలా విమానాశ్రయానికి చేరాం. రాజధాని అల్జీర్స్‌కి 11:00 గంటకు బయల్దేరే ఏకైక విమానం ఎక్కాం.

అల్జీర్స్‌ నుండి పారిస్ చేరాం. పారిస్ విమానాశ్రయంలో న్యూఢిల్లీకి వెళ్లడానికి వేచి ఉన్నప్పుడు – కాబోయే గవర్నర్ జనరల్‍నయిన హనీ ఆమ్రపాలి అనే నేను – ఢిల్లీ చేరుకుంటున్నానని అధికారులకు సందేశాన్ని పంపాను.

ఢిల్లీలోని స్వామి భూతనాథ్ విమానాశ్రయంలో దిగగానే ఘనస్వాగతం లభించింది. ఏదో అనామక గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ నుండి నా హోదా – మధ్య మరియు దక్షిణ ఆసియా గవర్నర్ జనరల్‌గా మారిపోయింది. నేనిప్పుడు స్థానిక అఘోరా మాంత్రిక సలహాదారుకీ, చక్రవర్తి సమూరాకి మాత్రమే జవాబుదారీని. నాకు సైన్యం నుంచి, అఘోరీ నాయకుల నుంచి గన్ శాల్యూట్, సైనిక వందనం లభించాయి.

విధి ఎలా మలుపులు తిరుగుతుందో, ఆ మార్పులను మానవ మనస్సు ఎలా స్వీకరిస్తుందో అంతా చిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులపై తిరుగుబాటు కూడా చేస్తుంది!

గతంలో ఒకసారి నేను ఈ విమానాశ్రయానికి వచ్చినప్పుడు, అప్పుడు అది వీర ఎయిర్‌పోర్ట్ అని పిలవబడింది. అప్పుడు నేను నా గతాన్ని అన్వేషిస్తున్న సాధారణ పౌరుడిని, పైగా కిడ్నాప్ చేయబడ్డాను. ఇప్పుడో…. నా చూపు ఎక్కడ పడితే అక్కడి రాజుని.

ప్రకృతికి చాలా సంతోషంగా ఉన్నట్టుంది. ఇక్కడ ఆమె ఆకుపచ్చ పట్టు చీర, బంగారురంగు అంచులున్న ఎరుపు రవిక ధరించింది. గులాబీలు, మల్లెలు ఆమె సిగని అలంకరించాయి. ప్రథమ మహిళగా తన స్థాయికి తగ్గట్టుగా పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో తనకి ఓ వజ్రాల ఉంగరమో లేక బంగారు గొలుసో కొందామంటే మా దగ్గర డబ్బు లేదు. కాబట్టి ఆ అంతరాన్ని పువ్వులు పూరించాయి, ఆమె అందాన్ని మరింత పెంచాయి. అయితే, ఇది ఎక్కువ కాలం ఉండదని మాకు తెలుసు. అధికారులు మమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచేందుకు, రాచదంపతుల వలె మర్యాదలందించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ మేము అందుకు తగము.

అంతా త్వరలో నశించిపోయే కల ఇదని నాకు తెలుసు. పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఈ హోదా పొందానని నాకు తెలుసు… హిందీలో ఏదో సామెత చెప్పినట్టు “ఏక్ దిన్ కా సుల్తాన్” నేను! రెండు వారాలలో అంతా మారిపోతుంది.

పైగా నేను ట్రైటా‌న్‌లో త్రికాల గ్రంథం చదివాను!

మేము ఏనిమాయిడ్, యురేకస్‌లతో కలసి రాయల్ ప్యాలెస్‌లో అడుగుపెట్టాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం దీన్ని “వైస్రాయి హౌస్” అనీ, ఆ తరువాత “రాష్టప్రతి భవన్” అని పిలిచేవారు. శతాబ్దాలు గడిచే కొద్దీ ఆ భవనం మరింత ప్రాచీనతని సంతరించుకుంది, కానీ అది ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంది మరియు పాతకాలపు విలువ పొందింది. కానీ ఇప్పుడది బలోపేతం చేయబడిన, అత్యంత రక్షణ గల కట్టడం. నేను లోపలికి ప్రవేశిస్తుండగా లేజర్ తుపాకీలతో కూడిన దళాలు, క్లోన్డ్ సైనికులు కవాతు చేశారు. యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ మోహరించబడ్డాయి. భద్రత కోసం గగనతలం నుంచి నేలని సర్వే చేస్తున డ్రోన్‌లను గమనించాను.

రెండు రోజుల్లో రాజభోగం! నా మనస్సాక్షి అత్యాశకి గురైంది, వెనకటి పట్టుదల సడలింది.

వేకువ జామున మేము “ఆసియా ప్రభువుకు వందనాలు” వంటి ప్రశంసా గీతాలతో మేల్కొన్నాము. సేవకులు వినయ విధేయతలతో వడ్డిస్తుంటే మేము రుచికరమైన అల్పాహారం ముగించాం. అప్పుడు వివిధ వ్యవహారాల కార్యదర్శులచే ప్రపంచ వార్తల వివరణ, అనంతరం స్థానిక నాయకులతో మరియు పాలకులతోనూ చర్చలు!

భోజనం మరియు మధ్యాహ్న సమయాలు ఏకాంత వ్యవహారం.

సాయంత్రాలు సాధారణ వివరణల తర్వాత వినోదశాలలో నృత్యాలు మరియు పాటలతో గడిచిపోయాయి.

ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. వెంటనే నేను మహత్వోన్మాదిలా అనుభూతి చెందడం ప్రారంభించాను.

విలక్షణ మామిడిపళ్ళ డెజర్ట్, ఇంకా ఐస్‌క్రీం తింటూ – ప్రకృతితో ఇలా చెప్పాను:

“ప్రకృతీ, నన్ను నేను ఓ రాజులా భావిస్తున్నాను, నువ్వు నా రాణివి. మనం ఇలాగే కొనసాగుదాము. మన పిల్లలు రాకుమారులుగా ఉంటారు. పైగా మనం ఎలాగూ మాంత్రికులమే. మనం  ప్రజలను వివేకంతో పరిపాలిద్దాం.”

ఇదే దురాశ – గతంలో ఒలంపస్ పర్వత శిఖరం నుంచి అమృత ఔషధాన్ని తెచ్చినప్పుడు; వెండి కొవ్వొత్తిని చేతిలో ఉంచుకున్నప్పుడూ నన్ను ముంచెత్తింది. అద్భుత వస్తువులని నేను సాధించినప్పుడు కలిగిన దురాశ మళ్ళీ నన్ను వివశుడిని చేస్తోంది.

నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె చంద్రబింబం లాంటి వదనాన్ని నా చేతుల్లోకి తీసుకుని – “మనం చక్రవర్తికి సేవలు అందిద్దాం. యుద్ధం ముగిసింది. అతను గెలిచాడు. అతను మనకు అధికారం ఇచ్చాడు. ఇంక… మానవులు మనల్ని ఎన్నటికీ అంగీకరించరు; వారు మనల్ని ఎల్లప్పుడూ బయటివారిగా లేదా ‘విశ్వశక్తిని ప్రయోగించేవారిగా’ లేదా ‘దుష్టమాంత్రికులు’ గానే పరిగణిస్తారు!”

ప్రకృతి బిత్తరపోయి చూస్తోంది.

“హనీ, నీకేమయింది? నీ కళ్ళు ఎర్రగా మారాయి. నీ ముఖంలో దురాశ మరియు దుర్మార్గం కనబడుతోంది. జరిగినదంతా నువ్వు మర్చిపోయావా?” అడిగింది ప్రకృతి.

అత్యంత ఖరీదైన షాండిలియర్స్‌తో అలకరించబడిన గదిలో వేల దీపాల కాంతి ప్రసరిస్తుండగా పచార్లు చేస్తున్నాను. గది చివర్లో ఎరుపు దుస్తులు ధరించిన సేవకుడు నా ఆదేశాల కోసం సిద్ధంగా ఉన్నాడు.

“లేదు. నేను మర్చిపోలేదు. కానీ సమూరా నన్ను నా దేశానికి రాజుగా చేశాడు – చూడు… అతడు చేసిన నష్టానికి బదులు చెల్లించాడు. ఇప్పుడు మనం విజేతల పక్షాన ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకు కాకూడదు… ఇలా ఎందుకు కొనసాగకూడదు? అతనికి సహాయం ఎందుకు చేయకూడదు? మూర్ఖపు ఎర్త్ కౌన్సిల్ నన్ను ఓ మిషన్ పై పంపింది, కానీ మధ్యలో నన్ను వదిలేసింది. వాళ్ళు తమ అసమర్ధతతో యుద్ధంలో ఓడారు. నేను సంవత్సరాల పాటు సుదూర అంతరిక్ష వేదికలోని జైలులో ఖైదు చేయబడ్డాను. వారు నన్ను రక్షించలేదు.”

“ఆపు!” అరిచింది ప్రకృతి.

ఏనిమాయిడ్ కంగారుగా, నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. యురేకస్ కూడా వచ్చింది. దానిపై ఉన్న ఆకుపచ్చ, ఎరుపు దీపాలు వెలుగుతున్నాయి, బీప్ ధ్వనులు వస్తున్నాయి.

“మాస్టర్, మాస్టర్ మీరిలా వాదించకూడదు. కెమెరాలు, మైక్రోఫోన్లు ఉన్నాయి. పైగా మిమ్మల్ని గమనిస్తున్నారు!” అంది యురేకస్.

నేను కోపంగా వున్నాను. “ఈ ఇనుప ముక్క నాకు సలహా ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నేను దీనిని విడదీసి, రీ-ప్రోగ్రామ్ చేస్తాను. నేను ఆసియా పాలకుడిని, అంగారక చక్రవర్తికి మాత్రమే జవాబుదారీని! ఎంతటి శక్తివంతుడ్ని నేను! “

దురాశ నన్ను ముంచెత్తింది. అధికారం నాకు మత్తెక్కించింది. నా తల్లిదండ్రుల హత్యకి పగ తీర్చుకునే ఆలోచనలన్నింటిని మరచిపోయాను. గొప్ప మానవతా విలువలని విస్మరించాను. విచిత్రమైన అఘోరీల వింత నియమాలతో గ్రామాలలో బానిసలుగా వ్యవహరించబడుతున్న మనుష్యుల దుస్థితిని మర్చిపోయాను.

గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. అందరూ మౌనంగా తమ తమ పడక గదులకు వెళ్ళిపోయారు.

ప్రకృతి రోదిస్తోంది. ఏనిమాయిడ్ గుర్రుమంటూ వెళ్ళిపోయాడు.

రోబోలు దుఃఖించవు. కాబట్టి యురేకస్ నిశ్శబ్దంగా ఉంది. ఈ రకంగా జీవితం మరొక రెండు వారాలు గడిచింది.

(సశేషం)

Exit mobile version