భూమి నుంచి ప్లూటో దాకా… -21

0
3

అధ్యాయం 61: పునర్జాగృతం

నన్ను తీవ్రంగా రెచ్చగొట్టినా, నాలో క్రోధం చెలరేగినా నా మనసెలా స్పందిస్తుందో నాకు తెలుసు. అదొక గత కాలపు భావన.

వాస్తవానికి నాల్గవ సహస్రాబ్దిలోని ‘ఉత్పరివర్తి’ (మ్యూటంట్) లేదా ‘విజర్డ్’ లేదా ‘పిసియుఎఫ్’లు అందరూ ఇలాగే స్పందిస్తారు. ఈ విషయంలో ప్రకృతి, ఏనిమోయిడ్ ఒకటే.

నా కళ్ళు ఎర్రగా మారాయి, నిప్పులు కక్కాయి. నా చేతి వేళ్లు లేజర్ కిరణాలను వెలువరించాయి. నాకు వాళ్ళకీ మధ్య అగ్నిగోళాలు ఎగిసిపడ్డాయి.

ప్రకృతి కూడా నాలాగే చేసింది. ఇది అంతకు ముందు లాంటి పోరాటం కాదు, తేడా ఏంటంటే సైనికుల్లో సాంప్రదాయ యోధులతో పాటు నాలాంటి తాంత్రికులు కూడా ఉన్నారు. ఫలితంగా – మాకు, శిక్షణ పొందిన దళాలకి మధ్య ఒక నిప్పుల పోరాటం.

అగ్నిగోళాలు ఎగురుతున్నాయి, గాలిలో పొగ నిండిపోయింది. గాయపడిన సైనికులు బాధతో అరుస్తున్నారు. నేను లేజర్ పుంజంతో కమాండర్‌ని చంపాను. “ప్రకృతీ, ఏనిమోయిడ్… ఇక పరిగెడదాం. మరిన్ని బలగాలు వస్తాయి. వాళ్ళతో మనం పోరాడలేము!” అంటూ అరిచాను.

మేము శబ్దాల గందరగోళం; మంటలు, పొగ నిండిన వాతావరణం నుంచి పరిగెత్తాం. కాసేపట్లోనే అదృశ్య రూపం ధరించాం.

ఒకప్పుడు “రాజ్‌పథ్” అని పిలవబడ్డ కింగ్స్ వేలో మేం నడుస్తూ ఉండగా ఆకాశంలో ఫైటర్ ప్లేన్స్, డ్రోన్‌లు ఎగురుతుండడం చూశాం. హెలికాప్టర్ గన్‌షిప్‌లు భవనాలపైన బాంబులు కురిపిస్తున్నాయి.

మానవ తిరుగుబాటు దళాలకు హెలికాప్టర్లు లేనందున రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్‌లతో దాడి చేస్తున్నాయి. సమూరా సామ్రాజ్యం యొక్క వైమానిక దళం వాటిని ఎదుర్కుంతోంది.

గగనతల పోరాటం కొనసాగుతోంది, కాల్బలాల పోరాటం మొదలైంది. తమపై తుపాకులతో కాల్పులు జరుపుతున్న వ్యక్తులపై తాంత్రికులు యుద్ధ ట్యాంకులతో దాడులకు దిగారు. తాంత్రికుల యుద్ధ ట్యాంకులను ఎదుర్కోడానికి ప్రజలు కూడా తుపాకులు చేతపట్టారు.

మా రక్షణ కోసం మేము పరిగెడుతునప్పుడు, మానవ తిరుగుబాటుదారుల ఆత్మహత్య దళాలు సమూరా యొక్క యుద్ధట్యాంకులపై దూకుతూ, బలిదానంతో వాటిని పేల్చివేయడం చూశాము.

చావులు, గాయాలు, అల్లకల్లోలం. మంటలు, పొగలు, కూలిన ఇళ్ళ శిథిలాల నుంచి జారుతున్న రాళ్ళు.

మేము ఢిల్లీ శివార్ల వైపు పరిగెత్తాం. ఆమ్రపాలి వెళ్ళేందుకు ఏదైనా వాహహనాన్ని పట్టుకోవడానికి హైవే మీద నిలబడ్డాం.

“మొదట నేను ఆమ్రపాలిలో మా నాన్నని చూడాలి, ఆయన్ని కాపాడాలి” అంది ప్రకృతి.

యురేకస్ నాతోనే ఉంది. ఇప్పుడది ఇంటర్‌గాలాక్టిక్ వార్ కరెస్పాండెంట్‌గా మారింది.

“భూమి మీద అన్ని జోన్‌లలోనూ తిరుగుబాటు జరుగుతోంది. అమెరికా, యూరప్, ఆసియాలలో పోరాటం కొనసాగుతోంది. చెన్ లీ అంతరిక్షంలో చంద్రుడిలో కాలనీలో ఉన్న తన రహస్య స్థావరం నుండి యుద్ధానికి మార్గదర్శనం చేస్తున్నాడు.”

“కుజుడిలో ఏం జరిగింది?” నేను అడిగాను.

“సమూరాకి చెందిన అన్ని గ్రహ కాలనీలలోనూ, అధీన దేశాలలోలూ యుద్ధం జరగనది కుజుడి లోని అరుణ భూములలో మాత్రమే. సమూరా తన ఉన్నత దళాలతో రాజధాని మంత్రలో ఉన్నాడు. అన్ని గ్రహాలలోని అన్ని రక్షణ దళాలకు మార్గదర్శనం చేస్తున్నాడు. మానవుల ప్రతిఘటన అన్ని చోట్లా ఇంకా ప్రారంభం కానప్పటికీ, చంద్రుడిలో సమూరా ఉపగ్రహ సామ్రాజ్యం ఇప్పుడే కూలిపోయింది. టైటాన్, గనీమీడ్‌లలో పతనం అంచున ఉన్నాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అత్యంత కష్టంగా నిర్మించుకున్న సాంకేతిక ప్రక్రియలు నాశనమయ్యాయి. కానీ మానవ కాలనీలు పోరాడుతున్నాయి. “

“డిమిట్రీని సంప్రదించు” యురేకస్‌కి చెప్పాను.

“డిమిట్రీ జాడ తెలియడం లేదు. టైటాన్‌లో తన తండ్రి పొసయిడన్, సోదరుడుతోనూ కలిసి ఆమె పోరాడుతుండవచ్చు. నేను ఆమె సంకేతాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నాను. “

రహదారి మీద ఒక పాత బస్సు నెమ్మదిగా వస్తోంది. తలపాగాలు ధరించిన గ్రామీణ పురుషులు, ముసుగులు ధరించిన స్త్రీలు, పిల్లలతో పూర్తిగా నిండి ఉంది.

మేము చేతులెత్తి సైగ చేయగానే బస్సు ఆగింది.

“ఖాళీ లేదు” చెప్పాడు డ్రైవర్. “బస్సు పూర్తిగా నిండిపోయింది” అన్నాడు.

“నేను రెట్టింపు ధరలు చెల్లిస్తాను. దయచేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి” అరిచాను.

బస్సంతా పిల్లల ఏడుపులు… చెమట వాసన, మాసిన బట్టలు వాసన. అది పేద ప్రయాణీకుల బస్సు మరి.

అందరూ యుద్ధం నుండి పారిపోతున్నారు.

“లోపలికి పదండి! ఎలాగొలా సర్దుకోండి! మీ బొమ్మను సురక్షితంగా ఉంచుకోండి” అన్నాడు డ్రైవర్ హిందీలో.

పెద్దగా చప్పుడు చేసుకుంటూ బస్సు సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమైంది. ఎవ్వరూ బాంబు దాడి చేయకూడదన్న ఉద్దేశంతో తెల్లని జండాపై రెడ్ క్రాస్‌ చిహ్నం ఉంచారు.

***

భూమి తిరుగుబాటు యొక్క పునర్జాగృతం లేదా పునరుజ్జీవం ఆశ్చర్యకరంగా ఉంది. తిరుగుబాటుదార్లు ప్రతిచోటా మాంత్రిక దళాలతో పోరాడుతున్నారు.

బస్సు వెళ్తున్న కొద్దీ, రోడ్డు మీద బారులు తీరి నడుస్తున్న శరణార్థులను చూశాము. వారు తమ వస్తువులు, సంచులని, చిన్న పిల్లలను మోసుకుంటూ శ్లోకాలు పాడుతూ దైవప్రార్థన చేస్తూ నడుస్తున్నారు. యుద్ధం జరుగుతున్న ఢిల్లీ, ఆగ్రా నగరాలు, ఇంకా ఇతర పట్టణాల నుండి పారిపోయి సురక్షిత ప్రాంతాలకు చేరాలనుకుంటున్నారు.

ఎక్కడ చూసినా వినాశనమే… దగ్ధమైన ఇళ్ళు, పొలాలు, కర్మాగారాలు…

దగ్గరలో ఉన్న పట్టణంలో నిలిచిపోవడంతో ఈ బస్సు సుదీర్ఘ ప్రయాణం ముగిసింది, అక్కడ్నించి మేము చాలా డబ్బు చెల్లించి మరొక బస్సుని పట్టుకున్నాము. నా కోటు జేబులో ఉన్న మొత్తం డబ్బు చివరి పైసా దాకా ఖర్చు చేసేశాను. ఎటిఎం డిజిటల్ కార్డులు ఉన్నాయి, కానీ అవేవీ పని చేయడం లేదు.

ఈ బస్సు మమ్మల్ని ఆమ్రపాలికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలో విడిచిపెట్టింది.

మేము అలసిపోయాము. ఆకలితో, దాహంతో ఉన్నాము. ‘నా మంత్రశక్తులూ, విశ్వశక్తి ఏదీ ఇప్పుడు మాకు ఆహారం అందించలేవు తీసుకుని ఉండవచ్చు’ ఎగతాళిగా అనుకున్నాను.

ఉన్నంతలో ప్రశాంతంగా ఆ పట్టణంలోని ఒక శిథిలమైన హోటల్లో మేము విశ్రాంతి తీసుకున్నాము. నీడలో కూర్చున్న ఒక్క వృద్ధుడు తప్ప అక్కడ ఎవరూ లేరు.

“దీన్ని వదిలివెళ్ళడానికి నేను నిరాకరించాను” అని ఆయన చెప్పాడు. “ఇది నా కొడుకు హోటల్, పైగా ఇది నా ఊరు. చావనైనా చస్తాను గానీ నేను ఈ స్థలాన్ని విడిచి పారిపోను” అన్నాడు.

స్టోర్ రూమ్‌లో దొరికిన కొన్ని రొట్టెలు, కూరగాయలు, మంచినీళ్ళ కోసం నేను ఆయనకి నా బంగారు ఉంగరాన్ని ఇచ్చాను.

ఉన్న పదార్థాలలో ప్రకృతి ఏదో ఒక వంట చేసింది. నిశ్శబ్దంగా తిన్నాం.

“గవర్నర్ జనరల్ స్థాయి నుంచి యుద్ధం నుండి పారిపోతున్న శరణార్థి స్థాయికి పడిపోయాను. విధి ఎంత విచిత్రమైనదో. మనమేం చేద్దాం ప్రకృతీ? డబ్బంతా అయిపోయింది. మేము ఇంకా చాలా మైళ్ళ దూరం వెళ్ళాలి!” అన్నాను.

ప్రకృతి వండింది కాబట్టి, వంటలు రుచికరంగా ఉన్నాయి. అయినా భారతీయ వంటకాలు చేయడంలో ప్రకృతి నేర్పరి.

“నడుద్దాం! నడుద్దాం! మన ఊరికి చేరేవరకూ దారంతా నడుద్దాం” అందామె పట్టుదలగా.

“చెన్ లీ మనకు ఓ విమానమో లేదా కారో లేదా ఒక ట్రక్ ఇస్తే ఎంత బాగుంటుందో… సమూరా నాకు గవర్నర్ పోస్ట్ ఇచ్చినట్లుగానే.”

“కౌన్సిల్ కమ్యునికేషన్స్ అస్థిరంగా ఉన్నాయి” అంది యురేకస్. “మనల్ని కాపాడమని ఎర్త్ కౌన్సిల్‌కీ, చెన్ లీకి అత్యవసర సందేశాలను పంపుతున్నాను. రవాణా సౌకర్యం కల్పించమనీ, ఆహారం అందించమని…. విన్నవించాను! ఇంకా జవాబు రాలేదు.”

మేము ఆ హోటల్‌లో నిద్రపోయాము. అది నిశ్శబ్దంగా ఉంది, కానీ అప్పుడపుడు నక్కల, కుక్కల అరుపులు వినబడుతున్నాయి. దూరంగా యుద్ధం జరుగుతోంది. కానీ అది నిజమైనది, క్రూరమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here