[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 60: తిరుగుబాటు ప్రారంభం
[dropcap]ఆ[/dropcap]సియా ప్రాంతపు, భారతదేశం యొక్క గవర్నర్ జనరల్‌గా కొన్ని రోజుల పాటు అనేక విషయాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాను. అఘోరీల పాలనలో బానిసలుగా బతుకుతున్న బీదలను విముక్తి చేయడం, దెబ్బతిన్న పట్టణాలు మరియు విద్యా సంస్థల పునర్నిర్మాణం మొదలైనవాటికి ప్రాధాన్యతనిచ్చాను. అధికారులందరిని సమావేశానికి పిలిచాను. విద్యార్థులకు పరిశోధన మరియు సరైన విద్యను తిరిగి ప్రారంభించటం ఎంత ముఖ్యమో వారికి వివరించాను. సాంకేతిక ప్రక్రియలు అవసరమని వాదించాను, మంత్రశక్తులు, విశ్వశక్తి యొక్క అభ్యాసంతో అవీ పాటూ ఉండాలని గట్టిగా చెప్పాను. ఆర్థికాభివృద్ధి, మానవ హక్కుల ప్రాముఖ్యత గురించి వారికి చెప్పాను. అనేక కమిటీలను నియమించడం ద్వారా పరిపాలనా, ఆర్ధిక, విద్యా సంస్కరణలు అమలు చేయడంలో తలమునకలయ్యాను. నిధులు మంజూరు చేయమని న్యూ హోప్ నగరంలోని విజార్డ్ కౌన్సిల్‌కు ఉత్తరాలు పంపాను.
అప్పుడు ఆ ఘటన జరిగింది.
ఈ కాలమంతా… ప్రకృతి, ఏనిమోయిడ్ నిశ్శబ్దంగా నన్ను గమనిస్తున్నారు. అప్పుడే నా ప్రతిపాదనలను తిరస్కరిస్తూ అమెరికాలోని న్యూ హోప్ లోని విజార్డ్ కౌన్సిల్ నుండి లేఖ వచ్చింది.
“మీరు చక్రవర్తి విధానాన్ని మార్చలేరు. మిత్రపక్షాల పాలనను అమలుచేయాలి. భూమి మాత్రమే కాదు, ఇతర అన్ని గ్రహాలు మాంత్రికుల పాలనలో ఉన్నాయి. ఇది విశ్వశక్తి యొక్క నియమం. మనకు తగిన సాంకేతిక ప్రక్రియలు ఉన్నాయి! కొత్త అభివృద్ధికి ఎటువంటి అవసరం లేదు.” నా సంస్కరణలు, నిధుల కోసం నా అభ్యర్థన అన్నీ బుట్టదాఖలయ్యాయి.
ఓరోజు గంభీరమైన ఆలోచనలలో మునిగి ఉండగా నా గదిలో యురేకస్ వచ్చింది.
“మాస్టర్! మీకు రహస్య సందేశాలు! నేను డీకోడ్ చేశాను. మీరు మాత్రమే చూడాలి” అంది.
అన్ని సందేశాలలో విషయం ఒకటే.
“పదిరోజులలో తిరుగుబాటు భూమి మీద అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఇది ఆసియా, అమెరికా, ఆఫ్రికా లోని అన్ని గ్రామాలలో, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రారంభమవుతుంది. మీరు సహకరించాలి! మానవుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం కోసం, మానవ కాలనీల కోసం!”
అప్పుడు స్వయంగా చెన్ లీ పంపిన ఒక సందేశం అందింది. “హనీ, మీరు మన విధానం నుంచి, సూచనల నుండి పక్కకి జరుగుతున్నారు. తాత్కాలిక అధికారం, హోదా మిమ్మల్ని గందరగోళపరిచాయి. వాస్తవాలు గ్రహించండి. మీరు ఎంపికైన వ్యక్తి.”
ఇటువంటి అనేక సందేశాలు ఉన్నాయి.
నేను నిరాశకు గురయ్యాను.
నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను.
రెండు రోజులు సుదీర్ఘంగా ఆలోచించాను.
ధ్యానం చేసాను.
విశ్వశక్తిని ఆవాహన చేసి శక్తిని లోపలికీ బయటకీ పంపసాగాను. ట్రైటాన్‌లో చదివిన త్రికాల గ్రంథాన్ని మళ్ళీ చూసాను.
నారా ఆమ్రపాలి, నయన ఆమ్రపాలిల అభౌతిక రూపాలను చూశాను. నాన్న తెల్లగడ్డంతో తేలుతున్న తెల్ల దుస్తులలో పొడుగ్గా కనిపిస్తున్నాడు; అమ్మ నల్లని జుట్టుతో, ఎర్రని ‘సిందూరంతో దేవదూతలా నాకేసి చూస్తూ నవ్వుతోంది.
“హనీ, సమయం ఆసన్నమైంది!”
నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. మరణం, వ్యాధులు, ఉత్పాతల దృశ్యాలు గోచరించాయి నాకు.
నాకు పీడకలలు వచ్చాయి. యుద్ధ జ్వాలలు చూశాను.
***
రెండు రోజుల తరువాత, గెలాక్టిక్ టివీలో వార్తలు చూస్తుండగా, చంద్రుడి అమృతా కాలనీలో భారీ పేలుడు సంభవించిందనీ, ప్రభుత్వ దళాలకీ ‘తిరుగుబాటుదారుల’కీ మధ్య అప్పుడప్పుడు కాల్పులు జరుగుతున్నాయని తెలిసింది. తిరుగుబాటు ఒక గ్రహ స్థాయిలో మొదలైందని నేను అర్థం చేసుకున్నాను.
అదే సమయంలో గనీమీడ్, టైటాన్‌లలో చెదురుమదురు ‘పేలుళ్ళ’ గురించిన వార్తలు వచ్చాయి, వార్తా ప్రసారంపై ఆంక్షలు విధించబడ్డాయని స్పష్టమైంది.
తర్వాత న్యూ హోప్ సిటీపైనా, ప్యారిస్, లండన్, ఇంకా మధ్య ఆసియా ప్రాంతాలు, ఐరోపాలోని పలు నగరాల్లో పేలుళ్లు జరిగాయనీ, డ్రోన్ విమాన దాడులు జరినట్లు వరుస వార్తలు వచ్చాయి. ఈ భూభాగాల పలు పాలకుల వారం పాటు రోజువారీ ప్రకటనలు ఇచ్చారు. తరువాత భూమిపై అంతర్యుద్ధం జరుగుతోందనీ, అభివృద్ధి చెందిన మానవులు ఆఫ్రికా నుండి విమానాలతో, ఇతర గ్రహాలపై రహస్య దళాలతో దాడులు చేస్తున్నట్టు గెలాక్టిక్ టివి ప్రకటించింది.
తర్వాత ఉన్నత హెచ్చరికలు అందాయి, రక్షణ అధికారులకు, దళాలకు మధ్య సమావేశాలు జరిగాయి. దళాలకు ‘పై’ నుండి… అక్షరాల అంగారకుడినుంచి ఆదేశాలు వచ్చాయి.
“దాడి చేయండి! నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. ఆసియాలోని తిరుగుబాటుదారులను చంపేయండి. మేము జీవాన్ని పునఃసృష్టించగలం, కాని సామ్రాజ్యం ప్రమాదంలో పడితే అంగీకరించం” అని అరుణ భూముల చక్రవర్తి, సౌర వ్యవస్థలోని గ్రహాల అధ్యక్షుడు అయిన సమూరా ఆదేశించాడు.
తర్వాత ఎర్త్ కౌన్సిల్ అధ్యక్షుడు చెన్ లీ నుంచి, ఇంకా చంద్రుడు, గనీమీడ్, టైటాన్, ప్లూటో నుండి ఇతర అజ్ఞాతంలో ఉన్న నాయకుల నుండి సందేశాలు వచ్చాయి.
“హనీ! స్వేచ్ఛ, సమానత్వం ఇంకా సౌభాతృత్వం. మీరు ఎంపికైన వ్యక్తుల్లో ఒకరు. మానవ జాతికి సహాయపడండి.” ఇది నాకొక్కడికే వచ్చిన సందేశమా లేక నాలాంటి అందరికీ అందిన సందేశమో నాకు తెలియదు. కానీ ఇది నాలో శాశ్వతమైన గందరగోళాన్ని కలిగించింది. నాలో సగం మనిషి, సగం మాంత్రికుడు ఉన్నారు.
నేను ఎవరి పక్షం?
ఆ రాత్రంతా పొడవాటి నీడలు దర్శనమిచ్చాయి. ఢిల్లీ, ఆగ్రా, టెహ్రాన్, బీజింగ్, మాస్కో ఇంకా అనేక నగరాలలో పేలుళ్లు జరిగాయి. విశ్వవిద్యాలయాలపై కూడా దాడి చేశారు.
తిరుగుబాటు నేను ఊహించినదాని కన్నా మరింత తీవ్రంగా, ఘోరంగా ఉంది.
ఏ చారిత్రాత్మక ఘటనలోనైనా ఏక వ్యక్తి పాలన స్వల్పమైనదే.
అయినప్పటికీ ప్రతి ఒక్కరూ విలువలను కాపాడటానికి తామే ఎంపికైనవారమని భావిస్తున్నారు.
నాకు సమయం, శక్తి ఉంటే ప్రతి గ్రహంలో జరుగుతున్న ప్రతి తిరుగుబాటు యుద్ధంపైన ఒక్కో పుస్తకం వ్రాసి ఉండేవాడిని.
కానీ నాది అల్పమైన ఉనికి! నాతో పాటు ప్రకృతి, ఏనిమోయిడ్, యురేకస్ ఉన్నారు.
పురుషుడు, స్త్రీ, జంతువు, ఇంకా యంత్రం.
నేను గెలాక్టివ్ టివీలో వార్తలు చూడసాగాను. ఉన్నత స్థాయి రక్షణ సమావేశాలలో అభావంగా, మౌనంగా ఉండిపోయాను.
తర్వాత ‘నైట్ ఆఫ్ లాంగ్ నైవ్స్’ సంభవించింది.
ఢిల్లీ లేదా 888 నగరంలో ఆ రాత్రంతా నిరంతరంగా బాంబుల దాడి, కౌంటర్ మిస్సైల్ ఎటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి గడిచేసరికి నా రాజభవనం – పురాతన వైస్రాయి రాయల్ ప్యాలెస్ మరియు శతాబ్దాల క్రితం నాటి రాష్ట్రపతి భవన్ – చుట్టూ యుద్ధ ట్యాంకులు నిలిచాయి. కమాండర్లు తుపాకులతో నిలబడి ఉన్నారు.
నాకు తెలుసు.
నేను మారిపోయానని వారికి తెలిసిపోయింది. వాళ్ళు నన్ను పట్టుకోవాలని కోరుకుంటున్నారు. బాల్కనీలోకి వెళ్ళి చూశాను, నాలుగు మిలిటరీ జీపులు ప్యాలెస్‌లోకి వేగంగా వచ్చి ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకున్నాయి. యుద్ధ ట్యాంకులన్నీ నెమ్మదిగా ప్యాలెస్ వైపు మొహరించాయి.
వారు నెమ్మదిగా లోపలికి వచ్చారు. నాకు తుపాకీలు గురిపెట్టారు.
“గవర్నర్ జనరల్ హనీ ఆమ్రాపాలి! మీరు మరియు మీ కుటుంబం ఖైదు చేయబడుతున్నారు. రాజద్రోహం, యుద్ధంలో చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్న అభియోగంపై మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము. మీరు మాతో రావలసి ఉంటుంది. మీ అధికారాలు తొలగించబడ్డాయి.
ఇప్పుడు మీరు ఖైదీగా, దేశద్రోహిగా ఉన్నారు” అని చెబుతూ గడ్డంతో ఉన్న సిక్కు జనరల్ నాకు మెషిన్ గన్ గురిపెట్టాడు.
ప్రకృతి, ఏనిమోయిడ్, యురేకస్ నెమ్మదిగా బాల్కనీలో బయటకి వచ్చి, నిశ్చలంగా నిలుచుండిపోయారు.
“మీ అధికారాలను తొలగించబడ్డాయి. రాజద్రోహిగా ఉన్నందుకు మీరు త్వరలోనే ఉరి తీయబడతారు మిస్టర్ గవర్నర్ జనరల్! నెమ్మదిగా మీ చేతులు పైకెత్తి మాతో రండి. లేదా మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే చంపేస్తాం.”
అధ్యాయం 61: పునర్జాగృతం
నన్ను తీవ్రంగా రెచ్చగొట్టినా, నాలో క్రోధం చెలరేగినా నా మనసెలా స్పందిస్తుందో నాకు తెలుసు. అదొక గత కాలపు భావన.
వాస్తవానికి నాల్గవ సహస్రాబ్దిలోని ‘ఉత్పరివర్తి’ (మ్యూటంట్) లేదా ‘విజర్డ్’ లేదా ‘పిసియుఎఫ్’లు అందరూ ఇలాగే స్పందిస్తారు. ఈ విషయంలో ప్రకృతి, ఏనిమోయిడ్ ఒకటే.
నా కళ్ళు ఎర్రగా మారాయి, నిప్పులు కక్కాయి. నా చేతి వేళ్లు లేజర్ కిరణాలను వెలువరించాయి. నాకు వాళ్ళకీ మధ్య అగ్నిగోళాలు ఎగిసిపడ్డాయి.
ప్రకృతి కూడా నాలాగే చేసింది. ఇది అంతకు ముందు లాంటి పోరాటం కాదు, తేడా ఏంటంటే సైనికుల్లో సాంప్రదాయ యోధులతో పాటు నాలాంటి తాంత్రికులు కూడా ఉన్నారు. ఫలితంగా – మాకు, శిక్షణ పొందిన దళాలకి మధ్య ఒక నిప్పుల పోరాటం.
అగ్నిగోళాలు ఎగురుతున్నాయి, గాలిలో పొగ నిండిపోయింది. గాయపడిన సైనికులు బాధతో అరుస్తున్నారు. నేను లేజర్ పుంజంతో కమాండర్‌ని చంపాను. “ప్రకృతీ, ఏనిమోయిడ్… ఇక పరిగెడదాం. మరిన్ని బలగాలు వస్తాయి. వాళ్ళతో మనం పోరాడలేము!” అంటూ అరిచాను.
మేము శబ్దాల గందరగోళం; మంటలు, పొగ నిండిన వాతావరణం నుంచి పరిగెత్తాం. కాసేపట్లోనే అదృశ్య రూపం ధరించాం.
ఒకప్పుడు “రాజ్‌పథ్” అని పిలవబడ్డ కింగ్స్ వేలో మేం నడుస్తూ ఉండగా ఆకాశంలో ఫైటర్ ప్లేన్స్, డ్రోన్‌లు ఎగురుతుండడం చూశాం. హెలికాప్టర్ గన్‌షిప్‌లు భవనాలపైన బాంబులు కురిపిస్తున్నాయి.
మానవ తిరుగుబాటు దళాలకు హెలికాప్టర్లు లేనందున రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్‌లతో దాడి చేస్తున్నాయి. సమూరా సామ్రాజ్యం యొక్క వైమానిక దళం వాటిని ఎదుర్కుంతోంది.
గగనతల పోరాటం కొనసాగుతోంది, కాల్బలాల పోరాటం మొదలైంది. తమపై తుపాకులతో కాల్పులు జరుపుతున్న వ్యక్తులపై తాంత్రికులు యుద్ధ ట్యాంకులతో దాడులకు దిగారు. తాంత్రికుల యుద్ధ ట్యాంకులను ఎదుర్కోడానికి ప్రజలు కూడా తుపాకులు చేతపట్టారు.
మా రక్షణ కోసం మేము పరిగెడుతునప్పుడు, మానవ తిరుగుబాటుదారుల ఆత్మహత్య దళాలు సమూరా యొక్క యుద్ధట్యాంకులపై దూకుతూ, బలిదానంతో వాటిని పేల్చివేయడం చూశాము.
చావులు, గాయాలు, అల్లకల్లోలం. మంటలు, పొగలు, కూలిన ఇళ్ళ శిథిలాల నుంచి జారుతున్న రాళ్ళు.
మేము ఢిల్లీ శివార్ల వైపు పరిగెత్తాం. ఆమ్రపాలి వెళ్ళేందుకు ఏదైనా వాహహనాన్ని పట్టుకోవడానికి హైవే మీద నిలబడ్డాం.
“మొదట నేను ఆమ్రపాలిలో మా నాన్నని చూడాలి, ఆయన్ని కాపాడాలి” అంది ప్రకృతి.
యురేకస్ నాతోనే ఉంది. ఇప్పుడది ఇంటర్‌గాలాక్టిక్ వార్ కరెస్పాండెంట్‌గా మారింది.
“భూమి మీద అన్ని జోన్‌లలోనూ తిరుగుబాటు జరుగుతోంది. అమెరికా, యూరప్, ఆసియాలలో పోరాటం కొనసాగుతోంది. చెన్ లీ అంతరిక్షంలో చంద్రుడిలో కాలనీలో ఉన్న తన రహస్య స్థావరం నుండి యుద్ధానికి మార్గదర్శనం చేస్తున్నాడు.”
“కుజుడిలో ఏం జరిగింది?” నేను అడిగాను.
“సమూరాకి చెందిన అన్ని గ్రహ కాలనీలలోనూ, అధీన దేశాలలోలూ యుద్ధం జరగనది కుజుడి లోని అరుణ భూములలో మాత్రమే. సమూరా తన ఉన్నత దళాలతో రాజధాని మంత్రలో ఉన్నాడు. అన్ని గ్రహాలలోని అన్ని రక్షణ దళాలకు మార్గదర్శనం చేస్తున్నాడు. మానవుల ప్రతిఘటన అన్ని చోట్లా ఇంకా ప్రారంభం కానప్పటికీ, చంద్రుడిలో సమూరా ఉపగ్రహ సామ్రాజ్యం ఇప్పుడే కూలిపోయింది. టైటాన్, గనీమీడ్‌లలో పతనం అంచున ఉన్నాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అత్యంత కష్టంగా నిర్మించుకున్న సాంకేతిక ప్రక్రియలు నాశనమయ్యాయి. కానీ మానవ కాలనీలు పోరాడుతున్నాయి. “
“డిమిట్రీని సంప్రదించు” యురేకస్‌కి చెప్పాను.
“డిమిట్రీ జాడ తెలియడం లేదు. టైటాన్‌లో తన తండ్రి పొసయిడన్, సోదరుడుతోనూ కలిసి ఆమె పోరాడుతుండవచ్చు. నేను ఆమె సంకేతాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నాను. “
రహదారి మీద ఒక పాత బస్సు నెమ్మదిగా వస్తోంది. తలపాగాలు ధరించిన గ్రామీణ పురుషులు, ముసుగులు ధరించిన స్త్రీలు, పిల్లలతో పూర్తిగా నిండి ఉంది.
మేము చేతులెత్తి సైగ చేయగానే బస్సు ఆగింది.
“ఖాళీ లేదు” చెప్పాడు డ్రైవర్. “బస్సు పూర్తిగా నిండిపోయింది” అన్నాడు.
“నేను రెట్టింపు ధరలు చెల్లిస్తాను. దయచేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి” అరిచాను.
బస్సంతా పిల్లల ఏడుపులు… చెమట వాసన, మాసిన బట్టలు వాసన. అది పేద ప్రయాణీకుల బస్సు మరి.
అందరూ యుద్ధం నుండి పారిపోతున్నారు.
“లోపలికి పదండి! ఎలాగొలా సర్దుకోండి! మీ బొమ్మను సురక్షితంగా ఉంచుకోండి” అన్నాడు డ్రైవర్ హిందీలో.
పెద్దగా చప్పుడు చేసుకుంటూ బస్సు సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమైంది. ఎవ్వరూ బాంబు దాడి చేయకూడదన్న ఉద్దేశంతో తెల్లని జండాపై రెడ్ క్రాస్ చిహ్నం ఉంచారు.
***
భూమి తిరుగుబాటు యొక్క పునర్జాగృతం లేదా పునరుజ్జీవం ఆశ్చర్యకరంగా ఉంది. తిరుగుబాటుదార్లు ప్రతిచోటా మాంత్రిక దళాలతో పోరాడుతున్నారు.
బస్సు వెళ్తున్న కొద్దీ, రోడ్డు మీద బారులు తీరి నడుస్తున్న శరణార్థులను చూశాము. వారు తమ వస్తువులు, సంచులని, చిన్న పిల్లలను మోసుకుంటూ శ్లోకాలు పాడుతూ దైవప్రార్థన చేస్తూ నడుస్తున్నారు. యుద్ధం జరుగుతున్న ఢిల్లీ, ఆగ్రా నగరాలు, ఇంకా ఇతర పట్టణాల నుండి పారిపోయి సురక్షిత ప్రాంతాలకు చేరాలనుకుంటున్నారు.
ఎక్కడ చూసినా వినాశనమే… దగ్ధమైన ఇళ్ళు, పొలాలు, కర్మాగారాలు…
దగ్గరలో ఉన్న పట్టణంలో నిలిచిపోవడంతో ఈ బస్సు సుదీర్ఘ ప్రయాణం ముగిసింది, అక్కడ్నించి మేము చాలా డబ్బు చెల్లించి మరొక బస్సుని పట్టుకున్నాము. నా కోటు జేబులో ఉన్న మొత్తం డబ్బు చివరి పైసా దాకా ఖర్చు చేసేశాను. ఎటిఎం డిజిటల్ కార్డులు ఉన్నాయి, కానీ అవేవీ పని చేయడం లేదు.
ఈ బస్సు మమ్మల్ని ఆమ్రపాలికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణంలో విడిచిపెట్టింది.
మేము అలసిపోయాము. ఆకలితో, దాహంతో ఉన్నాము. ‘నా మంత్రశక్తులూ, విశ్వశక్తి ఏదీ ఇప్పుడు మాకు ఆహారం అందించలేవు తీసుకుని ఉండవచ్చు’ ఎగతాళిగా అనుకున్నాను.
ఉన్నంతలో ప్రశాంతంగా ఆ పట్టణంలోని ఒక శిథిలమైన హోటల్లో మేము విశ్రాంతి తీసుకున్నాము. నీడలో కూర్చున్న ఒక్క వృద్ధుడు తప్ప అక్కడ ఎవరూ లేరు.
“దీన్ని వదిలివెళ్ళడానికి నేను నిరాకరించాను” అని ఆయన చెప్పాడు. “ఇది నా కొడుకు హోటల్, పైగా ఇది నా ఊరు. చావనైనా చస్తాను గానీ నేను ఈ స్థలాన్ని విడిచి పారిపోను” అన్నాడు.
స్టోర్ రూమ్‌లో దొరికిన కొన్ని రొట్టెలు, కూరగాయలు, మంచినీళ్ళ కోసం నేను ఆయనకి నా బంగారు ఉంగరాన్ని ఇచ్చాను.
ఉన్న పదార్థాలలో ప్రకృతి ఏదో ఒక వంట చేసింది. నిశ్శబ్దంగా తిన్నాం.
“గవర్నర్ జనరల్ స్థాయి నుంచి యుద్ధం నుండి పారిపోతున్న శరణార్థి స్థాయికి పడిపోయాను. విధి ఎంత విచిత్రమైనదో. మనమేం చేద్దాం ప్రకృతీ? డబ్బంతా అయిపోయింది. మేము ఇంకా చాలా మైళ్ళ దూరం వెళ్ళాలి!” అన్నాను.
ప్రకృతి వండింది కాబట్టి, వంటలు రుచికరంగా ఉన్నాయి. అయినా భారతీయ వంటకాలు చేయడంలో ప్రకృతి నేర్పరి.
“నడుద్దాం! నడుద్దాం! మన ఊరికి చేరేవరకూ దారంతా నడుద్దాం” అందామె పట్టుదలగా.
“చెన్ లీ మనకు ఓ విమానమో లేదా కారో లేదా ఒక ట్రక్ ఇస్తే ఎంత బాగుంటుందో… సమూరా నాకు గవర్నర్ పోస్ట్ ఇచ్చినట్లుగానే.”
“కౌన్సిల్ కమ్యునికేషన్స్ అస్థిరంగా ఉన్నాయి” అంది యురేకస్. “మనల్ని కాపాడమని ఎర్త్ కౌన్సిల్‌కీ, చెన్ లీకి అత్యవసర సందేశాలను పంపుతున్నాను. రవాణా సౌకర్యం కల్పించమనీ, ఆహారం అందించమని…. విన్నవించాను! ఇంకా జవాబు రాలేదు.”
మేము ఆ హోటల్‌లో నిద్రపోయాము. అది నిశ్శబ్దంగా ఉంది, కానీ అప్పుడపుడు నక్కల, కుక్కల అరుపులు వినబడుతున్నాయి. దూరంగా యుద్ధం జరుగుతోంది. కానీ అది నిజమైనది, క్రూరమైనది.
అధ్యాయం 62: ఆమ్రపాలి రహస్యం
పగటి సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలనుకున్నాం, అందుకని పొద్దున్నే లేచి బయల్దేరాం. దూరంగా తుపాకుల మోతలు, యుద్ధ విమానాల రొదలు, అప్పుడప్పుడు పేలుళ్ళ శబ్దాలతో ఉదయపు ప్రశాంతత చెదిరిపోయింది.
యుద్ధంలో ధ్వంసమైన గ్రామీణ ప్రాంతంవైపు నడక సాగించాం. ప్రకృతి పట్టుదల చూసినప్పుడు, “సరే మాస్టర్” అంటూ తనూ కూడ నడవడానికి యురేకస్ 7776 సిద్ధమైనప్పుడు పరిస్థితి పట్ల నా అభిప్రాయం నెమ్మదిగా మారుతోంది. “అవును మాస్టర్! నేనూ నడుస్తాను. దాడుల నుండి మిమ్మల్ని కాపాడటానికి జిపిఆర్ఎస్, ఇంకా ఉపగ్రహ చిత్రాల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తాను” అంది యురేకస్. వీళ్ళందరికీ అద్భుతమైన సంకల్పబలం కలిగి ఉంది. ఇప్పటి వరకు అధికారం నాకు మదమెక్కించింది, దురాశ నన్ను గుడ్దివాడ్ని చేసింది. దుష్ట సమూరాను ఓడించి నా దేశస్థులను, అమాయక గ్రామస్థులను కాపాడాలనే సంకల్పం నాలో మళ్ళీ బలపడింది.
ఆ ఊర్లో ఓ శిథిలమైన, బుల్లెట్ల తాకిడికి గురైన ఓ కిరాణ కొట్లో దొరికిన ఆహార దినుసులను మూటగట్టుకుని ఒక్కొక్కరం ఒక్కో సంచిలో వీపుకి పెట్టుకుని, ఆ ఉదయం బయలుదేరాం.
హైవే మీద నడవడం ప్రమాదకరం కాబట్టి మేము చిన్న సందుల గుండా నడిచాం. అప్పుడప్పుడు ఆమ్రపాలికి వైపు దారితీసే హైవేలను దాటాం. సూర్యోదయమయ్యాక, దారుల వెంబడి గ్రామాలలో చెదురుముదురు గృహదహనాలు తారసిల్లాయి, తుపాకుల వల్ల లేదంటే అఘోరీల త్రిశూలాల వల్ల మరణించిన గ్రామస్థుల శవాలు గుట్టల కొద్దీ కనబడ్దాయి. త్రిశూలాలతో శవాలని ఛిద్రం చేశారు. కొన్ని శవాలు కుళ్ళిపోయి దుర్వాసన వేస్తూంటే, వాటి చుట్టూ రాబందులు మూగుతున్నాయి.
హైవే నిర్జనంగా ఉంది. దాని మీద నడవడం మాకు సౌకర్యంగా ఉంది. ఎప్పుడైనా ఏదైనా మిలిటరీ ట్రక్కు లేదా ఆకాశంలో ఫైటర్ జెట్ వస్తోందని యురేకస్ హెచ్చరిస్తే, పక్కదారులు తీసుకున్నాం. లేదా చుట్టుపక్కల చెట్ల వెనక దాక్కున్నాము.
ఏడుస్తున్న పిల్లల్ని ఎత్తుకుని మాతో పాటే చాలా మంది శరణార్థులు నడుస్తున్నారు. మేము వారితో మాట్లాడాము, మధ్యాహ్నం వారితో కలిసి ఆహారం తీసుకున్నాము. ఎన్నో భయంకరమైన కధలు వినిపించారు వాళ్ళు. సనాతన సాధువుల వల్లా, తాంత్రిక అఘోరాల వల్ల దేశం ఎంత నాశనమైందో చెప్పారు. మానవులకీ, అఘోరాలకీ మధ్య కొత్త యుద్ధాలలో గ్రామాలు, పట్టణాలు ఎలా నాశనం అవుతున్నారో చెప్పారు.
“మానవుల విమానాలు వస్తున్నాయనీ, మాంత్రికుల రాజధాని నగరాలపై దాడి చేస్తున్నాయని మేము విన్నాం. మాంత్రిక ప్రభుత్వ కార్యాలయాలపై గెరిల్లా దాడుల గురించి కూడా విన్నాం. కానీ కొన్నిసార్లు అమాయకులను చంపారు. రైళ్ళలో, మార్కెట్లలో, కార్యాలయాల్లో పేలుళ్ళు జరిగాయి. మానవులకి ఆశ్రయం ఇస్తున్నారనే అనుమానంతో పాఠశాలల వంటి పౌర భవనాలపై దాడులు చేశారు. అంతా గందరగోళంగా ఉంది, భయంకరంగా ఉంది” అని చెప్పారు.
ఏ కాలంలో అయినా యుద్ధం ఘోరమైనది. పోరాడుతున్న రెండు వర్గాలు గెలవాలన్న వారి లక్ష్యం కోసం హింసకు పాల్పడుతాయి.
కానీ బాధ పడేది ప్రజలే.
మానవులు విజయం సాధించి, పూర్వపు స్థితి పునరుద్ధరించబడేంత వరకు ఇది ఇలాగే ఉంటుంది.
ఇది కాలినడకన సాగిన అత్యంత సుదీర్ఘమైన దుర్భలమైన ప్రయాణం. మేము మాలోని శక్తినంతా కూడగట్టుకుని నడిచాం. ఇది ఒక ప్రబోధాత్మక అనుభవంగా మిగిలింది.
మొత్తానికి మేము ఆమ్రపాలి చేరాం. వెంటనే ఒక శుభవార్త విన్నాం.
కొందరు శరణార్థుల వద్ద చేతిలో ఇమిడిపోయే ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ రేడియోలు ఉన్నాయి. అవి ఐజినెట్‌కి కనెక్ట్ చేయబడ్డాయి. కొందరు దాన్ని నోటి మాటగా విన్నారు.
వార్త తెలిసిపోయింది. శుభవార్త. ప్రజలు సంతోషపడ్డారు.
మానవుల ఎర్త్ కౌన్సిల్ గెలుపొందింది. అది న్యూ హోప్ సిటీను చేజిక్కించుకుంది, ఇప్పుడు న్యూ ఢిల్లీలోని మాంత్రికులను పూర్తిగా ఓడించింది. దక్షిణాసియా తమ ఆధీనంలో ఉందని ప్రకటించింది.
త్వరలోనే ఉత్తర అమెరికా భూభాగాలు మానవుల ఎర్త్ కౌన్సిల్ నియంత్రణలోకి వస్తాయని తెలిపింది.
ఆమ్రపాలి లోని మామిడి తోటలను చూశాము, నా హృదయం ఆనందంగా మారింది.
రంగురంగుల తలపాగాలు ధరించిన గ్రామస్తులు, కాగడాలతోనూ, దీపాలతో మాకు ఎదురొచ్చారు. బాణాసంచా పేల్చారు. నడిచి నడిచి అలసిపోయిన జనాలను తీసుకువెళ్ళడానికి ఒక డజను పెద్ద ఎర్ర బస్సులు ఎదురు చూస్తున్నాయి.
వారు ప్రతి ఒక్కరికి నీరు, పళ్ళరసాలు, రొట్టెలు, పండ్లు ఇచ్చారు. రోదిస్తున్న పిల్లలకి పాలు ఇచ్చారు.
రంగురంగుల తలపాగాల మధ్యలో, ఎర్ర తలపాగా ధరించిన ఒక పొడవైన బక్కపలచని శరీరం చేతూలూపుతూ మా వైపు నెమ్మదిగా వస్తోంది.
“నాన్నా!” వేదనతో, సంతోషంతో అరిచింది ప్రకృతి. గ్రామాధికారి మహా, నోరారా నవ్వుతూ, చెమ్మగిల్లిన కళ్లతో వచ్చాడు.
శరణార్థుల తొక్కిసలాటనీ, ఏడుస్తున్న పిల్లలనీ దాటుకుని ముందుకు సాగాం, ఆయన్ని కలిశాం. ఆయన మమ్మల్ని ఆప్యాయంగా హత్తుకున్నాడు.
“ప్రకృతీ, నా తల్లీ!” అంటూ అరిచాడు. “మీరు ఎంత బాధపడ్డారో! దేవుడు, భైరవ స్వామి మనకు సాయం చేశారు. చీకటి రోజులు ముగిసాయి” అన్నాడు.
మేమంతా గ్రామాధికారి మహా ఇంటికి వెళ్ళాం. అప్పటికే ఆ ఇంటిని శుభ్రపర్చారు. మా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉందది.
అబ్బా, దేవుడా ఎన్ని రోజుల తర్వాత రుచికరమైన భోజనం చేశాం! అనేక గంటలపాటు ఎటువంటి పీడకలలు లేకుండా హాయిగా నిద్రపోయాను.
భూమిపై యుద్ధం ముగిసింది! కమ్యూనికేషన్లు పునరుద్ధరించబడ్డాయి. విద్యుత్ సరఫరా కొనసాగింది. టీవీ వార్తలను ప్రసారం చేసింది.
మేము మరుసటి రోజున సాధారణంగా మేల్కొనగలిగినందుకు సంతోషించాము. మరుగుతున్న కాఫీ వాసన, కాల్చిన రొట్టెలు, ఇంకా రుచికరమైన పండ్ల సువాసనలు మమ్మల్ని మేల్కొలిపాయి.
రోబో యురేకస్ వచ్చి, లోహస్వరంలో చెప్పింది.
“మాస్టర్! చెన్ లీ మీకు స్వయంగా పంపిన నిగూఢ సందేశం” అంది.
నేను తినడం పూర్తి చేసి, దాని తెరకేసి చూశాను.
అది చాలా వివరాలతో కూడిన సుదీర్ఘ నిగూఢ సందేశం. నేను చేసిన సహాయానికి, అందించిన సేవలకీ నన్ను అభినందించింది.
ఆ సందేశంలోని చివరి మాటలు చదవగానే నా గుండె ఆగిపోయినట్లయ్యింది.
“హనీ… ఇంకా పూర్తవలేదు! అన్ని గ్రహాలపై యుద్ధం ముగిసింది, మనం గెల్చాం. మాంత్రికుల చీకటి శక్తులు ఓడించబడ్డాయి, పారిపోతున్నాయి. వాళ్ళలో చాలామంది భూమిపై నాశనమయ్యారు. కానీ అసలైన దుష్టుడు సజీవంగా ఉన్నాడు. అతని ప్రధాన రాజ్యాన్ని మనమింకా గెలవలేదు. కుజగ్రహం! సమూరా, అతని అందరు మిత్రులు ఇప్పుడు కుజగ్రహంలోని అరుణభూములలో చేరారు. అక్కడి మానవ కాలనీ వారితో యుద్ధం చేస్తోంది, కానీ ఓడిపోతోంది. ఎందుకంటే కీలక వ్యక్తి సమూరా! అతను మరణించినప్పుడు మాత్రమే యుద్ధంలో గెలుస్తాం!
హనీ ఆమ్రపాలీ! నువ్వు ఎంపిక చేసిన వ్యక్తివి. అతనిని నువ్వు లేదా నీ రక్తం చంపవచ్చు. ఈ విషయం మాంత్రిక గ్రంథాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. నిజానికి, అన్ని గ్రంథాలూ, దేవవాక్యాలు, ఇంకా మాంత్రికుల విజ్ఞానం ఇవన్నీ ఇదే మాటని ఏకగ్రీవంగా చెబుతున్నాయి. మానవాళిని నువ్వే కాపాడాలి! వెళ్ళు, వాడిని చంపెయ్. కుజగ్రహానికి వెళ్ళు! ఇప్పుడు ‘కుజుడి కోసం’ జరిగే యుద్ధంలో చేరు! నీకు అసమానమైన శక్తులున్నాయి. అక్కడికి ఎలా చేరుకోవాలో తెలిపే సూచనలు నీకు రహస్యంగా అందజేయబడతాయి. ఇప్పుడు కొన్ని గంటల్లో మీ సంసిద్ధతను నిర్ధారించాలి!”
ఇప్పుడు నేను ఆశ్చర్యపోయాను, విస్తుపోయాను, మళ్ళీ తికమకపడ్డాను.
కుజగ్రహానికి తిరిగి వెళ్ళడం ఎలా?
ఎక్కడ? నేను ఎవరితో పోరాడగలను?
అప్పుడు నా శరీరంలోనూ, మనస్సులోనూ ప్రతీకారపు భావన చెలరేగింది.
ఇదేదో ముందే తెలిసిన భావన. ఈశ్వరాదేశం యొక్క చివరి క్షణాలు ఇవి.
ప్రతీకారం. దుష్ట సమూరా ప్రలోభాలకు లొంగకుండా, హత్యకి గురైన మంచి మాంత్రికులయిన మా నాన్న నారా, అమ్మ నాయన మరణాలకు ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంది.
నేను అతని రక్తాన్ని, పైగా నేను ఎంపికైన వ్యక్తిని. ఈ మాటని నేను మొదటి నుండి తరచుగా వింటున్నాను. ఇప్పటివరకు నేను ఏమీ చేయలేదు. అనేక సార్లు అతను నన్ను చిక్కుల్లో పడేసాడు, నన్ను బ్లాక్‌మెయిల్ చేసి, నా శక్తులు ఉపయోగించి, తనకు కావల్సిన అద్భుత వస్తువులను చేజిక్కించుకున్నాడు.
వద్దు. ఇకపై ఇలా సాగదు.
ఈ చివరి యుద్ధంలో గెలవాలి. అతనిని చంపేవాడిని నేనే.
ఈ విషయం గురించి నేను ప్రకృతితో లేదా మహా గారితో లేదా ఏనిమోయిడ్‌తో చర్చించలేదు.
నేను ‘సరే!! సరే! సరే మహాశయా. ఓ సాధారణ బలహీనమైన మానవుడిననైన నాకు శక్తులున్నాయనీ, తాంత్రిక చక్రవర్తిని చంపేందుకు నేను ఎంపికైన వ్యక్తినినని నాల్గవ సహస్రాబ్ది యొక్క అన్ని శాస్త్రాలు తెలిసినవారు, వివేకం కలిగినవారైన మీరు చెబితే సరే. అవును. నేను సిద్ధంగా ఉన్నాను. కుజుడిపైకి వెళ్ళడానికి ఏర్పాట్లు చెయ్యండి. కాని ఎలా? అక్కడికి చేరడానికి కనీసం ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ సమయమే పడుతుంది” అని బదులిచ్చాను.
నిశ్శబ్దం! తెర చాలా సేపు ఖాళీగా ఉండిపోయింది. నాకు అనిశ్చితంగా ఉంది.
దూరంగా ప్రకృతి నవ్వుతూ గ్రామపు మహిళతో మాట్లాడుతోంది. మహా హుక్కా పీలుస్తూ కూర్చున్నాడు. యురేకస్ దాని ఛాతిపై స్క్రీన్‌తో నా ముందు వేచి ఉంచింది. తాజా పువ్వుల సువాసనని ఆఘ్రాణిస్తూ తోటలో తిరుగుతున్నాడు ఏనిమాయిడ్.
అంతా ప్రశాంతంగా ఉంది.
నేను ఆస్వాదించడానికి ఉద్దేశించబడని శాంతి ఇది. నాకెన్నడు శాంతి, ఆనందం లేవు.
ఉన్నట్టుండి తెరపై చాలా సూచనలు ఎరుపు అక్షరాలతో ప్రత్యక్షమయ్యాయి.
“దేవుడు నిన్ను దీవించుగాక. నువ్వు వెంటనే వెళ్లవలసి ఉంటుంది. మాయలు లేదా ‘విశ్వశక్తి’ ఉన్నవారు మాత్రమే వెళ్ళగలరు.
నేను పాటించాల్సిన సూచనలు తెరపై వరుసగా వచ్చాయి.
వాటిని చదువుతుంటే నా మతి పోయింది.
దక్షిణ దిశలో ఉన్న మా నాన్న పొలంలోని మర్రిచెట్టు రహస్యం వెల్లడైంది.
ఇది ఆమ్రపాలి రహస్యం.
అది నా విధి. కుజగ్రహానికి తక్షణమే చేరుకోవడానికి మార్గం ఆ మర్రిచెట్టే.
***
చీకటి పడుతోంది. ప్రకృతికి, మహాకి, ఏనిమోయిడ్‌కి చెప్పాలా వద్దా అని ఆందోళనతో ఉన్నాను. వాళ్ళని నాతో తీసుకెళ్ళి, ప్రమాదంలో పడేయలేను. అనేక సార్లు వారు నా ఆత్మీయుల్ని బంధించి ప్రమాదంలో పెట్టారు, నన్ను బ్లాక్‌మెయిల్ చేశారు. నేను ఒంటరిగానే వెళ్ళాలి.
కానీ నేను ఆమె చెప్పకుండా వెళ్ళలేను. ఆమె నా ప్రియమైనది. ఆమె నా జీవితానికి అర్థం. బహుశా నేను తిరిగి రాలేకపోవచ్చు.
రాత్రి భోజనం చేస్తున్నప్పుడు “మీకో విషయం చెప్పాలి” అన్నాను. వాళ్ళు భయపడ్డారు. మేము ఎర్ర వైన్, వేయించిన చేపలు, జున్ను మరియు ఎర్ర స్ట్రాబెర్రీలను తీసుకున్నాము. ఇదంతా నేను వాళ్ళకి చెబుతుంటే నాలో ఏవో దుశ్శకునాలు!
“నేను వస్తాను! నేను నిన్ను ఒంటరిగా వదలలేను” అంది ప్రకృతి.
“నేను విశ్వశక్తిని ఉపయోగించగలను. నేను మీతో ప్రయాణించటానికి శక్తి కలిగి ఉన్నాను” గట్టిగా అరిచాడు ఏనిమాయిడ్.
“నన్ను కూడా తీసుకువెళ్ళండి మాస్టర్! నేను మీతో వస్తాను. కుజగ్రహంలో తయారుచేయబడ్డ నేను అక్కడ మీకెంతగానో ఉపయోగపడతాను. పైగా మీరు నా యజమాని!” అంది యురేకస్.
అయితే మహా మాత్రం వెక్కి వెక్కి ఏడ్చాడు. “మీరు మళ్లీ వెళ్తున్నారు. ఇది అన్యాయం. నా ఆనందం ఇంత తక్కువ సేపా. నేనిక బతకలేను” అన్నాడు
“నాన్నా… ఆపు.” అంది ప్రకృతి. “మేము వెళ్ళితీరాలి, ఆ దుష్టుడి బారి నుంచి సౌర వ్యవస్థని కాపాడాలి. హనీ ఎంపికైన వ్యక్తి. నేను అతని భార్యను” అంది.
ఆకాశం నుంచి ఉరుములు వినబడ్డాయి, నల్లటి మబ్బులు కమ్మేశాయి. మెరుపులు మెరిసాయి. ఉన్నట్టుండి బలమైన గాలులు వీచసాగాయి. ఆమ్రపాలిపై కుండపోత కురవసాగింది. గ్రామంలో లావుపాటి ధారలతో వర్షం పడటం ప్రారంభమైంది.
“మనం మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళాలి” అన్నాను.
“ఓహ్, వద్దు!” అంటూ రోదించాడు మహా. అయితే నా తల్లిదండ్రులు మరణించినప్పుడు ఉన్నంత దట్టంగా చీకటి లేదు, తుఫాను కూడా ఆనాటిలా అంత ఉధృతంగా లేదు.
“పదండి వెళదాం!” నేను స్థిరంగా చెప్పాను.
మేము వానలో తడుస్తూ, జారుతున్న నేలపై చల్లగాలికి వణుకుతూ నడిచాము.
మేము ఆ భారీ మర్రిచెట్టుకు చేరుకున్నప్పుడు, అక్కడంతా బాగా చీకటిగా ఉంది. చేతి లైట్లు, ఇంకా ఆకాశంలో మెరుపులు మాత్రమే మాకు దారి చూపే కాంతి వనరులు. మా చేతిలో ఉన్న లైట్లు తప్ప మాకు వేరే సామాను లేదు.
“చెట్టు యొక్క ప్రధాన కాండం వైపు వెళ్ళండి” అరుస్తూ చెప్పాను.
మేం వెతికాం, చాలా సేపు వెతికాం. యురేకస్ కూడా తిరుగుతూ, గట్టిగా అరుస్తూ సంకేతాలు, సూచనలు అందించింది. ఈ చెట్టు అపారమైన శాఖలను, ఆకులను కలిగిఉంది.
ఎట్టకేలం మేం ఆ పాత మర్రిచెట్టు పెద్ద కాండంలో ఒక భారీ తొర్రని చూశాం. అది 12 అడుగుల వెడల్పు ఉంది. ఒకేసారి ఇద్దరు వ్యక్తులు సులభంగా దూరవచ్చు.
“అది ఇదే!” అన్నాను. “మొదట నేను వెళ్తాను!” చెప్పాను.
“దీంట్లో ఇద్దరు పడతారు. నేను నీతో వస్తాను” అంది ప్రకృతి.
“మాస్టర్‌తో నేను వెళ్తాను” అంది యురేకస్. ఎవరిని తీసుకెళ్ళాలి? ఇది లోహమానవుడు, రక్తమాంసాలున్న నా ప్రియమైన మహిళ మధ్య ఎంపిక.
“ముందు నేను, ప్రకృతి వెళతాం. తర్వాత నువ్వూ, ఏనిమాయిడ్.”
నేను ఆదేశించాను. ప్రమాదమని నాకు తెలుసు. నేను యురేకస్‌ని కోల్పోతే, కుజుడిపై విపత్తు తప్పదు.
కాని వారందరూ విధేయులుగా ఉన్నారు.
నేను చెట్టు రంధ్రంలోకి ప్రవేశించి, చెన్ లీ నాకు మెయిల్‌లో పంపిన మంత్రాలను చదివడం ప్రారంభించాను.
నేను మంత్రాలు చదువుతుంటే దడదడ శబ్దం పెరిగిపోయింది.
తనకంతా తెలిసినట్లు ప్రకృతి నాతో పాటు దూకేసింది. జన్యువులా? ఉత్పరివర్తనా? ఏమో నాకు తెలియదు.
ఆ చెట్టూ, చీకటి… గుండ్రంగా తిరిగాయి. అరగంటలో మేము అసాధారణ వేగంతో భ్రమణం చేశాము.
నేను స్పృహ కోల్పోయాను.
దక్షిణ దిశలోని పొలంలో ఉన్న మర్రిచెట్టు తొర్ర ఒక వార్మ్‌హోల్. అది మమ్మల్ని కుజగ్రహానికి చేరుస్తుంది. చేరుస్తుందా? ఆలోచిస్తుండానే ఆ భయంకర క్షణాలలో నేను చైతన్యం కోల్పోయాను.
(సశేషం)