భూమి నుంచి ప్లూటో దాకా… -22

0
6

అధ్యాయం 64: ‘ఎంపికైన వ్యక్తి’

ఇది పాత కాలం లాంటి కుజగ్రహమే. మేము రెండు రోవర్ క్రాఫ్ట్‌లలో యుద్ధ క్షేత్రానికి బయల్దేరాం. ఒక దాంట్లో నేనూ, ప్రకృతీ; మరొక దానిలో ఏనిమోయిడ్, యురేకస్. దాన్నెలా నడపాలో నాకు తెలుసు, అయినా నావిగేటర్ కోసం అభ్యర్థించాను. నా వద్ద వెండి పైతొడుగు ఉన్న ఒక బంగారు దండం మాత్రమే మంత్రదండంగా లేదా ఆయుధంగా ఉంది. దీనిని నేను మార్షియన్ సైన్యంలోని మాంత్రికదళం నుంచి తెప్పించుకున్నాను.

దండాలనేవి లోహం లేదా ఫైబర్ లేదా చెట్ల కొమ్మలతో తయారవుతాయి, జడమైన, నిర్జీవమైన వస్తువులు మాత్రమే. వాటికి శక్తి వాటిని ధరించిన వ్యక్తి శరీరం నుండి – విశ్వశక్తి, శక్తి తరంగాలను పంపడం ద్వారా మాత్రమే లభిస్తుంది. లేకపోతే అవి కేవలం వస్తువులు అంతే.

కుజుడి మీద తెల్లారింది, సూర్యుడు ఆకాశం పైకి వచ్చే సమయానికి మేము అరుణ భూములలోని అదృశ్య గోడకు దగ్గరగా ఉన్నాము.

అప్పుడు మేము యుద్ధపు తీవ్రతని చూడగలిగాము.

ఉన్నట్టుండి మానవ కాలనీ యుద్ధ విమానాల గుంపుగా వచ్చాయి, అగ్ని వర్షంలా బాంబులను విసురుతూ గోడవైపు ఎగిరాయి. ఇంకా అణుయుద్ధం మొదలవలేదు. ఇరు పక్షాలు అణ్వాయుధ ప్రయోగానికి దూరంగా ఉంటున్నాయని నాకు చెప్పారు.

అరుణ భూముల వైపు నుండి క్షిపణి నిరోధక తుపాకులు బులెట్లు కురిపించడంతో, మొత్తం అన్ని యుద్ధ విమానాలు మంటల్లో కాలిపోయాయి.

అసలే ఎరుపు రంగు నేల, దీనితో ఇప్పుడు ఈ మార్షియన్ నేల మంటలతో మెరిసిపోయింది. ఆకాశం ఎర్రబారింది.

మార్షియన్ నిముషంలో, క్షిపణుల దళాన్ని నాశనం చేశారు. అప్పుడు అదృశ్య గోడ కూడా కనిపించసాగింది. పెద్ద నల్లటి ఇనుప ద్వారాలు కనిపించాయి.

“గోడ నాక్కూడా కనిపిస్తోంది!” అంది ప్రకృతి.

గడ్డాలతో ఉన్న నల్లటి దుస్తుల తాంత్రికుల పదాతిదళం మాకు వైపు దూసుకువస్తున్నారు. వాళ్ళ చేతుల్లో తుపాకీల వంటి ఆయుధాలు ఉన్నాయి, ఏవో శ్లోకాలు ఉచ్చరిస్తూ వస్తున్నారు.

తరువాత వారు మాపై అగ్ని కిరణాలను ప్రసరించారు.

నా రోవర్ నావిగేటర్ పక్కకి జరిగింది. ఏనిమాయిడ్ కూడా పక్కకి జరగడానికి ప్రయత్నించాడు. కళ్ళు మిరమిట్లుగొలిపే ఎర్ర లేజర్ కిరణాలు కీచుమనే శబ్దంతో మమ్మల్ని చుట్టుముట్టాయి.

నా రేడియో మ్రోగింది. లిబర్టీ సిటీ నుండి జనరల్ గ్యానీ స్వరం వినిపించింది.

“హనీ! మీ వెనుక ఒక మానవ రెజిమెంట్ ఉంది. వారు మీకు వెనుకనుండి రక్షణ కల్పిస్తారు. మీరు వారిని ముందుకు నడిపించి నగరంలోకి ప్రవేశించవలసి ఉంటుంది.”

సరేనని, వెనక్కి తిరిగి చూశాను, ఎర్రని దుమ్ములో అంతం లేని వరుసలలో రోవర్ క్రాఫ్ట్‌లు వస్తున్నాయి. వాటి నుండి బుల్లెట్లు వెలువడుతున్నాయి.

వ్యూహాత్మక వివరణలలో మంత్ర రాజధాని నగరంలో సైన్యాన్ని నడిపించడానికి, దాడి చేయడానికి నేను నేతృత్వం వహించాలని చెప్పారు.

కానీ ఇంత త్వరగా అని నేను అనుకోలేదు! నేను గూఢచర్య దృష్టితో పరిశీలించాలని మాత్రమే అనుకున్నాను. కానీ ఇప్పుడు ‘మంత్ర’లో యుద్ధం ప్రారంభమైంది.

నేను ఏకాగ్రతతో నా బంగారు మంత్రదండాన్ని వారి వైపు పెట్టి మంత్రాలు చదువుతూ నిప్పులు కురిపించేందుకు ప్రయత్నించాను.

నా మంత్రదండం నుండి కొన్ని మెరుపులు వెళ్ళాయి. ప్రకృతి చేతిలో ఉన్న ప్లాటినం మంత్రదండం నుండి మరికొన్ని మెరుపులు వెళ్ళాయి.

కానీ అరుణ భూముల లేజర్ కిరణాలు మా రోవర్లను కాల్చివేశాయి. వాటికి నిప్పు అంటుకుంది.

“బయటకు దూకేయండి!” అన్నాడు నావిగేటర్ అరుస్తూ. నా రోవర్ భయంకరమైన మంటలలో ఉంది.

నేను, ప్రకృతి బయటకు దూకి, నేలపై దొర్లాం. ఏనినాయిడ్, యురేకస్ కూడా మాలానే చేశారు.

నా చర్మం మండింది.

ప్రకృతి దుస్తులకు నిప్పంటుకుంది. దూకినప్పుడు ఆమె పడిపోయింది, దొర్లడం ద్వారా మంటల్ని ఆర్పుకోడానికి ప్రయత్నించింది. ఒక నిమిషం తర్వాత కాని ఆమె విజయవంతం కాలేదు.

నాలో క్రోధం చెలరేగింది.

“Laissez le feu brûler!” (అగ్ని వారిని దహించు గాక!) అని ఫ్రెంచ్‍లో మంత్రం ఉచ్చరించాను. వేల వోల్ట్‌ల స్థిరశక్తి పొందేందుకు నా శరీరంలో కణాలన్నిటా ఇప్పుడు విశ్వశక్తిని ఉపయోగించాను.

మా మంత్రదండాల నుంచి ఉద్భవించిన అగ్ని మావైపు వస్తున్న గడ్డాల తాంత్రిక దళాలపైకి వెళ్లింది.

వారు దీనిని ఊహించలేదు, వినాశకరమైన మంటలు అన్నివైపుల నుంచి తీవ్రంగా వ్యాపించాయి.

తలలు, శరీరాలు, దుస్తులు కాలిపోవడం చూశాను. భయంతోనూ, బాధతోనూ వాళ్ళు కేకలు పెడుతున్నారు.

నేను గట్టిగా కేకపెట్టి మళ్ళీ దాడి చేశాను.

ప్రకృతి వణుకుతున్న స్వరము, ఏనిమోయిడ్ జంతు స్వరం యుద్ధపు ధ్వనుల కన్నా తీవ్రంగా వినిపిస్తున్నాయి. మార్షియన్ నేల మీద మేం ముగ్గురు నిలబడ్డాం. తాంత్రిక దళాలపై అగ్నికీలల పంపడం ప్రారంభించాం.

మానవ రోవర్స్ మమ్మల్ని దాటి వెళ్ళి అదృశ్య గోడ భారీ ద్వారాలను పేల్చివేశాయి.

నేను ఆ గోడను బద్దలుకొట్టేందుకు నా శక్తిని కేంద్రీకరించాను.

“మాస్టర్! ప్రాచీన సంస్కృతంలోని ‘జ్వాలా మంత్రం’ ఉచ్చరించండి. గోడ ఇప్పుడు బలహీనంగా ఉంది. దానిని నాశనం చెయ్యండి!” లోహస్వరంతో చెప్పింది యురేకస్.

నేను నా శక్తినంతా ఉపయోగించి “జ్వాలాముఖి” మంత్రం గట్టిగా చదివాను. అదృశ్య గోడ కనిపించింది, దాని ఎరుపు నలుపు ఇటుకలు కాలిపోతున్నాయి. భారీ ఇనుప ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. మొత్తానికి మానవ రోవర్ల సమూహాలు, పదాతిదళం నగరంలో దూసుకుపోయాయి.

అరుణ భూములపై మానవుల దండయాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది.

అప్పుడు లిబర్టీ నగరం నుండి మానవ విమానాలు మళ్ళీ గొప్ప శబ్దంతో వచ్చాయి, కానీ కుజుడి మీద శూన్యం ఉన్నందున  ఆ శబ్దాలను మేము వినలేకపోయాము.

ఇప్పుడు మాయలు చేసి, మానవ విమానాలను అడ్డుకునే తాంత్రిక సైనికులు లేరు.

మానవుల విమానాలు ఆకాశం నుంచి ‘మంత్ర’ నగరంపై బాంబుల వాన కురిపించి, నగరాన్ని నరకంలా మార్చారు

పదాతిదళం వారిని అనుసరిస్తూ వచ్చింది.

ఇది 20వ శతాబ్దపు రెండవ ప్రపంచ యుద్ధంలో అనుసరించిన ‘బ్లిట్జ్‌క్రీగ్’ పద్ధతిలో చేసే దాడి.

నేను, ప్రకృతి కలసి ఒక ప్లాటూన్ తాంత్రికుల సైన్యాన్ని నాశనం చేశాం. మేము మానవ దళాలకు నాయకత్వం వహించాము. అదృశ్య గోడ అని పిలువబడే మంత్ర నగరపు నిగూఢ రక్షణ కవచం చివరికి నాశనమైంది.

అరుణ భూములపై మానవ దండయాత్ర ఎట్టకేలకు మొదలైంది.

మాలో శక్తి నశించడంతో, నేనూ ప్రకృతి సైనికులతో పాటు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాం.

మా వెనుక నుంచి రెండు రోవర్లు వచ్చాయి. “లోపలికి రండి! లోపలికి రండి!” అని పిలుస్తూ, మమ్మల్ని ఎక్కించుకున్నారు.

“ఇది మన విజయానికి నాంది!” అంటూ చక్కెర పుష్కలంగా వేసిన తీపి నారింజ రసం ఒక గ్లాసులో ఇచ్చారు. నాకు కాస్త శక్తి వచ్చింది.

మాకు ఎదురుగా ‘మంత్ర’ నగరం ఎర్రటి ధూళితోనూ, జ్వాలల తోనూ నిండి ఉంది.

మంత్రగాళ్ళు అస్తవ్యస్తంగా పరిగెడుతున్నారు. ఇళ్ళు దహనమవుతున్నాయి. అక్కడ కొద్దిమంది పిల్లలు ఉన్నారు, కానీ మధ్య వయస్కులు మరియు ముసలి మంత్రగత్తెలు తమని మంటలు చుట్టుముడుతుండగా పరుగులు తీస్తున్నారు.

గ్రేట్ హాల్ కనబడుతోంది.

ఇది తాంత్రిక చక్రవర్తి సమూరా రాజకీయ కేంద్రం.

మానవ విమానాలు దానిపై బాంబులు వేశాయి, అది కూడా మంటల బారిన పడింది.

మేం ముగ్గురు ‘మంత్ర’ నగర వీధులలో అన్ని వైపులకు పరిగెత్తాం, ఎటు చూసినా విభ్రాంతి కలిగించేలా శవాలు, ఇళ్ళు దుకాణాల దహనం – భయంకరమైన దృశ్యాలు గోచరించాయి.

గత పది సంవత్సరాలలో తాంత్రిక సామ్రాజ్యం ఎంతో ఘనంగా అభివృద్ధి చెందింది, సమూరా తిరిగి వచ్చి సౌర వ్యవస్థను పాలించాడు. నా మిత్రుడు మీరోస్ ఉరితీయబడ్డాడు. అరుణ భూములంతా వింత వింత మంత్ర తంత్రవిద్యల అభ్యాసకులు, సాధకులతో నిండిపోయింది. గ్రేట్ హాల్ ముందు ఒక పెద్ద వేదిక కనబడింది.

ఇది ఎత్తులో ఉంది, ఇటుకలతో నిర్మితమై ఉంది. దానిపై ఉన్న లోహ వలయాలతో ఒక ఇనుప చట్రం ఉంది.

“ఇది సమూరా ఉరి వేదిక” చెప్పింది యురేకస్. “సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన అందరూ ఇక్కడ ఉరితీయబడ్డారు. చనిపోయే వరకూ ఉరి తీయబడ్డారు” చెప్పింది.

“బహిరంగ మరణశిక్షలు” అంది ప్రకృతి.

అలా బహిరంగంగా ఉరి తీస్తుంటే తాంత్రికులు, మంత్రగత్తెలందరూ ఈ వేదిక చుట్టూ నిలబడి చప్పట్లు కొట్టి ఉండొచ్చు.

మానవ పదాతిదళం దాన్ని బుల్లెట్లతో నాశనం చేశాక, మేము గ్రేట్ హాల్‌లోకి ప్రవేశించాము.

ఎక్కడ చూసినా పొగే!

“అతడెక్కడున్నాడో వెతుకు”అంటూ యురేకస్‌ని ఆదేశించాను. “సమూరా, అతని మంత్రులకున్న విశ్వశక్తి కారణంగా వారి చుట్టూ ప్రకాశం ఉంటుంది.”

నేను అతన్ని చంపాలి, ఇప్పుడే!

రాజభవనాలు గ్రేట్ హాల్ వెనుక ఉన్నాయి. సమూరా, సయోనీ అక్కడే నివసించేవారు. ప్రక్కనే మంత్రుల కోసం భవనాలు ఉన్నాయి. వాటన్నిటికీ గాజు గుమ్మటాలు ఉన్నాయి, ఎరుపు రంగులో జ్యామితీయ నమూనాలలో ఉన్నాయి. అయితే ఇప్పుడు అన్ని గుమ్మటాలు విరిగిపోయాయి. కాసేపట్లో వాతావరణంలో ఆక్సిజన్ క్షీణిస్తుంది.

మేము రాజభవనంలోకి పరిగెత్తాం.

అది బంగారు తలుపులు మరియు వజ్రాల హ్యాండిల్స్‌తో అలంకరించబడినది. కానీ అన్ని గదుల నిండా పొగ, ఎక్కడ చూసినా కాలుతున్న వాసన!

మేము అన్ని గదులను వెతికాం. అతన్ని పట్టుకునే ఆశను దాదాపు విడిచిపెట్టాం. “దొరికారు! గ్రేట్ హాల్‌కి ఎదురుగా ఉన్న కూడలిలో ముగ్గురు వ్యక్తులున్నారు! అధికమైన రేడియోషన్ ఉంది, కాని ప్రధాన వ్యక్తి సమురా నుంచి ఏ రేడియేషనూ లేదు” చెప్పింది యురేకస్.

అతనికి శక్తులు లేవని నాకు తెలుసు. అయితే అతను చావడు. కానీ అతనికి వద్ద మాయా వస్తువులున్నాయి, అతని మంత్రుల వద్ద ఆయుధాలున్నాయి.

మేము గ్రేట్ హాల్‌కి ఎదురుగా ఉన్న ప్రధాన వీధికి మళ్ళీ వెళ్ళాము.

“రా… రా…! గుంట నక్కా…” సమూరా కీచుగొంతుతో కేకపెట్టాడు.

అస్థిపంజర ఆకారం ఉరి వేదికపై నిలబడి ఉంది. అతనికి ఇరువైపులా రెండు పొడవైన గడ్డాలు, తలపై యాంటెన్నాలు ఉన్న తాంత్రికులున్నారు. వారు ఇతర నక్షత్ర వ్యవస్థ నుండి వచ్చినవారిలా స్పష్టంగా తెలుస్తోంది.

అయితే నన్ను విస్తుపోయేలా చేసినదేంటంటే – పొడవాటి కోసు చెవులున్న ఓ స్త్రీని అస్థిపంజర సమూరా తన కుడి చేతితో పట్టుకుని, తన ఎడమ చేత్తో ఆమె మెడపై కత్తి గట్టిగా ఆనించి ఉంచడం!

వీధుల్లో జ్వలిస్తున్న మంటల ప్రభావానికి ఆ కత్తి ఎర్ర రంగులో మెరుస్తూ కనబడింది. కొంతమంది సైనికులు మా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చారు.

“ఆపండి. కాల్చకండి!” అంటూ సైనికులను ఆదేశించాను.

ఆమె టైటాన్‌కి చెందిన డిమిట్రీ పొసయిడన్. ఆమెను బందీగా పట్టుకున్న సమూరా ఆమెను చంపుతానని బెదిరించాడు.

“ధూర్తుడా, ఆమెనేం చేయకు!” అంటూ అరిచాను. “మీరు ఓడిపోతున్నారు! లొంగిపొండి! లేదా మేము మిమ్మల్ని చంపుతాము! మీరు ఇప్పటికే యుద్ధంలో చాలా కోల్పోయారు!” అన్నాను.

“నేను ఈమెను చంపుతాను. ఇది నా వాగ్దానం” అంది అస్థిపంజర ఆకారం.

“నువ్వు నా గురించి పట్టించుకోవద్దు హనీ! అతన్ని చంపెయ్!” అని డిమిట్రీ అరిచింది. “యుద్ధం యుద్ధమే. హనీ అతన్ని చంపి, దీన్ని ముగించు! నేను సంతోషంగా చనిపోతాను!” అంది. ఆమె డిమిట్రీ, గొప్ప పోరాట యోధురాలు. నిజంగా శక్తివంతమైన మహిళ! ఆమె బాగా అలసిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోంది.

చుట్టూ మండుతున్న మంటలు కుజుడి ఎర్రటి నేలపై… ఎరుపు రంగుని ప్రతిబింబిస్తున్నాయి. మండుతూ, చుట్టూ వ్యాపిస్తున్నాయి.

అక్కడంతా పొగ, మంటలు, తుపాకీ కాల్పులు, విమానాలు ధ్వని! చివరిగా దుష్ట తాంత్రిక సామ్రాజ్య చక్రవర్తి అయిన సమూరాని ఎదుర్కొంటున్నాము.

ఉన్నట్టుండి నేను అతని పక్కన నిలబడి ఉన్న గ్రహాంతరవాసుల మీద మృత్యు మంత్రాన్ని ప్రయోగించాను.

“నిర్మూలించు!” అన్నాను. నా మంత్రదండం నుండి నీలి మంటలు వెళ్లి దీర్ఘశిరస్కులైన ఆల్ఫా సెంటారి తాంత్రికులను తాకాయి.

రబ్బరును కాలితే వచ్చే వాసన లాంటి వాసనతో వారి మాంసం దహించబడింది.

వాళ్ళూ నామీదకి మంటలని ప్రయోగించారు గానీ, ఏనిమాయిడ్ తన నోటితో కొన్ని జ్వాలలను వారి వైపే పంపాడు.

రెండు దిశల నుంచి వచ్చిన మంటలు మధ్యలో ఢీకొన్నాయి, కింద నిలబడి ఉన్న మాకూ, వేదిక మీద ఉన్న వాళ్ళకి మధ్య భారీ పేలుడు సంభవించింది.

మెడకి గురి పెట్టిన కత్తి గుచ్చుకుని రక్తం కారడంతో డిమిట్రీ నొప్పితో అరిచింది.

“ఈమె అంటే నీకు బాగా ఇష్టమని నాకు తెలుసు!” సమూరా ఒక దుష్ట ప్రతినాయకుడిలాగా నవ్వాడు. “ఈమె చనిపోవడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. నన్నీ ఈ క్షణంలో ఒంటరిగా వదిలేయ్. నేను ఓడిపోయాను. అవును! నేను సౌర వ్యవస్థ యొక్క అధినేతగా పొందిన 10 సంవత్సరాల కీర్తిని కోల్పోయాను. నేను నిన్ను లేదా నీ స్నేహితులను చంపను. గతంలో నువ్వు నాకు సహాయం చేసావు. ఇప్పుడు నన్ను దూరంగా పారిపోనివ్వు! నేను ఆల్ఫా సెంటారీ వ్యవస్థకి వెళ్ళిపోతాను, ఇక తిరిగి రాను. ఖచ్చితంగా రాను. నన్ను ఆపద్దు!” అన్నాడు.

కొన్ని క్షణాలపాటు ఆగి, “ఓరి మానవ ధూర్తుడా! నువ్వు నన్ను అమరుడిని చేశావు, కానీ నా శక్తులు అన్నింటినీ పోగొట్టావు. నీకది తెలుసు. మీరు నన్ను చంపలేరు! ఎన్నటికీ!” అన్నాడు.

మా మాంత్రికుల మధ్య మంటలు అటూ ఇటూ ప్రవహిస్తున్నాయి. అది పాశవికంగా ఉంది, భయంకరంగా ఉంది. నా జ్వాలలు, లేజర్ కిరణాలు అతన్ని తాకాయి. ఏనిమాయిడ్, యురేకస్ కూడా అతనిపైకి లేజర్ కిరణాలు పంపారు. కానీ ఆ అస్థిపంజరానికి నిప్పు అంటుకోనే లేదు!

అదే సమయంలో జనరల్ గ్యానీ అక్కడికి ప్రవేశించాడు. వస్తూనే, అరిచాడు:

“హనీ అమ్రాపాలి! మీరు ఎంపికైన వ్యక్తి! అతన్ని చంపండి! మీరు అలా చేయకపోతే ఆ ధూర్తుడు మళ్ళీ వస్తాడు.”

సమూరా డిమిట్రీతో నిలబడి ఉన్న ఉరి వేదిక వైపు పరిగెత్తుతున్నాను. నేనేం చేయాలో నాకు తెలుసు.

చుట్టూ చూసాను. గ్రేట్ హాల్ మంటల్లో ఉంది. భవనాలు దహనమవుతున్నాయి; రెండు వైపులా సైనికులు విస్తుపోయినట్లు నిశ్శబ్దంగా కాల్పులు ఆపి నిలబడిపోయారు. ఆశ్చర్యం ఘనీభవించిన క్షణాలవి! నేను నా ఛాతీని, ఛాతి పైన లోదుస్తులలో అమర్చుకున్న వస్తువుని తాకాను.

అణుబాంబులతో నిండిన దుస్తులవి! నేను పరిగెత్తుతున్నాను. పరుగెత్తుకు వెళ్ళి సమూరాని పట్టుకొని అతనిని కౌగిలించుకుని, ఆపై స్విచ్‌ని లాగుతాను. నేను నన్ను పేల్చుకుంటాను. అణు విస్ఫోటనం, నా రక్తం అతని మీద పడినప్పుడే అతన్ని నాశనం చేయగలను.

నేను పరిగెడుతూ వున్నాను.

కానీ నా మనసు నెమ్మదించింది.

మరి డిమిట్రీ సంగతో? ఆమె కూడా మరణిస్తుంది. ఆమె చనిపోవాలని నేను కోరుకోవడంలేదు.

గ్రహాంతర ఆల్ఫా సెంటౌరి తాంత్రికులపై ఏనిమాయిడ్, కొంతమంది మానవ మాంత్రిక సైనికులు ఆశ్చర్యకరమైన రీతిలో బుల్లెట్లను కురిపించగా, వారు నెమ్మదిగా కుప్పకూలిపోయారు.

నేను వేదికపై నెమ్మదిగా పరిగెత్తాను.

మానవ నాగరికత యొక్క భవిష్యత్తు పణంగా ఉంది. నా ఆత్మత్యాగంతో అతన్ని చంపకపోతే, అతను తిరిగి వస్తాడు.

చారిత్రక పత్రాలు అలాగే చెప్పాయి. నేను నా రక్తాన్ని అణు విస్ఫోటనంతో కలిపితేనే అతన్ని అంతమొందించగలను, అప్పుడే అస్థిపంజరం నిర్మూలనమవుతుంది.

మరి డిమిట్రీ కూడా బలి కావాలా?

నేను వేదికపైకి పరిగెత్తాను. నా దుస్తులలో ఉన్న అణుబాంబులను అతనికి మాత్రమే చూపించాను.

“ఆమెను వదిలేయ్! ఏది ఏమైనా నేను మీ ఇద్దరికి మీదకి దూకేస్తాను!” అన్నాను.

అతను నవ్వాడు.

“నీ వల్ల కాదు! నువ్వు నెమ్మదస్తుడివి, నీతిగల హనీ ఆమ్రపాలివి! ఆమ్రపాలి గ్రామంలోని నారా ఆమ్రపాలి, నయన ఆమ్రాపాలి కొడుకువి. నన్ను నాశనం చేసేందుకు ఎంపికైన వ్యక్తివి! నువ్వో ఉత్పరివర్తివి! నీ మొట్టమొదటి ప్రియురాలు టైటాన్‌కి చెందిన ఈ డిమిట్రీ అని నాకు తెలుసు! నీ తొలి ప్రియురాలు కూడా చనిపోతుంది. హా! హా! హా …!” వికటంగా నవ్వాడు సమూరా.

నేను కోపంతో ముందుకు వెళ్లాను “నిన్ను చంపేస్తాను!” అంటూ.

ఎవరో ఆమెని గాయపరిచినట్లుగా డిమిట్రీ గట్టిగా పెట్టిన కేకని విన్నాను.

లేదా ఎవరో ఆమెని లాగేసినట్లుగా…

ఇంతలో గాల్లో వేగంగా బుస్సుమన్న ధ్వని… నాకు చిరపరిచితమైన పరిమళం… ఆకుపచ్చ చీర ఒకటి వేగంగా నన్ను వెనక్కి లాగేస్తూ, తాను ముందుకు దూసుకుపోయింది… ఒక్క కుదుపుతో నన్ను బాగా వెనక్కి, వెనక్కి నెట్టేసింది.

“వెళ్ళిపో! వెళ్ళిపో!” జనాలు అరిచారు. డిమిట్రీ వేదిక మీద నుంచి దొర్లి వచ్చి నా పక్కనే  పడింది.

“అందరూ గ్రేట్ హాల్లోకి పరిగెత్తండి. అణుబాంబు ప్రమాదం!” అంటూ అరిచాడు జనరల్ గ్యానీ.

ఎక్కడో భయంకరమైన ధ్వనితో అప్రమత్తం చేస్తూ సైరెన్లు మ్రోగాయి. సైనికులు నన్ను లోపలికి లాగారు, డిమిట్రీ లోపలికి లాగింది.

ఏనిమాయిడ్ లాగాడు, యురేకస్ లాగింది.

“మాస్టర్! నా తర్కాన్ని కాదని అచింత్యమైనది, అనూహ్యమైనది, మార్చలేనిది జరిగింది! కానీ చారిత్రక పత్రాల తర్కానికది సరిపోతోందని నేను అంగీకరిస్తున్నాను” చెప్పింది యురేకస్.

భద్రత కోసం నన్ను గ్రేట్ హాల్ లోకి తీసుకు వెళ్ళేటప్పుడు, జరుగుతున్నది నమ్మలేక నేను వెనక్కి తిరిగి చూసాను. అద్భుతమైన ఆకుపచ్చ చీర, ముదురు నలుపు కేశాలు, నుదుటిపై ఎరుపు బిందీ, నిప్పులు కురిపిస్తున్న కళ్ళకి ‘కాటుక’! అణుబాంబులతో నిండిన తెల్లని దుస్తులను ఛాతిపై ధరించిన ప్రకృతిని విస్మయంగా చూస్తుండిపోయాను.

ప్రకృతి… నా సఖి… నా భార్య… నా రక్తం…

… దుష్టుడు, మానవత్వానికి మరణ శాపమైన సమూరాని ఆలింగనం చేసుకుంటోంది!

“హనీ… తిరిగి వెళ్ళు! గుర్తుంచుకో… నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గుర్తుంచుకో! నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను. నేను నీ రక్తంలో, నీ జన్యువులలో ఉంటాను…” ఆమె స్వరం ఆ కూడలిలో, నా చెవులలో ప్రతిధ్వనిస్తోంది.

సమారా యొక్క అస్థిపంజర రూపం భయముతో కదిలింది, అతని స్వరం ఉరుము ధ్వనిలో పలికింది.

“ఓ అంగారక దేవా! ఇంత కాలం నేను అతనినే చూస్తున్నాను!! కానీ ఎంపికైన వ్యక్తి అతను కాదు, ఈమె… ఎంపికైన వ్యక్తి ఈమే!!! హంతకి! రక్తం… సరిపోయింది! ఓహ్! ఓహ్! నేను నాశనమయ్యాను. నా పని అయిపోయింది!”

గత దశాబ్దంలో అనేక మంత్రగాళ్ళను, మానవులను ఉరితీసిన ఆ వేదికపై చెవులు బద్దలయ్యేటంతటి భారీ విస్ఫోటనం జరిగింది.

మేమంతా గ్రేట్ హాల్‌లోని గచ్చుపై పడిపోయాం. మంటలు, అణుధార్మికత ఆ ప్రాంతాన్నంతా కమ్మేసాయి.

“ప్రకృతి… ప్రకృతి… ప్రకృతి… నువ్వు వెళ్ళిపోయావు! నా రక్తానివి! నేను గమనించనేలేదు! నువ్వూ ఎప్పుడూ చెప్పలేదు!” అని గొణుక్కోడం మాత్రం ఆపలేదు నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here