ఉపసంహారం
ధ్వంసమైన మార్షియన్ వాతావరణంలో అణు విస్ఫోటనాలు గొలుసుకట్టు ప్రతిక్రియలను కలిగించగలవు. కానీ ధ్వంసం చేయలేని పదార్థాలతో తయారైన ఓ దుష్టుడిని అంతమొందించడానికి అణు విస్ఫోటనం తప్ప మరో మార్గం లేదు. తెలివైన మానవ జనరల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. రేడియేషన్ షీల్డ్స్, వాటర్ స్ప్రేలు… అధునాతన రేడియేషన్ రెసిస్టెంట్ గాజు మూతలతో ఈ ప్రాంతాన్నంతా అత్యంత వేగంగా మూసివేయించాడు.
కానీ నేను నా నెచ్చెలిని కోల్పోయాను. ఆమె ప్రణాళికలను ఎన్నడూ తెలుసుకోలేకపోయాను. నా స్వంత రక్తం… నా అంతటి శక్తులున్నది… నా మేనమామ కూతురు… నా భార్య…. కోల్పోయాను, నన్ను రక్షించటానికి, సమస్త మానవాళిని కాపాడడానికి తనను తాను బలి చేసుకుంది నా భార్య.
అతను అమరత్వం పొందినప్పటికీ. నారా ఆమ్రపాలితో రక్త సంబంధం ఉన్న వ్యక్తి మాత్రమే సమూరాని చంపగలరని చారిత్రక పత్రాలు తెలిపాయి, కానీ అణు విస్ఫోటనం జరగాలి.
ఆత్మబలిదానం కోసం జనరల్ గ్యానీ నన్ను సిద్ధం చేస్తుంటే – ప్రకృతి తన సొంత ప్రణాళికలను రూపొందించుకుంది. ఆమె నన్ను, డిమిట్రీని మాత్రమే కాదు, మొత్తం మానవ నాగరికతని కాపాడింది. నిరుపమానమైన త్యాగం చేసింది. నేను దిగ్భ్రాంత స్థితిలో ఉన్నాను. ఆహారం తీసుకోకుండా వారాలకూ వారాలకు రోదిస్తూ ఉన్నాను. రోజులు గడిచే కొద్దీ నన్ను ఆసుపత్రిలో చేర్చి ఇంట్రావీనస్ గ్లూకోజ్, యాంటీ-డిప్రెసెంట్ ఔషధాలను ఇవ్వసాగారు. ఆసుపత్రి కిటికీ లోంచి చూస్తే శిలలు, బండరాళ్లు కనిపించాయి, ఎర్రటి దుమ్ము తుఫానులతో జేగురు రంగు ఆకాశాన్ని చూశాను.
లిబర్టీ నగరంలోని ఆ ఆసుపత్రికి ఒక రోజు డిమిట్రీ, ఏనిమోయిడ్ వచ్చారు, రోజుకు ఇద్దరు సందర్శకులను మాత్రమే నన్ను చూడ్డానికి అనుమతి ఇచ్చారు.
“ఇలా ఇంకెంత కాలం?” అడిగింది డిమిట్రీ. “మూర్ఖంగా ఉండకు! వాస్తవాన్ని అంగీకరించడం కష్టమే… కాని ఎంత కాలం? విశ్వవిద్యాలయంలో బోధకుడిగా నీ అవసరం వాళ్ళకి ఎంతో ఉంది. యువతను ప్రోత్సహించటానికి వాళ్ళకి నువ్వేంతో అవసరం. వాళ్ళు నిన్నో నాయకుడిగా ఆరాధిస్తున్నారు. క్రుంగుబాటుతో నువ్విలా ఆసుపత్రిలో పడుంటే, భవిష్యత్ తరాల మానవులను గొప్ప పనులకు ఎవరు ప్రోత్సహిస్తారు?” అంది.
ఏనిమాయిడ్ గుర్రుపెట్టాడు. అతని కంట్లోంచి నీళ్ళు అతని గరుకు చర్మం మీదకి జారాయి.
జనరల్ గ్యానీ అంగరక్, కొంతమంది అధికారులు, వైద్యుడు లోపలికి వచ్చారు.
“చెన్ లీ మీ గురించి అనేక సార్లు అడిగారు. మీరు త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నారు” చెప్పాడు గ్యానీ.
అవును. ఇందులోంచి నేను బయటపడాలి. నాల్గవ సహస్రాబ్ది పురుషులు ప్రేమ లేకుండా మూడు వందల సంవత్సరాలు జీవించారు. జ్ఞానం కోసం తపించారు, కొత్త శక్తులను పొందారు.
నేనిప్పుడు విశ్వశక్తి యొక్క నూతన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. విశ్వశక్తి యొక్క కొత్త కోణం.
నా జీవితమంతా ఒక సినిమాలాగా నా కళ్ళ ముందు కదలాడింది. దక్షిణ దిశలోని పొలాలతో ప్రారంభమై, మర్రిచెట్టు వద్ద మా తల్లిదండ్రుల హత్య, అరుణ భూములకు వెళ్ళడానికి నన్ను ప్రేరేపించిన ఆ స్వప్నం, సౌర వ్యవస్థ చుట్టూ నన్ను విసిరేసిన విధి, నా గ్రహాంతర మిత్రులు, నా మానవ యజమాని, నన్ను ప్రకృతిని ముడిపెట్టిన విధి… నా జీవితము పూర్తి ఆవృత్తం చేసి, మళ్ళీ మొదటికి వచ్చింది.
“సరే” అన్నాను బలహీనంగా. “నేను ఇండికా సెంట్రల్‌కి వెళ్తాను”
“నేను బోధన కొనసాగించాలనుకుంటున్నాను, విద్యార్థులకు విశ్వశక్తిని గురించి బోధిస్తాను” అన్నాను.
డిమిట్రీ ఏడుస్తోంది. ఏనిమాయిడ్ రోదిస్తున్నాడు. గ్యానీ కూడా కన్నీరు తుడుచుకున్నాడు.
***
ఇది క్రీ.శ. 3700 లో ఓ ఉదయం.
తరగతి కాస్త ముందుగానే ప్రారంభమైంది. ఆ పూట క్లాసులో నేను విశ్వశక్తి గురించి, కలలు గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడాలి.
విద్యార్థులంతా యువతీయువకులు, అన్ని గ్రహ జాతీయతలకి, జాతులకి చెందినవారు.
వీరందరి మధ్య ఒక సాధారణ బంధం లేదా ఉమ్మడి లక్షణం ఉంది.
నాల్గవ సహస్రాబ్దిలో కనుగొన్న విశ్వశక్తి ఉపయోగించుకునే సామర్థ్యం కలిగిన జన్యుపరంగా మార్పు చెందిన ఉత్పరివర్తులు వీళ్ళు.
“కలలు” చెప్పాను. “రెండవ సహస్రాబ్దిలో… ఉపచేతన యొక్క నెరవేరని కోరికలను కలలుగా భావిస్తారు. ఎవరైనా ఎప్పుడైనా దేన్నైనా కోరుకుని పొందలేకపోతే, అప్పుడా కోరికలు కలల రూపం దాలుస్తాయి. కానీ నాల్గవ సహస్రాబ్ది కలలు… భావప్రసార మాధ్యమాలు…. విశ్వశక్తి సాధకులకు తప్పనిసరి…” అని చెబుతుండగా… ఓ తియ్యని కోకిల స్వరం.. నా ఉపన్యాసానికి అంతరాయం కలిగించింది.
“కానీ నువ్వు నా కలల్లోకి వస్తావే. ఎలా?”
నేను ఉలిక్కిపడి, తరగతి గది ప్రవేశద్వారం వైపు చూశాను.
విద్యార్ధులు ముసిముసిగా నవ్వుకున్నారు, మళ్లీ మౌనంగా ఉండిపోయారు.
ఒక గ్రామీణ భారతీయ యువతిలా ఆకుపచ్చ చీర, సిగలో పువ్వులు, కళ్ళకి ‘కాటుక’ చెవులకు రంగురాళ్ళ జూకాలతో డిమిట్రీ నిల్చుని ఉంది.
ఆమె తలపై ఉన్న యాంటెన్నా, వెబ్ ఆకారంలో ఉన్న చేతులు, వేళ్లు ఇంకా కోసు చెవుల ద్వారానే ఆమె వేరే గ్రహానికి చెందినదని తెలుస్తుంది.
“డిమిట్రీ! నువ్వేంటి ఇక్కడ? నువ్వొచ్చినందుకు సంతోషంగా ఉంది” అన్నాను.
“పిల్లలూ! పాఠం తర్వాత చెప్పుకుందాం. టైటాన్ యొక్క విశృంఖల కలల గురించి అధ్యయనం చేయండి!”
విద్యార్థులు నవ్వుతూ బయటకు వెళ్ళారు. వాళ్లకి తెలుసు.
యురేకస్ గుమ్మం ముందు ప్రత్యక్షమైంది. “మాస్టర్, ముందే చెప్పనందుకు క్షమించండి. కానీ మేడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయాలనుకున్నారు” అంది.
“నువ్వో దద్దమ్మ యంత్రానివి! నేను మీ మేడమ్‌ని కాదు! నేను హనీ ప్రియమైన స్నేహితురాలు డిమిట్రీని. అంతే.”
మేము బయటకు నడిచాము.
అన్ని గ్రహాలు నెమ్మదిగా కుదురుకున్నాయి. పునరావాస, పునర్నిర్మాణాలు మొదలయ్యాయి.
భూమి మీద విశ్వశక్తి సాధనపై ఆంక్షలను, నిషేధాన్ని తొలగించారు. మేము ఇకపై పి.సి.యు.ఎఫ్.లం కాము. తాంత్రికులు, మాంత్రికులు వంటి పదాలను ఉపయోగించవచ్చు. క్షుద్రవిద్యలు మాత్రమే నిషేధించబడ్డాయి.
మానవాళికి నేనందించిన సేవలకు గాను భూగ్రహపు అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది ఎర్త్ కౌన్సిల్’ నాకు లభించింది. నేను ఇండికా సెంట్రల్‌లో నివసించసాగాను, యువ విద్యార్థులకు విశ్వశక్తిలో శిక్షణ నిచ్చి వారికి డిప్లొమాలు ప్రదానం చేశాను.
నీలి మధ్యధరా తీరం వెంబడి మేము నడుస్తూండగా… వెచ్చని నారింజ రంగు సూర్యకాంతిలో నీలి సముద్ర జలాలు మిలమిలలాడుతున్నాయి. చల్లని గాలికి ఆకుపచ్చని చెట్లు తలలు ఊపుతున్నాయి.
“ఈ మధ్య మళ్ళీ కలలు వస్తున్నాయా?” అడిగింది డిమిట్రీ.
“ఎందుకు రావు” అన్నాను. “నీకు వచ్చినప్పుడు, నాకెందుకు రావు కలలు? నాక్కూడా వస్తాయి” అన్నాను.
ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం.
నేను మర్చిపోలేనని ఆమెకు తెలుసు, కాని గాయాలు నయం అవుతున్నాయి. నేను విశ్వవిద్యాలయంలో పూర్తిగా సాధారణ అధ్యాపకుడినయ్యాను.
“కానీ, ఇది ఎప్పుడు జరుగుతుంది?” ఆమె ఆటపట్టించింది. “గ్రహాంతర వివాహం? అన్ని రకాలుగా రికార్డు సృష్టించే పెళ్ళి…?”
నేను నవ్వి -” డిమిట్రీ, నువ్వు నన్ను ఆట పట్టించడం ఆపవు కదా. పద, కొన్ని కేకులు తిని కాఫీ తాగుదాం. పద!” అంటూ రెస్టారెంట్ వైపు అడుగులు వేశాను.
అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. అది ఒక ప్రశాంత సముద్రం, అలల గర్జనలు లేవు.
మేము అవీ ఇవీ ఎన్నో విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాము, కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకొని, మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం. కొన్ని విషయాలను తలచుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాం.
ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటనలతో జీవితం కొనసాగుతుంది.
అయితే కలలు కూడా కొనసాగుతున్నాయి, ఎప్పటికప్పుడు కొత్త సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
నేను నాల్గవ సహస్రాబ్దిలో జీవిస్తూ నా కథని మీకు పంపగా… మీరు రెండవ సహస్రాబ్దిలోనే నా కథ చదివినందుకు నా ధన్యవాదాలు. ఏదేమైనా, విలువలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి.
***