తుది పలుకు
“కుజుడి కోసం” (నాల్గవ సహస్రాబ్ది కథ) అనే నవలాత్రయంలో ఇది మూడవది, చివరిది.
మొదటి నవల – “కుజుడి కోసం”. ఇది అంగారక గ్రహంలో జరిగిన యుద్ధల గురించి చెబుతుంది. రెండవది “నీలీ ఆకుపచ్చ” (భూమికి తిరిగి రాక). దీనిలోని కథంతా భూమి మీద జరుగుతుంది.
భవిష్యత్తులో జరగబోయే కథని భారతీయ నేపధ్యంతో ఒక స్పేస్ ఒపెరాలా సృష్టించాలనే దృష్టితో నేను ఈ సిరీస్‌ని 2007లో రాయడం ప్రారంభించాను. గ్రహాంతర ప్రయాణాలు, గ్రహ కాలనీలు, తనకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని గ్రహించిన ఒక సాధారణ మనిషి సాహసాలను వివరించడానికి భవిష్యత్ ప్రపంచాన్ని సృష్టించడానికి కోరుకున్నాను. గ్రహ కాలనీలు మరియు ప్రయాణం గురించి వివరించే కథాభాగం ప్రస్తుత కల్పనలు, పరిశోధనా ఆధారంగా ఉంది. విశ్వశక్తి, మాయ, మంత్రవిద్య, తాంత్రికులకు సంబంధించిన కథాభాగం వాస్తవాతీత కల్పన. నేను అటువంటి సాహిత్యంలో ప్రస్తుత భావనలను ఉపయోగించుకున్నాను. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధారణంగా పురోగతి ఉన్నట్టే, తంత్రసాధన చేసేవారిలో కూడా సమాంతర అభివృద్ధి ఉంటుందని నేను ఊహించాను. నేను రెండు సంస్కృతుల మధ్య ఒక యుద్ధాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించాను, ఈ రెండు సంస్కృతుల పోరాటంలో చిక్కుకున్న సగం మానవుడు, సగం మాంత్రికుడైన హనీ ఆమ్రపాలి మానసిక గందరగోళాన్ని వివరించాను.
ఒక్కో గ్రహకాలనీ గురించి ఒక్కోటి చొప్పున ఏడు పుస్తకాలు రాయాలనుకున్నాను. కాని నా సమయంపైనా, కల్పనాశక్తిపైనా ఒత్తిడి కలిగించలేకపోయాను. పైగా ఇటువంటి కథాంశాల పట్ల పాఠకుల నుంచి పెద్దగా ప్రతిస్పందన లేదు. నేను ఈ మూడవ నవలలోని కథ – చంద్రుడు, గనీమీడ్, టైటాన్, వీనస్, నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహం ట్రైటాన్, అసమగ్రంగా పరిస్థితులున్న స్థితిలో ఉన్న భూమికి సంబంధించినదిగా రాశాను. ఈ పుస్తకంతో నవలాత్రయం ముగిసింది.
నేను దీనిని వేగంగా చదివించే థ్రిల్లర్‌గా వ్రాశాను. మీరు దీన్ని చదువుతారనీ, ఆఖరి అధ్యాయం వరకు ఆనందిస్తారని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాలలో; అతీంద్రియ శక్తులలో ఎటువంటి పురోగతి వచ్చినా – మానవీయ విలువలు – స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం శాశ్వతంగా నిలుస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. ఇది భవిష్యత్తు సహస్రాబ్దిలో మంచికి, సౌశీల్యానికి మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నాను.
మధు చిత్తర్వు
(సమాప్తం)