అధ్యాయం 13: చంద్రుడు
[dropcap]చం[/dropcap]దమామ. మనుష్యులు నివాసం ఏర్పరుచుకున్న మొదటి ఉపగ్రహంగా ఘనమైన చరిత్ర కలిగి ఉంది. ఐతే ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్ళడం, తిరిగి రావడం సర్వసాధారణం.
భూమి మీది వివిధ కాల మండలాల ప్రకారం చంద్రుడిపైకి వెళ్ళాలంటే అంతరిక్ష నౌకలో రెండు రోజులు పడుతుంది.
ఎర్త్ కౌన్సిల్ చేసిన ఏర్పాట్ల వల్ల మేము ఫ్లైట్ ఎక్స్‌జడ్ 333 ఎక్కగలిగాం, మాకు కేటాయించిన సీట్లలో కూర్చున్నాం. గురుత్వాకర్షణ మరియు ఆక్సిజన్ లేకపోవడం వల్ల విమానం లోపలి భాగమంతా అధిక పీడనంతో భర్తీ చేయబడింది.
ప్రయాణంలో ఎటువంటి అసాధారణ ఘటనలు జరగలేదు. చంద్రుడి భూమధ్యరేఖ సమీపంలో ఉన్న ప్రధాన చంద్ర రాజధాని ప్రాంతానికి వెళుతున్నాం. అది భూమి మీది అన్ని జాతీయతల పౌరులకు ఉమ్మడి స్థానం. .
భూమి – అమెరికాలోని ఎర్త్ కౌన్సిల్‌చే నియంత్రించబడుతుంటే, చంద్రుని వివిధ ప్రాంతాలలో వివిధ కాలనీలు అత్యంత స్వతంత్ర్యంగా ఉంటున్నాయి, విభిన్నమైనవి. రాజధాని ప్రాంతం చంద్రగ్రహానికి ముఖద్వారం.
ఉల్కాపాతానికి లోనవుతున్నప్పటికీ, వాతావరణం, ఆక్సిజన్, నీరు లేకపోయినప్పటికీ, ఖనిజాలకు నెలవైన చంద్రుడిపై భూగర్భ బిలాలలో నిర్మించిన కాలనీలు ఉన్నాయి.
మేము సౌత్ పోల్ వద్ద ఉన్న షాక్లెటన్ బిలంలో అమెరికాకి చెందిన అమృతా కాలనీకి వెళ్ళవలసి ఉందని మా చంద్రగ్రహ మిత్రుడు చాంద్ చెప్పాడు. కఠిన వాతావరణం మరియు ఉల్కాపాతం నుండి తప్పించుకోవడానికి ఈ కాలనీ భూగర్భంలో నిర్మించబడింది. దీనికి బాహ్య సౌర కాంతి ప్రాంతం ఉంది, కాబట్టి రాత్రి కాలం ఉండే పదిహేను రోజుల పాటు ఉండే ప్రాంతాల వలే కాకుండా సౌరశక్తిని ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు. లోతుగా ఏర్పడిన మంచుతో కూడిన పోలార్ ప్రాంతం కాబట్టి లోతైన భూగర్భ బోర్ బావుల నుండి నీటిని వెలికి తీస్తారు.
మరో రెండు కాలనీలు ఉన్నాయి. ఒకటి రష్యన్లది. ఇంకొకటి ఉత్తర ధ్రువంలో చైనీయులు ఏర్పాటు చేసుకున్నది. భూమధ్యరేఖకు సమీపంలోని బహుళజాతి కాలనీ – లూనార్ కాపిటల్ టెరిటరీకి ప్రక్కనే ఉంది.
చంద్రుని యొక్క మరో వైపు చీకటి ప్రాంతం. భూమి నుండి చూసినప్పుడు కనబడని ప్రాంతమది. అక్కడ కాలనీలు లేవు. ఇక్కడ మానవులు ఇంకా దేన్నీ అన్వేషించలేదు. చంద్రుడిపైకి చేరడానికి మానవులు అంతరిక్ష నౌకలను మాత్రమే కాకుండా, స్పేస్ ఎలివేటర్లు, ఇంకా అంతరిక్ష వస్తువులను రవాణా చేయటానికి అనేక ఇతర పద్ధతులను ప్రయత్నించారు. కాని ఇప్పుడు అవేవి ఉపయోగంలో లేవు.
లా టెర్ లాంటి అత్యంత అధునాతనమైన లూనార్ ప్లాట్‌ఫాం ‘లా లూన్’ ఉంది. కానీ చాలా వ్యోమనౌకలు నేరుగా లూనార్ కాపిటల్ టెరిటరీలోని లూనార్ స్పేస్-డ్రోమ్‌లో దిగుతాయి.
చంద్రుడు తక్కువ గురుత్వాకర్షణ కలిగివుండటంతో – దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రశాంతమైన సముద్రం లాంటి షాక్లెటన్ బిలాన్ని రష్యన్ కాలనీలు ఉన్న ఉత్తర బిలంలోని లూనార్ కాపిటల్‍ని కలుపుతూ పొడవాటి ఉపరితల రైలుమార్గాన్ని ఏర్పరచడం ద్వారా ఉపరితల రవాణాను సాధించారు. సర్ఫేస్ లూనార్ ట్రైన్‌లో ప్రయాణం విమాన ప్రయాణంలా చాలా వేగంగా ఉంది.
దీనితో పాటు, అణు ఇంధనంతో నడిచే ఛార్టరెడ్ న్యూక్లియర్ ఫ్లయిట్లులో కూడా ఆకాశంలో ప్రయాణించవచ్చు. కానీ విమానయాన వ్యవస్థ తక్కువగా ఉపయోగించబడుతోంది.
ఒక ఖరీదైన చంద్ర ఉపగ్రహ వ్యవస్థ కూడా ఉంది. మిలియన్ల సౌర ఫలకాలు ఉత్పత్తి చేసే విద్యుచ్ఛక్తితో, మైక్రోవేవ్‌ల ద్వారా చంద్రుడిపై ప్రసారం చేయటానికి భారీ స్పేస్ పవర్ స్టేషన్ కూడా ఉంది.
అంగారకుడిలానే చంద్రగ్రహం కూడా పర్యాటక రంగంపైనే అధికంగా ఆధారపడింది. సమీపంలోని మార్స్‌కు, శని ఉపగ్రహమైన టైటాన్, గ్వానిమేడ్, జుపిటర్ యొక్క ఉపగ్రహం యూరోపాకు జరిపే గ్రహాంతర ప్రయాణాలలో ఇది ఒక ముఖ్యమైన మజిలీ.
మా స్పేస్‌క్రాఫ్ట్ మినుకుమినుకుమంటున్న ఓ చిన్న నక్షత్రంలా చంద్రుడి చీకటి ప్రదేశంలోకి ప్రయాణిస్తోంది. చంద్రుని గురించి నాకు తెలిసిన విషయాలన్నీ గుర్తుచేసుకున్నాను.
కానీ ఇటువంటి విశాలమైన గ్రహం మీద సమూరా, అతని దుష్ట బృందం జాడలని ఎలా పసిగట్టడం?
ఎప్పటిలాగే యురేకస్ నాపక్కనే ఉంది. నా తర్వాతి సీట్లలో డిమిట్రీ, ఏనిమోయిడ్ కూర్చున్నారు. మా బృందంలోని ఇతర సభ్యులు చాంద్, వాన్ కు జాక్ నాతోనే ఉన్నారు. మేము చంద్రుడిపైకి చేరుకునే సమయానికి ఓ కార్యాచరణ ప్రణాళికను కలిగి ఉండాలి.
రెండో రోజు ముగుస్తుండగా మేము చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న స్పేస్ ప్లాట్‌ఫాం మీద దిగాం. దీనిని లా లూన్ అంటారు. భూమి యొక్క స్పేస్ ప్లాట్‌ఫాం (లా టెర్) లానే ఉంది. ఇది లూనార్ కాపిటల్ టెరిటరీకి దాదాపు 360 కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి కక్ష్యలో ఉంది.
ఇమ్మిగ్రేషన్ చెక్ … డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌లు… సెక్యూరిటీ చెక్ మినహాయింపు. అమృతా కాలనీ ప్రభుత్వపు అధికారి ఒకరు అదే సమయానికి అక్కడికి చేరుకున్నారు.
అన్ని గ్రహాల జాతీయతలకి చెందిన వ్యక్తులు… పొడవాటి మనుషులు, పొట్టివారు, తలలపై యాంటీనాలు ఉన్న గ్రహాంతరవాసులు, కోసుగా ఉన్న చెవులు కలిగిన వారు, వివిధ జాతుల లక్షణాలతో ఉన్న వ్యక్తులు, చిన్న, పెద్ద కళ్ళు, గోధుమ, నలుపు, తెలుపు పసుపు రంగు చర్మం కలిగిన వారు వివిధ ద్వారాల గుండా తిరుగుతున్నారు.
చంద్రుడి మీద దిగడానికి మరో ఫ్లయిట్ ఎక్కేముందుగా మేము ఫలహారశాలలో కొన్ని స్నాక్స్ తిన్నాము.
“ఆల్ఫా సెంటారీ నుండి గ్రహాంతరవాసులు వచ్చి పేలుడు జరిపిన రోజున ఏం జరిగిందో తెలుసుకోవడానికి నాకు కొంత సమాచారం అవసరం. అధికారులను అడుగుదామా?” అన్నాను.
అమృతా కాలనీ ప్రభుత్వం తరఫున వచ్చిన అధికారి ముఖం చిరాగ్గా పెట్టాడు. అతడి తల సాగి ఉంది, చెవులు కోసుగా ఉన్నాయి. వీటిని డోలికోసెఫాలి, హైపర్ టెలియోరిసిజం అని అంటారు.
“కుదరదు. పైగా అవసరం లేదు. విచారణ ముగిసింది. అన్ని స్టేట్‌మెంట్లను చిత్రీకరించాం. మీరు కోరుకున్నప్పుడు మీ పనికి తగినట్లుగా మీకు కావల్సిన వివరాలను ప్రభుత్వమే మీకు అందిస్తుంది”
“సరే” అన్నాను.
కాసేపటికి మా వాహనం మమ్మల్ని నేరుగా షాక్లెటన్ బిలంలో ఉన్న అమృతా కాలనీ ఉన్న ప్రాంతంలో దింపింది. ఇక్కడ ఎక్కువగా అమెరికా జాతీయులు నివసిస్తున్నారు.
మా వాహనం స్పేస్‌పోర్ట్‌లో ల్యాండవుతుండగా చుట్టూ చూస్తూ “అద్భుతం” అని అరిచాను.
సుదూరంగా చంద్రగ్రహపు ప్రకృతి రమ్యదృశ్యంగా కనబడింది. దూరంగా పర్వతాలు, ఆర్చ్‌లు కనబడుతున్నాయి, బహుశా అవి బిలంలోకి దారితీసే మార్గాలై ఉంటాయి.
తర్వాత మా శరీరాల నుంచి కొద్దిగా రక్తం తీసుకుని తనిఖీ చేశారు. డిఎన్‌ఎ ప్రింటింగ్ తీసుకున్నారు. మా శరీరాలకు లూనార్ పొజిషన్ ట్రాకింగ్ డివైజ్‌లు (Lunar Positions Tracking Devises) అమర్చారు, తద్వారా మేము ఎక్కడున్నా గుర్తించవచ్చు.
లూనాఖోడ్ సర్ఫేస్ వెహికల్స్ అమితమైన వేగంతో మమ్మల్ని – ముగ్గురిని ఒక వాహనం చొప్పున క్రేటర్స్ లోని భూగర్భ కాలనీకి చేర్చాయి.
(సశేషం)