Site icon Sanchika

భూమి నుంచి ప్లూటో దాకా… -5

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 11: చంద్రయానం

[dropcap]చ[/dropcap]కచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. అంగారక గ్రహంలోని అరుణ భూములలో నేను గడిపిన రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. మాంత్రిక చక్రవర్తి సమూరా నన్ను నిర్బంధించి బలవంతంగా నన్ను ఒక మిషన్‌పై ఒలింపస్‌కి పంపడం జ్ఞాపకమొచ్చింది.

ఇప్పుడీ మిషన్‌ని ఏర్పాటు చేసింది నా స్వంత జాతి.. భూగ్రహంపై మానవ జాతి… నాకిష్టం లేదని నేను చెప్పలేను. అదృశ్య దుష్టశక్తులకు బలైన నా తల్లిదండ్రులు నారా మరియు నయానా ఆమ్రపాలికి తగిన శ్రద్ధాంజలిగా నేను ఈ మిషన్‌కి అంగీకరించాను.

ఇది నేను నిర్వర్తించవలసిన బాధ్యత. స్వచ్ఛందం సంకల్పంతో, మరింత అంకితభావంతో మరియు ఉత్సాహంగా బాధ్యత నిర్వహించాల్సిన సమయం.

ఇందుకు నా భార్య ప్రకృతి అభ్యంతరం చెప్పకపోవడం నా అదృష్టం. ఎందుకంటే, ఆమెకి జరిగినదంతా తెలుసు. ఆమె ఆమ్రపాలికి చెందినది, పిసియుఎఫ్‌లు ఎదుర్కునే కష్టాల గురించి తనకి తెలుసు. నా కుటుంబం యొక్క విషాదమూ తెలుసు.

కాబట్టి మేమీ విషయంలో ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాం, ఎటువంటి సందిగ్ధత లేకుండా ముందుకు సాగాం.

న్యూ హోప్ నగరంలోని ఓ హోటల్‌లో ఎర్త్ కౌన్సిల్ ప్రతినిధులతో మరియు గ్రహాంతర వ్యవహారాలు మరియు ప్రయాణాల శాస్త్రీయ సలహాదారుతో జరిగిన మా మొదటి సమావేశంలో మిషన్‍కి సంబంధించిన మౌలిక ఏర్పాట్ల గురించి చర్చించాం.

***

అది ఓ పెద్ద హాల్. అయితే అరుణ భూములలోని గ్రాండ్ హాల్ వలె సందర్భానికి తగినట్టుగా విస్తరించేది కాదు, నక్షత్రాలను మరియు గ్రహాలను దర్శింపజేసే బహిరంగ పైకప్పును కలిగి ఉన్న హాలు కాదు.

అది ఎర్త్ కౌన్సిల్ యొక్క సాంకేతిక సలహాదారుతో మా మొదటి సమావేశం.

చంద్రగ్రహం, షాక్లెటన్ బిలంలో ఏర్పాటు చేసిన ఎర్రగా మెరుస్తున్న కాలనీలు మరియు సైనిక స్థావరాలు మరియు కక్ష్యలో ఉన్న గ్రహాలతో ఉన్న ఓ పెద్ద మ్యాప్ ఎల్లప్పుడూ మానిటర్లో ఉంటుంది.

ఈ మిషన్ యొక్క లక్ష్యం చంద్రుడిపైకి వెళ్లి షాక్లెటన్ బిలంలోని అమృతా కాలనీలో ఉంటూ అక్కడికి చేరుకున్న గ్రహాంతర తాంత్రికుల కోసం అన్వేషణ ప్రారంభించడం.

“బానే ఉంది, కానీ ఇదంతా గడ్డిమోపులో సూది కోసం వెతుకుతున్నంత క్రూరమైన సరదాగా ఉంది.”

చాంద్, చంద్రుడిపై నివాసం ఉంటున్న మానవుడు – గొంతు సవరించుకున్నాడు.

“మీరు అక్కడకు వచ్చిన తర్వాత, మీకు కొన్ని సంకేతాలు కనబడచ్చు. నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఉదాహరణకు, నిగూఢమైన సంఘటనల కోసం, గ్రహాంతర మాంత్రికుల ఏవైనా మాయలు చేసినప్పుడు వెలువడే తరంగాల కోసం మీరు మూన్-నెట్‌ని శోధించవచ్చు, ఇమ్మిగ్రేషన్ సెంటర్లో సంఘటనను దర్యాప్తు చేయడం కోసం అక్కడి వ్యక్తులను ప్రశ్నించడం ద్వారా విచారణ చేయవచ్చు” అన్నాడు.

నేను ఆలోచనల్లో పడ్డాను.

నా కల. చంద్రుడి యొక్క చీకటి వైపు, ఇగ్లూ ఆకార నిర్మాణాలు. తల వెనక్కి తిరిగి ఉన్న మొండెంతో… సయోని యొక్క వికారమైన శరీరం…

“మేము చంద్రుని మరో వైపుకు వెళ్ళలేమా?” అడిగాను.

అక్కడ నిశ్శబ్దం తాండవించింది.

చాంద్ నవ్వాడు. “ఎందుకు?, ఇది మరీ అసాధ్యమేమీ కాదు. బాగా చల్లగా, చీకటిగా ఉంటుంది, అంతేకాదు, అక్కడ ఎటువంటి ఆవాసాలు లేవు. కనీసం మ్యాపులు కూడా లేవు.” అన్నాడు.

ఏనిమాయిడ్ గుర్రుగుర్రుమన్నాడు.

డిమిట్రీ సైగ చేసింది. “నేను మాట్లాడచ్చా?” అని అడిగింది.

“సరే” అన్నాను.

“మీ తర్కాన్ని ఉపయోగించి చూస్తే, మార్స్ యొక్క గ్రహాంతర తాంత్రికులు పారిపోతున్నారు. సమూరా అన్ని శక్తులను కోల్పోయాడు. అతనిప్పుడు తనకి మళ్ళీ శక్తులనిచ్చే ఏడు అద్బుత వస్తువుల కోసం వెతుకుతున్నాడు. అందుకే అతను అన్ని గ్రహాలలోనూ శోధిస్తున్నాడు. ఇప్పటికే భూగ్రహం లోని భైరవాలయం నుండి వెండి కొవ్వొత్తిని సంపాదించాడు.”

తార్కికంగా ఆమె గ్రహించినది సరైనదని నేను అన్నాను. “నాకు అర్థమైంది. ఎన్‌సైక్లోపీడియా గెలాక్టికాలో వ్రాసిన విధంగా, అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం (సిండికేట్ ఆఫ్ సీనియర్ విజార్డ్స్) చంద్రునిపై దాచిన వస్తువు కోసం సమూరా వెదుకుతుంటాడు.”

“అవును!” అన్నాడు అంగారక గ్రహవాసి వాన్ కు జాక్, మా సంభాషణలో జోక్యం చేసుకుంటూ. పెద్ద కళ్ళు, తల మీద యాంటెన్నాలతో ఉన్న వాన్ మాట్లాడుతూ, “చంద్రునిపై యూనివర్సల్ మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ దాచి ఉంచారని – ఒకసారి మా చక్రవర్తి మీరోస్‌తో కలసి నేనూ చదివాను… దయచేసి ధృవీకరించండి.”

చంద్రగ్రహానికి చెందిన చాంద్ అన్నాడు – “ఇవన్నీ మీరు నిజంగానే నమ్ముతున్నారా? ఇంటర్ గెలాక్టిక్ ట్రావెల్ యొక్క ఈ అంతరిక్ష యుగంలో మీరో పిచ్చి అద్దం ఉందని భావిస్తున్నారా?”.

“ఓ విజర్డ్‌గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంది.” అన్నాను నేను. “సైన్స్, టెక్నాలజీ లాగానే ‘ఫోర్స్’ లేదా తాంత్రికత లేదా ప్రత్యామ్నాయ శక్తి యొక్క ప్రపంచం తన సొంత మార్గంలో పరిణామం చెందుతోంది. వాళ్ళు కూడా ఆవిష్కరణ, శక్తి మరియు ఆనందం కోసం అన్వేషిస్తున్నారు. వారు గొప్ప పురోగతి సాధించారు. ఈ అద్దాన్ని కనుక్కోవటం అంటే మంత్రశక్తితో ఒక కెమెరాతో ఉపగ్రహాన్ని సంపాదించటంలా ఉంటుంది. అతను తన మంత్రశక్తితో అద్దాలు, చీపురు కర్రలు, పానీయాల వంటి ఉపకరణాలతో విశ్వమంతా వెదుకుతాడు. సాధారణ మానవులకి వింతగా అనిపించే పనికిరాని వస్తువులు వారికి అత్యంత విలువైనవిగా ఉంటాయి.” అన్నాను.

“అవును. మొబైల్ లోని ఓ చిన్న చిప్ లేదా ఉపగ్రహంలోని ఒక ట్రాన్స్‌పాండర్‌లు అద్భుతాలు సృష్టించగలవు!” అంది ప్రకృతి.

టైటాన్ సుందరి డిమిట్రీ మళ్ళీ అంది – “అందుకే మనం చంద్రుడి పైకి వెళ్దాం. ఫోర్స్ ఉపయోగిస్తున్న సంకేతాలను అన్వేషిద్దాం. మనకు సహాయపడేందుకు చంద్రగహ గూఢచర్య సంస్థలు ఉండవచ్చు. మన స్వంత శక్తులతోనే మనం చంద్రుడి చీకటి వైపున్న ప్రాంతంలో సాహసోపేత అన్వేషణ ఎందుకు చేయకూడదు?”

“చీకట్లో గుడ్లగూబలా! లేదా గబ్బిలంలా! నేను గతంలా ఓసారి గ్వానిమేడ్‌లోని భూగర్భ గుహలలో ఇలానే చేశాను. హా! హా! అది చాలా సరదాగా ఉంటుంది! ప్రమాదం కూడా!” అని మధ్యమ స్వరంలో చెప్పాడు ఏనిమాయిడ్.

***

ఇటువంటి రౌండ్ టేబుల్ చర్చలు, ఎర్త్ కౌన్సిల్ యొక్క ప్రణాళికలు, వివరాలు మరియు లాజిస్టిక్స్ గురించి మా మధ్య అనేక సమావేశాలు జరిగాయి. చంద్రుని ప్రస్తుత భౌగోళిక స్థితి, నాగరికత, కాలనీలు మరియు స్థలాకృతిని మేం తెలుసుకున్నాం. చంద్రుడి షాక్లెటన్ బిలంలో మానవుల అతిపెద్ద కాలనీ ఉంది. ఉల్కాపాతం నుండి తప్పించుకోవడానికి లోతైన బిలాలలో ఆవాసాలు నిర్మించబడ్డాయి. చంద్రుడికి తన స్వంత కక్ష్యలో తిరిగే స్పేస్ ఫ్లాట్‌ఫాం ఉంది. సౌర ఫలకాల సాయంతో సూర్యకాంతిని విద్యుచ్ఛక్తిగా, శక్తిగా మార్చి ప్రసారం చేసే కొన్ని ఉపగ్రహాలు ఈ కక్ష్యలో ఉన్నాయి. ధ్రువ ప్రాంతాల నుండి నీటిని తీసుకువచ్చి భారీ నీటి రిజర్వాయర్లును ఏర్పాటు చేసుకున్నారు. ధ్రువ ప్రాంతాల మంచులో ఉండే హైడ్రోజన్, ఆక్సీజన్ నుంచి ఆక్సీజన్ తయారుచేసేందుకు కొన్ని ఆక్సిజన్ తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి.

చంద్రుడి కాలనీలలోకి ప్రధానంగా అత్యంత నాగరికులైన అమెరికన్, బ్రిటీష్ మరియు ఇతర ఐరోపా ప్రజలే వలసొచ్చారు. సౌర వ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన మొట్టమొదటి మానవ కాలనీ చంద్రుడిపైనే ఉంది. అక్కడ ఒక ప్రజాస్వామ్య, అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉన్నట్లు నేను చదివాను. వారు పర్యాటకం, కమ్యూనికేషన్, గ్రహాంతర ప్రయాణాలు మరియు అభివృద్ధి యొక్క వ్యవస్థలపై ఆధారపడ్డారు. ఓ వారం పాటు చర్చలు జరిగి ప్రణాళికలు రూపొందించాకా, మా చంద్రయానం ప్రారంభమయ్యే తేదీ నిర్ణయించబడింది. ముందుగా ఒక స్పేస్ షిప్‌లో భూమి యొక్క లా టెర్ స్పేస్ ప్లాట్‌ఫాంపైకి వెళతాం, అక్కడ ఆగుతాం.

లా టెర్ నుండి చంద్రునిపైకి వెళ్ళడానికి మాకు స్పేస్ షిప్ ఏర్పాటుచేయబడింది.

ఇది మాకు మాత్రమే పరిమితమైనది, ఎర్త్ కౌన్సిల్ నుండి మా సలహాదారుడు హెచ్చరించినట్లుగా ఇది అత్యంత రహస్యమైనది.

“మిమ్మల్ని గమనిస్తూంటాం, తగిన సహాయమూ చేస్తాం. కానీ ఎక్కువగా మీరు స్వతంత్ర్యంగా ఉంటారు. దౌత్య సంబంధాలు సున్నితంగా ఉన్నందున మీకు మీరే సహాయం చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రుని ప్రభుత్వం సహకరిస్తుంది.

కానీ వారు మీడియా దృష్టిని లేదా మానవ కాలనీకి బెదరింపులను కోరుకోరు.”

అధ్యాయం 12: లా టెర్

[dropcap]అ[/dropcap]నేక దృష్టాంతాలలో గమ్యాన్ని చేరుకోవడం కంటే, చేరుకునేందుకు చేసే ప్రయాణమే మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

ఫ్లోరిడా స్పేస్ స్టేషన్ నుండి ఓ స్పేస్ షటిల్‌లో మమ్మల్ని లా టెర్ స్పేస్ ఫ్లాట్‌ఫాంపైకి పంపారు.

నేను, ప్రకృతి, గ్వానిమెడ్ నుండి ఏనిమోయిడ్, టైటాన్ నుండి డిమిట్రీ, చంద్రగ్రహం నుండి చాంద్, ఇంకా అంగారక గ్రహం ‘రెడ్ ప్లెయిన్స్ నుంచి వాన్ కు జాక్.

అసాధారణమైన సామర్ధ్యాలు గలిగిన మంత్రగత్తె డిమిట్రీ మాత్రమే మా బృందంలో ఏకైక గ్రహాంతర మహిళ.  పురుషులందరూ విశ్వశక్తి ప్రయోగంలో నిపుణులే కాకుండా, సాంకేతిక జ్ఞానమూ కలిగి ఉన్నారు.

లా టెర్ ఎప్పటిలానే అన్ని గ్రహాల ప్రజలతోనూ, రోబోలతోనూ, పెంపుడు జంతువులతోనూ సందడిగా ఉంది.

గేట్ నెంబరు 28 వద్ద మేము చంద్రుడిపైకి వెళ్ళే స్పేస్ ఫ్లయిట్‍ ఎక్కాల్సి ఉంది. అంగారకుడితో పోలిస్తే, చంద్రగ్రహం భూమి నుండి కేవలం ఒక మిలియన్ మైళ్ల దూరంలో ఉంది.

కదులుతున్న లా టెర్ ప్లాట్‌ఫాంపై అత్యంత పొడవైన కారిడార్లు, డిపార్చర్ గేట్లు ఉన్నాయి. వాటికి ఎదురుగా అంతరిక్షపు నిశీధి… శూన్యం!

“మిఠాయిలేమయినా తింటారా” చాంద్ అడిగాడు.

“ఎందుకు వద్దంటాం? భూమి మీద నుండి బయల్దేరాకా నాకు విపరీతమైన ఆకలిగా ఉంది” చెప్పింది డిమిట్రీ.

“స్పేస్ స్నాక్స్” అనే పేరుతో ఒక ప్రకాశవంతమైన సైన్ బోర్డ్ ఉన్న కెఫె మమ్మల్ని ఆకర్షించింది.  మేమంతా అటు నడిచాం.

ఒక మధ్య వయస్కుడైన ఓ గ్రహాంతరవాసి – ఆర్డర్లను తీసుకునేందుకు నిలబడి ఉన్నాడు. అతనిది మచ్చలుగల ముఖం. మెరుస్తున్న కళ్ళు. తలపై రెండు యాంటీనాలు ఉన్నాయి.

అతను ఒక స్విచ్ నొక్కగానే, అతని వెనుక ఉన్న బోర్డు మీద క్షణాల్లో మెనూ ప్రత్యక్షమైంది. దక్షిణ భారతీయ దోసెల నుంచి బర్గర్ల వరకూ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ‘మీరు కనీసం 1000 యూనివర్సల్ కరెన్సీ యూనిట్ల బిల్లు చేస్తే మీ రోబోలని ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చు’ అని చిన్న అక్షరాలతో బోర్డు ఉంది.

ప్రకృతి ‘రొట్టెలు’ తినింది, డిమిట్రీ అర డజను బర్గర్లు, ఏనిమాయిడ్ గొడ్డు మాంసం-టిక్కీలను, చాంద్, వాన్ కు జాక్ మటన్ కట్‌లెట్‌లు తిన్నారు. మిలీనియం సాప్ట్ డ్రింక్ అయిన పెప్సి 3000 తాగారు.

మేమందరం బాగానే తింటాం. పైగా భవిష్యత్తులో విశ్వశక్తి ప్రయోగం కోసం, ఇతర అవసరాల కోసం మేం మా శక్తిని కాపాడుకోవాలి.

స్నాక్ స్టోర్ ఎలక్ట్రికల్ అవుట్‌లెట్ లోపల యురేకస్‌ తనని తాను చార్జి చేసుకుంటోంది.

“నేరస్థులు, ఇంటర్ గెలాక్టిక్ పోలీసులు వెంటాడుతున్న మారిటన్లు లా టెర్‌లోకి ఎలా ప్రవేశిస్తున్నారో, ఎలా నిష్క్రమిస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు.” అన్నాను.

“నాక్కూడా” అంది డిమిట్రీ.

“అదృశ్య సంచారం అనేది ఒక అవకాశం. కానీ అది కూడా విద్యుదయస్కాంత జాడలను కలిగి ఉంటుంది.”

“ఇమ్మిగ్రేషన్ మరియు పిసియుఎఫ్ తనిఖీ విభాగాలలో ప్రతిచోటా ఎవరైనా వాళ్ళకి సహకరిస్తున్నారని నా అనుమానం. ఇలా సహకరించే వ్యక్తులు స్లీపర్ సెల్స్ అయ్యుంటారు. దుష్టశక్తులను మౌనంగా అనుసరించే వారై ఉంటారు!”

“అవకాశం ఉంది!” చాంద్ అన్నాడు.

“అందుకే, దాని గురించి మాట్లాడటం మంచిది కాదు. గూఢచారులు పట్ల అప్రమత్తంగా ఉండాలి” చెప్పాడు వాన్ కు జాక్.

తరువాత మేము గేట్ నెంబరు 28 వైపు వెళ్ళాం. మూన్ ఫ్లైట్ కోసం అక్కడ వేచి ఉన్నాం.

ఫ్లైట్ ఎక్స్‌జడ్ 333 ద్వారా చంద్రుడి పైకి బయలుదేరడానికి 20 నిమిషాల సమయం ఉందని సైన్ బోర్డులు మెరుస్తూ సూచిస్తున్నాయి.

అధ్యాయం 13: చంద్రుడు

[dropcap]చం[/dropcap]దమామ. మనుష్యులు నివాసం ఏర్పరుచుకున్న మొదటి ఉపగ్రహంగా ఘనమైన చరిత్ర కలిగి ఉంది. ఐతే ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్ళడం, తిరిగి రావడం సర్వసాధారణం.

భూమి మీది వివిధ కాల మండలాల ప్రకారం చంద్రుడిపైకి వెళ్ళాలంటే అంతరిక్ష నౌకలో రెండు రోజులు పడుతుంది.

ఎర్త్ కౌన్సిల్ చేసిన ఏర్పాట్ల వల్ల మేము ఫ్లైట్ ఎక్స్‌జడ్ 333 ఎక్కగలిగాం, మాకు కేటాయించిన సీట్లలో కూర్చున్నాం. గురుత్వాకర్షణ మరియు ఆక్సిజన్ లేకపోవడం వల్ల విమానం లోపలి భాగమంతా అధిక పీడనంతో భర్తీ చేయబడింది.

ప్రయాణంలో ఎటువంటి అసాధారణ ఘటనలు జరగలేదు. చంద్రుడి భూమధ్యరేఖ సమీపంలో ఉన్న ప్రధాన చంద్ర రాజధాని ప్రాంతానికి వెళుతున్నాం. అది భూమి మీది అన్ని జాతీయతల పౌరులకు ఉమ్మడి స్థానం.   .

భూమి – అమెరికాలోని ఎర్త్ కౌన్సిల్‌చే నియంత్రించబడుతుంటే, చంద్రుని వివిధ ప్రాంతాలలో వివిధ కాలనీలు అత్యంత స్వతంత్ర్యంగా ఉంటున్నాయి, విభిన్నమైనవి. రాజధాని ప్రాంతం చంద్రగ్రహానికి ముఖద్వారం.

ఉల్కాపాతానికి లోనవుతున్నప్పటికీ, వాతావరణం, ఆక్సిజన్, నీరు లేకపోయినప్పటికీ, ఖనిజాలకు నెలవైన చంద్రుడిపై భూగర్భ బిలాలలో నిర్మించిన కాలనీలు ఉన్నాయి.

మేము సౌత్ పోల్ వద్ద ఉన్న షాక్లెటన్ బిలంలో అమెరికాకి చెందిన అమృతా కాలనీకి వెళ్ళవలసి ఉందని మా చంద్రగ్రహ మిత్రుడు చాంద్ చెప్పాడు. కఠిన వాతావరణం మరియు ఉల్కాపాతం నుండి తప్పించుకోవడానికి ఈ కాలనీ భూగర్భంలో నిర్మించబడింది. దీనికి బాహ్య సౌర కాంతి ప్రాంతం ఉంది, కాబట్టి రాత్రి కాలం ఉండే పదిహేను రోజుల పాటు ఉండే ప్రాంతాల వలే కాకుండా సౌరశక్తిని ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు. లోతుగా ఏర్పడిన మంచుతో కూడిన పోలార్ ప్రాంతం కాబట్టి లోతైన భూగర్భ బోర్ బావుల నుండి నీటిని వెలికి తీస్తారు.

మరో రెండు కాలనీలు ఉన్నాయి. ఒకటి రష్యన్లది. ఇంకొకటి ఉత్తర ధ్రువంలో చైనీయులు ఏర్పాటు చేసుకున్నది. భూమధ్యరేఖకు సమీపంలోని బహుళజాతి కాలనీ – లూనార్ కాపిటల్ టెరిటరీకి ప్రక్కనే ఉంది.

చంద్రుని యొక్క మరో వైపు చీకటి ప్రాంతం. భూమి నుండి చూసినప్పుడు కనబడని ప్రాంతమది. అక్కడ కాలనీలు లేవు. ఇక్కడ మానవులు ఇంకా దేన్నీ అన్వేషించలేదు. చంద్రుడిపైకి చేరడానికి మానవులు అంతరిక్ష నౌకలను మాత్రమే కాకుండా, స్పేస్ ఎలివేటర్లు, ఇంకా అంతరిక్ష వస్తువులను రవాణా చేయటానికి అనేక ఇతర పద్ధతులను ప్రయత్నించారు. కాని ఇప్పుడు అవేవి ఉపయోగంలో లేవు.

లా టెర్ లాంటి అత్యంత అధునాతనమైన లూనార్ ప్లాట్‌ఫాం ‘లా లూన్’ ఉంది. కానీ చాలా వ్యోమనౌకలు నేరుగా లూనార్ కాపిటల్ టెరిటరీలోని లూనార్ స్పేస్-డ్రోమ్‌లో దిగుతాయి.

చంద్రుడు తక్కువ గురుత్వాకర్షణ కలిగివుండటంతో – దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రశాంతమైన సముద్రం లాంటి షాక్లెటన్ బిలాన్ని రష్యన్ కాలనీలు ఉన్న ఉత్తర బిలంలోని లూనార్ కాపిటల్‍ని కలుపుతూ పొడవాటి ఉపరితల రైలుమార్గాన్ని ఏర్పరచడం ద్వారా ఉపరితల రవాణాను సాధించారు. సర్ఫేస్ లూనార్ ట్రైన్‌లో ప్రయాణం విమాన ప్రయాణంలా చాలా వేగంగా ఉంది.

దీనితో పాటు, అణు ఇంధనంతో నడిచే ఛార్టరెడ్ న్యూక్లియర్ ఫ్లయిట్లులో కూడా ఆకాశంలో ప్రయాణించవచ్చు. కానీ విమానయాన వ్యవస్థ తక్కువగా ఉపయోగించబడుతోంది.

ఒక ఖరీదైన చంద్ర ఉపగ్రహ వ్యవస్థ కూడా ఉంది. మిలియన్ల సౌర ఫలకాలు ఉత్పత్తి చేసే  విద్యుచ్ఛక్తితో, మైక్రోవేవ్‌ల ద్వారా చంద్రుడిపై ప్రసారం చేయటానికి భారీ స్పేస్ పవర్ స్టేషన్ కూడా ఉంది.

అంగారకుడిలానే చంద్రగ్రహం కూడా పర్యాటక రంగంపైనే అధికంగా ఆధారపడింది. సమీపంలోని మార్స్‌కు, శని ఉపగ్రహమైన టైటాన్, గ్వానిమేడ్, జుపిటర్ యొక్క ఉపగ్రహం యూరోపాకు జరిపే గ్రహాంతర ప్రయాణాలలో ఇది ఒక ముఖ్యమైన మజిలీ.

మా స్పేస్‌క్రాఫ్ట్ మినుకుమినుకుమంటున్న ఓ చిన్న నక్షత్రంలా చంద్రుడి చీకటి ప్రదేశంలోకి ప్రయాణిస్తోంది. చంద్రుని గురించి నాకు తెలిసిన విషయాలన్నీ గుర్తుచేసుకున్నాను.

కానీ ఇటువంటి విశాలమైన గ్రహం మీద సమూరా, అతని దుష్ట బృందం జాడలని ఎలా పసిగట్టడం?

ఎప్పటిలాగే యురేకస్‌ నాపక్కనే ఉంది. నా తర్వాతి సీట్లలో డిమిట్రీ, ఏనిమోయిడ్ కూర్చున్నారు. మా బృందంలోని ఇతర సభ్యులు చాంద్, వాన్ కు జాక్ నాతోనే ఉన్నారు. మేము చంద్రుడిపైకి చేరుకునే సమయానికి ఓ కార్యాచరణ ప్రణాళికను కలిగి ఉండాలి.

రెండో రోజు ముగుస్తుండగా మేము చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న స్పేస్ ప్లాట్‌ఫాం మీద దిగాం. దీనిని లా లూన్ అంటారు. భూమి యొక్క స్పేస్ ప్లాట్‌ఫాం (లా టెర్) లానే ఉంది. ఇది లూనార్ కాపిటల్ టెరిటరీకి దాదాపు 360 కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి కక్ష్యలో ఉంది.

ఇమ్మిగ్రేషన్ చెక్ … డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌లు… సెక్యూరిటీ చెక్ మినహాయింపు. అమృతా కాలనీ ప్రభుత్వపు అధికారి ఒకరు అదే సమయానికి అక్కడికి చేరుకున్నారు.

అన్ని గ్రహాల జాతీయతలకి చెందిన వ్యక్తులు… పొడవాటి మనుషులు, పొట్టివారు, తలలపై యాంటీనాలు ఉన్న గ్రహాంతరవాసులు, కోసుగా ఉన్న చెవులు కలిగిన వారు, వివిధ జాతుల లక్షణాలతో ఉన్న వ్యక్తులు, చిన్న, పెద్ద కళ్ళు, గోధుమ, నలుపు, తెలుపు పసుపు రంగు చర్మం కలిగిన వారు వివిధ ద్వారాల గుండా తిరుగుతున్నారు.

చంద్రుడి మీద దిగడానికి మరో ఫ్లయిట్ ఎక్కేముందుగా మేము ఫలహారశాలలో కొన్ని స్నాక్స్ తిన్నాము.

“ఆల్ఫా సెంటారీ నుండి గ్రహాంతరవాసులు వచ్చి పేలుడు జరిపిన రోజున ఏం జరిగిందో తెలుసుకోవడానికి నాకు కొంత సమాచారం అవసరం. అధికారులను అడుగుదామా?” అన్నాను.

అమృతా కాలనీ ప్రభుత్వం తరఫున వచ్చిన అధికారి ముఖం చిరాగ్గా పెట్టాడు. అతడి తల సాగి ఉంది, చెవులు కోసుగా ఉన్నాయి. వీటిని డోలికోసెఫాలి, హైపర్ టెలియోరిసిజం అని అంటారు.

“కుదరదు. పైగా అవసరం లేదు. విచారణ ముగిసింది. అన్ని స్టే‌ట్‌మెంట్లను చిత్రీకరించాం. మీరు కోరుకున్నప్పుడు మీ పనికి తగినట్లుగా మీకు కావల్సిన వివరాలను ప్రభుత్వమే మీకు అందిస్తుంది”

“సరే” అన్నాను.

కాసేపటికి మా వాహనం మమ్మల్ని నేరుగా షాక్లెటన్ బిలంలో ఉన్న అమృతా కాలనీ ఉన్న ప్రాంతంలో దింపింది. ఇక్కడ ఎక్కువగా అమెరికా జాతీయులు నివసిస్తున్నారు.

మా వాహనం స్పేస్‌పోర్ట్‌లో ల్యాండవుతుండగా చుట్టూ చూస్తూ “అద్భుతం” అని అరిచాను.

సుదూరంగా చంద్రగ్రహపు ప్రకృతి రమ్యదృశ్యంగా కనబడింది. దూరంగా పర్వతాలు, ఆర్చ్‌లు కనబడుతున్నాయి, బహుశా అవి బిలంలోకి దారితీసే మార్గాలై ఉంటాయి.

తర్వాత మా శరీరాల నుంచి కొద్దిగా రక్తం తీసుకుని తనిఖీ చేశారు. డిఎన్‌ఎ ప్రింటింగ్ తీసుకున్నారు. మా శరీరాలకు లూనార్ పొజిషన్ ట్రాకింగ్ డివైజ్‌లు (Lunar Positions Tracking Devises) అమర్చారు, తద్వారా మేము ఎక్కడున్నా గుర్తించవచ్చు.

లూనాఖోడ్ సర్ఫేస్ వెహికల్స్ అమితమైన వేగంతో మమ్మల్ని – ముగ్గురిని ఒక వాహనం చొప్పున క్రేటర్స్ లోని భూగర్భ కాలనీకి చేర్చాయి.

(సశేషం)

Exit mobile version