అధ్యాయం 17: లా డెర్నియర్ స్టేషన్
ఎట్టకేలకు మేము చంద్రుడి చీకటి భాగం అంచులలో ఉన్న లా డెర్నియర్ స్టేషన్‌కు చేరుకున్నాము.
మేము గ్రావిటీ సూట్లను ధరించి, మా సంచులను భుజాన వేసుకుని, నడుంపై ఆక్సిజన్ సిలిండర్లు, ఆహార పదార్థాలు మోసుకుంటూ స్టేషన్‍లో దిగినప్పుడు మా మధ్య ఒక భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది, అది మా వృత్తిగత నైపుణ్యం కూడా.
ఈ పరిస్థితి – ఈ బృందంలో బహుశా నాకూ, ప్రకృతికి మాత్రమే కొత్తయి ఉండవచ్చు. వాన్ కు జాక్, చాంద్ విరళ వాతావరణంలో ఈ రకమైన పరిశోధనాలకు, తక్కువ గురుత్వాకర్షణకు, తక్కువ ఆక్సిజన్‌కి అలవాటు పడి ఉన్నారు. డిమిట్రీ, ఏనిమోయిడ్ – టైటాన్, గనీమెడ్‌లలోని భూగర్భ కాలనీల నుండి వచ్చినవారు. వాళ్ళ కళ్ళు తీక్షణమైనవి, వినికిడి చురుకైనది. అద్భుతమైన విశ్వశక్తిని ఉపయోగించగలగడం వారి అదనపు బలం.
ప్లాట్‌ఫాం మీద భయం గొలిపే నిశ్శబ్దం ఆవరించి ఉంది. దీపాలు మందంగా వెలుగుతున్నాయి. ప్లాట్‌ఫాం నిర్జనంగా ఉంది, ఒంటరి రైల్వే గార్డు తప్ప అక్కడెవరూ లేరు. రైలు శుభ్రపరుచుకోడం కోసం, ఇంధనం నింపుకోడానికి హ్యాంగర్‌కి వెళుతుంది. ఆ మర్నాడు అమృతా కాలనీకి వెళ్తుంది.
తరువాత బహుశా మరో వారం పాటు ఇక్కడికి ఇంకో రైలు రాదు. నిర్జనమైన లా డెర్నియర్ స్టేషన్! ఈ బండి వెళ్ళిపోయాకా ఈ స్టేషన్‌ని పర్యవేక్షించే సిబ్బంది – లా డెర్నియర్ అని పిలవబడే లావా ట్యూబ్ లోపలికి వెళ్ళిపోతారు.
ఇక్కడ నుండి మేము లూనార్ రోవర్ క్రాఫ్ట్ ద్వారా చంద్రుడి మీద ఉన్న మరో వైపుకు వెళ్ళవలసి ఉంటుంది, అయితే పూర్తి చీకటిలో.
“చంద్రుని చివరికి వైపుకి స్వాగతం” అంటూ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఒక అధికారి ఒకరు మాకు స్వాగతం పలికాడు. అతను పొడవుగా ఉన్నాడు. ఆక్సిజన్ హెల్మెట్, గ్రావిటీ సూట్ ధరించి ఉన్నాడు. అతనితో పాటు సైనికుల్లా అనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులున్నారు.
గుమ్మటంలా ఉన్న స్టేషన్ లోపలి వైపుకి దారితీస్తూ… అతను “వేడిగా టీ ఏమైనా తాగుతారా? కాస్త స్నాక్స్ ఏవైనా తింటారా?” అని అడిగాడు. అక్కడ స్నాక్స్ మరియు కాఫీ మరియు టీ డిస్బర్సింగ్ యంత్రంతో ఒక చిన్న ఫలహారశాల ఉంది. అక్కడున్న ఓ ముగ్గురు – నలుగురు సందర్శకులకు నీలం-నలుపు లోహపు చర్మంతో ఉన్న ఓ రోబో స్నాక్స్, టీ అందిస్తోంది. పొడవాటి చెవులు, తలపై యాంటెన్నాలను చూస్తుంటే ఆ రోబో చంద్ర గ్రహానికి చెందినదే అని తెలుస్తోంది.
“రండి హనీ రండి! కూర్చోండి. మీరంతా అలసి పోయి ఉంటారు. మా రైళ్లు వేగవంతమైనవే అయినా అన్నింటికన్నా సుదీర్ఘ దూరం నడుస్తాయి.” అన్నాడతను.
ధన్యవాదాలు అంటూ గొణిగి, మేమంతా ఓ బల్ల చుట్టూ కూర్చున్నాం. మా సామాన్లను అతని సిబ్బంది మోసుకొచ్చి లోపల పెట్టారు.
“మీ సామాన్లని క్లోక్ రూమ్‌లోనే ఉంచమని కోరుతున్నాను. ప్రయాణం చేయడానికి మేమందించే రోవర్ క్రాఫ్ట్ ఉపయోగించండి. అక్షాంశాల వివరాలు అందిస్తాం. ఆహారం మరియు నీరు ఒక వారం పాటు సరిపోతాయి. మీరు తిరిగి వెళ్ళడానికి కనీసం ఐదు రోజులు ముందు ఇక్కడకి చేరుకుంటే బావుంటుంది. మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు, అక్సీజన్ నింపుకోవచ్చు, ఇతర పదార్థాలన్నీ సమకూర్చుకుని వెనక్కి మళ్ళవచ్చు” అని చెబుతూ అతను సానుభూతితో నవ్వాడు.
“అక్కడంతా చీకటిగా, చల్లగా ఉంటుంది. చాలా తక్కువ గురుత్వాకర్షణ ఉంది. ఎప్పుడూ ఉల్కాపాతం జరుగుతునే ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటున్న చోట ఉన్న అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలవ్వచ్చు. అయిన ఫెన్ ఎటర్నల్ మౌంటెన్ అనే ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం సమీపంలోని మరియా అనే ప్రాంతంలో సంకేతాలు బలంగా ఉన్నాయి. ఆ దుష్టులు అక్కడే ఉన్నారు. “
“ఇక్కడి నుంచి ఎంత దూరం?” డిమిట్రీ అడిగింది.. తెలివిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపేలా.
“450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా బృందాలు అక్కడికి వెళ్ళాయి, కానీ సౌర వ్యవస్థ వెలుపలి గ్రహాలకు చెందిన ఈ దుష్టులు ఎక్కువగా అదృశ్యరూపంలో తిరుగుతుంటారు. వారు అక్కడే ఉన్నారు కానీ కనిపించరు.”
“కానీ మీరెందుకు వాళ్ళని చూడలేరు?” ప్రకృతి అడిగింది. “లూనార్ పారానార్మల్ మంత్రిత్వ శాఖ తగినంత అధునాతనంగా లేదా?” అంది.
రక్షణాత్మక ముసుగు ధరించి ఉన్న మంత్రిత్వ శాఖ అధికారి ముసుగులోంచే నవ్వాడు. ముసుగుని తొలగించాడు. “ఇక్కడ ముసుగు అవసరం లేదు. ఫలహారశాలలో పీడనం ఉంది, చూశారుగా..” అన్నాడు ఏకస్వరంలో. అలా చెప్పడం చాలా అనుభవజ్ఞుడైన, అలసటతో ఉన్న వయోధిక ప్రభుత్వ పరిశోధకుడికి మాత్రమే సాధ్యమవుతుంది.
“నా పేరు ‘విన్‌స్కీ’. నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. దుష్టులను… అదే మీరు అనే చెడ్డ పిసియుఎఫ్‌లను వెతికి పట్టుకుని నాశనం చేస్తున్నాను. వాళ్ళల్లో అనేక రకాల వాళ్ళున్నారు, శక్తివంతమైన, దుష్టులు, ఎగరగలిగే సామర్థ్యం ఉన్న వారు, ఆక్సీజన అవసరం లేని వాళ్ళు, ఆల్ఫా సెంటారి వ్యవస్థ యొక్క జన్యుపరివర్తన జరిగినవాళ్ళు, 100,000 కంటే ఎక్కువ నక్షత్రాల స్థాయి ఉన్న మాంత్రికులు… ఏ ఆకారంలోని ఏ వస్తువులనైనా సృష్టించగలిగిన వాళ్ళు, చీకటిలోనూ చూడగలిగినవాళ్ళు. కణ పదార్థం, జన్యువులను పొందడానికి మానవులను తినే వారు… ఉన్నారు. ఇదంతా చాలా వికృతమైనది. విసుగు కలిగించేది, మార్మికమైనది. దాచబడి ఉంటుంది, నిగూఢమైనది, వివరాలు వెల్లడించబడనిది. ఆ దుష్ట శక్తులు నాగరిక మానవ కాలనీలపై దాడి చేస్తున్నారు. దౌష్ట్యం వారి భాష.. వాళ్ళ శక్తి చెడ్డది. వారి ఉద్దేశాలేమిటో తెలియవు. వాళ్ళంతా ఐకమత్యంగా ఉండి కొన్నిసార్లు గెలుస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళ సామ్రాజ్యాలు ఒక శతాబ్దం లేదా రెండు శతాబ్దాల పాటు కొనసాగాయి, అరుణ భూములలో లాగా వాళ్ళు స్థిరపడి శాంతియుతంగా ధ్యానం చేయటం, సమాజాన్ని ఏర్పరుచుకోవడం వంటివి చేశారు. ఉన్నట్టుండి ఒక్కోసారి ఏదో జరుగుతుంది, వారు ఏ కారణం లేకుండా ఇతర కాలనీపై దాడులు ప్రారంభిస్తారు. వారు రహస్యంగా అన్ని గ్రహాలకి ప్రయాణిస్తారు. వారికి మంత్రివర్గాలలోనూ, కస్టమ్స్ లోనూ, స్పేస్ ప్లాట్‌ఫాంల మీద, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలోనూ ఏజెంట్లు ఉంటారు. వారికి టెలిపతీ ద్వారా భావప్రసారం చేయగలిగే శక్తి ఉంది. బలహీన మనస్కులని గుర్తించి కలలు లేదా మానసిక సంకేతాల ద్వారా లొంగదీసుకుని వాళ్ళతో తమ పనులు చేయించుకుంటారు. కాబట్టి నిరంతర నిఘా ఒక్కటే మనల్ని కాపాడగలదు. శాస్త్రీయ ఆధారాల గురించి నేను ఆలోచించడం మానేశాను, ప్రశ్నించడం ఆపేశాను.
…వచ్చిన సమస్యను వచ్చినట్టు స్వీకరించండి. ఎదుర్కోండి. పరిష్కరించండి. కాని రహస్యంగా ఉంచండి. ఎందుకంటే కాలనీ యొక్క ప్రధాన నాగరికత, ప్రశాంతత చెదిరిపోకూడదు… “
మేమంతా నిశ్శబ్దంగా ఉండిపోయాం. విషయాలన్నీ నాకు అవగతమవుతున్నాయి.
నేనో సాధారణ మానవుడిని, ఒక పిసియుఎఫ్‌ని. వీటన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తోంది.
చాంద్ అన్నాడు: “వాళ్ళంతా ఇగ్లూ వంటి ఆకారంలో ఉన్న ఇంట్లో ఉన్నారని అనుకుందాం. మా నాయకుడు హనీ స్వప్నంపై మేము ఆధారపడి ఉన్నాం. ఆల్ఫా వ్యవస్థ నుండి వచ్చిన ఈ దుష్టశక్తుల బృందం – అరుణ భూముల ముసలి బలహీన చక్రవర్తి సమూరాకి ‘మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్’ వెతకడంలో సహాయం చేస్తున్నాయని అనుకుందాం. అదొక విషయంలోనే కాదు, అన్ని విషయాలలోనూ వాళ్ళు సమూరాకి సాయం చేస్తుండవచ్చు! స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన పిసియుఎఫ్ మాత్రమే దానిని కనుగొనగలడు. సర్… ఇవన్నీ మీకు కూడా తెలుసు కదా…”
“అవును! అవును! ఇప్పుడు ఈ మిషన్ కోసమే భూగ్రహానికి చెందిన హనీ ఆమ్రపాలిని నియమించారు. ఇతను అక్కడికి వెళ్లినట్లయితే… వారు ‘మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్’ని కనుగొనటానికీ, తమ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇతన్ని పట్టుకుంటారు. ఇదంతా నాకు తెలుసు. అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం, అద్భుత వస్తువులు, ఎన్‌సైక్లోపెడియా, వగైరా వగైరా… ఏదైనా సరే నాకు అనవసరం. మీరు మిషన్ పై అక్కడికి వెళ్తారని నాకు తెలుసు. వారిని పట్టుకోండి, చంపండి లేదా చావండి లేదా విశ్వశక్తి యొక్క జాలంలో చిక్కుకుపొండి. పదార్థం అనేది విశ్వమంతటా ఒకటే. ఇదే మంచీ, చెడులుగా జీవుల్లోకి ఘనీభవిస్తుంది. అవును. ఇక్కడ హనీ, ప్రకృతి ఉండడం మంచిదే… వారు సాధించగలరు. కానీ నాకు తెలియదు… నేను దీనికన్నా దారుణమైన విషయాలను చూశాను. ఆల్ఫా వ్యవస్థకి చెందిన దుష్ట, జన్యు పరివర్తన చేయబడిన తాంత్రికులు భయంకరమైన శక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళ రుచులు భిన్నమైనవి. వారు శక్తుల కోసం.. అక్షరాలా.. మిమ్మల్ని తింటారు. ఒకసారి మీరు చంద్రుడి చీకటి వైపు వెళితే, పాపం.. మీ శరీరాలు మిగలవని భావిస్తున్నాను. మీ ఆత్మలు మాత్రమే ఉంటాయి.
ఆపై పిసియుఎఫ్‌ల ఆత్మలను దుష్ట శక్తులు పీల్చుకుంటాయి. అక్కడికి వెళితే మీరు నాశనమవుతారు. అక్కడ ఉంటే మీరు బాధపడతారు. కానీ ఈ పని మీరు చేయాలని మంత్రిత్వశాఖ ఆశిస్తోంది. ఏదో సామెత చెప్పినట్టు ఇదంతా గందరగోళంగా ఉంది.”
“ముందు నుయ్యి… వెనుక గొయ్యి” అంటూ వాన్ కు జాక్ సంభాషణలో జోక్యం చేసుకున్నాడు. “చీకటి వైపు ఉన్న మరియాకీ.. ప్రకాశవంతమైన ప్రశాంత సముద్రానికి మధ్య…” అన్నాడు.
“మీరు సులువుగా మోసపోతారు! కుజ, చంద్ర, భూగ్రహాల నుంచి వచ్చిన నా మిత్రులారా! మీరు అక్కడికి వెళతారు, ఎందుకంటే మీరో గొప్ప మిషన్‌లో ఉన్నారు. మీరు ఉన్నతులనీ, స్వచ్ఛమైన వారని మిమ్మల్ని ఎంపిక జేసి ఇక్కడికి పంపింది ఎర్త్ కౌన్సిల్. హాహ్హహ… హాహ్హహ.. ఇప్పటికి మూడు జట్లు వెళ్లి విఫలమయ్యాయి, వాళ్ళంతా మరణించారు. ఇప్పుడు మీ వంతు”.
విన్‌స్కీ, ముసలి చంద్రగ్రహవాసి అకస్మాత్తుగా దుష్టునిలాగా నవ్వసాగాడు. ఆ గదిలో సాధారణ ధ్వనులు, మామూలు సంభాషణలు మాత్రమే ఉండటం వలన ఆ నవ్వు… పీడనం నిండిన ఆ గదిలో ప్రతిధ్వనించింది.
కానీ అది భయంకరమైన నిశ్శబ్దం. వెలుపలంతా శూన్యం, చీకటి వైపు కూడా శూన్యమే. వెలుపల చంద్రదృశ్యం బయట కూడా శూన్యమే. హెల్మెట్లలో ఉన్న హెడ్ ఫోన్ల ద్వారా మాత్రమే సంభాషణలు జరుపగలం.
కానీ – మేమంతా మూర్ఖులమనీ, ఖచ్చితంగా నశించబోతున్నామని తెలిసినవాడిలా విన్‌స్కీ నవ్వుతూనే ఉన్నాడు.