అధ్యాయం 18: లా డెర్నియర్ స్టేషన్
లా డెర్నియర్ స్టేషన్ బయట వాతావరణం బూడిదరంగులో, నిర్జీవంగా నిర్జనంగా ఉంది. దూరంగా మాకు దట్టమైన కొండలు, పలచని నారింజ రంగుతో ప్రకాశిస్తున్న కొన్ని ప్రకృతి దృశ్యాలు కనబడుతున్నాయి. వాటి దిగువన మైదానంలో బిలాలు గోచరించాయి.
మా ప్రయాత్నాన్ని విమర్శించినప్పటికీ, విన్‌స్కీ వచ్చి మాకు వీడ్కోలు చెప్పాడు. చంద్రుని ఉపరితలం మీద ప్రయాణించటానికి అవసరమయ్యే అన్ని గాడ్జెట్లను అతను మాకు ఖచ్చితంగా అందించాడు.
ఏడురోజుల పాటు నడిచే రోవర్లను ఇంధనం, శక్తిలతో నింపాడు. గ్రావిటి స్యూట్స్, హెల్మెట్లు, బ్యాక్‍సాక్‌లో ఆక్సిజన్ సిలిండర్, ఫ్రోజెన్ బిస్కెట్లు, ప్రోటీన్ డైట్ చిక్కుళ్ళు, మంచినీళ్ళు అందజేశాడు. ముఖ్యంగా హెల్మెట్‌లకి కమ్యూనికేషన్ హెడ్‌సెట్స్ అమర్చాడు. జియో పొజీషనింగ్ సిస్టమ్ పరికరాలను మా సూట్లు, శిరస్త్రాణాలు, ఇతర శరీర భాగాలలో అమర్చాడు.
“మీరు చనిపోయినా లేదా ముక్కలుగా పేలినట్లయినా, మేము మిమ్మల్ని కనుగొని, తీసుకురాగలం” విన్‌స్కీ హాస్యమాడాడు. అతని మాటలు ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి, భీతి కల్పిస్తున్నాయి.
డిమిట్రీ కళ్ళలోండి నీలం రంగు కిరణం వెలువడి విన్‌స్కీ వైపు కదిలింది. అది విన్‍స్కీ ముఖాన్ని వెంట్రుకవాసిలో దాటిపోయింది. నీలి కిరణం వెళ్లి స్టేషన్ కిటికీలోని ఒక గాజు పలకపై పడి, రంధ్రం చేసింది.
రంధ్రం నుండి నెమ్మదిగా తెల్లని పొగ వెలువడింది.
మృత్యుభయంతో విన్‌స్కీ గావుకేక పెట్టాడు. వద్దు వద్దన్నట్టుగా చేతులను తిప్పాడు.
“నా ఒక్కదాని శక్తికే ఇది నిదర్శనం. నీలాంటి మూర్ఖులు మాటలతో నన్ను రెచ్చగొడితే జరిగేదిదే. నాకు నిజంగా కోపం వచ్చి, నేను చంపదలచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు” అంది డిమిట్రీ క్రోధంతో బుసలు కొడుతూ. ఆమె తలపై యాంటెన్నాలో ఒన్న దీపం ఎరుపు రంగులో వెలిగిపోతోంది.
“ఓహ్! క్షమించాలి! మీకు శుభాకాంక్షలు. మీ ప్రయాణం సుఖంగా సాగాలి” అని మాకు వీడ్కోలు పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
“శభాష్ డిమిట్రి! అతనికి తిక్క కుదిరింది!” అరిచారు వాన్ కు జాక్, చాంద్.
మెచ్చుకుంటున్నట్టు కూతబెట్టాడు ఏనిమాయిడ్.
“సరే. బయల్దేరుదాం. ఒక్కొక్కరు వాహనాలెక్కండి. శోధన కోసం ఇదిగో కోఆర్డినేట్లు” అంటూ నిగూఢమైన గ్రహాంతరవాసులను గుర్తించడానికి వారికి నేను వాటిని చంద్రుడి అక్షాంశాలు, రేఖాంశాలను చూపించాను.
చంద్రుడి “ఇగ్లూ” హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేట్లని నేను ఉంచుకున్నాను, మిగతావాళ్ళు అన్ని దిశల కోఆర్డినేట్లను పొందారు. వ్యాసార్థం సుమారు 1000 కిలోమీటర్లు.
ఇక మా రోవర్ చంద్రుడి యొక్క చీకటి వైపు ప్రయాణమైంది. మా రోవర్ వెనుక ఆకాశంలో బూడిదలాంటి నీలం రంగు ధూళిమేఘం మరియు పొగ యొక్క కనబడ్డాయి.
చంద్రుడి యొక్క ప్రకాశవంతమైన వైపున సూర్యుడు అస్తమిస్తున్నాడు. తూర్పున పెద్దగా కనిపిస్తున్న భూగ్రహంలో నీలం రంగులో ఉన్న సగం ప్రకాశవంతమైన వైపున కనబడింది. చంద్రుడి ఆకాశంలో లక్షలాది నక్షత్రాలు ప్రకాశిస్తుంటే – చీకటి ఆకాశం ఒక పండుగలా వెలిగిపోయింది.
***
నా తెలివైన రోబో యు7776 గురించి చెప్పడం మర్చిపోయాను. మిగతా అందరూ తమ తమ రోవర్లలో వాళ్ళి కేటాయించిన దిశలలో వెళ్ళిపోయారు. నేనూ ప్రకృతి పక్కపక్కనే నిలుచున్నాము.
మేము కలిసి ఉండకూడదని చెప్పనవసరం లేదు. మాలో ప్రతి ఒక్కరం తమకు కేటాయించిన ప్రాంతంలో గ్రహాంతర దుష్టమాంత్రికులను గుర్తించాల్సి ఉంది.
ప్రకృతికి ఒక రోవర్, నాకొక రోవర్ ఉన్నాయి. తన స్యూట్‌కేస్‌లో దాచిపెట్టిన ఒక బ్యాగ్‌ని బయటకి తీసి నాకు ఇచ్చింది.
అది ఒక పెద్ద నీలి రంగు బ్యాగ్. దాంట్లో నా రోబో యురేకస్‌ని విడదీసి, వేరుచేసిన యాంత్రిక భాగాలు మరియు మరలు ఉన్నాయి.
మరో క్షణంలో మేమిద్దరం మరతలో భాగాలని బిగించాం, జెల్ పూసాము, రోబో వెనుక భాగంలో న్యూక్లియర్ బ్యాటరీ అమర్చాం. పవర్ స్విచ్ ఆన్ చేశాము.
రోబో కళ్ళు మెరిసాయి, ఐదు అడుగుల పొడవైన యు7776 క్రియాశీలకమైంది.
“శుభోదయం మాస్టర్ హనీ! చంద్రుని మధ్యలో అక్షాంశం 00 మరియు రేఖాంశం 1800. యురేకస్ 7776 మీకు రిపోర్ట్ చేస్తోంది. నేను అరుణ భూముల సామ్రాజ్యం శాస్త్రవేత్తలు రూపొందించిన 7వ తరం మారిటన్ రోబోలకు చెందినదాన్ని. మార్స్ చక్రవర్తి మీకు బహుమతిగా ఇచ్చిన రోబోని. నేను మీ స్వర ఆదేశాలను తీసుకొని, డేటాను నిల్వ చేసి మీకు తార్కిక సమాచారం అందిస్తాను, మీకు మాత్రమే అందిస్తాను. మీరే భూగ్రహానికి చెందిన యొక్క హనీ ఆమ్రపాలి. మీ స్వరాన్ని నేను గుర్తించాలి. దయచేసి, అవును అని చెప్పండి!”
“అవును” అన్నాను. ఇది రోబోని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు జరిగే ఓ క్రమం. ఎప్పుడో తప్ప ఇలా జరగదు.
చంద్ర ప్రభుత్వంలోని – పారానార్మల్ దళాలకు వ్యతిరేకంగా పోరాడే మంత్రిత్వ శాఖ – వారికి మాత్రమే తెలిసిన ఉత్తమ కారణాల వల్ల మాతో యు7776 ని తీసుకువెళ్ళడాన్ని నిషేధించించారు. అయినా నేను ప్రకృతితో చర్చించాను. మా పనిలో మాకు సహాయపడటానికి దాన్ని అక్రమ రవాణా చేయగలిగాం.
“మీ స్వరాన్ని గుర్తించాను మాస్టర్! ఇక ఆదేశాలివ్వండి!” అంది ఎప్పుడూ విధేయంగా ఉండే రోబో.
నేను మా మిషన్ యొక్క వివరాలను, చంద్రుడి యొక్క చీకటి వైపు యొక్క కోఆర్డినేట్లు ఇచ్చాను. దాన్ని నా మౌఖిక ఆదేశాలకు ప్రోగ్రామ్ చేసాను. నాకు తప్ప వేరెవరికీ కనిపించకుండా ఉండేలా, దాని శరీరంలో అతి తక్కువ విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉండేలా ప్రోగ్రామ్ చేశాను. అందువల్ల అది చంద్ర ప్రభుత్వం వారి నిఘా విభాగపు ఏ ట్రాకింగ్ వ్యవస్థకి దొరకదు. మంత్రిత్వ శాఖకి చెందిన విన్‌స్కీ రోబోని తీసుకెళ్ళేందుకు ఎందుకు అభ్యంతరం చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
కానీ నాకు అది అవసరం. అది అమూల్యమైనది.
“మాస్టర్, అర్థం చేసుకోండి! చంద్రుడి యొక్క కేంద్ర భాగానికి మీరిచ్చిన కోఆర్డినేట్లు సరిపోతాయి, బహుశా ఇది ‘మరియా సముద్రం’ కావచ్చు. నేను ఇప్పటికే ఈ రేఖాంశంపై తనిఖీ జరిపాను. గ్రహాంతర దుష్ట మాంత్రికుల విద్యుదాయస్కాంత వికిరణాలున్నాయి, వాటిని చంద్ర ప్రభుత్వంలోని – పారానార్మల్ దళాలకు వ్యతిరేకంగా పోరాడే మంత్రిత్వ శాఖ గుర్తించింది.”
“ఎలా?” అడిగాను. “రహస్య సమాచారాన్ని నువ్వెలా సంపాదించావు?”
సంతృప్తితో కూడిన యాంత్రిక మూలుగులు యురేకస్ నుండి వెలువడ్దాయి.
“ఓ మిలియన్ మేళవింపులను ప్రయత్నించి వాళ్ళ పాస్‌వర్డ్ పట్టుకున్నాను. మంత్రిత్వశాఖ వారి ఆర్కైవ్‌లో మ్యాపింగ్ సమాచారం – ‘చంద్రుడిపై గ్రహాంతర విద్యుదయస్కాంత సంకేతాలు’ అని ఉంది. కొన్ని క్షణాలు ఆపి, మళ్ళీ చెప్పసాగింది యురేకస్ “మీరు ఆశ్చర్యపోతారు మాస్టర్ హనీ, ఆ పాస్‌వర్డ్ ‘EmpREDPLAIN’.
ఇప్పుడు ఇది నాకు మరీ విస్తుగొల్పింది. ఇలాంటి పాస్‌వర్డ్‌ని వారెలా ఉపయోగించగలరు! ఇది మార్స్‌లోని రెడ్ ప్లెయిన్స్ చక్రవర్తిని… సమూరాని సూచిస్తోంది. అంటే తమ శక్తులను తిరిగి పొండడానికి ప్రయత్నిస్తున్న వృద్ధ తాంత్రిక చక్రవర్తి సమూరా గురించి వాళ్ళకి తెలుసన్న మాట! ఆ రేడియో ధార్మికత అతని నుండి వచ్చినదేనని సూచించారు.
లేదా… సమూరా కోసం పనిచేసే గూఢచారి చంద్ర ప్రభుత్వపు మంత్రిత్వశాఖలో కూడా ఉన్నాడా? పాస్‌వర్డ్‌లు ఒక వ్యక్తి యొక్క ఉపచేతన భావనను, ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి యొక్క ఇష్టాన్ని బహిర్గతం చేస్తాయి. ఈ పాస్‌వర్డ్ ద్వారా చక్రవర్తి, అరుణ భూముల పట్ల గౌరవం స్పష్టంగా వెల్లడవుతోంది. లేదా నేను మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నానా?
“సరే! మనిద్దరం ఈ ప్రదేశానికి రోవర్లో ప్రయాణిద్దాం. కాస్త దూరంలో ఉంటూ ప్రకృతి మనలని వెంబడిస్తుంది. ఆమె లేజర్ గన్, విశ్వశక్తితో నాకు ఏ ప్రమాదం లేదా నాపై దాడి జరగకుండా నాకు రక్షణగా ఉంటుంది.”
వాన్ కుక్ జాక్, యానిమోయిడ్ మరియు చాంద్ వరుసగా ఉత్తర, దక్షిణ మరియు ఆగ్నేయ దిశలలో వెళ్లారు. మా వద్ద కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి. వారి కోఆర్డినేట్లు, లూనార్ పొజిషనింగ్ ట్రాకింగ్ సిస్టమ్ నంబర్లు నాకు తెలుసు. వాటిని నేను రోబోలోకి ఎక్కించాను.
ఈ విధంగా నేను జట్టు సభ్యులతోనూ సంప్రదింపులలో ఉంటాను. వారి స్థానాలను తెలుసుకుంటూ ఉంటాను. ఏ ప్రమాదం జరగకుండా యురేకస్ నన్ను అప్రమత్తం చేస్తుంది, ఎప్పటికప్పుడు వాటిని విశ్లేషిస్తుంది.
అప్పుడు మేం చంద్రుని చీకటి వైపుకి మా యాత్రను ప్రారంభించాలి. మేం ప్రారంభించిన చోట మందమైన కాంతి ఉంది. ఉపరితలం పై ఎగిరే రోవర్ క్రాఫ్ట్‌ని ఆన్ చేయగానే చీకటి తీవ్రమైంది. గాలి వేగం ఉధృతమైంది. ఆకస్మికంగా ఉల్కలు రాలుతూ మా దృష్టికి ఆటంకం కలిగించాయి.
ప్రయాణం కఠినమైనది. శిలలు వానలా కురుస్తున్నాయి. గాలి అధిక వేగంతో ఉంది కానీ వింత ఏమిటంటే నేను శబ్దాన్ని వినలేకపోయాను.
ఇటువంటి పరిస్థితుల్లో నావిగేట్ చేయడం ఎంతో కఠినమైన పని. కానీ యురేకస్ దాన్ని సులభతరం చేసింది.
“మాస్టర్! భయపడవద్దు. ముందుకి వెళ్ళండి. త్వరలో ఇదంతా ఆగిపోతుంది” అని చెప్పింది. నా ఆందోళన తెలుసుకున్నట్టుగా, “ప్రకృతి గారు 5 కిలోమీటర్ల వెనుక ఉన్నారు, ఆమె మిమ్మల్ని అనుసరిస్తున్నారు, సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు” చెప్పింది యురేకస్.
మా గమ్యస్థానం ఆ ఇగ్లూ! ఆల్ఫా వ్యవస్థకి చెందిన గ్రహాంతరవాసుల ప్రధాన కార్యాలయం! సమూరా దాగి ఉన్నాడని భావిస్తున్న స్థలం! ఇక్కడికి చేరడానికి మాకున్న సమయం కేవలం కొద్ది చంద్ర రోజులే. ఆక్సీజన్, ఆహారం అయిపోవడానికి ముందే వాళ్ళ ఉనికి తెలుసుకోవాలి.
‘ఆ అద్దం ఎక్కడ ఉండి ఉంటుంది? ఎందుకు వాళ్ళు చీకటి వైపున దాక్కున్నారు?’ ఆలోచిస్తూ నేను పైకే అనేశాను.
మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్‌ని ఎక్కడైనా దాచి ఉండవచ్చు కానీ వారు ఇక్కడ వచ్చిన కారణం అది మాత్రమే కాదు. కోల్పోయిన గ్రహాలను, రెడ్ ప్లెయిన్స్ తిరిగి జయించటమనేది వారి ఆశయం. వారు చంద్రునిపై విద్యుత్ వ్యవస్థలను విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారు, దానిని నిర్వీర్యం చేసి జయిస్తారు.
“ఎలా? హాస్యాస్పదం! కొంతమంది ముసలి పిసియుఎఫ్‍లు చంద్రుడి కాలనీలను ఎలా జయిస్తారు?”
“సౌర విద్యుత్ కేంద్రం చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఆర్బిటింగ్ ప్యానెల్‌లో ఉంది. అందులో ఒకటి పాడయినా, మొత్తం చంద్ర విద్యుత్ శక్తి దెబ్బతింటుంది. అప్పుడు ప్రభుత్వంలో కీలక హోదాలలో ఉండి నిద్రాణంగా ఉన్న గూఢచారులు తిరుగుబాటును ప్రకటిస్తారు. ప్రభుత్వాలను అస్థిరపరుస్తారు. చంద్రుని చక్రవర్తిగా సమారాను ఆహ్వానించవచ్చు.”
“ఎంత చోద్యం? ఇదంతా ఎలా జరుగుతుంది? “
“విద్యుత్ శక్తి పునరుద్ధరణకు బదులుగా! విద్యుచ్ఛక్తి లేకుండా కాలనీలు కొన్ని రోజులు మాత్రమే మనుగడలో ఉంటాయి. మాస్టర్, నా తర్కానికి ఈ అవకాశం ఉందనిపిస్తోంది. అయితే ఇది ఒక్కటే కాదు!”
మేము ముందుకు దూసుకుపోతున్నాం. నా మనస్సు కూడా వేగంగా ఆలోచిస్తున్నది. రోబో యొక్క తర్కం నిజమైనదే అయితే, విశ్వవ్యాప్త సంభాషణకు హామీ ఇచ్చే తాంత్రికుల పురాతన అద్దం ఓ అసంబద్ధమైన, మూర్ఖపు వస్తువు అని అనిపించింది. ఆ మాటకొస్తే, శక్తులు గల వెండి కొవ్వొత్తి కూడా ఇంతే… కానీ శక్తి సామర్థ్యాలకి నేను ప్రత్యక్ష సాక్షిని!
కానీ మరిన్ని అధికారాలు పొందడం ద్వారా సమారా ఏం సాధిస్తాడు? ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అతను ఆయుధాలు, సైన్యాలు మరియు పూర్తి రాజకీయ వ్యవస్థలను పట్టుకోవాలి. అమృత ఔషధాలు, అద్దాలు, కొవ్వొత్తులు, మంత్రదండాల వంటి ఈ ఏడు వస్తువులు ఈ ప్రయోజనం సాధించలేవు.
లేదా దుష్ట గ్రహాంతరవాసులు సమూరకి ఎరవేసి తమ ప్రభావంలోకి లాక్కునే వ్యూహం ఉందా? అతనిలో ఉన్న పురాతన మాంత్రికుడికి ‘విశ్వశక్తి’ యొక్క ప్రామాణికమైన నియంత్రణతో అద్భుత వస్తువుల ద్వారా అధికారాలను తిరిగి పొందాలనుకుంటున్నారు. కానీ తెలివితేటలలో సమూరా కన్నా అధికులైన దుష్ట గ్రహాంతరవాసులు ఒక సామ్రాజ్యం సృష్టించడం కోసం – ఈ సాధారణ వస్తువులు పొందడానికి సమూరాని ఆకర్షించడం ద్వారా – అతనిని ఉపయోగించుకోవచ్చు.
ఇప్పుడు చంద్రునిపై ఆర్బిటింగ్ పానెల్స్‌తో కూడిన విద్యుత్ వ్యవస్థ ఉంది, ధ్రువాల వద్ద ఉండే శాశ్వత ప్రకాశం నుండి విద్యుత్ శక్తిని పొందుతోంది. చంద్రునిపై ఉన్న అన్ని వ్యవస్థలు… వాటర్ ప్లాంట్, రైల్వేలు, ఇతర దేశీయ వ్యవస్థలకు విద్యుచ్ఛక్తి అవసరం. విద్యుచ్ఛక్తి వ్యవస్థలపై అదుపు సాధిస్తే, ఎవరైనా చంద్రుడిని నియంత్రించవచ్చు.
ప్రభుత్వంలో కీలక పదవులలో రహస్య గూఢచారులను నియమించుకోడం ద్వారా రాజకీయ వ్యవస్థపై పట్టు సాధించవచ్చు.
ఇలా నా ఆలోచనలు నా మెదడులో తిరుగుతున్నాయి. రోవర్ వేగం పెంచుకుంటోంది, ఒక గంట సేపు ప్రయాణించాం.
అప్పుడు హఠాత్తుగా రోబో హెచ్చరిస్తూ కేక పెట్టింది.
“మాస్టర్! ప్రమాదం! ముందుకు వెళ్ళద్దు! పక్కకు తిప్పండి. కేవలం సెకన్ల సమయమే మిగిలింది…”
అంతే, కొన్ని క్షణాల్లో నల్లని సర్పిలాకారపు శిలావర్షం కురిసింది. నా రోవర్‌పై పిడుగు పడింది.
రోవర్‌ని నేను సకాలంలో ఆపలేకపోయాను.
విపరీతమైన శక్తితో పేలుడు సంభవించింది, నా తల దేనినో గుద్దుకుంది. నేను స్పృహ కోల్పోయాను. చైత్యన్యం కోల్పోయే ముందు నా కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించాయి. నేను వాహనం నుండి పడిపోయాను. చెవులు అదిరిపోయేలా వెలువడ్డ ఆ ధ్వని ప్రభావానికి నా రోబో కూడా ముక్కలై పోయి ఉంటుందని అనుకున్నాను.
చివరి క్షణాలలో వెనుక రోవర్లో వస్తున్న ప్రకృతి గురించి ఆలోచించాను. “దేవుడా! ఆమెను రక్షించు!”…. ఇదే నా చివరి ప్రార్థన.
(సశేషం)