భూమి పుత్రుడు

0
2

[dropcap]మం[/dropcap]డే ఎండలకు…
ప్రకృతి కాంతపచ్చని మేని ఒడలి పోతుంటే,
ఎండిన పంటలను
కన్నీళ్ళతో తడుపుదామంటే…
కళ్ళలో నీరింకిపోయింది.
గుండె నీరెండిన చెరువైంది!!

పసిబిడ్డ చనుబాలకేడ్చినట్లు,
రైతు చినుకుచుక్కకై గుక్కెట్టి ఏడుస్తున్నాడు!
నా కన్నీళ్ళు తుడుచేదెవరు, నన్ను
ఓదార్చేదెవరు.!

నాగటి చాళ్ళను కన్నీటి చారలతో తడుపుతూనే ఉన్నా
పొలం గట్టున నీరెండిన నయనాలతో
ఆశల చినుకు కోసం,
ఆత్రంగా ఆకాశం వైపు చూస్తునే ఉంటున్నా..!

ఆకాశానికి నిచ్చెన వేసి..
మబ్బుల జలపాతం తలుపులు తెరిచి,
అవని మేనిని తడుపుదామంటే..
మబ్బులు మొఖం చాటేసాయి..!
ధరిత్రిని మండే ఎడారిని చేసాయి..!

శివుని మెప్పించి, నేర్పుగా ఒప్పించి
తన జటాజూటంలో ఉన్న గంగమ్మను విడవమని తపస్సు చేద్దామంటే..
నేనేమైన అపర భగీరధుడునా…
ఏమో నాకైతే తెలీదు..!!

తన క్షుద్భాదను పంటి బిగువున దాచి,
ఆలమందలను, గొడ్డుగోదలను, పసరు చెట్లను, పూలమొక్కలను, మాతృమూర్తివలె కన్నుల్లో పెట్టుకుని, కడుపులో దాచుకుని బ్రతికించుకుందామంటే..
శివయ్య కనికరిస్తాడా,
గంగమ్మ కనికరిస్తుందా…!!

శివుడు నా మొరాలకించి గంగమ్మను విడువగా…
ఆశల చిరుగాలికి మబ్బుల జలపాతం పారగా
కనికరించిన గంగమ్మ ఎరులై సెలయేరులైంది.
అవని పులకించి, పైర్లపై గంగ పరవళ్ళు తొక్కింది…!

నైఋతి పరవశించి, వివశురాలై వర్షించింది…
ఆనందాల జడివానతో, తొలకరి చినుకులు, నవ్వుల వానై, ఆనందపు ఏరులై  పరవళ్ళు తొక్కుతూ…
ధరిత్రినంతా తడపగా
అవని ఆనంద పరవశమైంది…
రైతు ఇంటసిరులపంట పండింది…
భూమి పుత్రుడి కళ్ళలో వేయి కాంతుల దీపావళి  వెలుగులు నింపింది..!
విశ్వం ఆనంద పరవశమైంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here