భూతాల బంగ్లా-12

0
2

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[పోలీసు అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న భరత్ కాపీ, టీ లు కూడా కొంత మేరకు వ్యసనమే అంటూ కాపీ గురించి చెబుతాడు. కాఫీ ఇథియోపియా గొర్రెల కాపరులచే 9వ శతాబ్దములో కనిపెట్టబడిందని చెబుతాడు. ఆ తర్వాత ఏయే దేశాలకు చేరిందో వివరిస్తాడు. కాఫీని వాణిజ్యపరంగా అభివృద్ధిలోకి తెచ్చింది అరేబియన్లే అని చెబుతాడు. తగిన మోతాదులో కాఫీ తీసుకుంటే ఏం ఉపయోగాలున్నాయో చెబుతాడు. అలాగే ఎక్కువగా సేవిస్తే సంభవించగల ప్రమాదాలను ప్రస్తావిస్తాడు. తర్వాత టీ గురించి చెబుతాడు. మనిషి జీవితంలో అమితంగా ప్రభావం చూపుతున్న టీ పుట్టుపూర్వోత్తరాలు చెబుతాడు. ఎక్కడ ఎక్కడ ఏ రకం టీ పండుతుందో వివరిస్తాడు. ఈ సమాచారం వాళ్ళకి ఎందుకు చెపుతున్నాడో వివరిస్తాడు. మాదకద్రవ్యాల వినియోగం వలన ఎటువంటి కష్టం, నష్టం ఉందో సమాజానికి తెలియజేయడమనేది ఏ ఒక్కరి వలనో అయ్యే పని కాదని, సమిష్టిగా బాధ్యతగా అందరు వాటి నిర్మూలనకు కృషిచేస్తేనే విజయం సాధించగలమని అంటాడు భరత్. ఇక చదవండి.]

[dropcap]దె[/dropcap]య్యాలబంగ్లాకి వచ్చిన పోలీసులు అందరిని విచారించి, చెట్టుకు కట్టి ఉన్న తాడును చూస్తూ, కుక్కలకు మత్తుమందు ఉన్నఆహారం ఇచ్చి దొంగతనానికి వచ్చిన మారిముత్తు, మైకంలో బంగ్లా పైభాగం నుండి పడటంతో మరణించాడని రాసిన పోలీసులు కేసు మూసివేసారు.

మారిముత్తు సాధారణ దొంగ కనుక అతని మరణాన్ని పోలీసులు తేలికగా తీసుకున్నారు. అతని తోడుదొంగ సెల్వంని విచారించగా, ఆరోజు ఎక్కవ తాగడం వలన తన గదిలోనే ఉండిపోయానని చెప్పడంతో అదే నిజం అని నమ్మిన పోలీసులు ఈ కేసు మూసివేసారు. శవాన్ని కూడా తీసుకోవడానికి ఎవరు రాలేదు. మారిముత్తు మరణాన్ని ఆ ప్రాంత ప్రజలు పలు రకాల కథలుగా చెప్పుకోసాగారు.

***

“అయ్యా గుమాస్తా గారూ, మా అమ్మ మంచంలో ఉందంట, నిన్నపొద్దున తమరు ఇచ్చిన జాబులో అలా ఉంది. పది రోజులు సెలవు ఇప్పిస్తే నే వెళ్ళి మా అమ్మను చూసి వస్తా” అన్నాడు బంగ్లాలోని పనిమనిషి రామయ్య.

“కుదరదయ్యా. ఇప్పటికి ఇప్పుడు వెళతానంటే ఎలా? రేపు అయ్యగారు ప్రెండ్ కాళిగారు తన పార్టీ నాయకులు, స్నేహితులతో ఓ రాత్రి మీటింగ్ ఏర్పాటు చేసారు. అందుకు ఇక్కడకు పలువురు పెద్దవాళ్ళు వస్తున్నారు. పైగా పదిరోజులు సెలవు అంటున్నావు ఇప్పటికి ఇప్పుడు నేను మరో పనిమనిషిని ఎక్కడ వెదికేది. అదీ పది రోజులు పనికి అంటే ఎవరు వస్తారు? అందునా ఈ దెయ్యలకొంపలో  పనిచేసే వాడిని నేను ఎక్కడ వెదికేది” అన్నాడు ఆ బంగ్లా గుమాస్తా.

“అయ్య అందుకే నా అల్లుడు నా బదులు ఈ పది రోజులు ఇక్కడ ఉంటాడు. మావాడు ఈరోజు వస్తానని ఆ ఉత్తరంలో రాసాడు. రేపు అయ్యగారి మీటింగ్  అయ్యాక మావాడిని ఇక్కడ ఉంచి నేవెళతాను. అమ్మకదయ్య చూడకుండా ఎలా ఉంటాను?” అన్నాడు పనిమనిషి రామయ్య.

“ఒహో మీవాడిని పిలిపిస్తున్నావన్నమాట. ఇంకేం, అలాగే ఎల్లుండి వెళ్ళిరా! ఇదిగో ఈ కాగితాలపై  వేలిముద్రలు వేయి. నువ్వు ఇంతకాలం నా వద్ద దాచుకున్న నీ జీతం డబ్బులు  అరవై నాలుగువేలు లెక్క చూసుకో”  అన్నాడు గుమాస్తా.

“తమరు ఇవ్వడం నేను లెక్క చూడటమా? ఎంతమాట అన్నారు?” అన్నాడు రామయ్య.

ఇంతలో ఒకచేతిలో ట్రంకు పెట్టె, మరో చేతిలో ముల్లుకర్రతో ముతక పంచా చొక్క తలకు తుండుగుడ్డ కట్టిన యువకుని సెక్యురిటీ గార్డ్ వెంటబెట్టుకు వచ్చాడు.

“అడుగో వాడే మా అల్లుడు, మాటల్లోనే వచ్చాడు. అయ్యా, మావాడేలే నువ్వు వెళ్ళు” అని సెక్యూరిటీ గార్డుని పంపించాడు రామయ్య.

“అయ్య గుమాస్తా గారు, నే చెప్పింది వీడి గురించే. వ్యవసాయం తప్ప బొత్తిగా లోకజ్ఞానం లేనోడు, నా బావమరిదే కనుక నా భార్యపోయాక ఉన్న ఒక్క కూతురుని ఈడికి కట్టబెట్టి నే ఈడ పని చేసుకు బ్రతుకుతున్నా” అన్నాడు రామయ్య.

“ఏం పేరు నీది?” అన్నాడు గుమాస్తా.

“అయ్యా శివయ్య. అంతా శివుడు అని పిలుస్తారు” అన్నాడు వినయంగా.

“బుధ్ధిమంతుడే. జాగ్రత్త. ఎల్లుండి సమావేశానికి పెద్దవాళ్ళంతా వస్తారు. కాస్త మంచి బట్టలు వేసుకోమను మీవాడిని. మరో వారంలో అయ్యగారి అమ్మాయి తన స్నేహితురాళ్ళతో ఇక్కడ గడపడానికి వస్తున్నారంట, అంతా పెద్దింటి వాళ్ళు. బంగ్లాలోని రూమ్‌లు అన్ని అద్దంలాగా పరిశుభ్రంగా ఉండాలి. నాకు ఎటువంటి మాట రాకూడదు. సరే వెళ్ళండి. నాకు చాలా పని ఉంది” అన్నాడు గుమాస్తా.

తన అల్లుడితో బంగ్లాలోనికి వెళ్ళాడు రామయ్య.

ఆ బంగ్లాలోని మూడు అంతస్తుల్లోని పన్నెండు గదులు శుభ్రపరిచారు, అన్ని డోర్ కర్టన్స్ మార్చి, ప్రతి గదిలోనూ రూమ్ పర్‌ప్యూమ్ స్ప్రే చేసారు రామయ్య శివయ్యలు.

రెండో రోజు రాజకీయ నాయకుల సమావేశానికి వచ్చిన వారందరికి ఆహారం పొట్లాల రూపంలో ఏర్పాటు చేసారు. ముఖ్యమైనవారు డైనింగ్ టేబుల్‌పై తమ ఆహారం తినసాగారు. కరెంటు కోత కారణంగా అప్పుడే కరంటు పోయింది. ఆ బంగ్లా గురించి అందరికి తెలుసు కాబట్టి భయంతో మౌనంగా ఉన్నారు. ఇంతలో ఎవరో స్త్రీ కిలకిలా నవ్వడం, పరిగెడుతుండగా కాలి పట్టాల సవ్వడి సున్నితంగా స్పష్టంగా అందరికి వినిపించింది. ఇంతలో జనరేటర్ ఆన్ కావడంతో బంగ్లాలోని లైట్లని వెలిగాయి. ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు సగంమంది చెప్పకుండానే అక్కడనుండి బైట పడ్డారు. మరో అరగంటలో వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోగా రామయ్య, శివయ్య, వంటలమ్మ దంపతులు మిగిలిన ఆరు ఆహారపొట్లాలు తమ ముందు పెట్టుకు తినసాగారు. కరెంటు లేని సమయంలో ఆ బంగ్లాలో జరిగిన సంఘటన తమ మిత్రులకు ఫోన్ల ద్వారా తెలియజేసారు రాజకీయ పార్టీ కార్యకర్తలు. నిమిషాలలో ఆ వార్త వేలమందికి తెలిసిపోయింది. నిజం చెప్పులు వేసుకునే లోపే అబధ్ధం ఊరు చుట్టివస్తుందంటే ఇదే!

మరుదినం రామయ్య శివయ్యతో “అల్లుడూ రాత్రి విన్నావుగా  ఈ బంగ్లాలో విచిత్ర శబ్ధాలు, ఆడోళ్ళ నవ్వులు, కాలి గజ్జల శబ్ధాలు వంటి వింత ధ్వనులు వినిపిస్తాయి. నువ్వు భయపడక, వాటి వలన మనకు ఎటువంటి ఆపదా లేనప్పుడు వాటిని మనం పట్టించుకోనవసరం లేదు” అని అన్నిజాగ్రత్తలు చెప్పి, వంటలమ్మ తోటమాలీలకు తన అల్లుడిని బాగా చూసుకోమని చెప్పి తను ఊరు వెళ్ళాడు.

రాత్రికి భోజనం తరువాత  శివయ్య బంగ్లా ముఖద్వారం తలుపులు వేసి హాలులో ఫేన్ కింద పక్కబట్టలు పరుచుకుని పండుకున్నాడు.

రాత్రి పదకొండు గంటల సమయంలో ఎవరో స్త్రీ కిలకిల తక్కువ స్వరంతో నవ్వడంతో శివయ్యకు మెలకువ వచ్చింది. తన వెనుక భాగాన కాలి వెండి గజ్జల సవ్వడి మృదువుగా వినిపించడంతో, చివ్వున వెనుతిరిగాడు శివయ్య. అక్కడ ఎవ్వరూ లేరు. ఇంతలో పోర్టికోలో కారు హారన్ వినిపించడంతో పరుగులాంటి నడకతో వెళ్ళి పోర్టికోలో లైట్లు వేస్తూ ముఖద్వారం తీసాడు, రివ్వున దూసుకు వచ్చి శివయ్యను తాకింది చల్లగాలి.

పోర్టికోలోని దృశ్యం చూస్తూ ఆశ్చర్యపోయాడు. అక్కడ కారు లేదు. కారు హారన్ ఎలా తనకు వినిపించిందో అర్థం కాలేదు శివయ్యకు.

దూరంగా నక్కలు ఊళ వేస్తున్నాయి పంటపొలాలలోనుండి. అతని వెనక ఉన్న హాలులో కిలకిల నవ్వులు మరోమారు వినిపించాయి. తలుపులు వేసి గడియపెట్టి వచ్చి తన పక్కబట్టలపై వాలాడు. చల్లగాలి కోసం కిటికీ తలుపులు తీసి ఉంచిన శివయ్యకు తమ బంగ్లాకు ఉన్న ప్రహరి చేరువలో నక్కలు ఊళవేయడం వినిపించ సాగింది. అప్పటి వరకు శివయ్య ప్రతి కదలిక రహస్య కెమేరాల ద్వారా రికార్డింగ్ జరిగిందన్న విషయం తెలియని శివయ్య గుర్రు పెడుతూ కాళ్ళ నుండి తల వరకు దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.

ఇంతలో మరలా కారు హారన్‌తో పాటు, కాలింగ్ బెల్ మోగడంతో పరుగు పరుగున వెళ్ళి తలుపుతీసాడు శివయ్య. తన యజమాని సాగర్ గారితో మరో ఇద్దరు వ్యక్తులతో రావడంతో చూసి గౌరవంగా నమస్కరించి పక్కకు ఒదిగి నిలబడ్డాడు శివయ్య.

చేతిలోని అట్టపెట్టెలతో ఆ వ్యక్తులు సాగర్‌ను అనుసరిస్తూ బంగ్లా పైభాగానికి వెళ్ళిపోయారు.

తలుపులు మూసి నిద్రకు ఉపక్రమించాడు శివయ్య.

తెల్లవారు ఝూమున రాత్రి సాగర్ గారితో వచ్చిన ఓ వ్యక్తి శివయ్యను తట్టి లేపి “తలుపులు వేసుకో” అన్నాడు. తన యజమాని ఇలా రాత్రులు రావడం పరిపాటే అని రామయ్య చెప్పడం వలన శివయ్య తలుపులు మూసి మరలా పడుకున్నాడు.

మరుదినం ఉదయం అల్పహారం తిన్నశివయ్యను పిలిచిన గుమాస్తా “అమ్మాయి గారు భువన తన స్నేహితురాళ్ళతో రేపు ఆదివారం వస్తున్నారు. రెండు రోజులు తమ స్నేహితురాళ్ళతో ఇక్కడ ఉంటారట. వాళ్ళతో వినయంగా మసులుకో” అన్నాడు.

“అయ్యా మీ అమ్మాయి గారా అండి” అన్నాడు శివయ్య.

“ఓరి మోద్దు స్వరూపమా, మా అమ్మయికి ఇక్కడ ఏం పనిరా? అమాయకుడా. మన యజమాని సాగర్ బాబు గారి కుమార్తె డాక్టర్ భువన. అర్థమయిందా?” అన్నాడు గుమాస్తా.

“ఒహో డాక్టర్ అమ్మగారా, అయ్యా అట్లాగే, చాన్నాళ్ళుగా నాకు చెవిలో నొప్పి వస్తుంది. చూపిచ్చుకుంటా లెండి” అన్నాడు శివయ్య.

‘ఒరేవ్ ఇలాంటి తలతిక్క మాటలు అమ్మాయి గారి దగ్గర మాట్లాడబోక”

గుమాస్తా వెళ్ళిన తరువాత, బంగ్లాకు దిగువ భాగాన ఉన్న కిటికీలు అన్ని శుభ్రపరస్తు, అక్కడ ఉన్న ప్లాస్టిక్ సంచులు, కాగితాలు ఏరి  తన వద్దనున్న బుట్టలో వేస్తున్న శివయ్యకు బంగ్లా వెనుక భాగాన ఉన్న కిటికీలు శుభ్రపరుస్తుండగా నేలపై కొన్ని పక్షి ఈకలు వ్యత్యాసంగా కనిపించాయి. వాటిని కూడా బుట్టలో వేసుకుని అన్నికిటికీలు శుభ్రపరచి భోజన సమయం కావడంతో వంటమనిషి ఇంటికి వెళ్ళాడు.

శివయ్యకు బంగ్లా వెనుక భాగాన దొరికిన పక్షి ఈకలు ఆఫ్రికా ఖండంలో విహరించే గద్ద జాతికి చెందినవి. 10-15 కిలోల బరువు గొర్రెపిల్లను తమ కాళ్ళతో పట్టి తేలికగా మోసుకు వెళ్ళగలవు. అటువంటి ఈ పక్షి ఈకలు తమ బంగ్లా ప్రహరిలో ఎలా వచ్చాయో  అని ఆలోచిస్తూ, బహుశా పక్కనే ఉన్న తమ యజమాని ఆరు అంతస్తుల బిల్డింగ్‌పై వాలి ఉంటాయి. రెండు ప్రహరి గోడలు కలసి ఉండటం వలన గాలికి తమ బంగ్లాలో ఈకలు పడి ఉంటాయి అనుకుంటూ,  అయినా ఎక్కడో ఆఫ్రికాలో విహరించే పక్షులకు చెన్నయ్ రావడం ఎలా జరిగిందో అని ఆశ్చర్యపోయిన శివయ్య ఆలోచిస్తూ భోజనం చేయసాగాడు.

సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ బంగ్లా యజమాని కుమార్తె తన స్నేహితురాళ్ళతో కలసి మూడు కార్లలో వచ్చింది. గుమాస్తా పరుగు పరుగున పోర్టికోలోనికి వచ్చాడు. “అమ్మగారు మన రామయ్య ఊరు వెళుతూ తన అల్లుడిని ఇక్కడ పనిలో ఉంచాడు. పేరు శివయ్య” అన్నాడు.

వినయంగా నమస్కరించి తలగుడ్డను నడుముకు చుట్టుకుని వినయంగా నిలబడ్డాడు శివయ్య.

‘శివయ్య నిన్ను గతంలో ఎక్కడో చూసాను, గుర్తుకు రావడంలేదు” అంటూ అతని పాదాలకేసి పరీక్షగా చూస్తూ “సరే లగేజి అంతా ఎవరి ఎవరిదో తెలుసుకుని వారి గదులలో పెట్టండి” అని భువన బంగ్లాలోనికి వెళ్ళింది.

తోటమాలి సహాయంతో వారి లగేజి అంతా వారివారి గదులలో సర్ధాడు శివయ్య.

వంటమనిషి  వచ్చినవారందరికి బిస్కెట్లు, కాఫీలు అందించింది.

భువన వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రాత్రి ఏడు గంటల సమయంలో మెయిన్ గేటు వద్దనుండి ట్రే రిక్షాలో శివయ్య తీసుకువచ్చి హాలులో ఓపక్కగా ఉన్న పెద్ద డైనింగ్ టేబుల్ పై సర్ది, వాటర్ బాటిల్స్ అందరికి అంబాటులో టేబుల్ పై ఉంచాడు. అలాగే ప్రతి కుర్చీ ముందు భాగాన పింగాణి ప్లేట్లు, మిని టవల్స్, అనంతరం కొద్ది దూరంలో ఉన్న వాష్ బేసిన్ వద్ద లిక్విడ్ సోపు, చేతులు తుడుచుకోవడానికి పేపర్స్, టర్కీ టవల్స్, పోర్కు, కత్తి, స్పూన్ అందరికి  ఉందుబాటులో ఉంచాడు.

వాళ్ళంతా భోజనానికి వస్తూనే “శివయ్య నీకు, తోటమాలికి, వంటమనిషికి పీజా, బర్గర్‌లు ఈ పూటకు తెప్పించాను. మేము ఉండే ఈ రెండు రోజులు మాతో పాటే మీకు భోజనం వస్తుంది. కాఫీ, టీలు, బిస్కట్లు మాత్రమే వంటమనిషి తెస్తే చాలు. మీరు మాతో పాటే ఇదే టేబుల్ పై మాతో కలసి భోజనం చేయాలి” అన్నది భువన.

బుద్ధిగా తల ఊపాడు శివయ్య చేతులు కట్టుకుని.

భువన వాళ్ళు కలసి అంతా పీజా, బర్గర్లు తినసాగారు. శివయ్యను, తోటమాలి దంపతులను గమనించసాగింది భువన.

తోటమాలి దంపతులు పీజా, బర్గర్లు తింటూ మొహం చిట్లించగా, శివయ్య సాధారణంగా తినసాగాడు.

అలా రాత్రి డిన్నర్ ముగించి వెళ్ళిన తరువాత  వంటమనిషి, తోటమాలి సహాకారంతో డైనింగ్ టేబుల్ అంతా శుభ్రపరచి, తమకోసం ఉంచిన ఆహారపు పొట్లాలతో ముగ్గురు వంటలమ్మ ఇల్లు చేరారు.

ఆ రాత్రి ఎప్పటిలా మెట్లకింద భాగంలో తను పడుకున్నాడు శివయ్య. ఆ రోజు ఎటువంటి వింత శబ్ధాలు వినిపించలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here