Site icon Sanchika

భూతాల బంగ్లా-13

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[దెయ్యాల బంగ్లాకి వచ్చిన పోలీసులు అందర్నీ విచారించి, దొంగతనానికి వచ్చిన మారిముత్తు తాగిన మైకంలో బంగ్లా పై నుండి పడడంతో మరణించారని కేసు మూసేస్తారు. తోడు దొంగ సెల్వంను విచారించి వదిలేస్తారు. కానీ ప్రజలు మాత్రం రకరకాలుగా చెప్పుకుంటారు. భూతాల బంగ్లాలో పని చేసే రామయ్య తల్లికి ఒంట్లో బాలేదని ఉత్తరం వస్తుంది. అతను ఊరెళానని గుమాస్తాని అనుమతి అడిగితే, మర్నాడు పార్టీ ఉందని, అప్పటివరకు ఉండమని అంటాడు. తనకు బదులుగా తన అల్లుడు ఉంటాడని చెబుతాడు. రామయ్య అల్లుడు శివయ్య వస్తాటు, అల్లుడికి జాగ్రత్తలు చెప్పి రామయ్య ఊరు వెళ్లిపోతాడు. ఓ రోజు రాత్రి యజమాని సాగర్, చేతిలో అట్టపెట్టెలున్న ఇద్దరు వ్యక్తులతో వస్తాడు. తెల్లవారు జామున వాళ్ళు వెళ్ళిపోతారు. సాగర్ కుమార్తె భువన తన స్నేహితురాళ్ళతో కలసి రెండు రోజులు ఉండడానికి ఆ బంగ్లాకి వస్తుంది. అందరికీ బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది భువన. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]రుదినం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన స్నేహితురాళ్ళతో టీ తాగుతున్నభువన “శివయ్యా, మన బంగ్లా తోటలో సీతాఫలాలు ఉన్నాయా?” అన్నది.

“ఉన్నాయి అమ్మగారు, తీసుకు రమ్మంటారా?” అన్నాడు శివయ్య.

“అవును. ఓ గంట సేపు మేమంతా ఇక్కడ ఉన్న తోట చూసి వస్తాము, ఈలోపు నువ్వు ఫలాలు సిధ్ధం చేయి” అన్నది భువన.

తల ఊపుతూ బుట్టతో బంగ్లా వెనుక భాగాన ప్రహరి గోడ చేరువలోని సీతాఫలాలు చెట్టునే పండినవి సేకరిస్తూన్న శివయ్యకు అక్కడ కొన్ని పక్షి ఈకలు కనిపించాయి.

మరుదినం చెన్నయ్ రెడ్ క్రాస్ సంస్ధ వారికి ఫోన్ చేసి తనకు కావలసిన వివరాలు సేకరించుకుంది భువన. అదే రోజు సాయంత్రం “శివయ్యా అలా గార్డెన్ లోనికి వెళదాం రా” అని దారి తీసింది భువన. ఆమెను అనుసరించాడు శివయ్య.

పౌంటెన్ వద్ద ఉన్న సిమెంటు బల్లపై కూర్చుంటూ “నిజం చెప్పు ఎవరు నువ్వు? నువ్వు పల్లెటూరివాడివే అయితే నీ పాదాలు ఇంత తెల్లగా ఉండవు. సంవత్సరాల తరబడి షూస్ వాడుతూ ఉండేవాళ్ళకే ఆ అవకాశం ఉంది” అన్నది భువన.

“నిజం అమ్మాయి గారు. మా అన్న దుబాయిలో సివిల్ ఇంజనియర్. రకరకాల బూట్లు నాకు పంపేవాడు. ప్రతి మాసం ఇరవై వేలు పంపేవాడు. పదేళ్ళుగా నేను బూట్లే వాడుతున్నా! ఇక్కడ పనికి వస్తా బూబ్లు ఏసుకుని రాకూడదుగా అందుకని..” అన్నాడు శివయ్య.

“కాదు, నీకు గుర్తుందా, మూడు నెలల క్రితం రెడ్ క్రాస్ వారు చెన్నయ్ స్టాన్లి హాస్పటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అప్పుడు నేను మరి కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ వాలంటరీ సర్వీస్ చేయడానికి వచ్చాము. అప్పుడు నువ్వు రక్త దానానికి వచ్చావు. అక్కడ ఉన్న పోలీస్ సూపరింటెండెంట్ నీకు సెల్యూట్ చేయడం నేను చూసాను. ఆ క్యాడర్ వారు తమకన్న పెద్ద హాదాలో ఉన్నవారికి మాత్రమే సెల్యూట్ చేస్తారు. నీకు ఇద్దరు గన్‌మ్యాన్లు ఉండడం కూడా నేను గమనించాను. కనుక నువ్వు శివయ్యవు కావు, నీ పేరు భరత్ అని రెడ్ క్రాస్ వారి ద్వారా వివరాలు సేకరించాను. మీరు చెన్నయ్ వచ్చినప్పటినుండి ప్రతి సంవత్సరం మూడు సార్లు రక్తదానం చేస్తారని తెలిసింది.” అని తన హేండ్ బ్యాగ్ లోని కొత్త సెల్ ఫోన్ తీసి అతనికి చేతికి ఇస్తూ ఇందులో “నా ఫోన్ నెంబర్ ఉంది. నేను మీతో కలసి జీవించాలి అనుకుంటున్నాను. ఇష్టమైతే ఈ ఫోన్ స్వీకరించండి” అన్నది భువన.

ఆమె ఇచ్చే సెల్ ఫోన్ అందుకుని “భువనా నేను ఫార్మా రంగంలో పి.జి. చేసాను. యూనివర్శిటీలో గోల్డు మెడల్ అందుకున్నాను. నాకు నా అనేవారు లేరు. నేను అనాథ ఆశ్రమంలో ఉంటూ చదువుకున్నాను. కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారిగా నేను ఒక కేసు పరిశోధిస్తూ ప్రాణాపాయ స్ధితిలో ఇక్కడ నేను మారు పేరుతో ఉన్నాను. నా పి.హెచ్.డి కూడా మాదక ద్రవ్యాలపైనే జరిగింది. నువ్వంటే నాకు ఇష్టమే, అడగకుండా వరాలు ఇచ్చే దేవతే భువికి వచ్చి నా ముందు ఉంటే కాదనేది ఏముంటుంది? కాని నేను ఇక్కడ ఈ పేరున ఎందుకున్నానో చెప్పడానికి కొంత సమయం కావాలి. నన్ను ఇక్కడ ఈ విధంగా చూసినట్లు ఎవ్వరితోనూ అనకండి. నా ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది” అన్నాడు శివయ్య పేరుతో ఉన్న భరత్.

“అలాగే, ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది, ఇప్పుడే కాదు, ముందు జీవితంలో ఎన్నడు మీకు ఇష్టంలేని పనులతో ఇబ్బంది పెట్టను లెండి” అన్నది భువన.

ఆమె సరసన సిమెంటు బల్లపై కూర్చుంటూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు భరత్. సిగ్గుతో తొట్రుపడుతూ బంగళా లోనికి పరుగు వంటి నడకతో వెళ్ళింది భువన.

భువన వాళ్ళు ఉన్నన్ని రోజులు రాత్రులు ఎటువంటి వింత శబ్ధాలు వినిపించక పోవడం శివయ్య గమనించాడు.

మరుదినం భువన వెళుతూ తోటమాలి దంపతులకు తలా రెండు వేల రూపాయలు ఇచ్చి వెళ్ళింది.

***

రెండు రోజుల అనంతరం ఏర్పడిన తుఫాన్ వలన చెన్నయ్ నగరంలో అల్లాడిపోసాగింది. సునామి హెచ్చరికతో ఆరాత్రి తోటమాలి, వంటలమ్మ, సెక్యూరిటీ గార్డుతో పాటు శివయ్య బంగళా పై అంతస్తుకు చేరుకున్నారు.

గదిలో వెచ్చగా ఉండటంతో అంతా నిద్రపోయారు.

వర్షంతో ముంచెత్తింది. చెన్నయ్ నగరంలో కరంటు నిలిచిపోయింది. దెయ్యాల బంగ్లాలో జనరేటర్ సాంకేతిక లోపంతో ఆగి పోయింది.

శివయ్య తన ట్రంకు పెట్టె రహస్య అరలో దాచిన – చూపరులకు మాములుగా టార్చిలైట్‌లా కనిపించే దాన్ని తీసుకుని – (లేజర్ టార్చిలైట్ ప్రత్యేకమైన కళ్ళద్దాలు ధరించిన వారికి మాత్రమే టార్చిలైట్ వెలుగు కనిపిస్తుంది) – అత్యంత శక్తివంతమైన మినీ వీడియో కెమెరాతో బంగ్లా పైబాగాన ఉన్న ప్రత్యేకమైన పెద్ద గది తాళం మారు చెవితో తీసి గదిలోనికి వెళ్ళి లేజర్ టార్చి సహాయంతో ఆ గదిలోని వస్తువులు చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ టేబుల్ పై సముద్ర దిశగా పెద్ద లేజర్ మిషన్ బిగింపబడి ఉంది. వెనువెంటనే సీలింగ్ ఫ్యాన్ పైన ఉండే డోమ్ (కెనాఫిల్) లో అతి శక్కివంతమైన మినీ వీడియో కెమెరా ఆ గదినంతా చూపే విధంగా (ఇది ఆటోమేటిక్ సెన్సర్ల ద్వారా ఆ గదిలో ఎవరైనా ఉండి కదులుతుంటేనే రికార్డు అవుతుంది.) దాని ద్వారా చిత్రీకరించబడిన దృశ్యాలు తమ కార్యాలయానికి చేరేలా ఏర్పాటు చేసి, ఎప్పటిలా గదికి తాళం పెట్టి కిందికి వచ్చి తన చేతిలోని టార్చిలైట్ ఎప్పటిలా ట్రంకుపెట్టె రహస్య అరలో భద్రపరచి తోటమాలి పక్కనే నిద్రకు ఉపక్రమించాడు.

తెల్లవారుతూనే వర్షం బాగా తగ్గింది. కరెంటు వచ్చింది. ఆ రోజు రాత్రి సాగర్ తన మనుషులతో రావడం, తెల్లవారు ఝూమున ఎప్పటిలా అట్టపెట్టెలు కారు డిక్కిలో పెట్టుకు వెళ్ళడం గమనించాడు శివయ్య.

సాగర్ తన మనుషులతో ఆ గదిలో రాత్రి సమయంలో చేయించిన ప్రతి పని, శివయ్య సీలింగ్ ప్యాన్‌లో పెట్టిన వీడియో కెమెరా అంతా రికార్డింగ్ చేస్తూ, శివయ్య సెట్ చేసిన విధంగా ఇతర ప్రాంతాలకు ఈ వీడియోను ప్రసారం చేసింది.

***

దెయ్యాల బంగ్లాను, సాగర్ వ్యాపార సంస్ధలకు పోలీసుల సహాకారంతో మాదకద్రవ్య అధికారులు సీల్ వేసారు. సాగర్ దెయ్యాల బంగ్లాలోని పై అంతస్తు గదిలో తన లైసెన్స్ రివాల్వార్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరుదినం ప్రెస్ మీట్‌లో మీడియావారి ముందు స్ధానిక ఉన్నత పోలీసు అధికార్లతో సమావేశమై ఈ కేసుకు సంభంధించిన విషయాలు భరత్ తెలియజేస్తూ..

“ఈ మత్తు పదార్ధాల కేసు గురించి తెలుసుకునే ముందు మనం కొంత మత్తు పదార్థాల గురించి తెలుసుకుందాం!

కాగితాలు ఏరుకునే వారి నుండి ఖరీదైన కార్లలో తిరిగే 14 ఏళ్ళ నుండి 70 ఏళ్ళ వారివరకు ఈ మత్తు పదార్ధాల బారిన పడుతున్నారు.

ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే లభ్యమయ్యే ఖరీదైన ‘మత్తు’గా ఉన్న డ్రగ్స్‌.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ, ఐటీ సెక్టార్‌ మొదలు.. మధ్యతరగతి ప్రజలు, చివరికి స్కూలు విద్యార్థులనూ ఉచ్చులోకి లాగుతోంది. నైజీరియా లాంటి ఆఫ్రికా దేశాలు, ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే కొకైన్‌, చరాస్‌ మత్తుపదార్థాలు ఇప్పుడు లోకల్‌గానే లభిస్తున్నాయి. గోవా, జమ్మూకశ్మీర్‌ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఖరీదైన డ్రగ్స్‌ చేరుతున్నాయి.

పదిహేనేళ్ల క్రితం వరకు చిన్నాచితకా గంజాయి కేసులు నమోదయ్యే హైదరాబాద్‌లో ఇప్పుడు ఎండీఎంఏ బ్లోట్స్‌ కేసులూ రిజిస్టర్‌ అవుతున్నాయి. తొలినాళ్లలో డగ్స్‌ కేసంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు స్థానికులే డ్రగ్స్‌ తయారు చేస్తున్నారు.. దిగుమతి చేసుకుంటున్నారు.. అమ్ముతున్నారు.. వాడుతున్నారు. డ్రగ్స్‌ వినియోగంలో గోవా, ఢిల్లీ నగరాల తర్వాత.. హైదరాబాద్‌ మూడో స్థానానికి చేరుకుంది.

మూడేళ్ల క్రితం కెల్విన్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్టు తర్వాత.. పెద్ద సంఖ్యలో సినీ నటులను ఎక్సైజ్‌ పోలీసులు విచారించారు. అయితే ఆ కేసులో సినీ ప్రముఖులను బాధితులుగానే పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో, ఐటీ సెక్టార్‌లో, చివరికి మధ్యతరగతి, స్కూలు విద్యార్థుల పార్టీల్లో కూడా డ్రగ్స్‌ భాగమవుతున్నాయి. పండుగలు, పుట్టినరోజు పర్వదినాలు, ఈవెంట్లు, కొత్త సంవత్సర వేడుకలు, పబ్‌లు, కాలేజ్‌ పార్టీలు, బార్‌లు, రిసార్టులు, ఫామ్‌హౌ్‌సలలో జరిగే పార్టీల్లో డ్రగ్స్‌ ప్రధాన భూమిక పోషిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పార్టీల్లో డ్రగ్స్‌ ఇప్పుడు నయా ట్రెండ్‌ అని తెలుస్తోంది.

ఖరీదైన డ్రగ్స్‌ అన్నీ గోవా, జమ్మూకశ్మీర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాయి. డ్రగ్స్‌కు అలవాటు పడి కొందరు.. అధిక సంపాదన కోసం మరికొందరు గోవా నుంచి మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి కొకైన్‌, హెరాయిన్‌, చరాస్‌, ఎండీఎంఏ బ్లోట్స్‌, ఓపియం, ఎఫెడ్రోన్‌, ఎల్‌ఎ్‌సఏ స్ట్రిప్స్‌, ఎల్‌ఎ్‌సడీ బ్లోట్స్‌ నగరానికి వస్తున్నాయి. దీంతో ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్‌.. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులకూ అందుబాటులో ఉంటున్నాయి.

డ్రగ్స్‌ (మాదక ద్రవ్యాలు).. ఉత్తేజాన్ని ఇస్తూనే ప్రాణాలు తీసే మహమ్మారి. సరదా కోసం, కిక్కు కోసం డ్రగ్స్‌ తీసుకోవడం మొదలెడతారు కొందరు. అది రానురానూ వ్యసనమైపోతుంది. ఆరోగ్యాన్నే కాదు జీవితాన్నీ దెబ్బతీస్తుంది. డ్రగ్స్‌కు ఎలా అలవాటు పడతారు? ఈ వ్యసనం నుంచి ఎంత బయటపడాలనుకున్నా ఎందుకు సాధ్యం కాదు? చికిత్స పరమైన సవాళ్లు ఏమిటీ? ఈ విషయాలు తెలుసుకుందాం..

తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని తెలిసినా కూడా డ్రగ్స్‌ తీసుకోవడాన్ని ఒక అలవాటుగా కొనసాగించడమే డ్రగ్స్‌ అడిక్షన్‌. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల డ్రగ్స్‌ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.

డ్రగ్స్‌ ఎందుకు తీసుకుంటారు?

డ్రగ్స్‌ మెదడులోని డోపమైన్‌ అనే రసాయనం విడుదలను పెంచి కొండంత ఉత్తేజాన్ని ఇస్తాయి. మనందరిలోనూ ఉత్తేజానికి కారణమయ్యే న్యూరోట్రాన్స్‌మీటర్‌ డోపమైన్‌ సాధారణంగా వంద శాతం ఉంటుంది. అదే మీరు కడుపారా భోజనం చేసినప్పుడు లేదా నచ్చిన సినిమా చూసినప్పుడు డోపమైన్‌ 150 శాతానికి చేరుతుంది. అదే సెక్స్‌లో పాల్గొనప్పుడు 200 శాతంగా ఉంటుంది. అలానే డ్రగ్స్‌ వాడకం కూడా డోపమైన్‌ శాతాన్ని ఒక్కసారిగా పెంచుతుంది. ఉదాహరణకు ఆల్కహాల్‌ తీసుకుంటే 250 శాతం, కొకైన్‌ వాడితే 300 నుంచి డోపమైన్‌ 400 శాతానికి చేరుతుంది. మెదడులో ఉండే ఉత్తేజాన్ని కలిగించే వ్యవస్థ పనితీరు డ్రగ్స్‌ వల్ల పది రెట్లు పెరుగుతుంది. అందుకే డ్రగ్స్‌ తీసుకోవాలనుకుంటారు చాలామంది.

ఉత్తేజాన్ని ఇస్తాయి కదా! మరి సమస్య ఏంటీ?

మొదటిసారి డ్రగ్స్‌ తీసుకున్నవారు పాజిటివ్‌ ఎఫెక్ట్‌కు లోనవుతారు. ఎప్పుడో ఒకసారి తప్ప డ్రగ్స్‌ తీసుకోవద్దని అనకుంటారు. అయితే జరిగేదేమిటంటే చాలా వరకు మత్తుపదార్థాలు శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపుతాయి. దీంతో రోజులు గడిచే కొదీ ఉత్తేజం కోసం కాకుండా సాధారణంగా ఉండేందుకు డ్రగ్స్‌ తీసుకుంటారు. వాటి వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ‘డ్రగ్స్‌ తెచ్చుకోవాలి. వాడాలి’, ఇదొక్కటే ఆలోచనగా ఉంటుంది. భారతదేశంలో ఆల్కహాల్‌, నికోటిన్‌ వాడకం చాలా ఎక్కువ. ఇన్‌హేలెంట్స్‌ ద్వారా డ్రగ్స్‌ వాడేవారు చాలామంది ఉన్నారు.

మానడం కష్టమా?

మొదట్లో డ్రగ్స్‌ తీసుకోవడం అనేది పూర్తిగా సొంత నిర్ణయంతోనే జరుగుతుంది. అయితే ఒకసారి డ్రగ్స్‌ వాడడం అలవాటుగా మారాక మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. డ్రగ్స్‌ ఆపేస్తే వారు ఇక ఏ పని మీద దృష్టి పెట్టలేరు. మెదడు ఇచ్చే ఆదేశాల్లో మార్పు రావడంతో నిర్ణయం తీసుకోవడం, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు డ్రగ్స్‌ను నిత్యం తీసుకుంటూనే ఉంటారు.

ఏదైనా చికిత్స ఉందా!

డ్రగ్స్‌ తీసుకోవడం మాన్పించి, వారు తిరిగి మునుపటి జీవితం గడిపేలా చేసేందుకు పరిశోధన ఆధారిత పద్ధతులు, అధ్యయనాలు ఉపయోగపడతాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల మాదిరిగా డ్రగ్స్‌కు బానిసలైన వారికి కూడా చికిత్స అందించవచ్చు. కోలుకొనేలా చేయవచ్చు. అయితే దీనికి పూర్తిస్థాయి చికిత్స లేదు. కానీ అందుబాటులో ఉన్న చికిత్సను కొనసాగించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు.

చికిత్సలో ఎదురయ్యే సవాళ్ళు

డ్రగ్స్‌కు అలవాటుపడిన వాళ్లు సామాజికంగా, వృత్తిపరంగా, చట్టపరంగా ఎదురయ్యే ఒత్తిళ్ళతో పాటు తమకు తాము ఏర్పరచుకున్న అభిప్రాయం వల్ల ఎంతో వేదనకు లోనవుతారు. చికిత్సలో సవాల్‌ విసేరే సమస్య ఏమిటంటే డ్రగ్స్‌కు బానిసలైన వారిని పరీక్షించి, చికిత్స అందించే ‘అడిక్షన్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌లు’ 5 వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వీరి కొరత చాలా ఉంది.

మత్తు పదార్థం.. వివరణ

కొకైన్‌: కోకా మొక్క నుంచి తయారు చేస్తారు. తెల్లని పౌడర్‌ రూపంలో ఉంటుంది.

ఓపియం: గసగసాల మొక్క నుంచి తయారు చేస్తారు. దీన్నే నల్లమందు అని పిలుస్తారు

హెరాయిన్‌: ఇది కూడా కొకైన్‌ మాదిరిగా ఉంటుంది. మెదడు, గుండెపై ప్రభావాన్ని చూపుతుంది

ఎల్‌ఎస్‌డీ: దీన్ని లైసర్జిక్‌ యాసిడ్‌ డైథైలామైడ్‌ అంటారు. బ్లోట్స్‌, స్ట్రిప్స్‌ రూపంలో లభిస్తుంది.

ఎండీఎంఏ: మిథైల్‌ ఎనిడియోక్సీ మెథాంఫేటమిన్‌ అని అంటారు. ఇది కూడా బ్లోట్స్‌ రూపంలో లభిస్తుంది.

చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది డ్రగ్స్‌ తీసుకుంటారు. అయితే వారందరికీ మాదక ద్రవ్యాల వ్యసనం లేదు. పరిశ్రమలో చాలా మంది పరిస్థితుల ప్రభావంతో డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారన్నారు. ఎందుకు ట్రై చేయకూడదనే ఉద్దేశంతో డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. డ్రగ్స్‌ వల్ల యాక్టివ్‌గా ఉంటామని అనుకుంటారు.

ముందుగానే గుర్తిస్తే కాపాడవచ్చు

తమ పిల్లలు చెడు వ్యసనాల బారిన పడరనే అతివిశ్వాసాన్ని తల్లిదండ్రులు ప్రదర్శించకూడదు. అనుమానం వస్తే.. కొట్టడం, తిట్టడం, నిలదీయడం చేయకూడదు. ప్రొఫెషనల్స్‌ సహాయం తీసుకోవాలి. డ్రగ్స్‌ తీసుకునేవారి ప్రవర్తనలో క్రమంగా మార్పులు వస్తాయి. ముందుగానే గమనిస్తే.. డీ-ఎడిక్షన్‌ సెంటర్ల సాయం తీసుకోవచ్చు. వారిని కాపాడవచ్చు. తల్లిదండ్రులు, టీచర్లే తమ పిల్లల ప్రవర్తన గమనించాలి.

ఈ కేసుల్లో ఎక్కువగా మద్యానికి బానిసవ్వడం, గంజాయి, నిద్ర మాత్రలు, దగ్గు మందు సేవించడం వంటివే ఉంటున్నాయి. స్కూలు పిల్లలు ఎక్కువగా సాల్వెంట్లు, ఫెవీబాండ్స్‌, వైట్‌నర్‌లకు బానిసవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లే వారిని కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్‌ తీసుకునేవారి ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. క్లాసులు ఎగ్గొట్టడం, పనితీరులో తేడాలు, ఊరికే చికాకు పడుతుండడం, ఇంట్లో అబద్ధాలు చెబుతూ డబ్బులు తీసుకోవడం, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే.. వారి చేతికి డబ్బు అందగానే హుషారుగా మారిపోతారు” అంటూ ఆపాడు.

(సశేషం)

Exit mobile version