Site icon Sanchika

భూతాల బంగ్లా-2

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[చెన్నయి శివారు ప్రాంతంలోని అమ్జికరై సమీపంలో ఓ పాడుబడిన భవనంలో దెయ్యాలున్నాయని జనాలు చెప్పుకుంటూంటారు. చీకటి పడితే అటు వైపు వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. ఒక రాత్రి ఒక పెళ్ళి బృందంలోని నలుగురు తమ టూవీలర్లపైన ఆ మార్గంలో వెడుతుండగా, భూతాల బంగ్లా దగ్గరికి వచ్చేసరికి రోడ్డు మీద దెయ్యం లాంటి ఆకారం కనబడడంతో బెదిరిపోయి పారిపోతారు. విదేశాల నుంచి వచ్చిన రాజేంద్ర యువకుడు ఈ దెయ్యాల సంగతి తేలుస్తానని మిత్రులతో చెప్పి, రాత్రివేళ అక్కడికి వెడతాడు. అయితే అత్యంత దారుణంగా చంపబడతాడు. చెన్నయ్ నగరంలో పేరు మోసిన మానసిక వైద్యుడు శంకరలింగం వద్దకు తన కొడుకు రవిని తీసుకువస్తాడు మోహనరావు. భయాలు, వాటి లోని రకాలను వివరించి, రవికి మందులు రాసిస్తాడాయన. ఇక చదవండి.]

[dropcap]చె[/dropcap]న్నయ్ నగరం లోని టి.నగర్ (త్యాగరాయ నగర్) లోని పానగల్ పార్కు, సాయంత్రం నాలుగు గంటలు కావస్తుంది. ముగ్గురు యువకులు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఓ వ్యక్తి సరిగ్గా నాలుగు గంటలకు పార్కులోనికి రావడం, వీరికి ఉచితంగా బ్లూ సిగరెట్స్ (హ్యాష్ ఆయిల్ కలపబడింది) ఇవ్వడం జరుగుతుంది. ఆ సిగరెట్టు కాల్చిన వీరు దాదాపు రెండు గంటలు మైకంలో ఉండటం జరుగుతుంది. ఆ వ్యక్తి వస్తూనే తన వద్దనున్న సిగరెట్స్ తలా ఒకటి ఇస్తూ “సారీ ప్రెండ్స్ నేను ఊరు వెళుతున్నా మీ ఫోన్ నెంబర్లు, మీ పేర్లు ఇవ్వండి. మిమ్మల్ని ఓక వాట్సప్ గ్రూపులో చేరుస్తాను. మీకు ఎన్ని సిగరెట్లు కావాలన్నా వాళ్ళు సప్లై చేసారు. కాకుంటే కొద్దిగా డబ్బులు తీసుకుంటారు.” అని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకు వెళ్లాడు ఆ వ్యక్తి.

అలా ఆ ముగ్గురు యువకుల ద్వారా మరో ముప్ఫై మంది, వారి ద్వారా మరికొందరు తమకు తెలియకుండానే ఈ మత్తు పదార్థాల సాలెగూట్లో దేశం అంతటా లక్షలాది మంది ఇలా చిక్కుకు పోతున్నారు.

మాదక ద్రవ్యాలపై తన దిగువున పనిచేస్తున్న వారితో భరత్ అనే యువ ఉన్నతాధికారి మాట్లాడుతూ….  “సహచరులారా మన ఈ సమావేశం రెండు ఆదివారాలు సాగుతుంది. ఇందులో మత్తు పదార్ధాలపై మీకు అవగాహన కలిగించే విషయాలు చెప్పబోతున్నాను. మనది కాని సంస్కృతీ వ్యామోహంలో టూర్లు, పబ్బులు, రేవ్ పార్టీలు పేరిట నాగరీకం పేరున అనాగరీకులుగా మారిపోతుంది యువత.

దేనికి అయినా మనం తొందరగా అలవాటు పడతాము కానీ ఆ అలవాటు నుండి బైటపడటం మత్తుపదార్థాల విషయంలో అంత సులభం కాదు.

మాదక ద్రవ్యాల వాడకం వేలాది సంవత్సరాలుగా మనుషులకు తెలుసు. ఆదిమ మతాలకు చెందిన వారు మాదకతను కలిగించే గంజాయి వంటి ఆకులను, ఆకుల పసర్లను, కొన్ని రకాల మొక్కల నుంచి దొరికే గింజలను వాడేవాళ్లు. వీటిని వాడితే విచిత్రమైన తన్మయావస్థ, లేనిపోని భ్రాంతులు కలుగుతాయి. ఆదిమ మతాలకు చెందిన వారు ఇలాంటి అనుభూతినే దివ్యానుభూతిగా, ఇదంతా దైవానికి సన్నిహితం చేసే ప్రక్రియగా అపోహ పడేవారు.

పాతరాతి యుగంలోనే – అంటే, దాదాపు అరవైవేల ఏళ్ల కిందటే మనుషులు మత్తును మరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నాటికి ఈజిప్టు, భారత్‌ ప్రాంతాల్లో మత్తునిచ్చే సోమరసం, దాదాపు అలాంటిదే అయిన ‘హవోమా’ వంటి మాదక పానీయాలను మతపరమైన వేడుకల్లో ‘దివ్యానుభూతి’ కోసం విరివిగా వాడేవారు.

క్రీస్తు పూర్వం 2700 నాటికి మనుషులు గంజాయిని కనుగొన్నారు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా దొరికేది. గంజాయి ఆకులను ఎండబెట్టి, మట్టితో తయారు చేసిన చిలుంలో వేసి, వాటిని కాల్చి, దాని పొగను పీల్చేవారు. ఈజిప్టు, పర్షియా, ఆఫ్రికా, భారత ఉపఖండం, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఆ కాలంలోనే గంజాయి వాడకం ఉండేది. భారత ఉపఖండంలోనైతే, గంజాయి పొగ పీల్చడంతో పాటు, పచ్చి గంజాయి ఆకులను నూరి  తయారు చేసిన ‘భంగు’ను పానీయాల్లో కలిపి సేవించే పద్ధతి కూడా ఉంది. గంజాయిని కనుగొన్న కాలంలోనే ఉమ్మెత్త మొక్కల వేర్లను, ‘రుబార్బ్‌’ మొక్కల వేర్లను కూడా మాదకద్రవ్యాలుగా వాడటం మొదలైంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికి నల్లమందు వాడకం మొదలైంది. క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో కోకా ఆకులను మాదకద్రవ్యంగా కనుగొన్నారు. కోకా ఆకుల నుంచే ‘కొకైన్‌’ తయారు చేస్తారు. చాలావరకు ఆధునిక మాదక ద్రవ్యాలకు ప్రాచీన కాలంలోనే కనుగొన్న గంజాయి, నల్లమందు, ఉమ్మెత్త వంటి మొక్కలే మూలం.

డ్రగ్స్‌లో కొన్నింటిని ముక్కుతో పీలుస్తారు. కొన్నింటిని సిగరెట్‌ లేదా చిలుంలో నింపుకుని పొగలా తాగుతారు. కొన్నింటిని శీతలపానీయాలు లేదా మద్యంలో చల్లుకుని, తాగుతారు. ఇవి కాకుండా మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో దొరికే మాదకద్రవ్యాలూ ఉన్నాయి. వైద్యచికిత్స ప్రయోజనాల కోసం ఉపయోగించే కొన్ని మాత్రలు, ఇంజెక్షన్లను కొందరు మత్తులో మునిగితేలడం కోసం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. గంజాయి, నల్లమందుతో పాటు కొకైన్, మార్ఫిన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌ సుగర్, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ–మెథాంఫెటామైన్‌) వంటి డ్రగ్స్‌ ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుకలో ఉన్నాయి. వీటిపై ఎన్ని ఆంక్షలు, నిషేధాలు ఉన్నా ఇవి అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నాయి. మన దేశంలోనూ ఇవి తరచుగా పోలీసు దాడుల్లో పట్టుబడుతూనే ఉన్నాయి.

నొప్పి నివారిణులుగా మాదకద్రవ్యాలు:

వైద్యశాస్త్రం ఆధునికతను సంతరించుకున్న తొలినాళ్లలో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్‌ వంటి మాదక ద్రవ్యాలను నొప్పి నివారిణులుగా వాడేవారు. వీటిని వైద్యులే రోగులకు సూచించేవారు. అప్పటి పత్రికల్లో హెరాయిన్, కొకైన్‌ల ప్రకటనలు కూడా వచ్చేవి. శస్త్రచికిత్సలు జరిగిన రోగులకు, తీవ్రమైన గాయాలకు లోనై ఇన్ఫెక్షన్లు, నొప్పులతో బాధపడేవారికి మార్ఫిన్‌ ఇచ్చేవారు. మార్ఫిన్‌ ఎంతటి నొప్పినైనా మరిపిస్తుంది గాని, నొప్పులు తగ్గినా మార్ఫిన్‌ మాదకతకు రోగులు బానిసైపోతారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు మార్ఫిన్‌ ఇచ్చేవారు. హెరాయిన్, కొకైన్‌లూ దాదాపు ఇదే తీరులో పనిచేస్తాయి. కొన్నాళ్లు వీటిని వాడిన వారు వీటికి బానిసలు కావాల్సిందే. ఆ తర్వాత వాటి నుంచి బయటపడటం దుస్సాధ్యం. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో వైద్యులు చిన్నపాటి పంటి నొప్పుల మొదలుకొని నానా రకాల జబ్బులకు కొకైన్‌ను ఎడాపెడా సూచించేవారు. హెరాయిన్‌ను దగ్గుమందుగా వాడేవారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో సైతం ఆనాటి వైద్యులు విచక్షణారహితంగా వీటిని సూచిస్తూ పోవడంతో లక్షలాదిమంది వీటికి బానిసలుగా మారారు. దాదాపు శతాబ్దకాలం తర్వాత వైద్యులు వీటి దుష్ప్రభావాలను గుర్తించడంతో ప్రభుత్వాలు వీటిపై నిషేధం విధించాయి. నిషేధం తర్వాత పత్రికల్లో వీటి ప్రకటనలైతే నిలిచిపోయాయి గాని, వీటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. అక్రమమార్గాల్లో వీటి ఉత్పత్తి, రవాణా, సరఫరా జరుగుతూనే ఉన్నాయి.

నిషేధాలూ పర్యవసానాలూ:

మాదక ద్రవ్యాలపై నిషేధాజ్ఞలు జారీ చేసిన తొలి దేశం చైనా. అక్కడ నల్లమందు వాడకం విపరీతంగా ఉండేది. జనాలంతా నల్లమందు భాయీలుగా మారడంతో ఆందోళన చెందిన చైనా ప్రభుత్వం 1729లో తొలిసారిగా నల్లమందుపై నిషేధం విధించింది. అది పెద్దగా ఫలించలేదు. అయినా పట్టువదలని చైనా ప్రభుత్వం 1796, 1800 సంవత్సరాల్లో కూడా మరో రెండుసార్లు నల్లమందుపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా, ఇవేవీ ఫలించలేదు. ప్రభుత్వం నిషేధం విధించినా, నల్లమందు మరిగిన చైనా జనాలు సొంతగానే దొంగచాటుగా గసగసాల సాగు చేస్తూ, సొంత వాడకానికి కావలసిన నల్లమందు తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. సొంత సాగుకు వీలు కుదరని వారు విదేశాల నుంచి దొంగచాటుగా నల్లమందును దిగుమతి చేసుకునేవారు. ఫలితంగా నిషేధాజ్ఞలకు ముందు 40 లక్షలుగా ఉన్న నల్లమందుభాయీల సంఖ్య 1836 నాటికి ఏకంగా 1.20 కోట్లకు చేరుకుంది. ఇది గమనించిన చైనా ప్రభుత్వం నల్లమందు దిగుమతిపై నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసే చర్యలు ప్రారంభించడంతో అవి వికటించి, బ్రిటన్‌తో మొదటి నల్లమందు యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1839లో ప్రారంభమై నాలుగేళ్లు కొనసాగింది. ఆ తర్వాత 1856లో రెండో నల్లమందు యుద్ధం జరిగింది. రెండో యుద్ధంలో బ్రిటిష్‌ సేనలతో ఫ్రెంచి సేనలు కూడా జతకలసి చైనాతో తలపడ్డాయి. రెండు యుద్ధాలూ చైనాకు ఆర్థిక నష్టాన్ని, సైనిక నష్టాన్ని మిగిల్చాయి.

ఇరవయ్యో శతాబ్ది నాటికి ప్రపంచ దేశాలన్నీ కాస్త తెలివి తెచ్చుకుని మాదక ద్రవ్యాలపై నిషేధాజ్ఞలు విధించాయి. నిషేధాజ్ఞల ఫలితంగా మాదక ద్రవ్యాల ఉత్పాదన విరివిగా జరిగే దేశాల్లో మాఫియా ముఠాలు తయారయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడమే కాకుండా, దారుణమైన నేరాలకు పాల్పడుతూ దేశ దేశాల్లో వేళ్లూనుకున్నాయి. ఈ మాఫియా ముఠాలు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో, దానిపై వచ్చే లాభాలు ఏ మేరకు ఉండవచ్చో కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, ఐక్య రాజ్య సమితి 1997లో విడుదల చేసిన ‘వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌’ నివేదిక మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపార లాభాలు దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల (రూ.278 లక్షల కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ అంచనా ఇరవై ఐదేళ్ల కిందటిది. ఆ తర్వాత దీనిపై అధికారిక లెక్కలేవీ అందుబాటులో లేవు. ఇప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవాల్సిందే! మాదక ద్రవ్యాల నిషేధానికి ఎన్ని దేశాలు ఎన్ని చట్టాలను తెచ్చినా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎంత భారీ యంత్రంగాన్ని ఏర్పాటు చేసుకున్నా, మాఫియా ముఠాల ప్రాబల్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుతున్న దాఖలాల్లేవు.

ఆంక్షలున్నాఆగని అక్రమ రవాణా:

మాదక ద్రవ్యాల ఉత్పత్తి అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. భారత్‌తో పాటు అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, టర్కీ, లావోస్, తదితర దేశాల్లో గసగసాల సాగు భారీ స్థాయిలో సాగుతోంది. దీని ద్వారా తయారయ్యే నల్లమందు, దాని నుంచి ఏటా ఉత్పత్తి చేసే మాదకద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27.5 కోట్ల మంది నిషిద్ధ మాదక ద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో గంజాయి వాడేవారి సంఖ్య అత్యధికంగా 19.2 కోట్ల వరకు ఉంటుందని, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ పుచ్చుకునేవారి సంఖ్య 1.10 కోట్ల వరకు ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం కారణంగా సంభవించే మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం మరో ఆందోళనకరమైన పరిణామం. యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యూఎన్‌ఓడీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 2000 సంవత్సరంలో డ్రగ్స్‌ కారణంగా 1.05 లక్షల మంది మరణిస్తే, 2015 నాటికి ఈ సంఖ్య 1.68 లక్షలకు చేరుకుంది.

భారతదేశం అంతటా ధనార్జనే ధ్యేయంగా దేశ అభివృధ్ధికి నిరోధకులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఉదాహరణకు… ఏ.పి. లోని విశాఖ మాన్యంలో పాగా వేసిన మాఫియా వాళ్ళు పెద్ద ఎత్తున ద్రవ గంజాయి (హషిష్ ఆయిల్) తయారు చేయిస్తున్నారు. స్ధానిక గిరిజనులకు డబ్బు ఎరచూపి ఈ ఆయిల్ తయారు చేయిస్తూ లీటర్ లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు. దాదాపు ముప్ఫై కిలోల పచ్చి గంజాయి ఆకురసం నుండి పలు నవీన పధ్ధతుల ద్వారా తయారు చేయబడుతుంది. ఈ ఆయిల్ తయారి అన్నీ చోట్లా జరుగుతున్నట్లు నేను భావిస్తున్నాను. ఈ ఆయిల్ చుక్కలు సిగరెట్ లోనికి ఎక్కించి అమ్ముతున్నారు.

వీటి గుట్టు విప్పడానికే నేను వచ్చాను.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కొన్ని దేశాలు కీలక స్థావరాలుగా ఉంటున్నాయి. మెక్సికో, కొలంబియా, పెరు, బొలీవియా, వెనిజులా వంటి దేశాల నుంచి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు అమెరికా, కెనడా, యూరోప్‌ దేశాలకు చేరుతున్నాయి. ఇరాన్, అఫ్ఘానిస్తాన్, మయన్మార్‌ తదితర దేశాల నుంచి భారత్‌ సహా దక్షిణాసియా దేశాలకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దుల వద్ద ఎంతటి కట్టుదిట్టమైనా భద్రత ఏర్పాట్లు ఉన్నా, ఏటా వివిధ దేశాల సరిహద్దు భద్రతా దళాలకు టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు పట్టబడుతూనే ఉన్నా, మాఫియా ముఠాలు మాత్రం ఏదో ఒక రీతిలో భద్రతా బలగాల కళ్లు గప్పి వీటిని తాము చేరవేయదలచుకున్న ప్రాంతాలకు చేరవేస్తూనే ఉన్నారు. డ్రగ్స్‌ను విక్రయించే స్థానిక దళారులు యువతకు వీటి మత్తును మప్పి, వీటికి బానిసలుగా తయారు చేస్తున్నారు. మన దేశంలో పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది. పంజాబ్‌ ఉదంతాన్ని తీసుకుంటే, అక్కడి యువత మత్తులో మునిగి తేలే పరిస్థితులు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అక్కడి పరిస్థితులపై రూపొందించిన ‘ఉడ్‌తా పంజాబ్‌’ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

మత్తుకు బానిసలుగా 14-20 ఏళ్ల వయసువారే కిక్కు కోసం యువత మెడికల్‌ షాపులకు పరుగులు తీస్తోంది..! ప్రధానంగా నేరాలకు పాల్పడుతున్న టీనేజీ వయసు కుర్రాళ్లలో అధికశాతం నిద్ర మాత్రలు, ఇతరత్రా మత్తు బిళ్లలను వినియోగిస్తున్నారు. వీరిలో 14-20 సంవత్సరాల మధ్య వయస్కులు అధికంగా ఉంటున్నారు. ఇటీవల కొన్ని కేసుల్లో నిందితులను విచారించగా.. ఈ విషయం వెలుగుచూసింది. అంత దర్జాగా.. ధైర్యంగా.. నేరం ఎలా చేశారు అని పోలీసులు ప్రశ్నిస్తే.. వారు మత్తు బిళ్లల విషయాన్ని బయటపెట్టారు. ఆ మత్తులో ధైర్యంగా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

కొన్ని రకాల మత్తు మాత్రలను వైద్యులు అవసరమైన రోగులకు సూచిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఇలాంటి ఔషధాలను ప్రిస్ర్కిప్షన్‌ లేనిదే విక్రయించకూడదు. అయితే.. టీనేజీ కుర్రాళ్లు అధిక మొత్తం చెల్లిస్తుండడంతో.. మెడికల్‌ షాపుల నిర్వాహకులు కొందరు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. మత్తు, నిద్ర మాత్రలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. యువత ఆ మాత్రలను కల్లు, బీరు లేదా విస్కీలో కలిపి సేవిస్తోంది. ఫలితంగా.. 36-48 గంటల వరకు మత్తులో జోగుతోంది. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తోంది. పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మత్తు మాత్రలను సేవించి, విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు.

మత్తు కోసం వైట్‌నర్, నెయిల్ పాలీష్ వాసనను ఆస్వాదించేవారు ఉన్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.

యువత అధికంగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. అనారోగ్యం బారినుంచి కాపాడేందుకు తయారు చేసిన మందులు కాస్తా వీరికి వ్యసనంగా మారుతున్నాయి. జిల్లాలో 2వేల వరకు మందుల దుకాణాలు ఉన్నాయి. పట్టణాల్లోని యువత కంటే గ్రామీణ, మండల స్థాయిలోని యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

దగ్గు సిరప్‌.. మత్తుకు స్టార్టప్‌!:

ప్రధానంగా దగ్గును తగ్గించే పలు రకాల సిరప్‌లను అధిక మోతాదులో సేవిస్తూ యువత మత్తుకు బానిసలవుతున్నారు. గతంలో ఓ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును విచ్చలవిడిగా ఉపయోగించేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిని రద్దు చేయగా, సదరు కంపెనీ కొన్ని నిబంధనలతో తిరిగి దానిని పునరుద్ధరించుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో మత్తును కలిగించే ఔషదాన్ని డోసు తగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం లభించే మరో కంపెనీ మందును స్టెరాయిడ్‌ మాత్రలతో కలిపి సేవిస్తూ యువత మత్తుకు బానిసలవుతున్నారు. దీనికితోడు ఆపరేషన్‌ సమయంలో రోగులకు వాడే ఫోర్ట్‌విన్‌ అనే మత్తు ఇంజెక్షన్లు సైతం ఆసుపత్రుల నుంచి బయటకు వస్తున్నాయి.

వీటిని బయటి మెడికల్‌ షాపుల్లో విక్రయించకపోయినా నర్సింగ్‌హోమ్‌లు ఉండే ఆసుపత్రుల్లో మాత్రం లభిస్తున్నాయి. వాటిని ఆసుపత్రుల పారామెడికల్‌ సిబ్బందే కొందరు రోగుల పేరుతో అధికంగా కొనుగోలు చేసి, అధిక మొత్తానికి యువతకు విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్లు వేసుకున్న యువత గంటల తరబడి మత్తులో ఉంటోంది. ఇవేగాక నిద్ర మాత్రలు, ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించే మాత్రలు సైతం మందుల దుకాణాల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అధికారుల దాడులకు బయపడి పట్టణాల్లో వీటి విక్రయంపై భయం ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

మత్తు పదార్థాలతో బాల్యం చిత్తవుతోంది. మొదట సరదాగానే మత్తు పదార్థాలు తీసుకున్నా చివరకు వాటికి బానిసగా మారి జీవితాలను నాశనం  చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా జీవించే కొందరు వ్యాపారులు, వ్యక్తులు మత్తును కలిగించే పదార్థాలను పిల్లలకు, యువతకు అంటగట్టి వారి జీవితాల్లో అంధకారం నింపుతున్నారు.

పిల్లలు, యువత, నిరుద్యోగుల వ్యవహారశైలిపై నిత్యం నిఘా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళాశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి ఆలస్యంగా రావడం, కొత్త స్నేహితులతో పరిచయం, వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని పేర్కొంటున్నారు. అయితే వారిపై నిఘా కొరవడంతోనే మత్తుకు అలవాటు పడిపోతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైట్‌నర్‌ మత్తులో బాల్యం:

స్టేషనరీ, బుక్‌షాప్‌లలో లభించే ఇంకు మరకలను చెరిపి వేసే వైట్‌నర్‌నే పలువురు బాలలు మత్తు పదార్థంగా వినియోగిస్తున్నారు. ఈ మందును చేతి రుమాలుపై వేసుకుని, ఆ వాసనను పీలుస్తూ గంటల తరబడి మత్తులో జోగుతున్నారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్‌ల వద్ద కనిపించే వీధి బాలలతో పాటు కొందరు యువకులు, భిక్షాటన చేసే మహిళలు సైతం వైట్‌నర్‌ మత్తుకు దాసోహమవుతున్నారు.

అద్బుతమైన జీవితాన్ని కొద్దిపాటి ఆనందాన్ని కలిగించే మత్తు పదార్థాలకు బలిచేసుకుంటున్నారు. తాము ఏం చేస్తున్నామో తమ నడవడిక సరైనదేనా అని తనని తాను ప్రశ్నించుకోగలిగితే తను బాగుపడి తనను నమ్ముకున్నవారిని ఆదుకోగలుగుతాడు. తను నరకప్రాయమైన జీవితం అనుభవిస్తూ మరణించి, తనపై ఎన్నో ఆశలు పెట్టుకు బ్రతుకుతున్నతన కుటుంబ సభ్యులను శోకసముద్రంలో ముంచి వెళ్ళిపోతాడు.

సంపన్న కుటుంబాల వారు, తల్లి తండ్రులు ఉద్యోగాలు చేస్తూ తమ సంతతికి అడిగినంత డబ్బు, కార్లు, బైకులు, క్రెడిట్ కార్డులు ఇచ్చి తము సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నాము అని భావించే వారు తమ బిడ్డల ప్రవర్తనను గమనించకపోవడం శోచనీయం. మత్తు కోసం యువత పలురకాల మాత్రలు వాడుతున్నారు. వాటిలో కెటమైన్‌ ఒకటి. దీని నుంచి పొడిని తయారుచేసి నిషా కోసం వాడుతుండటంతో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదక ద్రవ్యాల జాబితాలో చేర్చింది.

ప్రస్తుతం.. దీన్ని ఇంట్లోనే తయారుచేస్తూ విక్రయించే ట్రెండ్‌ నడుస్తోంది.”

(సశేషం)

Exit mobile version