భూతాల బంగ్లా-3

0
2

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[చెన్నయి నగరంలో ఓ పార్కులో అమాయక యువకులకి మత్తు సిగరెట్లు అలవాటు చేసి వాళ్ళని మత్తుపదార్థాలకి బానిసలని చేసే ప్రయత్నంలో ఉంటుంది ఒక ముఠా. యువ అధికారి భరత్ తన సహచరులతో మాట్లాడుతూ కొన్ని ఔషధాలను మాదక ద్రవ్యాలుగా ఎలా వినియోగిస్తున్నారో వివరిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మత్తు పదార్థాలున్నాయో, వాటి మీద ఆంక్షలున్నా వినియోగం ఎలా సాగుతోందో వెల్లడిస్తాడు. కాఫ్ సిరప్, వైట్‌నర్ వంటి వాటి దురుపయోగాన్ని వివరిస్తాడు. ఇక చదవండి.]

[dropcap]“ఇ[/dropcap]దొక్కటే కాదు.. మాదకద్రవ్యాలు కాని ఇలాంటి అనేక మత్తు ‘మందు’లకు యువత బానిసవుతోంది. సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్స చేసిన తర్వాత, అత్యవసర సమయాల్లో వాడే ఔషధాలు పక్కదారి పడుతున్నాయి. వీటిని విక్రయించేందుకు వ్యవస్థీకృత ముఠాలు పుట్టుకొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పోలీసులు అంటున్నారు. పట్టుబడిన ఔషధాల్లో కొన్ని మెడికల్‌ షాపులు, డీలర్ల నుంచి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. మాదకద్రవ్యాలతో పాటు ఈ ఔషధాల దుర్వినియోగం పైనా నిఘా పెట్టారు. ఈ ఔషధాలను ‘మత్తు’ కోసం వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు.

గతంలో విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ నగరంలోని ఓయూ ఠాణా పరిధిలోనూ కెటమైన్‌ ఇంజెక్షన్లను అక్రమంగా కలిగిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. టోలిచౌకి ప్రాంతంలో కెటమైన్‌ ఇంజెక్షన్‌ను వినియోగించి పొడిని తయారుచేయడం వెలుగులోకొచ్చింది. ఈ పొడిని ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకుంటూ మత్తులో జోగుతున్నారు. దీన్ని వినియోగించేవారితో పాటు విక్రయించే వాళ్లు నగరంలో పలువురు ఉన్నారు గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్‌ టాబ్లెట్స్‌ వాడుతున్నారు. వీటిని మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగర పోలీసులు ఇటీవల ఒక ప్రాంతంలో ఓ విక్రేతను అరెస్టు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. గంజాయిని సిగరెట్లో ఉంచి పీల్చినప్పుడు వెలువడే పొగతో తీవ్రమైన వాసన వెలువడుతుంది. దీంతో అందరి కంట్లో పడుతున్నామని భావిస్తోన్న యువత.. ప్రత్యామ్నాయంగా ‘నెట్రావిట్‌’ మాత్రల్లో మత్తును వెతుక్కుంటోంది. తీవ్ర రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాత్రిళ్లు సరిగా నిద్రపట్టక ఇతర రుగ్మతలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకనే వైద్యులు వీరికి నెట్రావిట్‌ మాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తారు. శస్త్రచికిత్స జరిగిన వారికీ ఆ నొప్పి తెలియకుండా ఒకట్రెండు రోజులు వీటిని రాస్తారు. ప్రస్తుతం యువత ఈ ‘మత్తు’ బారినపడటంతో కొందరు మహారాష్ట్ర నుంచి నెట్రావిట్‌ మాత్రల్ని నగరానికి అక్రమ రవాణా చేస్తున్నారు. 15 మాత్రలతో ఉండే స్ట్రిప్‌ ఖరీదు రూ.85 కాగా, గంజాయి బానిసలకు రూ.200కు అమ్ముతున్నారు.

దగ్గు మందులే ఎక్కువ…

ఇటీవల పలువురు విద్యార్థులు, యువకులు ‘సేఫ్‌ డ్రగ్స్‌’ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉండే వారు సైతం వీటినే వాడుతున్నారు. వీరంతా వాడే వాటిలో దగ్గు మందు ప్రధానమైందని అధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ జాబితాలో నిద్రమాత్రలు, వైట్‌నర్‌ వంటివీ ఉన్నాయి. నిద్రమాత్రల్ని సేకరించడం కొంచెం కష్టం. వైట్‌నర్‌ను ఖరీదు చేయడం తేలికే అయినా, వాడేటప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలుంటాయి. దీంతో మత్తుకు బానిసలవుతున్న యువత, వైట్‌నర్‌ లభించని వారు దగ్గు మందును ఎక్కువ వాడుతున్నారు. సాధారణంగా దగ్గు మందుల్ని డెక్స్‌ట్రోమెథార్ఫిన్, కోడైన్‌లతో తయారుచేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్నికేవలం ఔషధాల తయారీకే వినియోగిస్తుంటారు. డెక్స్‌ట్రోమెథార్ఫిన్‌ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలవుతున్నారు.

కండల కోసం ఇంజెక్షన్‌:

అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్‌టెరైమన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వాడుతోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి, ఎక్కువ బరువులు ఎత్తడానికి ఈ సూది మందును తీసుకుంటోంది. దీన్ని అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాను ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్‌టెరైమన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రోగులకు సర్జరీలు చేసేటపుడు మత్తు (అనస్థీషియా) ఇస్తారు. ఈ ఇంజెక్షన్‌ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పనిసేలా చూస్తుంది. గుండెపోటు వచ్చిన వారికి ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాలక్రమంలో ఈ ఇంజెక్షన్‌ నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువతకు ‘అథ్లెట్స్‌ స్టెరాయిడ్‌’గా మారిపోయింది.

మెడికల్‌ షాపులపై డేగకన్ను:

ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి లేదు. కొందరు అక్రమార్కులు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగరంలోని కొన్ని మెడికల్‌ షాపుల నిర్వాహకులు చీటీ లేకుండానే విక్రయించేస్తున్నారు. కొన్ని రకాలైన ఇంజెక్షన్లు కొరియర్‌లో ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని మెడికల్‌ దుకాణాలు, కొరియర్‌ సంస్థలపై పోలీసులు డేగకన్ను వేశారు. మెడికల్‌ దుకాణాల నిర్లక్ష్య ధోరణిపైనా డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీస్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు.

ఈ మత్తు‘మందుల్ని’, స్టెరాయిడ్స్‌ను వినియోగించే వాళ్లకు తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని వాడే వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉన్నారు. వీటికి ఒకసారి అలవడితే.. అది దొరక్కపోతే పిచ్చివాళ్లుగా మారిపోతారు. వైద్యులు సైతం అత్యంత అరుదుగా రాసే కొన్ని ఔషధాలను అక్రమంగా వాడటం వల్ల గుండెజబ్బులతో పాటు కిడ్నీ, లివర్, మొదడుతో పాటు నరాల వ్యవస్థ దెబ్బతింటాయి. ఒక్కోసారి గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు పెరిగి తీవ్ర పరిణామాలు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలి.

అమిత వేగంతో వాహానాలు నడిపి ప్రమాదాల బారిన పడటం, మత్తుపదార్ధాలకు బానిసలు కావడం వంటి బలహీనతలనుండి మనోధైర్యంతో బైటపడాలి. మత్తు పదార్ధాలు సేవించే తమ పిల్లలను గమనించాలి అది వారి బాధ్యత.

ఆంధ్రప్రదేశ్‌ మద్యానికి బానిసలైన వారిలో రెండో స్థానంలో, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో ఏడో స్థానంలో ఉందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారికి తక్షణం చికిత్సలు అందించడంతో పాటు.. ప్రాథమిక, మధ్య స్థాయి వ్యసనపరులూ ఆ సమస్య నుంచి బయట పడేందుకు సహాయం చేయకపోతే లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో ఆరు శాతం మంది మద్యానికి బానిసలేనట.. మత్తు పదార్థాల వినియోగంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన చేదు నిజమిది. మద్యం మహమ్మారికి బానిసలైన వారు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ఈ అధ్యయన నివేదిక తేల్చింది.

నల్లమందు(ఓపియం), హెరాయిన్‌ తదితర మాదకద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న ఏడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటని స్పష్టం చేసింది. ఇంజెక్షన్ల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకుంటున్న వారూ ఏపీలో ఎక్కువగానే ఉన్నారని పేర్కొంది. ఇలాంటి వారందరికీ తక్షణ చికిత్స అందించాల్సిన అవసరముందని హెచ్చరించింది. పదేళ్ల వయసుకే బాలలూ మద్యం రుచి మరుగుతున్నారని.. మాదకద్రవ్యాలను వినియోగించే వారిలో 75ఏళ్ల పైబడినవారూ ఉన్నారని వివరించింది.

నివేదికలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. మాదక ద్రవ్యాలు అత్యధికంగా వినియోగించే వారిలో సగం కంటే ఎక్కువ మంది ఏడు రాష్ట్రాలు, దిల్లీలోనే ఓపియం, హెరాయిన్‌, ఫార్మాసూటికల్స్‌ మాదకద్రవ్యాలను అత్యధికంగా వినియోగించే వారు దేశవ్యాప్తంగా 77 లక్షల మంది ఉండగా.. వారిలో సగం కంటే ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఈ జాబితాలో ఏపీ ఏడో స్థానంలో నిలిచింది.

ఈ మత్తు పదార్ధాలు సప్లయ్ చేసే వారిని ‘ పెడ్లర్స్’ అంటారు. వీరు చాలా తెలివిగా యువత ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఎంచుకుని మేధాశక్తి పెరుగుతుంది దీనివలన అంటూ ఉచితంగా నాలుగురోజులు బ్లూ సిగరెట్లు (మత్తుపదార్ధాలు కలిగినవి) ఉచితంగా పంచుతారు. ఈ డ్రగ్స్‌లో సిగరెట్, ఆల్కాహాల్, కొకైన్, గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్, హెరాయిన్, మార్ఫిన్, ఎల్.ఎస్.డి (లైసెర్జిక్ యాసిడ్ డై ఇథాలమైడ్), ఎం.డి.ఎం.ఎ (మీథైట్ ఎనాడయాక్సీ మెథాంఫెటామైన్) చరస్, మార్జువాన, వంటి పలు రూపాలలో లభిస్తున్నందున వాటిని తీసుకున్నవారు జీవచ్ఛవాలలా మారుతున్నారు. ప్రభుత్వాలు ఎంతో చిత్తశుధ్ధిగా పనిచేస్తున్నా ఈ విషవలయాన్ని నియంత్రించలేకపోతుంది.

ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్నవారికి గమ్మతైన ఆనందం ఆవహిస్తుంది. అది అలవాటుగా మారితే మెదడు ఆ మాదక ద్రవ్యాలను పదే పదే కోరుతుంది. ఫలితం అదొక వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనానికి బానిసలైన వారికి మధుమేహం, బి.పి, గుండెదడ వంటి వ్యాధులే కాక నిరాశ, ఆవేదన, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి కోల్పోవడం, నైపుణ్యత కోల్పోవడం, హైజీనిక్‌కి దూరమవడం వంటి సమస్యలు దీర్ఘకాలంగా పట్టి పీడిస్తాయి. జీవితం దీని మీదే ఆధారపడేలా చేసే వ్యసనంలా మారుతుంది.

చాలా మందికి సిగరెట్ తాగనిదే మలం రాదు. కొందరు రచయితలకు ఆలోచనలు రావు. మరికొందరికి ఆల్కాహాల్ సేవించనిదే రోజు పూర్తికాదు. ఇలా రకరకాలుగా వ్యసనాలకు బానిసలౌతారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి చెడు వ్యసనం ఒకరిద్వారా మరొకరికి ప్రేరేపించబడటం.

మరికొందరు డ్రగ్‌లకు బానిసలై దానికొరకు ఎంత దూరమైన వెళతారు ఏమైనా చేస్తారు. మాదక ద్రవ్యాల కొరకు డబ్బు కోసం అప్పులు, దొంగతనాలు, చివరకు హత్యలకు కూడా పాల్పడతారు.

వీరు ప్రతి రోజు చేసే రోజు వారి దినచర్యలు అంటే స్నానం చేయడం, షేవ్ చేసుకోవడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, ఇష్టమైన ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, వ్యాయమం చేయకపోవడం, కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండక పోవడం పక్కన పెట్టేస్తారు. దీంతో వారు బరువు తగ్గడం, గుండెదడ, ఆకలి లేకపోవడం వంటివి వాటితోపాటు, ఏ పనిమీద ఏకాగ్రత లేకపోవడం, ఆందోళన పెరగడం, నిద్రలేమి, డిప్రెషన్, కోపం, ఏకాంతం, ఆత్మహత్య ఆలోచనలు, తనవారు అనుకున్నవారినే ద్వేషించడం, వంటి పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. వీరి రోజు వారి దిన చర్యలు గమనిస్తే తల్లితండ్రులు తమవారిని రక్షించుకోవచ్చు.

ఇదంతా డ్రగ్ తీసుకోవడవలన మెదడులో విడుదలయ్యే డోపమైన్ హార్మోన్ మనిషిని మరో లోకంలో విహరింపజేస్తుంది. ఈ మత్తు పదార్ధాలకు అలవాటు పడినవారికి సమయానికి అవి అందకపోతే అసహనం, కోపం, ఎదటివారిని నిందించడం వంటివి ప్రాథమిక లక్షణాలు. ఒక చోట కుదురుగా కూర్చోలేక పోవడం, కుటుంబ సభ్యులనుండి దూరంగా ఏకాంతంగా గడపటం, వివరీతంగా అరవడం, కాళ్ళు, చేతులు వణకడం, తూలిపోవడం, అధికంగా చెమట పట్టడం, ధ్యాస లోపించడం, చదువులో, వృత్తిలో వెనుకబటం…. వంటివి బాహ్య లక్షణాలు.

ప్రతిరోజు ఒకే పని, ఒకే సమయానికి పదే పదే చేస్తే మన శరీరం దానికి కండీషనింగ్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం కాఫీ, టీ తాగేవారికి ఆసమయానికి అవి అందకపోతే అసహనం కలుగుతుంది. రాత్రి త్వరగా నిద్ర పోయేవారికి ఆసమయానికి నిద్ర పోక పోతే సోలిపోతుంటారు. ఇలా మన మెదడు ప్రతిదానికి కండీషనింగ్ అవుతుంది. ఈ మాదక ద్రవ్యాల వ్యసనం కూడా అటువంటిదే! మిగతా అలవాట్ల నుండి తేలికగా బైట పడవచ్చు కానీ మాదకద్రవ్యాల వ్యసనం నుండి బైటపడటం అంత తేలిక కాదు.

ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడంవలన అలౌకిక ఆనందంలో తేలిపోతూ చదువునీ, కష్టాన్ని, భాధల్ని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈ భూమిపై ఎక్కడ ఉన్నాము, ఎవరితో గడుపుతున్నాము అన్న సృహ ఉండదు. ముఖ్యంగా యువతులు ఈ దుర్వ్యసనానికి బలై తమ మాన ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి బానిసలవుతున్న వారిపట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. వారికి వాటి వాడకం వలన వచ్చే కష్ట నష్టాలు వివరించాలి. సహజమైన జీవనం పట్ల వారి దృష్టి మరలించే ప్రయత్నం చేయాలి. వారికి మనోధైర్యాన్ని కలిగించాలి. మానసికంగా సిధ్ధపడితే ఆ వినియోగదారుడు త్వరగా ఈ మహమ్మారి నుండి దూరంగా వెళ్ళగలుగుతాడు.

ఎవరైనా మత్తుపదార్ధాలు అమ్ముతున్నా, వాడుతున్నా స్ధానిక రక్షకభటులకు సమాచారం అందించి మంచి సమాజ నిర్మాణానికి మన వంతు భాత్యత అని మరచిపోకూడదు.

ఈ రోజు ఆ మత్తుపదార్ధల బాధితుడు ఎవరి బిడ్డో రేపు మన బిడ్డో మన బంధువుల బిడ్డడో కావచ్చు. ఈ మహమ్మరిని ప్రజలంతా కలసి కట్టుగా పోరాడి కూకటివేళ్ళతో పెకిలించాలి.

మాదకద్రవ్యాలు నల్లబజారు వ్యాపారం. వీటిని వివిధ ప్రాంత సాంకేతిక నామాలతో చలామణి అవుతున్నాయి. ఈ మాదకద్రవ్యాలపై నిషేధాజ్ఞలు, ఆకాంక్షలు ఉన్నప్పటికి అక్రమంగా దొంగదారుల్లో రవాణా అవుతూనే ఉన్నాయి. ఎవరి దగ్గరైనా తక్కువ మొతాదులో (స్మాల్ క్వాంటిటీ) పట్టుపడితే ఒక సంవత్సరం జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమాన విధిస్తారు. ఎక్కువ మొత్తంలో మత్తు పదార్థంతో పట్టుపడితే పది నుండి ముప్ఫై సంవత్సరాల వరకు జైలుశిక్ష,రెండు లక్షలవరకు జరిమాన విధిస్తారు.

శిక్షలు….ముఖ్యంగా రెండు రకాలుగా విభజించారు.

మెదటిది: రక్తం, మెదడుపై ప్రభావంచూపించే మాదక ద్రవ్యాలు.

రెండవది: కేంద్రియ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే మాదక ద్రవ్యాలు. వీటికి 20,21,22 సెక్షన్ల కింద శిక్ష విధిస్తారు. అధిక మోతాదుల్లో విక్రయిస్తూ దొరికితే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అదుపులోనికి తీసుకుంటారు.

సెక్షన్ 20: రక్తం, మెదడులపై ప్రభావం చూపించే మాదక ద్రవ్యాలకు బానిసలై పట్టుబడి, పరివర్తన చెందాలి అనుకునేవారిని రిమాండ్‌కు బదులు, రిహేబిలిటేషన్ కేంద్రాలకు పంపుతారు. గంజాయి, దాని సంబంధింత మాదక ద్రవ్యాలు సెక్షన్ 20 కిందకు వస్తాయి.

సెక్షన్ 21: గంజాయిలో.. ఉత్పత్తుల్లో మరో డ్రగ్ కలిపి తయారు చేసే మాదక ద్రవ్యాలు మార్ఫిన్, కొకైన్, చరస్ వంటివి. ఈ రకం మాదకద్రవ్యాల కింద పట్టుబడినవారికి సంవత్సరం జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

సెక్షన్ 22: కేంద్ర నాడీ వ్యవస్ధపై తీవ్ర ప్రభావం చూపించే టాబ్‌లెట్స్, ఇంజెక్షన్లు, ఎల్.ఎస్.డి వంటి డ్రగ్స్ అమ్మేవారికి నాన్ బెయిలబుల్, ముప్ఫై సంవత్సరాల జైలు శిక్ష.

ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ దినోత్సవంగా జూన్ 26 వ తేదిని జరుపుతున్నారు. 2021 థీమ్ ‘మాదక ద్రవ్యాలపై వాస్తవాలను పంచుకొండి.. ప్రాణాలను కాపాడుకొండి’. ఈ మత్తు ఉచ్చు నుండి బయటపడాలి అంటే కొంచెం కష్టమైనప్పటికి, అసాధ్యం మాత్రం కాదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు, రీహేబిలిటేషన్ సెంటర్లు, బిహేవియర్ థెరిపీలతో మత్తు వ్యసన విషవలయం నుండి బైటపడవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మిత్రులు వీరిని గమనిస్తే ప్రాథమిక అలవాటులోనే నియంత్రించవచ్చు.

డ్రగ్స్ వల్ల ఏమి జరుగుతుంది?

గంజాయి, కొకెయిన్, హెరాయిన్, ఎల్‌ఎస్డీ.. ఇలా రకరకాల డ్రగ్స్ వున్నాయి. ఇవి రకరకాలుగా శరీరం పై పని చేస్తాయి. నేటి యువత ఎక్కువగా డ్రగ్స్ వైపు ఆకర్షితులు కావడం జరుగుతోంది. కాలేజీలలో, యూనివర్సిటీ క్యాంపస్‌లలో, హాస్టల్స్ లో వీటి వాడకం ఎక్కువవుతోంది .

తప్పని తెలిసీ ఎలా అకర్షితులవుతారు?

స్నేహితుల ఒత్తిడి .. పీర్ ప్రెషర్ .. ఇది వరకే డ్రగ్స్ తీసుకొంటున్న ఒక స్నేహితుడు ఒత్తిడి చేస్తాడు. “ఏమీ కాదు.. జస్ట్ ఒకసారి ట్రై చెయ్యి. చెడు అనిపిస్తే మానేద్దువు” అని ప్రోత్సహిస్తాడు. ఎక్సప్లోరింగ్.. అంటే తెలుసుకోవాలి అనే ఆసక్తి యువతలో ఎక్కువ. ఇది తప్పు అని ఇంత మంది అంటున్నారు అంటే చూద్దాము.. ఏమి జరుగుతుందో.. నాపై నాకు నమ్మకం వుంది. ఒక్కసారి తీసుకొనే మానేస్తా.. నా పై నాకు ఫుల్ కంట్రోల్ వుంది అనే ఆత్మవిశ్వాసం.. అంటే! క్యూరియాసిటీ 2. ఆత్మ విశ్వాసం 3. స్నేహితుడి ప్రోత్సాహం.. ఇవీ చీకటి జగత్తు కు దిగజారడం లో మొదటి మెట్టు.

ఒకసారి డ్రగ్ తీసుకొన్నాడు. ఇరవై నిమషాల్లో చిత్రమైన ప్రపంచం కనిపించింది. ఉదాహరణకు ఆసిడ్‌గా పిలవబడే ఎల్‌ఎస్డీ తీసుకొన్నాడు. కంటి పాప పెద్దదయింది. కొత్త రంగులు కనిపించాయి. శబ్దానికి రంగులు వచ్చాయి. వాసనకు రుచి. అదో గమ్మత్తయిన జగత్తు, ఎప్పుడు చూడని జగత్తు, అదో మాయ ప్రపంచం, స్వర్గం అంటే అదేనేమో అనిపిస్తుంది. బ్రాంతి.. మొత్తం బ్రాంతి.. మూడ్ మారిపోయింది. ఇది కదా ప్రపంచం అనిపిస్తుంది.

ఆ గమ్మత్తయిన అనుభూతి కొన్ని గంటల పాటు ఉండిపోతుంది. రెండు రాత్రుల పాటు నిద్ర రాదు. అయినా అలసట అనిపించదు. శరీరం తేలిపోయినట్టు ఉంటుంది. అటు పై వరుసగా రెండు రోజులు పగలు రాత్రి నిద్ర పోతాడు.

తప్పు చేశాను అనే భావన కలుగుతుంది. ఇక మీదట ఎప్పుడు చెయ్యను అనుకొంటాడు. కనీసం రెండు నెలలు ఆ ఆలోచన రానివ్వడు. ఈ స్థితిలో ఉన్న వాడిని డ్రగ్స్ ఇచ్చిన ఆ ఫ్రెండ్ కూడా డిస్టర్బ్ చెయ్యడు. నీ ఇష్టం అంటాడు. 2 – 3 నెలలు డ్రగ్స్ తీసుకోకపోయేటప్పటికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తాను అడిక్ట్ కాను. తనకు ఆ కంట్రోల్ ఉంటుంది అనుకొంటాడు. ఈసారి తానే ఆ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఇంకోసారి ట్రై చేద్దాము అంటాడు. “వద్దు బాబు నీతో కష్టం” అంటాడు. బతిమాలాడించుకొంటాడు. ఇవన్నీ సీనియర్‌కు డ్రగ్ కార్టెల్ ఇచ్చిన ట్రైనింగ్‌లో భాగం.

జూనియర్ రెండోసారి డ్రగ్స్ ట్రై చేసాడు. ఈ సారి కూడా అదే అనుభూతి. వారం గడిచింది. ఇంకో సారి స్వర్గం చూడాలి అనుకొంటాడు. ఈ సారి వారానికే థర్డ్ టైం.

ఇప్పుడు అతనికి బ్రెయిన్ వాషింగ్ సెషన్ జరుగుతుంది. ఇందులో సీనియర్‌లు క్లాసులు తీసుకొంటారు. 1. డ్రగ్ తీసుకొనుంటే ఆరోగ్యం పాడవుతుంది అనేది తప్పు. హీరోయిన్‌లు ఎంతో మంది తీసుకొంటుంటారు. డ్రగ్స్ వల్లే వారి సౌదర్యం పెరిగి అందరికీ ప్రీతిపాత్రం అవుతారు. 2.డ్రగ్స్ తీసుక్కొంటే కండలు వచ్చి మాచోమాన్‌గా మారొచ్చు. అమ్మాయిలు రా నా హ్యాండ్సమ్ అంటూ వెంటబడుతారు. 3. అసలు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతారు. వారి చదువు పాడుకాలేదు సరి కదా మెమరీ పెరిగి బ్రెయిన్ షార్ప్ అయ్యి మరిన్ని మార్కులు సాధించారు అంటూ వారి పేర్లు చెప్పి.. ఫోటోలు చూపుతారు. 4. సరే పట్టుపడితే ఏమవుతుంది? అమ్మ ఏడుస్తుంది. ఏడవని.. రెండు రోజులు ఏడ్చి ఊరుకొంటుంది. అంతకన్నా ఏమి చేస్తుంది? నాన్న కొట్టడానికి వస్తాడు. రెండు దెబ్బలు తిను.. అమ్మ సానుభూతి దక్కుతుంది. నాన్న కూడా తరువాత అయ్యో అనుకొంటాడు. తరువాత ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళుతారు. వారు అదే సోది చెబుతారు. వారికి అది వృత్తి. ఆరోగ్యం దెబ్బతింటుంది అంటారు. ఆరోగ్యం దెబ్బతింటే మరి హీరో హీరోయిన్‌లు ఎందుకు తీసుకొంటారు? కెరీర్ పాడైతే మీ సీనియర్ రెగ్యులర్‌గా హై లో ఉండేవాడు.. ఇప్పుడు చూడు ఫలానా కంపెనీలో ఇంత ప్యాకేజీకి పని చేస్తున్నాడు. ఇలా బ్రెయిన్ వాష్ జరిగిపోతుంది. రెండో దశలో డ్రగ్స్‌ను వారాంతాల్లో తీసుకోవడం మొదలు పెడుతాడు. ముందుగా ఫ్రీ దొరికిన డ్రగ్‌కు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి. పాకెట్ మనీ సరిపోవడం లేదు.. అబద్దాలు.. చిన్న వస్తువులు అమ్మేయడం.. ఇంట్లో చిన్న దొంగతనం.. ఇలా ఒక్కో మెట్టు కిందకు ప్రస్థానం సాగుతుంది.

ఇప్పుడు స్వయం ఉపాధి పథకం ముందుకు వస్తుంది. మరో నలుగురు కొత్త కుర్రాళ్లను ఊబి లోకి లాగాలి. ఒక్కడిని తెచ్చినప్పుడు ఒక్కో డోస్ ఫ్రీ.. సీనియారిటీ వస్తే ఇక కొత్తగా చీకటి ప్రపంచంలో వస్తున్న వారికీ బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చెయ్యాలి. తనని ఊబిలోకి దించిన వాడు ఇదే ప్రోగ్రాం ప్రకారం చేసాడు.. ఫ్రెండ్షిప్ లేదు పాడు లేదు అని అర్థం అవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. అతని అడుగుజాడల్లో తానూ నడుస్తున్నాడు. నలుగురు బకరాల కోసం వేట. ఇదే ఛైన్ లింక్డ్ డ్రగ్స్ ప్రమోషన్ టీం.

డ్రగ్స్ తీకుకొంటే మరణం ఖాయం.. సర్వనాశనం ఖాయం. ఎందుకు? ఎలా?

డ్రగ్స్ తీసుకొంటే దెబ్బతినేది కేవలం వ్యక్తి ఆరోగ్యం కాదు. కుటుంబం.. నగరం,.. సమాజం.. దేశం.. ప్రజాస్వామ్య వ్వవస్థ మొత్తం నాశనం అయిపోతాయి. డ్రగ్స్ రాజ్యం ఏలుతున్న మెక్సికో కొలంబియా లాంటి దేశాల్లో డ్రగ్స్ కార్టెల్స్ సమాంతర ప్రభుత్వాలు ఎలా నడుపుతున్నాయి.. హత్యలు.. కిడ్నాప్‌లు.. EXTORTION ఎందుకు నిత్యకృత్యం అయిపోయాయి? హింస అనేది నిత్య జీవన విధానం ఎందుకు అయిపొయింది?

ఇండియా ఇంకా తొలిదశలో వుంది. దేశంలో ఒక పక్క నిరుద్యోగిత.. తాగడం ఫాషన్ అయిపోయిన స్థితి. నగరాల్లో ఇప్పటికే వ్యవస్థీకృతం అయిన డ్రగ్స్ మాఫియా.. అన్నింటికీ మించి దేశ జనాభాలో డెబ్భై అయిదు శాతం యూత్ చేరువలో మత్తుమందు మాఫియా దేశాలు మనం ఎంతో జాగురూకతో వ్యవహరించవలసిన సమయం ఇది. మీరంతా దేశానికి వెన్నెముక అయిన యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేలా చేయడంలో నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. మరో పర్యాయం మనం కలుసుకున్న సమయంలో ఈ మత్తుపదార్ధాలపై మరిన్ని విషయాలు రాబోయే సమావేశాలలో మీరు తెలియజేస్తాను. జైహింద్” అని తన ప్రసంగం ముగించాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here