భూతాల బంగ్లా-5

0
2

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[కడుపు నొప్పితో బాధపడుతున్న తన ఆరేళ్ళ పిల్లవాడిని తమ ప్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళతాడు కృష్టమూర్తి. పిల్లాడిని పరీక్షించిన డాక్టర్, భయపడనక్కరలేదనీ, చిన్న సర్జరీ చేయవలసి ఉంటుందని అంటారు. ఆరేళ్ళ పిల్లవాడికి మత్తు ఇవ్వడం సాధ్యమా అంటూ, మత్తు మందు గురించి వివరించమని కృష్ణమూర్తి డాక్టర్‌ని అడుగుతాడు. అప్పుడా డాక్టర్ మత్తుమందుల ఆరంభం గురించి, ఏయే రసాయనను మేళవించి మత్తుమందులు తయారో చేస్తారో, ఏ రోగికి ఏ పరిమాణంలో ఇవ్వాలనేది ఎలా తెలుసుకున్నారో సవివరంగా చెప్తాడు. పిల్లాడికి చేసేది చాలా చిన్న సర్జరీ అనీ, మరుదినమే ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పాడు డాక్టర్. ఇక చదవండి.]

[dropcap]చె[/dropcap]న్నయ్ మహానగరంలో మహాబలిపురం వెళ్ళే పాత రోడ్డులో టోల్ గేట్ దాటి కొద్దిదూరం ప్రయాణం చేసాక ఎలియట్స్ బీచ్ దాటి ముందుకు వెళితే ‘అమ్జికరై’ అనే ప్రాంతం వస్తుంది. అది సముద్రతీర ప్రాంతమే! అక్కడనుండి ముందుకు వెళితే గోల్డెన్ బీచ్ వస్తుంది.

అది నగరానికి దూరంగా ఉండటంవలన ప్రశాంతంగా జీవించాలనే కోటీశ్వరులు పెద్ద పెద్ద బంళాలు కట్టారు. వాళ్ళకి సేవలు అందించేందుకు వారిని నమ్ముకుని బ్రతికే పేదవాళ్ళు అక్రమిత రోడ్డువార గుడిసెలు, రేకులషెడ్డు అనే ఇళ్ళు వందల్లో వెలిసాయి.

అక్కడకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పొలాలమధ్య ఎన్నడో బ్రిటీష్ వారికాలంలో కట్టిన బంగ్లా ఉంది. ప్రస్తుత వారసులు దాన్ని అమ్మివేయడంతో స్ధానిక వ్యాపారవేత్త సారధి రెండేళ్ళ క్రితం కొనుగోలు చేసాడు. ఈయన ప్రముఖ రాజకీయ నాయకుడు కాళిదాసు సహాకారంతో ఆ బంగ్లాని కొని రిపేరు చేయించి ఎంతో సుందరంగా తయారు చేయించినప్పటికి దాని పేరు దెయ్యాల బంగ్లా గానే స్ధిరపడింది.

దాదాపు నాలుగు ఎకరాలలో స్ధలంలో వెనుక భాగాన ప్రహరీకి పక్కనే కట్టబడి ఉంది ఆ బంగ్లా. దానికి కుడిభాగాన మట్టి రోడ్డు ఆ పరిసరాలలోని పల్లెటూర్లకు వెళ్ళడానికి వినియోగ పడుతుంది. బంగ్లాకు ఎడమ భాగాన అన్ని వ్యవసాయ భూములే!

రాత్రి దీపాలు వెలిగాక ఎవ్వరు ఆ దెయ్యల బంగ్లా పక్కనే ఉన్నరోడ్డుపై ఒంటరిగా వాహనంతో కూడా ప్రయాణం చేయరు. అక్కడి జనాలకు అంతటి భయాన్ని కలిగించిన సంఘటనలు ఎన్నో గతంలో ఆ బంగ్లా వద్ద జరిగాయి. వాటికి మరికొన్ని కల్పితాలు జోడించి ఆ ప్రాంతం వారు కథలు కథలుగా చెప్పుకుంటారు నేటికి. ఈ బంగ్లా యజమాని సాగర్ తమిళనాడులో ప్రముఖ వ్యాపారి, దక్షణ భారతదేశంలోని ధనవంతులలో ఒకరు. రాజకీయంగా చాలా మంది పాలక, ప్రతిపక్ష వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు.

సంవత్సరం క్రితం దెయ్యాల బంగ్లా ప్రహరి వెనుక భాగాన ఆరు ఎకరాల స్ధలంలో సాగర్ ప్రొడక్ట్స్, సాగర్ ఏజన్సీస్ పేరిట ఆరు అంతస్తుల బిల్డింగ్ నిర్మించబడింది. దాని ముఖద్వారం రోడ్డు భాగానికి ఉంటుంది. ఆ బిల్డింగ్‌కు అనుసంధానంగా కొన్ని గోదాములు నిర్మించబడ్డాయి. ప్రముఖ లిక్కర్ కంపెనీ, కొన్ని సిగరెట్ల కంపెనీలకు సాగర్ ఏజన్సీస్ వారు తమిళనాడు డీలర్లు. అక్కడే పామ్ ఆయిల్ పెద్ద పెద్ద ట్యాంకులలో స్టోరేజ్ పెట్టి లారీలకు లోడ్ చేస్తుంటారు. వీరే పలు రకాల నిత్యవసర వస్తువులు – కందిపప్పు, మినపప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు వంటి పలురకాలు శుధ్ధపరచి హోల్‌సేల్ దుకాణాలకు సప్లయ్ చేస్తుంటారు. ఈ విభాగంలో దాదాపు అరవై మంది ఆడవారు పనిచేస్తుంటారు.

అక్కడే పెద్ద ఎత్తున తేనెటీగల పెంపక కేంద్రం ప్రారంభించారు. స్వచ్ఛమైన తేనెకు సాగర్ బ్రాండ్ ఎంతో పేరు పొందింది.

మరో అంతస్తులో సాగర్ షిప్పింగ్ కంపెని వ్యవహారాలు నడుస్తుంటాయి. వీరి షిప్పులు అంతర్జాతీయ సరుకుల రవాణా చేస్తుంటాయి. అమెరికా, సింగపూర్, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్ధాన్ వంటి దేశాలనుండి సరుకులు కంటైనర్ల ద్వారా చేరవేస్తుంటాయి. చెన్నయ్ హార్బర్‌లో సరుకులు ఎగుమతి దిగుమతులలో సాగర్ కంపెనీ వారి లారీలే ప్రముఖంగా కనిపిస్తాయి.

ఆరు అంతస్తులు కలిగిన బిల్డింగ్‌లో ప్రతి అంతస్తువారికి ప్రత్యేకమైన లిఫ్టులు ఉంటాయి. ఏ అంతస్తువారు ఆ లిఫ్టులోనే వెళ్ళాలి. ఇక్కడ పనిచేసేవారు ఇంటికి వెళ్ళడానికి తిరిగి ఉదయం రావడానికి బస్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. రాత్రి వదిలేయడానికి వెళ్ళిన బస్ అక్కడే ఉండి తెల్లవారి స్టాఫ్‌ను తీసుకు వస్తుంది. ఏ అంతస్తులో పనిచేసే వారు ఆ అంతస్తులోనికి వెళ్ళడానికి మాత్రమే అనుమతి. మరో అంతస్తులోనికి వెళ్ళడానికి ఎవ్వరికి అనుమతి ఉండదు. అందరికి వారు పని చేసే అంతస్తు నెంబరు, వారి హోదా తెలియజేస్తూ ఐ.డి.కార్డులు ఉంటాయి. సెక్యూరిటీ గార్డులు కూడా వాకిలి దాటి లోనికి వెళ్ళరు. ఆ సంస్ధ ఐదు అంతస్తులలోనూ వీడియో కెమేరాలు అమర్చబడి ఉంటాయి. పనివేళలలో వాటిని సెక్యూరిటి స్టాఫ్ నిరంతరం గమనిస్తుంటారు.

ఆరవ అంతస్తులో కొందరు పనిచేస్తున్నా దాని గురించి ఎవ్వరికి తెలియదు.

ఏ అంతస్తులో ఏం జరుగుతుందో, మరో అంతస్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వారంలో ఒకరోజు సంస్ధ ఎగుమతులు యజమాని సాగర్ స్వయంగా పరివేక్షిస్తారు. అప్పుడే అన్ని అంతస్తులు ఆయన మేనేజర్‌తో కలసి పరిశీలిస్తారు.

ప్రతి దినం పలు లారీలు సరుకు దించి వెళితే మరికొన్ని లారీలు సరుకు లోడుతో అక్కడనుండి వెళతాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు, పాలకవర్గ మంత్రి కాళిదాసు సాగర్ కంపెనీలో భాగస్వామి కనుక ఎన్నడు వారి వద్దకు వచ్చే లారీని కాని వెళ్ళే లారీని కాని ఆపే ధైర్యం ఎవరు ఇంతవరకు చేయలేదు.

ఉదయం తొమ్మిది గంటలకు పనికి వచ్చినవారు సాయంత్రం ఆరు గంటలవరకు తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. పనికి సంబంధించిన విషయాలు తప్ప మరేవి మాట్లాడకూడదు. ఉదయం పదకొండు గంటలకి, సాయంత్రం నాలుగు గంటలకి టీ తమ అంతస్తు ముఖద్వారం వెలుపల కెటిల్‌ల్లో ఉంటుంది. పది పది మందిగా వెళ్ళి అక్కడే ఉన్న యూస్ అండ్ త్రో కప్పుల్లో టీ పట్టుకు తాగి రావాలి.

ప్రతి అంతస్తుకు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఒక విభాగంలో పనిచేసే వారిని మరో విభాగం లోనికి వెళ్ళనివ్వరు. ఏ అంతస్తులో ఏం జరుగుతుందో ఏ గోదాముల్లో ఏముందో కూడా అక్కడి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎవరి పని వారిదే, క్రమశిక్షణతో పనిచేసుకుంటూ వెళతారు.

రాత్రి ఏడు గంటలకు ఆ ప్రాంతమంతా నిర్మానుషంగా మారుతుంది.

***

తలుపు తడుతున్న శబ్ధం విన్న సెల్వం గది తలుపు తీసాడు.

గదిలోనికి వచ్చిన నలభై ఏళ్ళ మారిముత్తు “రేయ్ సెల్వం, ఎలా ఉన్నావురా?” అన్నాడు.

“బాగున్నా అన్నా, కూర్చో” అని కుర్చీ చూపించాడు సెల్వం.

“మూడు రోజులనుండి ఫోన్ చేస్తున్నా, ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది” అన్నాడు మారిముత్తు.

“ఫోన్‌లో బ్యాలన్స్ లేదు, వేద్దాం అంటే కొంచెం సర్దుబాటు లేదు” అన్నాడు సెల్వం.

“అలాగా మరో మూడు రోజుల్లో మనం దెయ్యల బంగ్లాలోకి వేటకు వెళుతున్నాం” అన్నాడు గొంతు తగ్గించి. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటూ, “తంబి ఆఫ్ మందు, మటన్ బిరియాని, ఐదువేలు డబ్బులు ఇస్తా. ఆ బంగ్లాలో వేటలో ఏం దొరికినా అంతా నాకే. ఏం లభించక పోయినా ఆ నష్టం నాకే సరేనా” అన్నాడు మారిముత్తు.

“అన్నా అది ఆ దెయ్యాల బంగ్లాలో ఏం ఉంటాది? దెయ్యాల బంగ్లా అంటేనే భయం. అందులో వేట అంటేనే ఇంకా భయంగా ఉంది. అసలు నీకు దెయ్యాల భయం లేదా?” అన్నాడు సెల్వం.

“ఒరే తిక్కలోడా అది మన మానసిక బ్రాంతి. నేను తెలుసుకున్నంతలో మన బలహీనత మాత్రమే! దెయ్యం (Ghost) చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా భావిస్తారు. ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ని హాంటెడ్ (Haunted) ప్రదేశాలు అంటారు. ఇవి కొన్ని వస్తువుల్ని ప్రేరేపిస్తాయి; కానీ ఇలాంటివి ఎక్కువగా యువతులలో కనిపించే మానసిక ప్రవృత్తికి సంబంధిచిన విషయాలుగా కొందరు భావిస్తారు. దెయ్యపు సైన్యాలు, జంతువులు, రైళ్ళు, ఓడలు కూడా సినిమాలుగా వచ్చాయి, కథలుగా ప్రచురించబడ్డాయి.

అయితే దెయ్యాలు ఉన్నది లేనిదీ చాలా సంధిగ్ధంగా ఉంది. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళూ ప్రపంచమంతా ఉన్నారు. దెయ్యాల గురించి ప్రాచీనకాలం నుంచి నమ్మకాలు బలంగా నాటుకున్నాయి. అయితే 19వ శతాబ్దంలో మానసిక శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన భూత వైద్యులు దెయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. హేతువాదులు దెయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణం తెలియని విషయాలకు దెయ్యాలుగా ప్రచారం చేస్తారని వీరు భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండింటికీ కూడా బలమైన నిరుపణలు లేవు. అమెరికాలో 2005 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం సుమారు 32% మంది దెయ్యాలు ఉన్నాయని నమ్మారు.

హిందూ మతంలో చాలా మంది దెయ్యాలని నమ్ముతారు. కొంతమంది దెయ్యాలను నమ్మరు, అలాగే దేవుడిని కూడా నమ్మరు. కొంతమంది దెయ్యాలు వుంటే దేవుడు కూడా ఉంటాడని, లేకపోతే దేవుడు వుంటే దెయ్యాలు కూడా ఉంటాయని నమ్ముతారు. సదా దేవుడు దెయ్యాల నుంచి రక్షిస్తూ ఉంటాడని నమ్ముతారు.. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నపుడు దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయని నమ్ముతారు, ఇక్కడ దుష్ట శక్తులు అంటే దెయ్యాలే. అసలు ఇంతకి దెయ్యాలు ఉంటాయా అన్న ప్రశ్నకి మాత్రం ఇప్పటిదాకా ఖచ్చితమైన సమాధానం లేదు. ఏవైన కొన్ని వింత విషయాలు చెడ్డవి జరిగితే అది దెయ్యాల ప్రభావమేనని నమ్ముతారు. కానీ కొన్ని విషయాలను శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించిన సంఘటనలు కూడా కొన్ని సమయాలలో చోటు చేసుకున్నాయి. కొన్ని పల్లెటూర్లలోని ప్రజలు దయ్యం తమతో ప్రవర్తించిన తీరును చెప్తుంటారు. దేవ ఘడియలో జన్మించిన వారికి దయ్యం కనిపిస్తుందని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఎవరైనా ఆయుష్షు తీరకుండా చనిపోతే దయ్యలై తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అలాగే ఎవరైనా కోరికలు తీరకుండా చనిపోయినా కూడా వారి ఆత్మ దెయ్యం రూపంలో తిరుగుతుందని చెప్తారు. కానీ హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పాటు వారి ఆత్మకు శాంతి ఉండదని ఆ సంవత్సరం కాలం పాటు ఆత్మ ఘోషిస్తూ ఉంటుందని పండితులు చెప్తారు.

ఏది ఏమైనా నమ్మకం అనేది మనపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఉన్నాయి అని నమ్మేవాళ్ళకు ఉన్నాయి. లేవు అనుకునేవాళ్ళకు లేవు. నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ జీవించేవారికి అసలు దెయ్యం, దేముడితో పనేముంది?

ఒరే సెల్వం, అది నిజంగా దెయ్యాల బంగ్లా అయితే ఆ ఇంట్లో రెండేళ్ళుగా ఉండే పనివాడు, వంటమనిషి, ఆమె భర్త తోటమాలి ఇన్నిరోజులు భయం లేకుండా ఎలా ఉన్నారు? దెయ్యాలేమైనా వాళ్ళకి చుట్టాలా? దెయ్యాలు అనేది మన భ్రమరా, రోజు కొన్ని లక్షలమంది పుడుతూ, పోతూ ఉంటారు వాళ్ళంతా దెయ్యాలో భూతాలో అయితే ఈ భూమి సరిపోతుందా? క్వార్టర్ మింగి గోడదూకితే మనల్ని చూసి ఆ దెయ్యాలే భయపడతాయి. నేను ఉండగా నీ మీద ఈగ వాలనిస్తానా, ఎన్నాళ్ళని చిల్లర దొంగతనాలు చేస్తూ పొట్టపోసుకుంటాం? కొడితే ఇట్టాంటి కొంపకొట్టాలి, మన పంట పండాలి. నేటికి మూడోనాడు రాత్రికి మన ఇద్దరం వేటకి బంగ్లాలోనికి వెళుతున్నాం,

ఆడ – రాజుల కాలంనాటి బొమ్మలు పంచలోహ విగ్రహాలు చాలా ఉండాయంట. అసలు పంచలోహాలు అంటే బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము. అంటే ఐదు కిలోల పంచలోహ విగ్రహంలో కిలో బంగారం, కిలో వెండి, కిలో ఇత్తడి, కిలో రాగి, కిలో ఇనుము వంతున ఉంటాయి. అంటే పెద్ద దేవుడు, దేవతా విగ్రహం ఒక్కటి లభించిందంటే మనకు ఇంక ఏ అప్పుల బాధ ఉండదు. ఈ విగ్రహాలు బంగ్లాలోపల పలుచోట్ల వాటిని అందంగా అలంకరించి ఉంచారంట. దొరికినకాడకి గోతాలలో వేసుకుని మనం తిరిగివస్తాం, ఈ దొంగతనం మనం చేసామని ఎవ్వరికి తెలియకూడదు. పోలీసోళ్ళు ఎంత అడిగినా దొంగలు అందరు చెప్పినట్లే నాకేం తెలియదు అని చెప్పాలి” అన్నాడు మారిముత్తు.

“అన్నా పక్కనే ఆరు అంతస్తుల బిల్డింగ్ ఉంది. దానిలో వెలిగే దీపాల వెలుతురు దెయ్యాల బంగ్లా లోపడుతుంది. పైగా దానిలో సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది కదా” అన్నాడు సెల్వం.

“తంబీ, అన్ని నాకు తెలుసు. బంగ్లాలోనికి వెళ్ళడానికి దాని ముందు భాగాన ప్రహరి గోడ లోపల తిరుగుతుండే డాబర్‌మేన్ కుక్కలను ఎలా నిద్రపుచ్చాలో కూడా నాకు తెలుసు. బంగ్లా లోనికి వెళ్ళడానికి సులువైన, అనువైన మార్గం ఎంపిక చేసుకున్నాను. అదంతా నే చూసుకుంటాను. నువ్వు నా వెంట ఉంటే చాలు. రెండు మూటల సామాన్లు దొరికాయనుకో, చెరొక మూటతో బంగ్లా దాటి రావాలి” అన్నాడు మారిముత్తు.

“అన్నా ఇప్పుడు ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చాలా తెలివైనోడు, ఆవలిస్తే పేగులు లెక్కబెట్టేవాడు, జాగ్రత్త” అన్నాడు సెల్వం.

“ఒరేయ్ నేను ఇట్టాంటోళ్ళను ఎంతమందిని చూసానో తెలుసా? నిక్కర్లు తొడిగే వయసునుండే నేను కిలాడిని. పోలీసోళ్ళ బాధలేకుండా అందుకు తగిన ముందు జాగ్రత్తగా మనిద్దరం మందు ఎక్కవతాగి కడుపునొప్పితో దొంగతనానికి ముందురోజే ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేరినట్టు, చేరి ఉన్నట్టు సాక్ష్యం ఉందిలే, దొంగతనం చేసామా, సొత్తు ఓ రహస్య ప్రదేశంలో భద్రపరచుకొని వెళ్ళి ఆసుపత్రిలో పడుకున్నామా. అర్థం అయిందా?” అన్నాడు మారిముత్తు.

“తెలివి అంటే నీదే భలే భలే, ఏందన్నా పదేళ్ళుగా నీ జట్టుగా ఉన్నా ఏనాడైనా పోలీసోళ్ళ దగ్గర నోరు ఇప్పానా” అన్నాడు సెల్వం.

“అందుకే కదరా ఎడకెల్లినా నిన్నే నాతో తీసికెళ్ళేది” అంటూ మారిముత్తు, చేతి సంచి లోని మందుతో పాటు, తినే పదార్ధాలు వెలుపలకు తీసాడు, ఇద్దరు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ మందు తాగసాగారు.

కొద్దిసేపటికి “అన్నా చాలా ఇబ్బందిగా ఉంది. రెండు నెలలుగా గది అద్దెకట్టలా కొద్దిగా డబ్బులు సర్దితే…” నసిగాడు సెల్వం.

“కొద్దిగా ఏందిరా, ఇదిగో ఐదు వేలు. కావలసినవన్ని తీసుకుని ఎల్లుండి రాత్రి పది గంటలకు వస్తా నీ టూవీలర్‌పై ఆ బంగ్లాకు వెళదాం, డబ్బులు దొరికాయికదా అని బండికి ఆయిల్ పోయకుండా నువ్వు పోసుకునేవు జాగ్రత్త, ఆ సమయంలో బంక్‌లో పెట్రోలుకు వెళితే సి.సి. కెమేరాలలో మనం కనపడతాం. అందుకని ఈ రోజే పెట్రోలు పోయించు. ఎట్టి పరిస్ధితులలోనూ ఈ దొంగతనం గురించి ఏ విషయమైనా మనం ఫోనులో మాట్లాడకూడదు. రేపు దొంగతనం జరిగాక పోలీసులు మన కాల్ డేటా చూసారంటే విషయం తెలిసిపోతుంది ఏ విషయమైనా ముఖాముఖిగా మాట్లాడవలసిందే” అన్నాడు మారిముత్తు.

“ఇప్పుడు ఆ బంగ్లాలో ఎంతమంది ఉంటున్నారు? అసలు ఆ బంగ్లా కథ ఏమిటి?” అన్నాడు సెల్వం.

“పాడు పడిన ఆ బంగ్లా గురించి ఎన్నోకథలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు ఆ బంగ్లా వారసుల వివాదం కోర్టులో ఉంది. పేరుమోసిన స్ధానిక వ్యాపారవేత్త సాగర్ గారు రెండేళ్ళక్రితం రాజ వారసులను సఖ్యత పరచి వారి నుండి ఆ బంగ్లా, దాని వెనుక ఉన్న ఆరు ఎకరాల స్ధలం కొనుగోలు చేసి బంగ్లా అంతా ఇతర రాష్ట్రాల పనివాళ్లతో రిపేర్లు చేయించాడు. బంగ్లా కింది భాగం హాలులో వందమందికి పైగా కూర్చునే అవకాశం ఉంది. చిన్న వేదికకూడా ఏర్పాటు చేయబడి ఉంది. అక్కడ తరచూ బంగ్లా యజమాని మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన కాళిదాసు రాజకీయ పార్టీకి సంభంధించిన సమావేశాలు జరుగుతుంటాయి.

బంగ్లాకి కొద్దిదూరంలో చిన్నఇంటిలో వంటమనిషి, ఆమె భర్త తోటమాలి, బంగ్లాలో పనివాడు రామయ్య ఉంటారు, బంగ్లా కార్ షెడ్‌లో కారు ఉంటుంది. ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి ఒక గుమాస్తా ఉంటారు. ఉదయం అల్పహారం, భోజనం అందంరికి వంటమనిషి చేస్తుంది. సాయంత్రానికి గుమాస్తా, కారు డ్రయివర్ వెళ్ళిపోతారు. గేటు దగ్గర ఉండే కావలిదారులు గేటు వదలి లోపలకు రారు. తోటమాలి వంటమనిషి వారి ఇంటిలో ఉంటారు. రాత్రి భోజనానంతరం అరవై ఏళ్ళు పైబడిన రామయ్య ఒక్కడే బంగ్లాలో పడుకుంటాడు, బంగ్లాలో వినిపించే వింత శబ్దాలు వినిపిస్తాయట. వాటికి అలవాటు పడ్డాడు రామయ్య.

ఎప్పుడైనా ఆ యింటికి ఎవరు అతిథులుగా వచ్చినా వారికి అన్ని వసతులు పనిమనిషి, రామయ్యే వంటమనిషి, తోటమాలి సాయంతో ఏర్పాటు చేస్తారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే రాత్రులు ఆ యింటి యజమాని వస్తుంటాడు, తెల్లవారక ముందే వెళ్ళిపోతుంటాడు. ఆయన వచ్చిన కారులోనే సొంతంగా నడుపుకుంటూ తిరిగి వెళ్ళిపోతాడు. బంగ్లాలోని కారు వాడటం చాలా అరుదు. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మాత్రమే ఆ కారు వాడతారు. మంచినీళ్లు, నిత్యావసర వస్తువులు అన్ని గుమాస్తానే చూసుకుంటాడు. వంట మనిషి భర్త అయిన తోటమాలి బంగ్లాకు దూరంగా పలురకాల కాయగూరలు, ఆకుకూరలు పండిస్తుంటాడు. పనస, జామ, మామిడి, సపోటా, సీతాఫలం వంటి పలు రకాల చెట్లు ఆ బంగ్లా చుట్టూ ఎప్పటినుండో కాస్తున్నాయి. బంగ్లాకు కొద్ది దూరంలో ప్రహరి లోపల భాగంలోనే ఔట్ హౌవుస్ ఉంటుంది. దాన్ని చాలా కాలంగా మూసే ఉంచారు. దానికి చేరువగా జనరేటర్ రూమ్ ఉంది. ఎప్పుడన్న కరెంటు ఆఫ్ అయితే దానంతట అదే పనిచేస్తుంది, కరెంటు వచ్చిందంటే అది తనంతట తానే ఆగిపోతుంది. ఇంకా బంగ్లా పైభాగాన సోలార్ సిస్టం ఏర్పాటు చేసారు. బంగ్లా యజమాని సాగర్ అయినప్పటికీ, రాజకీయ నాయకుడైన కాళిదాసు తరచు తన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎక్కువగా వాడుతుంటాడు.

రెండు డాబర్‌మేన్ కుక్కల్ని రాత్రులు వదలిపెడతారు. అవి బంగ్లా చుట్టూ రాత్ర అంతా తిరుగుతుంటాయి. ఇది నేను తెలుసుకున్న ఆ దెయ్యాల బంగ్లా కథ. అసలు భయమే మనిషికి పుట్టుకతో వచ్చే తొలి శత్రువు అని మనిషి ఎన్నడు తెలుసు కుంటాడో కదా!” అన్నాడు మారిముత్తు.

“నిజమే అన్నా వందేళ్ళు బ్రతమని తెలిసి కూడా మనిషి వెయ్యేళ్ళకు సరిపడా సంపాదిస్తాడు” అన్నాడు సెల్వం.

“మాబాగా చెప్పావురా సెల్వం, మనిషి తను మారడు కానీ లోకం మారాలంటాడు” అన్నాడు మారిముత్తు.

అలా మాట్లాడుకుంటూ కొద్దిదూరంలోని ఇరానీ హాటల్‌కు వెళ్ళారు.

“సెల్వం నీకు ఏం కావలన్నా కడుపు నిండా తిను, రాత్రికి ఏం కావాలో పార్సిల్ కట్టించుకో బిల్లు నేనే ఇస్తాలే” అన్నాడు మారిముత్తు.

తనకు కావలసిన పదార్ధాలు ఆర్డర్ చేసాడు సెల్వం. ఇద్దరూ భోజనం చేసాక సెల్వం తన గదికి, మారిముత్తు తన ఇంటికి బయలుదేరారు.

వందల్లో చిల్లర దొంగతనాలు చేసిన మారిముత్తూ, సెల్వాలకు, పెళ్ళం పిల్లలు లేరు, దొంగతనంగా సంపాదించడం తాగి జల్సా చేయడమే వారి పని.

ఆ ప్రాంతం పోలీస్ స్టేషన్‌కి వీళ్ళు పాత నేరస్థులుగా బాగా పరిచయస్థులే!

ఆ ప్రాంతంలో ఎక్కడ ఎవరు దొంగతనం చేసిన పాత నేరస్థులు అందరినీ పోలీసులు పిలిపించడం విచారించడం పరిపాటే!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here