Site icon Sanchika

భూతాల బంగ్లా-6

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[భూతాల బంగ్లాకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తారు రచయిత. ఎన్నడో బ్రిటీష్ వారి కాలంలో కట్టిన ఆ బంగ్లాని వారసులు అమ్మివేయడంతో స్ధానిక వ్యాపారవేత్త సారధి ప్రముఖ రాజకీయ నాయకుడు కాళిదాసు సహాకారంతో ఆ బంగ్లాని కొని రిపేరు చేయించి ఎంతో సుందరంగా తయారు చేయించినప్పటికి దాని పేరు దెయ్యాల బంగ్లా గానే స్ధిరపడింది. ఆ బంగ్లా వెనుక మరో భవనంలో తన వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు సారధి. ఆరు అంతస్తులున్న ఆ భవనంలో ఏ అంతస్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వారంలో ఒకరోజు సాగర్ స్వయంగా పర్యవేక్షిస్తాడు. మంత్రి కాళిదాసు సహకారం ఉంది కాబట్టి అధికారులు ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఆ దెయ్యాల బంగ్లాలో దొంగతనానికి ప్రణాళికలు వేస్తారు సెల్వం, మారిముత్తు. సెల్వం దెయ్యాలకి భయపడితే, మారిముత్తు దెయ్యాలంటే భ్రాంతి అనీ, దెయ్యాలు ఉన్నాయీ, లేవనే అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వివరిస్తాడు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో, ఎలా దొంగతనం చేయాలో, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చర్చించుకుంటారు. ఆ రాత్రికి కావల్సింది తిని, తాగీ నిద్రపోతారు. ఇక చదవండి.]

[dropcap]బై[/dropcap]ట ప్రపంచానికి కార్ల మెకానిక్‌గా మంచి పేరు పొందిన భరత్, ఆ రోజు తనకు వచ్చిన పోస్టు చూస్తూ ఫ్రం అడ్రస్ లేని కవర్ ఓపెన్ చేసాడు. కవరులో తెల్లకాగితం మాత్రమే ఉంది. క్యాండిల్ వెలిగించి ఆ కాగితానికి క్యాండిల్ వెలుగు సెగ చూపించాడు. క్రమంగా ఆ కాగితం పైన…

11379 – చెన్నయ్.

అని కనబడింది. ఆ లెటర్ తనతోపాటు మాదకద్రవ్యాల వ్యాపారుల గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న సుదర్శన్ గారు రాసింది. ఒక విధమైన రసాయనం కలిగిన పెన్నులు తమ డిపార్ట్‌మెంటు వారు మాత్రమే వినియోగిస్తారు. రాసే సమయంలో మామూలుగానే అక్షరాలు కనిపిస్తాయి. అక్షరాలు గాలికి ఆరే కొద్ది అదృశ్యమౌతాయి. ఆ కాగితం వేడి చేస్తే దానిపై ఉన్న అక్షరాలు కొద్ది సేపు మాత్రమే కనిపించిన అనంతరం శాశ్వతంగా అదృశ్యమౌతాయి. దురదృష్టవశాత్తు సుదర్శన్ తన అపార్ట్‌మెంట్‌కు చేరువలో వారం క్రితం హత్య చేయబడ్డారు. హంతకులు రౌడీషీటర్స్ తంగవేల్, కనకరాజ్‌లుగా సి.సి. కెమేరాల ద్వారా గుర్తించినప్పటికి వారి పేర్లు ప్రకటించకుండా వాళ్ళను అరెస్టు చేయకుండా కేసు దర్యాప్తు జరుగుతుంది అని పై అధికారుల సూచన మేరకు పోలీసులు తెలియజేసారు. ఇటువంటి హత్యలు ఎన్నో చేసిన ఆ రౌడీషీటర్స్ దైర్యంగా తిరగ సాగారు.

సుదర్శన్ వంటి అధికారిని హత్య చేయవలసిన అవసరం వారికి ఏముంది? అనుకుని వారి పైన అత్యంత రహస్యంగా నిఘా పెట్టారు వాళ్ళ సెల్‌ఫోన్‌లు టాప్ చేయబడ్డాయి. టాప్ చేయబడిన రౌడీషీటర్స్ ఫోన్ల సంభాషణ వింటన్న భరత్‌కి విషయం అర్ధమైయింది్ – వాళ్ళు చెన్నయ్ నగర మత్తుపదార్ధాల రిటైల్డ్ డీలర్స్ అని.

రెండు సంవత్సరాల క్రితం వరకు సొంత ఇల్లు లేనివారు నేడు కోట్లు ఖరీదు చేసే సొంత బంగళాలలో నివసిస్తున్నారు.

ఎవ్వరికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఆ రౌడీషీటర్స్‌ని అదుపులోనికి తీసుకుని తమ రహస్య కార్యాలయానికి తరలించమని భరత్ తన డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం ఇచ్చాడు.

11379 నెంబర్ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి నమ్మకమైన తమ యంత్రాంగంలోని వ్యక్తులు ప్రయత్నించసాగారు. మొదట ఆ నెంబర్ కలిగిన వాహనాలను, అనంతరం చివర ఆ నెంబర్ కలిగిన సెల్ ఫోన్, లాండ్‌లైన్ ఫోన్ నెంబర్ కలిగిన వారిని ఇలా సహనంగా ఎన్నో రోజులు వెదకసాగారు. ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. మరికొన్నిరోజుల అనంతరం ఆ నెంబర్ కలిగిన వంట గ్యాస్, కరెంటు మీటర్ సర్వీస్ నెంబర్ పరిశీలిస్తూ భరత్ ఉలిక్కి పడ్డాడు. ఇంటి కరెంటు సర్వీసు నెంబర్, ప్రభుత్వమే ఇంటి అద్దె, కరెంటు మొదలగునవి చెల్లిస్తుంది కనుక వాటిని గురించి భరత్ ఎప్పుడూ పట్టించుకోలేదు.

మరుదినం ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ వారి సహాకారంతో మీటర్ రీడింగ్ తీసే వ్యక్తితో ఆ నెంబర్ ఇంటికి వెళ్ళాడు, కరెంటు మీటర్ రీడింగ్‌ను అతను చూస్తుండగా భరత్ మెయిన్ స్విచ్ ఓపెన్ చేసాడు. అందులో రెండు ఫ్యూజుల మధ్యలో నాలుగు మడతలు పెట్టిన కవరు ఉంది. ఆ కవరు తీసుకుని తన జేబులో భద్రపరుచుకుని ఇంటికి వెళ్ళి చూసాడు భరత్. అది ఖాళీ కవరు. అందులో ఎటువంటి లెటర్ లేదు. చిరునామా మాత్రం అతని పేరిటే రాసి ఐదు రూపాయల స్టాంపు అంటించి ఉంది. స్టాంపు అంటించి లెటర్ రాయకుండా ఆ కవర్ తను తీసుకునే విధంగా తనకు లెటర్ ద్వారా సుదర్శన్ తెలియజేసాడు, అంటే ఖచ్చితంగా ఈ కవర్‌లో ఏదో నిగూఢ రహస్యం దాగి ఉంది అనుకుంటూ స్టాంప్ అంటుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ఆ స్టాంపు అడుగున చిన్న మెమిరికార్డు ఉండటం గమనించి దాన్ని కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తు దానినుండి వెలువడిన సమాచారం దీక్షగా చదివి, అనంతరం అందులోని ఫోటోలు వివరాలు, ఢిల్లీ లోని తమ కార్యాలయానికి పంపించాడు.

సుదర్శన్ సమాచారం ఆ ఇంటి మెయిన్ స్విచ్‌లో పెట్టి, ఆ విషయం తనకు పోస్టల్ కవరు ద్వారా రహస్య సమాచారం అందించాడు. సుదర్శన్ తమ ఉనికి పసికట్టాడని ఊహించిన మత్తు పదార్ధల డీలర్స్, రౌడీషీటర్లు అయిన కనకరాజ్, తంగవేల్ ఒక రాత్రి తనను కలవడానికి వచ్చిన సుదర్శన్‌ని హత్య చేసారు అని ఊహించాడు. దాదాపు మత్తుపదార్ధాల చిల్లర వ్యాపారుల వివరాలు అన్ని సుదర్శన్ సమాచారంతోనూ, తనూ కొంత సేకరించాడు ఇహ మిగిలింది ఈ డ్రగ్ రాకెట్ మూలవిరాట్ ఎవరో తెలుసుకోవడమే. సుదర్శన్ ఇక్కడకు రావడం వలన తన ఉనికి కూడా దాదాపు వాళ్ళు పసికట్టే ప్రమాదం ఉంది కనుక తనపై దాడి జరుగకముందే తంగవేల్, కనకరాజ్‌ల కథకు ముగింపు ఇవ్వలని లాండ్‍లైన్ ఫోన్ చేతిలోనికి తీసుకున్నాడు.

***

మూడురోజుల అనంతరం సెల్వం తన బండిపైన మారిముత్తును ఎక్కించుకుని రాత్రి పదిగంటలపైన బంగ్లాకు బయలుదేరాడు. చుట్టూ చీకటి రోడ్డుకు ఇరువైపుల నగరకేసరి, యూకలిప్టస్, మామిడి, సపోటా, సీతాఫలం వంటి పలురకాల పండ్లతోటలు ఉన్నాయి. దారిపొడవునా కీచురాళ్ళ ధ్వని, బాగా తెలిసిన రోడ్డు కనుక బండి లైట్లు వేయకుండా చీకట్లో నెమ్మదిగా పావుగంట ప్రయాణం చేసి బంగ్లా పరిసరాలకు చేరిన ఇద్దరు రోడ్డు పక్కన ఉన్న పొదల చాటున తమ బండి ఇతరులకు కనుపడకుండా ఆపి, దెయ్యాల బంగ్లా చేరుకున్నారు.

లుంగీ పైకి ఎగకట్టి నిక్కరు జేబులోని క్వార్టర్ మందు బాటిల్ తీసి సగం తాగి మిగిలిన సగం సెల్వానికి ఇచ్చి, చేతి సంచిలోని మత్తుమందు కలిపిన కోడి తొడలు నాలుగు ప్రహరి గోడలోపలకు విసిరాడు మారిముత్తు. వేంచిన కోడి మాంసం ముక్కల వాసన చూస్తూ వచ్చిన రెండు డాబర్‌మేన్ జాతికుక్కలు ఆ మాంసం తింటూనే మత్తుగా అక్కడే నిద్రపోయాయి కొద్దిసేపటికి.

దూరంగా నక్కలు ఊళ వేస్తున్నాయి. పండ్ల సీజన్ కూడా కాదు కనుక సమీప పండ్ల తోటలకు ఎవరూ కావలిదారులు లేరు.

బీడి వెలిగించిన మారిముత్తు కొంత సమయం ఆగిన అనంతరం ప్రహరీ గోడపక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి కొమ్మకు తాడుకట్టి నెమ్మదిగా ప్రహరి గోడ లోపలి భాగం లోనికి దిగాడు. అతన్ని అనుసరించాడు సెల్వం. ఇద్దరు వడివడిగా బంగ్లాలో వెళ్ళడానికి ఎంపిక చేసుకున్న ప్రాంతం చేరారు.

”రేయ్ సెల్వం డ్రయిన్ వాటర్ పైపుల పట్టుకుని నేను బంగ్లా పైభాగానికి వెళ్ళి అక్కడ అగ్గిపుల్ల గీస్తాను. అది చూసి నువ్వు చప్పుడు కాకుండా నేవెళ్ళన దారినే బంగ్లా పైభాగానికి రా” అని గోతాలు తుండుగుడ్డతో వీపుకు కట్టుకుని మూడు అంతస్తుల బంగ్లాపై బాగానికి చేరి, పిట్టగోడలోనుండి లోపలకు చూస్తూనే భయంతో వెర్రికేక పెడుతూ అప్రయత్నంగా చేతులు రెండూ వదలడంతో అంత ఎత్తు నుండి వేగంగా కింద పడి సిమెంట్ దిమ్మెకు తల తగడంతో మారిముత్తు తలపగిలి క్షణాలలో అక్కడే మరణించాడు.

తన కళ్ళముందు జరిగిన విషయానికి భయపడిన సెల్వం పరుగు పరుగున వెళ్ళి చెట్టుకు కట్టిన తాడు అందుకుని చెట్టు పైకి చేరి బంగ్లాపై భాగాన్ని చూసాడు. అక్కడ రెండు అస్థిపంజరాలు చిందులు వేస్తూ కనిపించాయి అతనికి. తడి ఆరిన గొంతుకతో చెట్టుదిగి భయంతో వణుకుతూ వచ్చి పొదల మాటున ఉంచిన బండిపై వేగంగా తన గదికి చేరి తను చూసిన మారిముత్తు మరణ దృశ్యం మర్చిపోలేక మందు బాటిల్ తీసి నీళ్ళు కూడా కలుపకుండా పూర్తిమైకం ఎక్కేదాకా తాగి పక్కపై వాలిపోయాడు

***

కళాశాలకు కొద్ది దూరంలోని టీ అంగడి, దాని పక్కనే ఉంది కిళ్ళీ షాపు. టీ తాగిన వారిలో కొందరు అక్కడే సిగరెట్ కాల్చివెళుతున్నారు. ఆ టీషాపుకు ఎదురుగా రోడ్డుకు అవతల భాగాన సుమో వాహనం ఆగి ఉంది. దాని డ్రైవర్ బానెట్ ఎత్తి చాలా సేపుగా రిపేరు చేస్తున్నాడు. సుమోలో ఉన్నవ్యక్తి అత్యంత అధునాతనమైన వీడియో కెమెరాతో రహస్యంగా కిళ్ళీ షాపు వ్యాపారాన్ని రికార్డింగ్ చేయసాగాడు.

పలువురు యువకులు ఐదు వందల రూపాయల నోటు ఇచ్చి ఒక సిగరెట్ తీసుకు వెళుతున్నారు. మిగిలిన చిల్లర అడగకుండా వెళ్ళిపోవడం వీడియో తీస్తున్న వ్యక్తికి ఆశ్చర్యపరచింది. ఒక సిగరెట్ వెల ఐదు వందలా? అనుకున్నాడు.

అలా ఐదువందలు ఇచ్చి సిగరెట్ పాకెట్ తీసుకున్నయువకులు, కళాశాలకు పక్కనే ఉన్న పార్కులోనికి వెళ్ళడం గమనించి ఎవరికో ఫోన్ చేసాడు సుమోలోని వ్యక్తి.

అప్పటివరకు టీ కొట్టువద్ద చేతిగుడ్డలు (కర్చీఫ్) అమ్ముతున్న వ్యక్తి ఫోన్ రావడంతో మాట్లాడి పార్కులోనికి వెళుతున్న యువకులను అనుసరించాడు.

ఆ యువకులు గుబురుగా ఉన్న ఒక క్రోటన్ చాటున చేరారు. జేబులోని సిగరెట్టు తీసిన ఒక యువకుడు దాన్ని లైటర్ మంట పైన ఉంచి గుడ్రంగా వేళ్ళమధ్య ఉన్న సిగరెట్‌ను వేడి చేయసాగాడు. నిమిషంలో లైటర్ వేడికి సిగరెట్ లైటర్ వేడికి నల్లగా రంగుమారింది. అంతకు మునుపే దానిలో యాష్ ఆయిల్ (గంజాయి నుండి తయారు చేయబడినది) సిరంజి ద్వారా ఎక్కించి ఉండటంటో వేడి తగలగానే సిగరెట్ లోని ఆయిలు కరిగి సిగరెట్ మొత్తం అలుముకుంది. ఒక యువకుడు ఆ సిగరెట్టు వెలిగించి గట్టిగా దమ్ము లాగి మరో యువకుడికి అందించాడు. అలా ఒకరి తరువాత ఒకరు మార్చి మార్చి ఆ సిగరెట్టు పీల్చసాగారు. పొదలాంటి క్రోటన్ చాటున వారిని అనుసరించి వచ్చిన వ్యక్తి యువకుల చర్యను తన ఫోనులో రహస్యంగా చిత్రీకరించసాగాడు.

ఉదయం పదిగంటలకు పార్కులోనికి వెళ్ళిన యువకులు దాదాపు రెండు గంటల సమయం వరకు మత్తులో మినిగి ఉండి అనంతరం నెమ్మదిగా పార్కు వెలుపలకు వెళ్ళారు. అప్పటివరకు వాళ్ళను గమనిస్తున్న వ్యక్తి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి తను తీసిన వీడియో అవతల వ్యక్తికి పంపించి అక్కడ రాలినసి సిగరెట్ నుసిని, పారవేసిన సిగరెట్ ముక్కను ప్లాస్టిక్ కవర్లో భద్ర పరచుకుని వెళ్ళిపోయాడు.

ఈ మాదకద్రవ్యాలు చెన్నయ్ నగరంలో వ్యాపారులు అందరికి తన మనుషుల ద్వారా బ్లూ సిగరెట్ అందించేది ఇద్దరు రౌడీషీటర్లు. వారే తంగవేల్, కనకరాజ్. వీరికి మత్తుపదార్ధాలు ఎక్కడినుండి వస్తున్నాయో తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు.

ఒకరోజు రాత్రి టూవీలర్‌పై మాదకద్రవ్యాలు అందజేసి నగదు అందుకుని చిన్న వీధులలో కారులో తిరగడం కష్టం కనుక టూవీలర్ పై తిరిగి వస్తున్నవారికి సుమో వాహనం అడ్డంపెట్టి ఇరువురిని కొందరు వ్యక్తులు చీకటిగా ఉన్న ఆ వీధిలో కిడ్నాప్ చేశారు. మరునిమిషమే వారి సెల్ ఫోనులు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. వారి టూవీలర్ కూడా రహస్యంగా దాయబడింది.

***

ఉదయం తొమ్మిది గంటల సమయం. చెన్నయ్ నగర పడమర దిశగా పూందమల్లి హైవేస్ దాటి రాణిపేట వెళ్ళే దారిలో ‘శక్తి కార్ సర్వీసింగ్’ కారు షెడ్ ఆవరణలో పలు రకాల కార్లు రిపేరు నిమిత్తం ఉన్నాయి. పెద్ద రేకుల షెడ్‌లో రకరకాల వాహనాలు రిపేరు జరుగుతున్నాయి.

అది నిజానికి కార్ రిపేర్ షెడ్ అయినప్పటికి అక్కడ భూగృహంలో మాదక ధ్రవ్యాల నిరోధకశాఖ రహస్య కార్యాలయం అత్యంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అక్కడకు సుమో డ్రవ్ చేసుకుంటూ వచ్చిన భరత్, కారు అక్కడ వదలి షెడ్డు లోనికి వెళ్ళి బట్టలు మార్చుకుని, కారు రిపేరు చేయసాగాడు.

అతను ఆ షెడ్డు యజమాని కావడంతో అతను ఎప్పుడు వచ్చినా వెళ్ళినా ఎవరూ పట్టించుకోరు. అతనితోపాటు మరో ముగ్గురు మెకానిక్‌లు, హెల్పర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళంతా తమ భోజనం కారు షెడ్ లోనే చేస్తారు. ఎన్నడూ ఆఫీస్ లోనికి వెళ్ళరు అక్కడ పనివారు. వారు జీతాలు తీసుకునే రోజు తప్ప మరెన్నడు ఆఫీస్ లోనికి వెళ్ళరు.

మధ్యాహ్నం భోజన సమయంలో, భరత్ బిల్డింగ్ ఆఫీస్ లోపలకు వెళ్ళాడు. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా సీక్రెట్‌గా ఉన్న మాదక ద్రవ్యాల నిరోధక వ్యక్తులు. మెకానిక్ వేషాలలో అక్కడ మరెవ్వరికి తెలియకుండా ఉన్నారు. ఆఫీస్ లోనికి వచ్చిన భరత్ చూస్తూ మెకానిక్ డ్రస్ లోని వ్యక్తి సెల్యూట్ చేస్తూ, బీరువా వెనుక భూగర్భానికి వెళ్ళే రహస్యగది తలుపు తాళాం తీసాడు. భూగర్భరహస్య గదికి చేరగానే అక్కడ సాధారణ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు సెల్యుట్ చేసారు.

కుర్చీలకు కట్టివేయబడి ఉన్న వ్యక్తులను చూస్తూ “ఏమైనా చెప్పారా?” అన్నాడు భరత్.

“లేదు రాత్రి తీసుకువచ్చినప్పటినుండి నోరు విప్పడం లేదు. మేము చేయని ప్రయత్నం లేదు. ‘మాకు ఏమి తెలియదు’ అన్నమాటతప్ప మరో మాట లేదు” అన్నారు వారు.

“అంటే మాకేం తెలియదు అంటారు వీళ్లు, సరే రేపు వీళ్ళని నేను వచ్చిన తరువాత వీళ్ళవద్ద వాంగ్ములం తీసుకుని వదిలివేధ్ధాం. ఇదిగో ఈ పదివేలు తీసుకువెళ్ళి వాళ్ళిద్దరికి కొత్త బట్టలు, వాళ్ళు అడిగిన మందు, ఆహారం, సిగరెట్లు తీసి ఇవ్వండి. కట్లు ఊడదీసి ఉంచండి. వాళ్ళు తిన్న తరువాత ఈ గదిలోనే ఉండనివ్వండి, పారిపోయే ప్రయత్నం చేస్తే కాల్చేయండి, భయపడవద్దు, మీ పైన ఏ కేసు రాకుండా నే చూసుకుంటా” అని అక్కడ ఉన్న ఓ అధికారికి డబ్బులు ఇచ్చాడు భరత్.

“రేపు మమ్మల్ని వదిలేస్తుంటే ఈ రాత్రి పారిపోయే ప్రయత్నం చేయడానికి మేము తిక్కలోళ్ళం కాదు” అన్నాడు కుర్చీకి తాళ్ళతో కట్టబడిన తంగవేల్.

భరత్ ఆ గదిలోనుండి వెలుపలకు వెళుతూ పదివేలు తీసుకున్న ఆఫీసర్‌ని తనతో తీసుకువెళ్ళి ‘పగతో పాయసం తాగించలేము. ప్రేమతో విషం తాపించవచ్చు. వాళ్ళనుండి నిజం ఎలా రాబట్టలో నాకు తెలుసు’ అంటూ రాత్రికి వాళ్ళకి ఏంచేయాలో, ఎలా చేయాలో వివరించాడు. అతని ఆలోచనా విధానానికి అబ్బురపడిన ఆ వ్యక్తి భరత్‌కు సెల్యూట్ చేసాడు.

భరత్ తన సుమోతో తూర్పుదిశగా చెన్నయ్ నగరం వైపుకు వెళ్ళిపోయాడు.

ఆ రోజు రాత్రి రహస్యంగా బంధింపబడిన ఇద్దరికి వారు కోరుకున్న సరంజామా అంతా ఏర్పాటు చేయబడింది.

“మీ ఇద్దరికి కొత్తబట్టలు తెల్లవారి ఇవ్వమన్నాడు మా సార్” అన్నాడు మెకానిక్ వేషంలోని వ్యక్తి.

“ఏందయ్య మాకేదో అనుమానంగా ఉంది. ఇన్ని తినబెట్టి కొత్త బట్టపెట్టి పంపుతున్నారంటే ఆలోచించాలిసిన విషయమే ” అన్నడు బందీలలో ఒక వ్యక్తి.

“అంత భయమైతే మీరు తినబోకండి, నేను మావాడు కలసి హాయిగా ఇంత ఖరీదైన మందు తాగి ఇవి తింటాం, ఈయనగారు చాలా మంచోడు. మీరు నిర్ధోషులని నమ్మి వదిలివేయమన్నాడు. మీరు వెళ్ళిపోతే మాకు పని ఒత్తిడి తగ్గుతుంది, రేపు సార్ వచ్చాక మీకు కళ్ళకు గంతలు కట్టి తీసుకు వెళ్ళి కోయంబేడు బస్‍స్టాండ్‌లో వదిలి మీ మొబైల్స్ మీకు ఇస్తాం. మీ టూవీలర్ కూడా అక్కడే స్టాండ్‌లో ఉంది” అన్నాడు వాళ్ళకు అన్ని తెచ్చి ఇచ్చిన వ్యక్తి.

ఇద్దరు బంధితులు బాగా తాగి తిన్న అనంతరం మత్తులో ఉప్పుడు, ఆ ఇద్దరిని తల్లక్రిందులుగా ఫేన్ హుక్కుకు వేళ్ళాడతీసి, గదికి తాళం పెట్టి ఏ.సి. ఆన్ చేసి పై గదిలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు.

తెల్లవారి బంధితులు ఉన్నగది తలుపులు తీసి ఆ గదిలోనుండి వస్తున్న దుర్వాసనకు ముక్కులు మూసుకున్నారు వాళ్ళు.

ఫ్యాన్ హుక్కుకు తల్లకిందులుగా వేళ్ళాడతీయబడిన బంధితులు “అయ్యా అంతా చెపుతాము, మమ్మల్ని కిందకి దించండి” అని దీనంగా వేడుకోసాగారు.

వాళ్ళను కిందకు దించి బాత్ రూమ్ లోనికి పంపి, షాంపు బాటిల్ విసిరివేసారు.

వాళ్ళు స్నానం చేసాక కొత్త టవల్స్ ఇచ్చిన అనంతరం, గదిలో రాత్రి వాళ్ళు చేసిన అసహ్యమంతా వాళ్ల చేత కడిగించిన తరువాత వాళ్ళకు కొత్త బట్టలు ఇచ్చి, గది అంతా రూమ్ పెర్‌ప్యుమ్ స్ప్రే చేశారు. వాళ్ళ తమకు మత్తు పదార్ధాలు ఎవరి ద్వారా వస్తున్నాయో తాము చిల్లర డీలర్లకు ఎలా అమ్మేది వివరంగా చెప్పిన వారి వద్ద నుండి వీడియో ద్వారా, రాతపూర్వకంగా వాగ్మూలం తీసుకుని పైకి వెళ్ళారు వారు.

ఇదందా వీడియో చూస్తున్న భరత్ తమ వాళ్ళు తీసుకువచ్చిన కాగితాలు, వీడియో చిప్‌ను తన వద్ద భద్రపరచుకొని, బందీలు ఉన్నగది లోనికి వెళ్ళిన భరత్ “ఇవిగో ఉదయం అల్పాహారం తినండి” అని వారికి చెరో పాకెట్ అందించాడు.

భయం భయంగా ఒకరి మొహలు ఒకరు చూసుకోసాగారు కనకరాజ్, తంగవేల్.

“భయపడకండి మీ చేత నిజం చెప్పించడానికి మీరు రాత్రి తిన్న బిరియానిలో నాలుగు సుఖవిరేచన మాత్రలు కలిపి ఇప్పించాను. తల్లకిందులుగా వేళ్ళడదీసేసరికి కడుపులోనిది అంతా వెలుపలకు వచ్చేసరికి ఆ దుర్వాసన వేదన భరింపలేక ఎన్నివిధాల ప్రయత్నించినా నోరు విప్పని మీరు నిజం చెప్పారు. మీ వంటి పైన చేయి వేయకుండా మీతో నిజం చెప్పించాను. తినండి, ఇందులో ఏ మందు కలపవలసిన అవసరం మాకు లేదు.” అన్నాడు.

భయపడుతూనే వాళ్ళు ఆ యువకుడు తెచ్చిన ఇడ్లీలు తినసాగారు.

(సశేషం)

Exit mobile version