Site icon Sanchika

భ్రమ విభ్రమ

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘భ్రమ విభ్రమ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]డవి అందాల తెగనరికే
హోరు
అనంతానంత అస్తిత్వగౌరవాన్ని అటుకెక్కించే జోరు
నలిగేది మట్టి ప్రాణమే
రసపట్టు నృత్యకావ్యమైన గిమ్మిక్కల అబద్ధ భాషలో

వీచే గాలికి సుమాలు
చేజారిన ఊహల బాసలు
తలకెక్కకదని సేవించే మద్యం
మత్తెక్కించి చిత్తుచేసే తీరున పాలన

పల్లకీలో ఊరేగిన ఆశల దారి
అంతేలేని వేటలో ఉచితాల బేహారి
ఆకర్షణ ఎరకు బలి
అతుకుల గతుకుల గల్లీ ఉత్తినే

మారని రాజ్యంలో మారింది రాజే
మంత్రాంగ భాషలో యంత్రాంగ అనువాదం
ఊసుల గాలి కదలికలు
మోజుల లోలకం నడక ఏ గట్టుకో!

నిజం
ఏ కత్తికీ బువ్వ కాదు
ఎవరున్నా లేకున్నా బతికే నిప్పురవ్వ అది

తప్పుడు అన్వయం చెలగాటం
అది బాధల సంతసం
సంపెంగ పొదలో కాళపరిష్వంగం
శృతిలేని బాణీలో లయ తప్పిన సంగీతం

నిజాన్ని కప్పేయడం విరామమే కావొచ్చు
విశ్వంలో కాదది చరమ గీతం

Exit mobile version