Site icon Sanchika

భ్రమణం

“ముందు తరాలకు ఆస్తుల కంటే విలువైన ఆక్సీజన్ అందించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలను పెంచుదాం” అంటున్నారు బాలకృష్ణ పట్నాయక్ ఈ కవితలో.

ప్రపంచీకరణ నేపథ్యం
ధనికుల స్వర్గధామం
పేదవాడిని పీక్కుతినే
పెద్దవాడి కుటిలత్వం
ప్రశ్నించే హక్కు లేని
రాజకీయ చదరంగం

గిరులు కరుగుతున్నాయి
తరువులు తరుగుతున్నాయి
మైదానాలు పచ్చికబయళ్ళు
కార్ఖానాల పొగలు చిమ్ముతున్నాయి
పంటభూములు సెజ్‍ల సెమినార్లగాను
బంజరు భూములు బిల్డింగుల నమూనాలుగా
మారుతున్నాయి.

అరణ్యశరణ్యం లేని వన్యమృగాలు
జనావాసాల మీద పడుతున్నాయి
పదజతుల మయూరాలు కార్టూన్ కామిక్స్ లోనూ
స్వరగతుల కోయిలలు కీబోర్డు తీగలలోనూ
ప్రతిధ్వనిస్తున్నాయి

సహజవనరులు అంతరించి చికిత్సకందని
రోగాలు సంక్రమిస్తున్నాయి
ప్రాణవాయువు అందక ఆక్సీజన్ మాస్క్‌లే
అలంకారాలుగా మారనున్నాయి
ప్రపంచీకరణ సూత్రం కాకూడదు విశ్వవినాశనం
అందుకే ముందు తరాలకు
ఆస్తుల కంటే విలువైన ఆక్సీజన్ అందిద్దాం
పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటుదాం
ఆమ్లజని నిలువలను పుష్కలంగా పెంచుదాం.

Exit mobile version