Site icon Sanchika

భ్రాంతి

[dropcap]అ[/dropcap]వి, నేను కలకత్తా లో పని చేస్తున్న రోజులు.

“కలకత్తాలో శాకాహారులు తక్కువరా! అందరూ జలపుష్పాలు తింటారు అక్కడ. నువ్వెలా బతుకుతావో, ఏమిటో” అంటూ ఆత్మీయులంతా తెగ భయ పెట్టారు నన్ను.

“నీళ్ళలో వుండే పువ్వులు తినడం ఏమిటర్రా? కలవ పువ్వుల్లాంటివి తింటారా, ఏమిటీ, కొంపదీసి? పోనీ! తింటే తిననియ్యండి. నష్టం ఏమిటీ?” అని గట్టిగానే వాదించాను.

“నీ మొహం!’జల పుష్పాలు’ అంటే, చేపలు. అక్కడ, శాకాహారులు కూడా చేపలు తింటారన్న మాట! నీకు గడ్డు రోజులు తప్పవులే” అని కొట్టినంత పని చేసి, ఢంకా కూడా బజాయించి చెప్పారు.

నిజం చెప్పొద్దూ, ఈ సారి నిజం గానే, భయపడ్డాను.

“పోనీ లెండర్రా! బయట ఎక్కడా తినను. నాకు వంట బాగానే వచ్చును. నేను వొండుకున్న తిండే తింటాను. జాగ్రత్త గానే బతుకుతాను. మీరు మరీ ఏడిపించకండి” అంటూ వాళ్ళని కసురుకున్నాను, నా మీద నాకున్న నమ్మకంతో.

నాకు తెలిసిన కొద్దిపాటి వంట మీద నమ్మకముతో, ధైర్యంగానే కలకత్తా వెళ్ళాను.

“వెధవ ఉద్యోగం వొదిలేస్తే బాగుండేది!” అని అనిపించినా, చూస్తూ, చూస్తూ, బేంకు ఉద్యోగం ఎక్కడ వొదులు కుంటానూ? ఎలాగో, ఒక యేడాది బండి లాగితే, ఎలాగో ఒక లాగ, ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని, మళ్ళీ ఆంధ్రాకి వచ్చెయ్యొచ్చు అనే ఆశ బాగానే వుంది.

రోజులు, నా స్వయం పాకంతో, బాగానే గడుస్తున్నాయి. లావెక్కక పోయినా, చిక్కనూ లేదు.

“కలకత్తా వెళ్ళి, చిక్కి పోయి వస్తే, నీకు పిల్ల నెవరూ ఇవ్వరు! బాగా వొండుకుని తిను” అని మా అమ్మ బాగానే బోధించి పంపింది.

“అలాగే, అమ్మా! నువ్వే చూస్తావుగా, ఎలా లావెక్కుతానో” అంటూ అమ్మకి భరోసా ఇచ్చాను.

లంచ్‌ టైంలో, కొందరం బేంకు ఉద్యోగులం కలిసి, తిళ్ళు తినేవాళ్ళం. అందరూ తమ తమ కొంపల్లో వొండుకున్నవే, డబ్బాల్లో తెచ్చుకునేవారు.

“అబ్బా! నీ డబ్బా లోంచి ఘుమ ఘుమ వాసనలొస్తున్నాయి. ఏం వొండావూ?” అంటూ ఒకడు, తన నోట్లోంచి చెంచా తీసి, నా డబ్బాలో పెట్టబోయాడు.

ఒక్క సారిగా జడుసుకుని, వాడి చేతిని దూరంగా తోసేశాను.

ఆ విసురుకి, వాడు కూడా జడుసుకుని, తెల్లబోయి, నా వేపు దీనంగా చూశాడు.

“నీ ఎంగిలి చెంచా, నా డబ్బాలో పెడతావేం? నాకు నచ్చదు అలాగ. నీకు కావాలంటే, అడుగు. నేనే కాస్త పెడతాను” అంటూ, ఒక శుభ్రమైన చెంచాతో, నా డబ్బాలోది కాస్త వాడికి వొడ్డించాను.

తిని మెచ్చుకున్నాడు గానీ, అప్పణ్ణించీ, నేనంటే కాస్త భయంగా మెసిలేవాడు, లంచ్ టైంలో.

నా పద్ధతి ఏమిటో, అందరికీ అర్థం అయిపోయింది, ఆ సంఘటనతో. మళ్ళీ, నా డబ్బా జోలికి ఎవడూ రాలేదు.

రోజులు, అలా భారంగా గడుస్తున్నాయి. ఇంటి మీద దిగులు ఎక్కువవుతోంది నెమ్మదిగా. ప్రతీ దానికీ వంకలు పెడుతూ తినే నాకు, మా అమ్మ వంటలు కల లోకి కూడా వస్తున్నాయి ఈ మధ్య.

అదిగో, ఒక రోజు వచ్చింది అసలు తంటా!

నా సహోద్యోగి తపన్ ముఖర్జి, నా సీటు దగ్గిరకి వొచ్చాడు.

“ఏంటండీ ముఖర్జీ గారూ? ఎలా వున్నారూ?” అంటూ అభిమానం గానే పలకరించాను.

ముఖర్జి మంచి వాడే. ఎప్పుడూ నన్ను నవ్వుతూ పలకరిస్తాడు.

“ఈ ఆదివారం, మా ఇంట్లో చిన్న పార్టీ వుందండీ. మన ఆఫీసు వాళ్ళందరూ వస్తున్నారు. మీరు కూడా తప్పకుండా రావాలండీ” అంటూ మర్యాదగా ఆహ్వానించాడు.

గతుక్కు మన్నాను. నాకు అప్పటికీ, కలకత్తా రోడ్లు అలవాటు కాలేదు.

“మీ ఇంటికి రావాలంటే, మొదట ట్రాము ఎక్కాలి. దాంట్లో మెట్రో స్టేషనుకి వెళ్ళాకి. అక్కడ మెట్రో ఎక్కాలి. అది గాక, మళ్ళీ ట్రాము ఎక్కి, మీరుండే చోటుకి రావాలి. నాకు అసలే, కలకత్తా సరిగా తెలియదండీ. ఇదంతా నా వల్ల కాదండీ” అంటూ బేలగా చెప్పాను.

మా మాటలన్నీ, అక్కడే వున్న మా సెక్షన్ మేనేజరు విన్నాడు.

“ప్రసాదు గారూ! మీరేమీ వర్రీ కాకండి. నా కారులో, మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకు వెళ్తాను. మళ్ళీ, జాగ్రత్తగా మీ రూము దగ్గిర దింపుతాను. సరేనా?” అంటూ సానునయంగా చెప్పాడు.

ఇంక ఎలా తప్పించుకుంటానూ? ఒప్పేసుకున్నాను, వెళ్ళడానికి.

వాళ్ళింటికి చేరగానే, ముఖర్జి చాలా మర్యాదగా లోపలకి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేశాడు. మొహమాటంగా పట్టుకెళ్ళిన చిన్న బహుమతి ఇచ్చేసి, మా బేంకు వాళ్ళతో పిచ్చాపాటిలో పడ్డాను.

అప్పులిచ్చే సెక్షను వాళ్ళకీ, వాటిని వసూలు చేసే సెక్షను వాళ్ళకీ, ఏదో బెంగాలీ సినిమా గురించి, వాదన జరిగి పోతోంది. సగం అర్ధం అయ్యీ, అవని విషయాలు వింటున్నాను. నేనా సినిమా చూడలేదు. బెంగాలీ నాకేం అర్థం అవుతుందీ?

ఈ లోపల, భోజనాలు తయారుగా వున్నాయని పిలుపొస్తే, అందరం పక్క హాలు లోకి వెళ్ళాము.

అక్కడకి వెళ్ళగానే, మళ్ళీ గతుక్కు మన్నాను. నా బతుకంతా, గతుకులాటలే!

ఆ భోజనం ఏర్పాట్లు, బఫే పద్ధతిలో చేశారు. ఒక పెద్ద బల్ల మీద, అన్ని పదార్థాలు వరుసగా పేర్చారు.

అన్నం, పప్పూ తప్ప ఏ ఒక్క పదార్ధాన్నీ గుర్తు పట్టలేక పోయాను. ప్రతీ కూరా, బాగా మసాలాలు దట్టించి వొండారు. ఏది శాకాహారమో, ఏది కాదో తెలియడం లేదు. ఏది తినాలో, ఏది తినకూడదో తేల్చుకోలేక సందిగ్ధంలో పడ్డాను. ఇటు అటు దిక్కులు చూడసాగాను.

ఇంతలో ముఖర్జి వచ్చి, “ప్రసాద్ భాయ్! మీరు తినడం లేదేం?” అని ఆప్యాయంగా అడిగాడు.

మకరం నుంచి కరిని కాపాడ్డానికి వొచ్చిన హరి లాగా కనిపించాడు, ముఖర్జి అప్పుడు నాకు.

“అది కాదండీ! నేను గట్టి శాకాహారినండీ! ఇక్కడున్న పదార్ధాలు ఏమిటో బొత్తిగా అంతు పట్టడం లేదు. నేను జల పుష్పాలు కూడా తిననండీ. ఎలాగా అని చూస్తున్నాను” అంటూ నా గోడు వెళ్ళబోసుకున్నాను ఆయనకి.

ముఖర్జి నవ్వి “మేమూ శాకాహారులమే, ఒక్క జల పుష్పాలు మాత్రం తింటాము. ఉండండి, మీకు వడ్డించి తెస్తాను”అని ఒక ప్లేటు తీసుకున్నాడు.

ఆ ప్లేటులో కొంత అన్నం, పప్పూ, కూరా వేసి ఇచ్చాడు. పక్కనే కాస్త మామిడికాయ ఊరగాయ కూడా వేశాడు. చిన్న కప్పులో పెరుగు వేసి ఇచ్చాడు.

వరాలిచ్చే విష్ణుమూర్తి లాగా కనిపించాడు ఆయన నా కంటికి.

“బతికించారండీ! మీ రుణం తీర్చుకోలేను” అంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

నవ్వుతూ, మిగిలిన అతిథులను పలకరించడంలో మునిగాడు ముఖర్జి.

పప్పన్నం తిని, వంకాయ కూరన్నం కలుపుకున్నాను.

“ఈ కలకత్తా వంకాయలు చూడ్డానికి కాస్త తెల్లగా, విచిత్రంగా వుంటాయి. అయినా రుచి బావుంటాయి” అనుకుంటూ తినడం మొదలెట్టాను.

రుచి నిజంగా చాలా బాగుంది.

ఈ లోపల, ఎంగిలి చెంచా సహద్యోగి తన పళ్ళెంతో, నా పక్కకి చేరాడు.

“ఏంటండీ తింటున్నారూ?” అంటూ ఆరా తీశాడు.

“వంకారా మసాలా కూరండీ! చాలా బావుంది రుచికి. నేను జల పుష్పాలు, అవే చేపలు, తిననండీ. గట్టి శాకాహారినండీ. మసాలా ఎక్కువ వేసినా, కూర బాగుంది” అని చెప్పాను నవ్వుతూ.

అతను సందేహంగా, నా పళ్ళెంలోని కూరను చూశాడు. ఆ తర్వాత తన పళ్ళెంలోని కూరను చూసుకున్నాడు.

“ఈ వంకాయ కూరేగా మీరు తింటున్నారూ?” అని అడిగాడా ఎంగిలి చెంచా.

“అవునండీ. చాలా బావుంది. మళ్ళీ వేయించు కుందామనుకుంటున్నాను” అన్నాను.

“అయ్యో! అది జల పుష్పాల కూరండీ! అదే, చేపల కూరండీ. మీరు తెలియక చేపల కూర తింటున్నారు. ఎవరో గిన్నెలు అటూ, ఇటూ జరిపినట్టున్నారు. రెండూ చూడ్డానికి ఒకే లాగా వుంటాయండీ. పోనీ లెండి, నచ్చిందంటున్నారుగా. తప్పు లేదండీ! అది కూడా శాకాహారమేనండీ” అంటూ వివరంగా చెప్పాడు.

అంతే! ఒక్కసారిగా బుర్ర తిరిగింది. కడుపులోకూడా గిర గిరా తిరగడం మొదలయింది. గత జన్మ కూడా కళ్ళ ముందర కదిలింది. కడుపులో బాగా తిప్పేసింది. వెంటనే బాత్‌రూము లోకి పరిగెత్తాను. తిన్నదంతా బయటకి వచ్చేసింది.

నీరసంగా, బాత్‌రూమ్‌ లోంచి వచ్చిన నన్ను చూసి, “ఏమయింది ప్రసాద్ భాయ్! ఏమయింది?” అని ఆత్రుతగా అడిగాడు ముఖర్జి.

“చూడండి ముఖర్జి భాయ్! మీ మీద నమ్మకంతో మీరు ఇచ్చింది తిన్నాను. ఎవరో గిన్నెలు కదిపారంట. మీరు పొరపాటున నాకు జల పుష్పాల కూర పెట్టారు. చాలా కష్ట పడ్డాను. ఇబ్బంది పడ్డాను. మన సహద్యోగి చెప్పాడు” అంటూ చెప్పాను.

నా కళ్ళలో నీళ్ళు ఒక్కటే తక్కువ.

దానికి అతను బాగా నొచ్చుకున్నాడు. నా చేయి పట్టుకుని, పదార్ధాల బల్ల దగ్గిరకి తీసుకెళ్ళాడు.

“అయ్యో, ప్రసాద్‌ భాయ్! మా ఇంట్లో ఏ గిన్నె లోని కూర ఏదో నాకు తెలీదా? నేను మీకు వంకాయ కూరే వొడ్డించాను. మీరు తిన్నది వంకాయ కూరే, జల పుష్పాల కూర కాదు. చూడండి. ఆ సహద్యోగి మిమ్మల్ని ఏడిపించడానికి అలా చెప్పాడు” అని వివరించాడు.

నేనా ఎంగిలి చెంచా గాడి వేపు చూశాను. వాడు అల్లరిగా నవ్వుతున్నాడు.

“అమ్మ వెధవా! ఎంత పని చేశావురా” అని వాడిని తిట్టుకున్నా, జల పుష్పాలు తినలేదని నా మనసు కుదుట పడింది.

ఇదేనన్న మాట, రజ్జు సర్ప భ్రాంతి అంటే!!

Exit mobile version