[dropcap]గ్రం[/dropcap]థాన్ని పాఠకుడు అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే సమాచారాన్ని ఇవ్వడం పీఠికకు ప్రధాన లక్ష్యం. గ్రంథం తనంతట తానుగా ఇవ్వని, పాఠకునికి అవసరమైన, పాఠకుడు తెలుసుకోగోరే వివరాలను పీఠిక అందిస్తుంది. గ్రంథ పఠనానికి పూర్వరంగాన్ని సిద్ధం చేస్తుంది.
పీఠిక, పరిచయం, మున్నుడి, ముందుమాట, ఉపోద్ఘాతం, అవతారిక, భూమిక, ప్రస్తావన – ఇవన్నీ పీఠికకు పర్యాయ పదాలు. పర్యాయ పదాలతోనే హెడింగ్, ట్యాగ్ లైన్ ఇవ్వడం పద క్రీడలో ఒక భాగమే. ప్రఖ్యాతులైన పీఠికాకర్తలు సైతం రెండు మూడు సాహితీ ప్రక్రియలకే పరిమితమై ముందుమాటలు రాసి ఇస్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సుధామ కవిత, కథ, వ్యాసం, నవల, నాటకం, కార్టూన్, కాలమ్, గళ్ళ నుడికట్టు ఇలా అనేకానేక ప్రక్రియలలో వచ్చిన గ్రంథాలకు పీఠికలు రాయడం ఒక రికార్డు అనే చెప్పాలి.
కథా సంపుటాలకు రాసిన ముందుమాటలను చూస్తే సంస్కారాన్ని పెంచే రావిపల్లి నారాయణరావుగారి కథలను “సంస్కార కథా కల్పవల్లి – రావిపల్లి”గా విశ్లేషిస్తారు. మంచి కథ లక్షణాలను చెపుతూ గంటి భానుమతి కథల్లోని మానవతా ధోరణులను వివరిస్తారు. పోలాప్రగడ సత్యనారాయణమూర్తిలోని హాస్య ప్రవృత్తి, సంప్రదాయ అనురక్తి, మానవీయ విలువల పట్ల ఆయనకున్న అపారమైన భక్తి ఆయన కథలలో కనిపిస్తాయంటారు. తమిరిశ జానకి మినీ కథలు జీవన వైవిధ్యాలనే కాదు, మనుషులను, వారి మనస్తత్వాలలోని అనేక పార్శ్వాలను కళ్ళకు కట్టిస్తాయంటారు. సింహప్రసాద్ అంటే కథల కర్మాగారం కాదు, కథానికా సుక్షేత్ర కర్షకుడని నిరూపిస్తారు. శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి కథలు హాస్య వ్యంగ్యాలతో కూడుకుని వున్నాయని చెబుతారు. కథలు-కాకరకాయలను విశ్లేషస్తూ ఎస్వీ కృష్ణజయంతి గృహిణిగా రచయిత్రిగా ఎదిగిన క్రమాన్ని వివరిస్తారు. వివిధ విషయాల పరిజ్ఞానంతో కాకాని చక్రపాణి రాసిన “నిప్పు” నవల మీద సోమరసెట్ మామ్ ప్రభావాన్ని కూడా చర్చించడం చూడవచ్చు.
కవిత్వంలో పద్యకవిత, వచన కవిత, శతకాలు, లలితగీతాలు, బాల గేయాలు, రుబాయిలు, మినీ కవిత్వాలను విశ్లేషిస్తూ రాసిన పీఠికలున్నాయి. లఘ కవితా రూపాలు ఏర్పడ్డాక ఎందరికో కవితాభివ్యక్తి సౌలభ్యం ఏర్పడింది. తమ భావాలను అక్షరాలలో, మంచి పదాలతో ప్రకటించుకుని ‘కవిత్వమొక తీరని దాహం’ కాదని తృప్తి చెందుతున్నారు. కవులుగా రూపొందడానికి ఈ తరానికి అందివచ్చిన నానీలు, హైకులు, రెక్కలు, చుక్కలు, వ్యంజకాలు వంటివన్నీ కూడా ఇవాళ చెలామణిలో వున్నాయి. ఒకప్పుడు వెలుగు వెలిగి కలం ముడిచిన విశ్రాంత రచయితలకు కూడా నూతనోత్సాహన్నీ, ఉత్తేజాన్నీ ఈ సౌలభ్య ప్రక్రియలు అందించగలుగుతున్నాయి అని నిర్ధారించిన సుధామగారు ఆయా ప్రక్రియ పూర్వాపరాలను వివరిస్తూ ఆ ప్రక్రియలో వెలువడిన పుస్తకాలకు ముందుమాటలు రాశారు.
కవిత్వంలో పద్యకవిత, వచన కవిత, శతకాలు, లలితగీతాలు, బాల గేయాలు, రుబాయిలు, మినీ కవిత్వాలను విశ్లేషిస్తూ రాసిన పీఠికలున్నాయి. ఈ కవిత్వ పీఠికల్లో కవుల జీవితాన్ని, సాహిత్యాన్ని మదింపు జేసినవి వున్నాయి. వారి కవిత్వంలో వారి వ్యక్తిత్వమెలా ప్రతిబింబించిందో తెలియజేస్తారు. ఈ కవితా సంపుటాలలో వున్న ఆయాకవుల అనుభూతి సాంద్రతను, వారి లోచూపును, సమాజ హిత భావనను, ఆశావహ దృక్పథాన్ని, కవితా కౌతుకాన్ని గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ అభినందన పూర్వకంగా ముందుమాటలు రాశారు. ఇందులో ప్రణయ కవిత్వంతో పాటు ఆధ్యాత్మిక కవిత్వాన్ని కూడా పరిశీలించారు. త్రిశతితో పాటు ఏకవాక్య కవితలను కూడా విశ్లేషించారు.
నాటకాలకు రాసిన ముందుమాటలు, ప్రపంచానికి భారతీయ నాటక ఆధిక్యతను, ప్రాశస్త్యాన్ని ఎన్.ఎస్. కామేశ్వరరావు తన రచన ద్వారా తెలియజేశారంటారు. గురజాడ అప్పారావు మనవడు, అదే పేరుతో వున్న గురజాడ అప్పారావు రాసిన ‘ద్వాదశి’ నాటకాలకి, మరో నాటక సంపుటానికి ఆత్మీయమైన ముందుమాటలు రాశారు. విద్యార్థుల కార్యక్రమాల్లో పాఠ్యాంశాలను రూపకాలుగా మలిచిన డా. సరోజన బండ, ‘పృథ్వీరాజ్’ నాటకాన్ని రాసిన తిరుమల వెంకటస్వామి పుస్తకాలపై రాసిన పీఠికలు కూడా ఇందులో వున్నాయి.
వ్యాస సంపుటాలకు సంబంధించి సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మికం, వ్యంగ్యం, వైతాళికులు, సుభాషితాల పైన రాసిన ముందుమాటలున్నాయి. సామెతలు, వ్యక్తిత్వ వికాసం, కళాకారులు, కార్టూన్స్, ప్రత్యేక సంచికలు, జోకులు, ఆత్మకథలు, గళ్ళ నుడికట్టు పుస్తకాలపై రాసిన పీఠికలున్నాయి. పీఠికా కర్తకున్న విస్తృత అధ్యయనం, సరియైన అవగాహన, నిశితపరిశీలనను వారి పీఠికలలో గర్తించవచ్చును. ఆయా గ్రంథాలకు సంబంధించిన పుర్వాపరాలను వివరిస్తూ, ప్రస్తుత గ్రంథంలో ప్రతిపాదించబడిన విషయాలతో పోల్చి చూస్తూ రచయిత కృషిని ప్రతిభను అంచనా కట్టడం వాటిలో కనిపిస్తుంది. సాహిత్యం, ఆధ్యాత్మికంలపై ఎంత పట్టు వుందో, ఆర్థికశాస్త్రానికి సంబంధించిన అంశాలపై కూడా అంతే ప్రతిభను కనబరుస్తారు. ఏ విషయాన్ని తీసుకున్నా సాధికారికంగా రాయడం సుధామ ప్రత్యేకత. చాలా మంది పీఠికాకర్తలు తమ పాండిత్యానికి వేదికగా పీఠికలను మలచుకుంటారు. మరికొంతమంది రచయితలు నొచ్చుకొనేలా రాస్తారు. ఇంకొంతమంది పుస్తకాన్ని విడిచి నానా చెత్తా రాస్తేస్తారు. వారందరి కంటే భిన్నంగా సుధామ పీఠికలు ఆయా రచయితలకు ఎంతగానో ప్రోత్సాహాన్ని కలుగజేస్తాయి. మిత్ర సన్నిహితంగా వుంటాయి వారి పీఠికలు, నచ్చని అంశాన్ని కూడా సుతిమెత్తగా చెబుతారు. ఒక కవితా సంపుటిని విశ్లేషిస్తూ వారి కవిత్వం మరింత నిశితమూ, విస్తృతమూ కావాలని కోరుకుంటారు. ఒక రచయిత్రి కవిత్వ వచనాన్ని అక్షరకరించడంలో అలవోకతనాన్ని అభివృద్ధి పరచుకున్నారని అనడంలోని వ్యంగ్యం చాలామందికి అర్థంకాదు. అలాగే డా. రమణ యశస్వి రాసిన ‘రెక్కల గుర్రం’ కవి భావాల ఎరుకతో “ఏమో గుర్రం ఎగరా వచ్చు” అని చమత్కరిస్తారు. భుజం తట్టి ప్రోత్సహించే విధంగా వారి పీఠికలు వుంటాయి. కాబట్టి కొంత్మంది తరచుగా వారి తమ పీఠికలు రాయించుకోవడాన్ని కూడా గమనించవచ్చు. కొత్త వాళ్ళే కాదు, సీనియర్ రచయితలైన పొలాప్రగడ సత్యనారాయణమూర్తి, తమిరిశ జానకి, కాకాని చక్రపాణిల వచన సాహిత్యం మీద, ఆచార్య తిరుమల, తిరుమల శ్రీనివాసాచార్య, వాసా ప్రభావతి, విహారిల కవితా పుస్తకాలకు కూడా పీఠికలను రాయడం గమనించవచ్చు. యువభారతి పునర్ముద్రించిన కావ్యలహరి, మందార మకరందాలు, భావుక, ప్రజాసూక్తం, భోగినిలాస్యం, వేమన్న వేదం గ్రంథాలకు; అలాగే విహారి పరంపరలో నిర్వహించి ప్రచురించిన వేద విజ్ఞానలహరి, ఉపనిషత్సుధాలహరి గ్రంథాలకు, కావ్యలహరి పునర్ముద్రణకు ప్రధాన సంపాదకులుగా సుధామ రాసిన పీఠికలు పోతన సాహిత్యం మీద వారికున్న అభిరుచిని తెలియజేస్తాయి. అందమైన చేతివ్రాత సుధామ సొంతం. వారి చేతిరాతకు ముగ్ధులైన రచయితలు ఆ పీఠికలను అట్లాగే అచ్చువేసుకోవడం గొప్ప విషయం. అలాంటి వాటినుండి మచ్చుకు రెండు మూడు పీఠికలను చేతిరాతతోనే ప్రచురిస్తే బాగుండేది. మొత్తానికి విభిన్నమైన అంశాలతో వున్న ఈ పీఠికలు వైవిధ్యభరితంగా వుండి పాఠకులను ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
***
భూమిక
సుధామ పీఠికలు-ముందుమాటలు
సంపాదకులు: అల్లంరాజు ఉషారాణి
స్నేహితా స్రవంతి, మలక్‌పేట, హైదరాబాద్ – 500036
పేజీలు: 469, ధర: ₹ 300/-
ప్రతులకు: ఎ. ఉషారాణి, ఫోన్ నెం : 98492 97958.
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.