Site icon Sanchika

బిచ్చగాడు

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన శిరిప్రసాద్ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు డా. అమృతలత.]

[dropcap]కొం[/dropcap]డయ్య వెంకటేశ్వర స్వామి గుడిముందు కూర్చున్నాడు.

అది చాలా ఖరీదైన ప్రాంతం. హైదరాబాద్ బంజారా హిల్స్ తెలియని వాళ్లుండరు కదా! అక్కడున్న ఆ గుడికి ఎంతో ప్రాముఖ్యత వుంది. అక్కడికి బాగా డబ్బున్న వాళ్ళు వస్తుంటారు. దేవుడి హుండీలో ఎంత వేస్తారో తెలియదు కానీ, అర్చకుడికి ఓ వంద నోటు కొడుతుంటారు. గుడి బయటకి రాగానే రెడీగా వున్నకారు ఎక్కి వెళ్లిపోతుంటారు. కారు రావడం కొంచం ఆలస్యమైతే గుడి ముందున్న బిచ్చగాళ్లు ఈగలు ముసిరినట్టు చుట్టూ చేరిపోయి బిక్షం అడుగుతారు. వాళ్ళ బాధ పడలేక వందో, యాభయ్యో చేతులో పెడుతుంటారు. చీదరించుకుని ముందుకు వెళ్లిపోయేవాళ్లే ఎక్కువ. ఆ గుడి ధర్మకర్తల సంఘం బిచ్చగాళ్ళని గుడిముందు చేరనీయకుండా చేపట్టాల్సిన చర్యల గురించి చాలా సార్లు చర్చిస్తూ, చివరికి మానవతా దృక్పథంతో వదిలేస్తుంటారు. ఇది ఆ బిచ్చగాళ్లు చేసుకున్న అదృష్టమే. అక్కడ వాళ్ళ సంపాదన అంత బాగుంటుంది మరి.

పది సంవత్సరాల ముందు వరకు కొండయ్య ఒక అపార్ట్మెంట్‌లో వాచ్‌మాన్‌గా పనిచేసేవాడు. ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగం వెతుక్కుంటూ ముంబై వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో ఉద్యోగం సంపాదించుకుని, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. తల్లితండ్రుల్ని చూడ్డానికి రాలేదు కదా, కనీసం ఫోన్ చేయడం కూడా మానేసాడు. కొండయ్య ముంబై వెళ్లి తన కొడుకుని వెతికే ప్రయత్నం చేసి, విఫలమై, బండెడు దుఃఖంతో తిరిగి వచ్చేసాడు. భార్య మంచంపట్టి కొండయ్యని ఒక్కడ్ని చేసి పోయింది. ఆ అపార్ట్మెంట్ యజమానులు కొండయ్యని ఉద్యోగం నించి తీసేసారు. కష్టాలు ఒక్కటిగా రావంటే యిదే!..

కొండయ్యకి ఏమి చేయాలో పాలుపోలేదు. కూలీ పని చేసేంత శక్తి లేదు. బిచ్చగాడిగా మారిపోయాడు. ఆ పని కూడా కష్టమే అనిపించింది. ఎందుకంటే ముఖ్యమైన ప్రదేశాల్లో స్థిరపడ్డ బిచ్చగాళ్ళు కొత్తవాళ్లెవరినీ రానీయడం లేదు. కొన్ని ప్రదేశాల్లో హత్య చేయడానికి కూడా వెనకాడని బలమైన బిచ్చగాళ్లున్నారు. కొండయ్య అప్పుడే పూర్తైన వెంకటేశ్వర స్వామి గుడి ముందు చోటు సంపాదించుకోగలిగాడు. దానికి తన తెలివితేటలు, ఆ స్వామి ఆశీర్వాదం తోడ్పడ్డాయి. అదే పెద్ద అదృష్టంగా భావించాడు కొండయ్య. ఇక అక్కడ్నించి అతనికి మంచి సంపాదన మొదలైంది; మంచి తిండి తినగలుగుతున్నాడు. మంచి తిండి అంటే దగ్గిరలో వున్నఒక తోపుడు బండి దగ్గిర పొద్దున్నే మూడు ఇడ్లీలు తింటాడు. మధ్యాహ్నం అక్కడే ఒక రైస్ ఐటెం తింటాడు. రాత్రికి మళ్ళీ టిఫినో, రైస్ ఐటెమ్ ఒకటి తింటాడు. ఆ ఖర్చు రోజుకి యాభై అరవై రూపాయలైతే గొప్పే. రోజుకి అంతకంటే ఎక్కువే సంపాదిస్తాడు.

ఆ గుడి ముందు పదిమంది బిచ్చగాళ్ళు చేరారు. పదకొండోవాడు అక్కడికి రాకుండా దాదాగిరీ చేస్తుంటారు. ఈ ధోరణి ధనవంతుల మధ్య ఎంత వుంటుందో, పేదవాళ్ల మధ్య కూడా అంతే ఉంటుంది. బహుశా ఇది ప్రాకృతిక సహజ న్యాయసూత్రాలలో ఒకటేమో!

కొండయ్య పోయిన భార్య గురించి కంటే బతికుండి అడ్రస్ తెలియని, తనను పట్టించుకోని కొడుకు గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాడు. ఇంత వయసొచ్చిన తనని చూసుకోని కొడుకు బాగుండాలని రోజూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటాడు. తనకి తిండి పెడుతున్న స్వామి తన కొడుకుని మాత్రం మంచిగా చూసుకోడా అని దేవుడి మీద భరోసా వుంచుతాడు.

ఆరోజు రాత్రి గుడి మూసేసాక తోపుడు బండి దగ్గిర కొంచం జీరా రైస్ తిని, దగ్గిరలో వున్న స్లమ్ లోని తన రేకుల గదికి వెళ్లి ఆ రోజు కలెక్షన్ లెక్క పెట్టుకున్నాడు. సరిగ్గా రెండొందల యాభై వుంది. దాన్ని ఆ గదిలో మూల వున్న చెక్క సామాన్ల కింద దాచుకున్న రేకు డబ్బాలో పెట్టి, ఒక క్షణం ఆలోచించాడు. ఆ డబ్బాలో వున్న డబ్బుని లెక్కపెట్టాడు. యాభై రెండు వేలు వున్నది.

కొండయ్య ఆ గదికి నెలకి వంద రూపాయల అద్దె చెల్లిస్తాడు. ఆ గది చుట్టుపక్కల ఓ ఇరవై పోర్షన్లు వుంటాయి. వాటిల్లో కూలీనాలీ చేసుకునే వాళ్ళు, బిచ్చగాళ్ళు ఏ పనీపాటా లేనివాళ్లు వుంటారు. ఒక్కో గది వంద స్క్వేర్ ఫీట్లు వుండచ్చు. అందులోనే ఫ్యామిలీలు కూడా వుంటాయి. కొండయ్య మాత్రం ఒక్కడే వుంటాడు. అప్పుడప్పుడు పక్కల వాళ్ళ చుట్టాలొస్తే కొండయ్య గదిలో చోటు అడుగుతుంటారు. ఒక్క రాత్రికైతే ఒప్పుకుంటాడు. అది కూడా భయంభయంగానే. తను కష్టపడి అడుక్కుని సంపాదించుకున్న సొమ్ము కాజేస్తారేమోనని అతని భయం. అలాగని వాళ్ళని వుండనీయక పొతే అనుమానం రావచ్చు. కొండయ్యకి తను దాచుకున్న సొమ్ముని కాపాడుకోడం పెద్ద సమస్య. ఎవరికీ చెప్పుకోలేడు.

తన గదికి ఎదురుగా వున్న గదిలో యాదయ్య అని కూలీ పని చేసుకునే ఓ మధ్య వయస్కుడుంటాడు. కొండయ్య అతనితో స్నేహంగా వుంటాడు. తన కష్ట నష్టాలని పంచుకుంటూ వుంటాడు. యాదయ్య కూడా ఒంటరివాడే. నిజాయితీ వున్నవాడు. తన ఏ రోజు సంపాదన ఆ రోజే ఖర్చు పెట్టుకుంటాడు. ఒక క్వార్టర్ చీప్ లిక్కర్, రెండు మూడు మాంసం ముక్కలు లేనిదే రోజు గడవదు. కొండయ్యకి అలాంటి అలవాట్లు ఎప్పుడో వున్నా, యిప్పుడు లేవు.

యాదయ్య కూడా కొండయ్యలానే జీవితంలో దెబ్బతిన్నవాడు. అతని దురలవాట్లకి విసిగిపోయిన భార్య అతన్ని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నిరోజుల తర్వాత ఆమెని పుట్టింటినించి తీసుకొద్దామని వెళ్లిన యాదయ్యకి ఆమె ఎవరితోనో వెళ్లిపోయిందని తెలిసింది. కొన్ని రోజులు బాధపడ్డాడు. తనని తనే నిందించుకున్నాడు. అయినా అలవాట్లని మానుకోలేకపోయాడు. పిల్లలు లేకపోవడంతో ఒంటరి వాడయ్యాడు. బతికినంతకాలం తన నేస్తం చీప్ లిక్కరేనని నిర్ణయించుకున్నాడు. కొండయ్యని చూసి జాలి పడుతూ వుంటాడు. కొండయ్య కొడుకు గురించి తను కూడా అప్పుడప్పుడు విచారిస్తుంటాడు. కొండయ్య వాచ్‌మన్‌గా పనిచేసిన అపార్ట్మెంట్‌కి వెళ్లి కొండయ్య కొడుకు వచ్చిపోయాడేమో అని విచారించి, రాలేదని తెలిసి బాధపడుతుంటాడు. కొండయ్యని ఓదారుస్తూ వుంటాడు.

యాదయ్య కొండయ్యతో ఎంతో స్నేహంగా వున్నప్పటికీ కొండయ్య యాదయ్య పట్ల అనుమానంతో అంత దగ్గర కాలేకపోయాడు. తను దాచుకున్న డబ్బు కొట్టేస్తాడేమో అనే భయం కొండయ్యని వెంటాడుతూ వుంటుంది. ఎప్పుడైనా యాదయ్య అప్పడిగితే కొండయ్య అడిగిన దాంట్లో సగం యిచ్చి తన కష్టాలు చెప్పుకుంటుండేవాడు. యాదయ్య తెలివినుపయోగించి తనకి కావాల్సినదానికి రెట్టింపు అడిగేవాడు. ఎంత తీసుకున్నా చెప్పిన సమయానికి తిరిగి యిచ్చేసేవాడు.

మరో రెండేళ్లు గడిచిపోయాయి. కొండయ్య సంపాదన బాగా పెరిగిపోయింది. ఆ గుడికి భక్తుల రద్దీ అంత పెరిగింది. ప్రతిరోజూ రాత్రి పూట తను దాచుకున్న డబ్బు లెక్కపెట్టుకుంటుంటాడు. ఇప్పుడు అతని పొదుపు మొత్తం మూడు లక్షలకి చేరింది. మెహదీపట్నంలో ఫుట్‌పాత్ మీద లోపల రెండు పెద్ద జేబులున్న కోటు కొనుక్కున్నాడు. ఆ జేబుల్లో రెండు లక్షలు పెట్టుకుని దాన్ని ఎప్పుడూ వేసుకుని తిరుగుతుంటాడు. మరో లక్ష గది లోని రేకు డబ్బాలో దాచుకున్నాడు.

నలుగురైదుగురు బిచ్చగాళ్ళు అనుమానంతో కొండయ్యని “యింత ఎండలోనూ కోటు విప్పవేంట్రా,” అని అడుగుతుండేవారు. ఏదో సమాధానం చెప్పి తప్పించుకున్నా, వాళ్ళు ఆ డబ్బు కొట్టేస్తారేమోనని భయపడుతుంటాడు. ఆనందాన్ని కొనిపించగల డబ్బు భయాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే భయం భయంగా కాలం గడుపుతున్నాడు.

ఒక రాత్రివేళ గది బయట నలుగురి మధ్య పెద్ద కొట్లాట జరిగింది. ఆ స్లమ్‌లో వుంటున్నజనాలందరూ గుమిగూడారు. బయటికొచ్చిన కొండయ్యకి భయం పట్టుకుంది. ఆ గొడవ పెరిగి పెద్దదై గుడిసెలకి నిప్పు పెట్టడం లాంటి హింసకి దారితీస్తే తన పరిస్థితి ఏమిటి, తను దాచుకున్న డబ్బు సంగతి ఏమిటి? ఆ ఆలోచన వెన్నులో వణుకు పుట్టించింది. కొంతసేపటికి ఆ గొడవ సద్దుమణిగింది.

గదిలోకి వెళ్లి పడుకున్న కొండయ్యని మనసు ప్రశ్నించింది, “యింత డబ్బు ఎందుకు దాచుకుంటున్నావ్?” ఆలోచించాడు కొండయ్య.

అసంకల్పితంగా డబ్బు దాస్తున్నాడు.

సరిగ్గా తినకుండా కూడా ఎందుకు దాస్తున్నట్టు?

‘బిచ్చగాడికి వృద్ధాప్యంలో ఏ జబ్బో వస్తే, ఆసుపత్రి ఖర్చులు ఎవరిస్తారు?’

‘బిచ్చగాణ్ణి పెద్ద ఆసుపత్రిలోకి రానీయరు కదా!.. సర్కారు దవాఖానానే గతి కదా!.. అక్కడ చికిత్స వుచితమే కదా!..’

‘మంచి చికిత్స తీసుకోడానికి డబ్బు చూపిస్తే పెద్దాసుపత్రిలో చికిత్స చేయరా?’

‘బిచ్చగాడి దగ్గిర అంత డబ్బా, అని నొక్కేస్తారు. డబ్బూ పోతుంది, జబ్బూ మిగిలిపోతుంది’

‘తన దగ్గిర అంత డబ్బు వుందని తెలిసిన మరుక్షణం జనం గద్దల్లా మీద పడిపోరా? బిచ్చగాళ్ల దగ్గిర ఎంత వుండాలో సమాజమే నిర్ణయిస్తుంది.’

‘మరి ఎందుకీ కష్టం, ఎందుకీ పొదుపు?.. ఎవ్వరూ తోడు లేని జీవితానికి దేవుడే తోడు. అందరూ నమ్మినట్టే వెంకటేశ్వర స్వామిని తనూ నమ్ముతాడు కదా?’

‘ఏమో తన కొడుకు నరేందర్ తన దగ్గిరకి తిరిగి వస్తాడేమో, వాడికి డబ్బు అవసరాలుంటాయిగా, వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వుంటాడుగా! డబ్బు అవసరం ఎంతో వుంటుంది. అయిదారు లక్షలిస్తే వూరు చివర జాగా కొనుక్కుని ఓ గుడిసె వేసుకుంటాడు..’

‘అంటే ఈ కష్టమంతా నిర్దాక్షిణ్యంగా నిన్ను వదిలి వెళ్లిన కొడుకు కోసమా?’

‘నేను వాడిని వదిలేయ లేనుగా!’

‘వయసొచ్చాక వాడి బతుకు వాడే బతకాలి. నీకెందుకు కష్టం?’

‘కష్టమేముంది?.. గుడి ముందు కూర్చుని స్వామికి దణ్ణం పెట్టుకుంటూ, భక్తుల్ని అడుక్కోడమేగా!.. కొత్తల్లో అడుక్కోడం సిగ్గనిపించినా, అలవాటయ్యాక అదొక పని లాగానే అనిపిస్తోంది. భక్తులు తనకి ఏ జన్మలోనో అప్పు పడ్డ వాళ్ళలాగా కనిపిస్తుంటారు. ఆ అప్పు వసూలుకే తనక్కడ కూర్చుంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్లకి ఆ దానం వల్ల పుణ్యం కూడా దక్కుతుంది.’

‘అలాగైతే నీ కొడుక్కి నువ్వు రుణపడినట్టా?’

‘తెలియదు. ఎవరు ఎవరికి రుణపడ్డారో తెలియడం కష్టమే..’

ఆలోచనలో పడ్డాడు కొండయ్య.

కొడుకు నరేందర్ మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ‘తనని కలుసుకోడానికి ఎప్పటికైనా వస్తాడనే ఆశ. ఆ ఆశ బలంగా వుండడం వల్లే తానింకా బతికున్నాడు. ఆశ చచ్చిపోడంతోనే భార్య చచ్చిపోయింది.’

ఒకవేళ నరేందర్ తిరిగొస్తే తన బాగోగులు చూసుకుంటాడా?.. తను జబ్బుపడితే దవాఖానకి తీసుకుపోతాడా?.. తనని కూర్చోపెట్టి పోషిస్తాడా?.. అసలు తండ్రి బిచ్చగాడంటేనే నామోషీ పడతాడా?.. తనని దూరం పెడతాడా?

ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు కొండయ్య.

మర్నాడు ఉదయం కొండయ్య బయటికొచ్చేసరికి మొహల్లాలో చర్చ నడుస్తోంది. నాంపల్లిలో ఓ బిచ్చగాడు ఫుట్‌పాత్ మీద చచ్చిపోయాడు. అతని దగ్గిర ఎనిమిది లక్షల నగదు దొరికిందట. అక్కడ కూలీ నాలీ చేసుకునే వాళ్లంతా బిచ్చగాళ్ల పనే బాగుందంటూ హేళనగా మాట్లాడుతున్నారు. బిచ్చగాడు ఛస్తే వాడి డబ్బు పోలీసులు ఎత్తుకెళ్తారు; దాన్ని మనమే ఎందుకు గుంజుకోకూడదు, అని ఒకడు అంటుండగా అందరూ వత్తాసు పలికారు. కొండయ్య నెమ్మదిగా పిల్లిలా అక్కడ్నించి జారుకున్నాడు. ‘తను కూడా డబ్బు పోగేస్తున్నట్టు తెలిస్తే తన్ని పట్టుకుపోతారు. ఈ డబ్బు ఎక్కడ దాయాలి? అక్కడ దాచానని నరేందర్‌కి ఎట్లా తెలుస్తుంది?..’ ఆందోళన చెందాడు కొండయ్య.

‘ఈ సమస్యకి పరిష్కారం ఆ స్వామినే చూపిస్తాడు. ధైర్యంగా వుండాలి’ అనుకున్నాడు.

సాయంత్రం యాదయ్య హడావిడిగా కొండయ్య దగ్గిరకి వచ్చాడు.

“కొండయ్యా, యింటి కోస్తూ మీ అపార్ట్మెంట్ దగ్గిరకి పోయి వాచ్‌మన్‌ని నీ కొడుకు వచ్చిండేమో కనుక్కున్నాను. నీ కొడుకు వారం కిందట వచ్చి ఎంక్వయిరీ చేసి పోయిండట. వాడి ఫోన్ నెంబర్ యిచ్చిండట. ఇదిగో ఈ కాయితం మీద రాసిచ్చిండు. సంతోషం కదా?”

ఒక్క క్షణం వుక్కిరి బిక్కిరి అయిపోయాడు కొండయ్య. యాదయ్యని కావలించుకుని జేబులోంచి వంద రూపాయలు తీసిచ్చాడు. యాదయ్య ఆ నోటు చూసి ఖుషీ అయిపోయాడు. “వాడికి ఫోన్ చేద్దువు పద!” అన్నాడు యాదయ్య.

“వాడు ఇప్పుడు పనికి పోయుంటాడు. ఏడెనిమిది గంటలు కొట్టాక చేస్తాలే. నువ్వు పోయి మందు కొట్టు ఈ లోగా” అన్నాడు కొండయ్య. అట్లనే, అంటూ యాదయ్య వెళ్ళిపోయాడు.

సంతోషం, దుఃఖం, సందేహం, షరం అన్నీ ఒక్కసారే చుట్టుముట్టాయి కొండయ్య గుండెల్ని.

‘ఎంతకాలమాయె నరేందర్ని చూసి!.. ఎట్లా వున్నాడో? ఇప్పుడు వాడి వయసెంతో?.. పెళ్లి చేసుకున్నాడో, లేదో? పిల్లలున్నారో, లేదో? మనుమలు, మనుమరాండ్రతో తనకి టైం పాస్ అయిపోతుంది,’ అడుగులు వడివడిగా వేస్తూ తన గదికి చేరుకున్నాడు.

రాత్రి ఎనిమిదింటికి కొండయ్య గుడి నించి బయల్దేరి ఆ రోడ్డు మూల వున్నపాన్ షాప్‌కి వెళ్ళాడు. అక్కడ మాత్రమే పబ్లిక్ ఫోన్ వుంది. మొబైల్ ఫోన్లు వచ్చాక పబ్లిక్ ఫోన్లు మాయమైపోయాయి. సెకండ్ హ్యాండ్ మొబైల్ అన్నా కొందామనుకున్నాడు కొండయ్య. కానీ బిచ్చగాడికి ఫోన్ ఎందుకులే అని వూరుకున్నాడు. తను ఫోన్ చేయడానికి ఎవరూ లేరు; తనకి ఫోన్ చేసేవాళ్ళు లేనేలేరు. ఇప్పుడు నరేందర్‌తో వుంటే ఫోన్ కొనుక్కుని అందరిలా చూస్తూ కూర్చోవచ్చు, అనుకున్నాడు.

నరేందర్ యిచ్చిన నెంబర్ ని కలిపి పాన్ షాప్ వాడు ఫోన్ కొండయ్య చేతికిచ్చాడు.

“ఎవరూ?” అటునించి మాట వినపడింది. కొండయ్యకి ఎంతకీ గొంతు పెగల్లేదు. న.. న.. అంటున్నాడు. అటువైపు ఫోన్ కట్ అయిపోయింది. షాప్ వాణ్ని మళ్ళీ బతిమాలాడుకుని కలిపించుకున్నాడు. ఈ సారి కొంచం గట్టిగా మాట్లాడాడు కొండయ్య.

“నరేందరా?”

“అవును”

“నేను నీ నాన్నని రా!”

“నాన్నా.. ఎట్లున్నావ్?”

“మంచిగనే వున్నారా బిడ్డా.. నువ్వేట్లున్నావ్?.. మంచిగున్నావా?.. జాబ్ చేస్తున్నావా?.. పెండ్లి అయిందిరా బిడ్డా?.. ఎంత కాలమాయె నిన్ను చూసి..”

“అంతా మంచిగనే వుంది నాయనా.. ఆదివారం వస్తా .. నువ్వేడుంటవొ చెప్పు..”

కొండయ్య వివరంగా చెప్పాడు.

“ఎట్ల బతుకుతున్నావే నాయనా?”

“నాకెంత కావాలిరా?.. బిచ్చమెత్తుకుంటే గింత వెయ్యరా?”

“బిచ్చమెత్తుకుంటున్నవా?”

నరేందర్ ఒక రకంగా అడిగినట్లనిపించింది. అది అసహ్యమో, ఏమో అర్థం కాలేదు కొండయ్యకి. తండ్రి బిచ్చగాడంటే కొడుక్కి నామోషీ కాదా?.. వాడి దగ్గిరుంటే బిచ్చమెత్తుకునే అవసరం ఏముంటది?

ఆదివారం కోసం ఎదురు చూస్తున్నాడు కొండయ్య.

కొడుకుతో ఏం మాట్లాడాలి, ఎట్ల మాట్లాడాలి అని తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు పారిపోయిన కొడుకుని యిన్నేళ్ల తర్వాత కలుసుకుంటున్న ఆనందం ఒక వైపు, కొడుకు తనని ఆదరిస్తాడా, అసహ్యించుకుంటాడా అనే సందేహం, భయం మరో వైపు.

ముందు రోజు యాదయ్యతో తన సందేహాన్ని చెప్పాడు. యాదయ్య దాన్ని కొట్టి పారేసాడు.

ఆ రాత్రి తను దాచుకున్న డబ్బుని లెక్కించుకుని మొత్తం రేకు పెట్టెలో పెట్టి, దాని మీద చెక్క సామాను పెట్టేసాడు. తన కోటుని పారేయాలనుకున్నాడు. మళ్ళీ దాని మీద పెంచుకున్న వ్యామోహంతో పారేయలేక ఓ మూల పేపర్లో చుట్టి దాచిపెట్టాడు. కొడుకు తనని తీసుకెళ్లకపోతే, మళ్ళీ బిచ్చమెత్తుకునే బతకాలిగా అనుకున్నాడు. తనని ఆదరించిన, ఆదరించకపోయినా తను యింతకాలం పొదుపు చేసి దాచుకున్న లక్షల సొమ్ము వాడికే యిచ్చేద్దామని నిర్ణయించుకున్నాడు. అది ఏ పోలీసుల పాలో, చుట్టూ వున్న దొంగనాకొడుకులపాలో కావడం కంటే కొడుక్కి పోవడమే మేలు, అనుకున్నాడు.

ఆదివారం రానే వచ్చింది. రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడంతో వుదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకున్నాడు కొండయ్య. కొంచం దూరంలో వున్న బండి దగ్గిరకిపోయి మూడు ఇడ్లీలు తిని, చాయ్ తాగి వచ్చాడు. కొడుకు ఏ పదింటికో వస్తాడు. అసలు వాడెక్కడున్నదీ కనుక్కోడం మర్చిపోయాడు.

తొమ్మిదవుతుండగా యాదయ్య కనిపించాడు.

“యాదయ్యా పనికి పొవట్లేదా?”

“ఆదివారంగా! పదింటికి అడ్డా దగ్గిరకి పోతా. పని దొరికితే పోతా, దొరక్క పొతే వచ్చేస్తా. నీ కొడుకుని చూసే పోతాలే..” అన్నాడు యాదయ్య.

“ఇప్పుడు తొమ్మిది కొడుతోంది.. నేను గుడి దాక పోయొస్తా. నా కొడుకొస్తే కూర్చోపెట్టు..”

“ఇయ్యాల కూడా ముష్టికి పోవాల్నా?..”

“కాదన్నా.. సామికి దణ్ణం పెట్టుకొస్తా..”

“సరే పోయిరా.. కొడుకు యింటికి తీస్కపోతే పోవాలిగా!” నవ్వుతూ అన్నాడు యాదయ్య.

“నన్ను తీస్కపోతాడంటావా?”

యాదయ్య ఒక్క క్షణం ఆలోచించాడు.

“ఇయ్యాలరేపు పోరగాళ్ళు ఎట్లుంటిరో చూస్తలేదా కొండయ్యా!.. నీ కొడుకు మంచోడైతే తీస్కపోతాడు..” అన్నాడు.

నిట్టూర్చాడు కొండయ్య. ‘యాదయ్య చెప్పింది నిజమే. ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు..’ అని నిరాశగా అనుకున్నాడు. గదికి తాళం వేయడం మర్చిపోయి గుడివైపు నడిచాడు.

రెండు నిముషాల తర్వాత కొండయ్య కొడుకు నరేందర్ ఓ బాగ్ పట్టుకుని యిల్లు వెతుక్కుంటూ యాదయ్యకి కనిపించాడు. వివరాలు కనుక్కున్న యాదయ్య అతనే కొండయ్య కొడుకు నరేందర్ అని నిర్ధారించుకున్నాడు. కొండయ్య గదిలోకి తీసికెళ్ళి, అక్కడున్న బల్ల మీద కూర్చోపెట్టాడు. నరేందర్ నించి వివరాలు సేకరించాడు. నరేందర్ బాలానగర్‌లో ఒక ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. పెళ్ళై యిద్దరు పిల్లలు కూడా. మంచి జీతం, మంచి జీవితం అనుకున్నాడు యాదయ్య. తన తండ్రి ఏం చేస్తుంటాడని అడిగాడు. “ఈ వయస్సులో ఏం చేస్తాడు? వెంకన్న సామి గుడి ముందు కూర్చుంటాడు. బిచ్చమెత్తుకుంటూ..” అన్నాడు యాదయ్య.

నరేందర్ ముఖంలో నెత్తురు చుక్క లేదు.

“బాధపడ్తున్నవా?.. నువ్వు తీసికెళ్తావని ఆశతో వున్నాడు. నువ్వొచ్చాక యింకా బిచ్చమెత్తుకోడం దేనికి?”

నరేందర్ ఏమీ మాట్లాడలేదు.

తర్వాత యాదయ్య వెళ్ళిపోయాడు.

నరేందర్‌కి తండ్రి బిచ్చమెత్తుకుంటున్నాడంటే నామోషీ అనిపించింది. “అపార్ట్మెంట్‌లో వాచ్‌మన్ అంటే కొంచం గౌరవప్రదమైన పని, దాన్ని వదిలేసి అడుక్కోడం ఏమిటి? భార్యా పిల్లలు ఏమనుకుంటారు?” అనుకున్నాడు. గది అంతా కలియచూసాడు. ఓ మూల చెక్క సామాను వుంది. ఏమిటా అని వుత్సుకత తో ఆ సామాను చూడసాగాడు. దానికింద ఒక రేకు పెట్టె కనపడింది.

ఒక్క క్షణం నరేందర్ మనస్సులో ఆ మధ్య విన్న వార్త ఒకటి గుర్తుకొచ్చింది. నాంపల్లి స్టేషన్ దగ్గిర ఫుట్‌పాత్ మీద చచ్చిపడి వున్న బిచ్చగాడి దగ్గిర ఎనిమిది లక్షలు బయపడ్డాయట. తన తండ్రి కూడా అట్లనే డబ్బు దాచిపెట్టిండా, అనే ఆశ మెదిలింది. ఆ రేకు డబ్బాలో ఏముందో చూద్దామనుకున్నాడు. దానికి వున్న చిన్న తాళాన్ని గట్టిగా లాగాడు. ఆ బక్కప్రాణం క్షణంలో వూడి కింద పడింది. డబ్బా తెరిచి చూసిన నరేందర్ ఒక్క క్షణం షాక్ తిన్నాడు. డబ్బు. ఆ పెట్టె నిండా డబ్బు. లక్షల్లో వుంటుందేమో! ..

వెంటనే నరేందర్ తను తెచ్చుకున్న బాగ్‌లో నించి తండ్రికి తెచ్చిన పంచె, లాల్చీలు బల్లమీద పెట్టి ఆ డబ్బంతా లెక్కపెట్టకుండా తన బాగ్‌లో కూరేసాడు. ఐదారు లక్షలుండచ్చు, అనుకున్నాడు. ఒక వైపు ఆనందం. మరో వైపు అపరాధ భావన. ‘ఇంత డబ్బు దాచాడంటే అది తన కోసమే ఐ వుంటుంది. అలాంటప్పుడు దొంగతనంగా ఎందుకు తీసికెళ్ళడం?..’

నిజమే ననిపించింది. ‘కానీ తను తండ్రిని తనింటికి తీసికెళ్ళట్లేదంటే ఆ డబ్బు తనకివ్వడేమో?’

అదీ నిజమే అనిపించింది. ఆ బాగ్‌ని భుజానికి తగిలించుకుని, గది తలుపు దగ్గిరగా వేసి, చుట్టూ ఒకసారి తనని ఎవరైనా చూస్తున్నారేమోనని చూసుకుంటూ పరుగులాంటి నడకతో బయటపడ్డాడు. వీధి మలుపులో వున్న ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాడు.

గుడినించి తిరిగొచ్చిన కొండయ్యకి గది తెరిచి వుండడం కనిపించింది. తాళం వేయకుండా వెళ్లిన విషయం గుర్తొచ్చి భయపడ్డాడు. లోపలి వెళ్లి చూడగానే ఇల్లంతా చిందర వందరగా వుంది. చెక్క సామాన్లు చెల్లా చెదురుగా పడున్నాయి. తనకి ప్రాణప్రదమైన రేకు పెట్టె ఖాళీగా కనిపించింది. హతాశుడయ్యాడు కొండయ్య. ఒక్క క్షణం యాదయ్య మీద అనుమానం కలిగింది. కళ్ళు తిరిగినట్టనిపించింది. గుండెలో గునపం దిగినట్టనిపించింది. తూలుతూ కుప్పకూలిపోయాడు.

అదే సమయంలో వచ్చిన యాదయ్యకి విషయం అర్థం కాలేదు. కొండయ్య కిందపడున్నాడు. నరేందర్ కనిపించలేదు. పెద్దగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్ళు నలుగురైదుగురు వచ్చారు. నెమ్మదిగా కింద కూర్చుని కొండయ్య తలని తన ఒళ్ళోకి తీసుకున్నాడు యాదయ్య. “కొండయ్యా, నీ కొడుకొచ్చిండయ్యా..” అని దుఃఖంతో పెద్దగా అరిచాడు. ఆ మాటలు కొండయ్యకి వినపడ్డాయో, లేదో.

అక్కడ చేరిన వాళ్లలో ఒకడు అంబులెన్సుకి ఫోన్ చేసాడు.

[సమాప్తం]

Exit mobile version