Site icon Sanchika

బిగ్ బాసూ – హడావుడి రావూ

[dropcap]హ[/dropcap]డావుడి రావుకి పట్ట పగ్గాల్లేకుండా ఉంది. ఏడో స్వర్గంలో విహరిస్తున్నాడతను. ఇంట్లో, ఆఫీస్‌లో, కాలరెగరేసుకొని తిరుగుతున్నాడు. అతని కాళ్లు భూమిపై ఆనడం లేదు. అడిగిన వారికీ అడగని వారికీ అదే విషయం, మార్చి మార్చి చెబుతున్నాడు. తన అభిమాన నటుణ్ణి కలుసుకునే యోగం పట్టిందని ఉబ్బితబ్బిబ్బౌతున్నాడు.

ఇంతకీ విషయం ఏంటంటే తెలుగు బిగ్ బాస్, మొదటి అంకం షూటింగ్ చూసే అవకాశం అతన్ని వరించింది. వరించిందనేకంటే, ఆయా వ్యక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించుకుని ఆ చాన్స్ కొట్టేశాడనడం సబబు. అలా తన అభిమాన జూనియర్ యన్.టి.ఆర్.ని ప్రత్యక్షంగా చూసే అవకాశం చేజిక్కించుకున్నాడు. జేబు నుంచి కానీ ఖర్చు పెట్టకుండా షూటింగ్ చూస్తాడతను. పుణేకి దగ్గర్లోని ‘లోనావలా’లో, బిగ్ బాస్ సెట్ ఏర్పాటు చేశారు. అక్కడికి ముంబయి నుండి తెలుగు ప్రేక్షకులను తీసుకువచ్చేందుకు ఒక ఆర్గనైజర్ కుదురుకున్నాడు. ఉదయం ఆరు గంటలకు ఓ లగ్జరీ బస్‌లో దాదాపు యాభై మందిని తీసుకొని, దార్లో ఓ ఢాబాలో టిఫిన్ పెట్టించి, దాదాపు పదకొండు గంటలకు, ముంబయికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న షూటింగ్ వేదికకి చేరుకోవాలి. పన్నెండు గంటల లోపు, అక్కడ భోజనాలు చేయించి, ప్రేక్షకులను సెట్ లోకి పంపించాలి. దాదాపు ఐదు గంటలకు షూటింగ్ ఐపోగానే తిరిగి బస్సులో ముంబయికి బయల్దేరాలి. ఆ రోజంతా భోజనాదులు ఆర్గనైజరే సమకూర్చాలి. షూటింగ్‌కి వెళ్లాల్సిన ముందు రోజు, కొలీగ్స్ అందరూ ఉబ్బేయడంతో వారికి పార్టీ ఇచ్చి, రెండు వేలకు తిలోదకాలిచ్చాడు హడావుడి రావు. తన అభిమాన నటుడ్ని కలిసే అవకాశంతో పోలిస్తే , అదతనికి చిన్న మొత్తంగా తోచింది. మర్నాడు నిర్ణీత చోటుకి, సమయానికి, అరగంట ముందే చేరుకున్నాడు హడావుడి రావు. రెండు గంటలపాటు నుంచుని కాళ్లు పీకాయతనికి. అప్పుడు తాపీగా వచ్చింది అతని శకటం.

“ఏంటి సార్! మమ్మల్ని పెందరాళ ఆరు గంటలకు రమ్మని మీరు ఎనిమిది గంటలకు వస్తారా? ఎక్కడ మీ బస్సు మిస్సౌతానో అని ఐదున్నరకే వచ్చాను. రెండున్నర గంటలు ఇక్కడ ఈడిగిలపడి శోష వచ్చేట్టుంది. ఏదో మా అభిమాన నటుణ్ణి చూడాలని మేము ఆతృత పడి మీకు లోకువయ్యామా?” ఆర్గనైజర్ మీద ఎగిరాడు హ.వి. రావు.

“ఏంటండీ బాగా ఎగుర్తున్నారు? మిమ్మల్ని రమ్మని మీకు బొట్టు పెట్టి పిలువలేదు. మీరే పైరవీలు చేసి మా పిలుపు అందుకున్నారు. మీకు రావాలనుంటే రండి, లేకపోతే ఇక్కడే దిగిపోండి. మీలాంటి వాళ్లతో ఇదే బెడద.” ఎదురు దాడి ఎదురైయ్యేసరికి కుక్కిన పేనయ్యాడు హడావుడి రావు. అప్పటికే ఆలస్యం అయిందని దార్లో చేయించాల్సిన టిఫిన్‌కి ఎగనామం పెట్టి, టీ నీళ్లతో సరిపుచ్చాడు ఆర్గనైజర్. అక్కడా గొడవ చేశాడు హ.వి. రావు.

హడావుడి రావుని ఆత్మరాముడు గోలపెట్టసాగాడు. అతన్ని, తాను తెచ్చుకున్న బిస్కెట్లు, మంచి నీళ్లతో జోకొట్టి నిద్రపుచ్చాడు. కరువులో అధిక మాసమన్నట్టు, పన్వెల్ దాటగానే ఇక కదలనంది బస్. మెకానిక్‌ని తీసుకొచ్చి, రిపేర్ చేయించి, షూటింగ్ చోటుకి చేరే సరికి, పుణ్యకాలం కాస్తా దాటిపోయింది.

యన్.టి.ఆర్., తన ‘జై లవకుశ’ నాయికలు రాశీ ఖన్నా, నివేదా థామస్ లతో అప్పటికే బిగ్ బాస్ షూటింగ్ మొదలెట్టాడు. సెట్ గేట్ మూసేశారు. ఇక ఎవరికీ ప్రవేశం లేదన్నారు. ఒక్కసారి యన్.టి.ఆర్ సెట్ లోకి వచ్చాక ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదన్నారు. చాలా దూరం నుంచి వచ్చామని ఎంత మొరపెట్టుకున్నా పప్పు ఉడకలేదు. ఆలస్యంగా వచ్చినందుకు ఆర్గనైజర్‌పై అక్షింతలు పడ్డాయి. అతని పారితోషికానికి కోత పెడతామన్నారు. అతను తన అక్కసు హడావుడి రావు పై తీర్చుకున్నాడు. అతన్ని పేచీకోరని ఇతరులకు చెబుతూ..

“మీ మూలాన మనకు మరింత ఆలస్యం ఐంది” అని విరుచుకు పడ్దాడు. హ.వి. రావు కిక్కురు మనలేదు.

‘ఓ అరుదైన అవకాశం కోల్పోయానే’ అని ఎక్కువ మథన పడ్డాడు హడావుడి రావు. అతను మళ్లీ ఆర్గనైజర్‌తో పెట్టుకున్నాడు. అంతకు ముందు తనను పేచీ కోరు అనడానికి పగ తీర్చుకున్నాడు.

“మేం గతిలేక వచ్చామా? ఆఫీస్‌లో నా హోదా తెలుసా? నా కింద పది మంది పని చేస్తున్నారు. నేనంటే వారికి హడల్! అలాంటి వాణ్ని మీరు, బిచ్చగాడి కంటే అధ్వాన్నంగా చూస్తారా? ఏదో మా అభిమాన నటుణ్ణి కలిసే అవకాశం వస్తోంది కదా? అని ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వస్తే, తగిన శాస్తే జరిగింది. మీకూ మీ బస్సుకూ ఓ డండం. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను.” అని తిరుగు ముఖం పట్టాడు హడావుడి రావు. ముంబయి పుణేల మధ్య నడిచే వోల్వో బస్సులో సొంత ఖర్చుతో, అతను తన గూడు చేరుకున్నాడు. మర్నాడు ఆఫీస్‌కి ఏ ముఖం పెట్టి వెళ్లాలా? తీవ్రంగా ఆలోచించాడతను. ఏ దారీ కనిపించలేదు. కాసేపు టీ. వీ. చూసే సరికి అందులోని ఓ సన్నివేశంతో అతనికి ఐడియా వచ్చింది. “హుర్రే” అని అరిచాడతను. అతని శ్రీమతి బిత్తర పోయింది. అదేమీ పట్టించుకోకుండా వెంటనే తమ కూతురి గదిలోకి చొచ్చుకుపోయాడు. పాపం ఆ అమ్మాయి గజ గజ వణికింది. అది గమనించే సరికి, హ.వి. రావు ఈ లోకం లోకి వచ్చాడు. వెంటనే తన కూతుర్ని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు. అంతా అయోమయంగా ఉంది ఆ అమ్మాయికి. బెదురు చూపులతో తన తండ్రిని అలానే చూస్తుండి పోయింది.

“ఏం లేదమ్మా! నీతో కాస్త పని పడింది. నువు మల్టీమీడియా చేశావు కదా? అది నాకిప్పుడు ఉపయోగ పడబోతోంది.”

“ఎలా నాన్నా!” కుదుటపడి అడిగింది.

“చెబుతా, చెబుతా నువు నీ ల్యాప్‌టాప్ తెరువు.”

“ఆ తెరిచాను. ఇప్పుడేం చేయాలి?”

తనకేం కావాలో చెప్పాడు హ.వి. రావు.

“సరే నాన్నా!” తలూపింది అమ్మాయి. హ.వి. రావులో విజయ దరహాసం!

మర్నాడు ఆఫీస్‌లో ..

“అంత మందిలో నాతోనే చేయి కలిపాడు యన్.టి.ఆర్. తెలుసా? రాశీ ఖన్నా, నివేదా థామస్ లను చూడడానికి రెండు కళ్లు చాలలేదంటే నమ్మండి. ఆ సెట్ వైభవం చూడాలే తప్ప వర్ణించలేము.” తన టీ షర్ట్ కు లేని కాలర్ ఎగిరేస్తూ తన మొబైల్ లోని ఫొటోలు చూపించాడు హడావుడి రావు.

ఒక ఫొటోలో హ.వి. రావుతో కరచాలనం చేస్తూ యన్.టి.ఆర్! ఇంకో దాంట్లో హ.వి. రావును హత్తుకున్న యన్.టి.ఆర్.

మరో దాంట్లో యన్.టి.ఆర్., రాశీ ఖన్నా, నివేదా థామస్ లతో హ.వి. రావు. మరొక ఫొటోలో కేవలం రాశీ ఖన్నా, నివేదా థామస్ లతో హ.వి. రావు! అలా వివిధ భంగిమల్లో అతని ఫొటోలు చూసేసరికి సహోద్యోగుల్లో కొందరు అసూయ పడ్డారు. కొందరు మనస్ఫూర్తిగా అభినందించారు.

“అంత మంచి చాన్స్ కొట్టేసినందుకు మాకు మళ్లీ పార్టీ ఇవ్వల్సిందే” అని పట్టు పట్టారు సహోద్యోగులు.

“మీకు ముందే పార్టీ ఇచ్చాను కదా?” అని వాదించాడు హ.వి. రావు.

“అది యన్.టి.ఆర్.ను కలువ బోతున్నందుకు. ఇప్పుడు అతనితో కలిసి ఫొటోలు దిగినందుకు. అంతే కాదు బోనస్‌గా రాశీ ఖన్నా, నివేదా థామస్ లను తనివి తీరా వీక్షించి, వారితో ఫొటోలు తీసుకున్నందుకు” అని పాయింటు లేవదీశారు తోటి పనివారు. లోలోన ఏడుస్తూ, పార్టీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడతను. మరో మూడు వేలకు కాళ్లొచ్చాయి. రాశీ ఖన్నా, నివేదా థామస్ లతో ఫోటోల తతంగంతో ఒన గూరిన అదనపు ‘లాభ’ మది.

పాపం హడావుడి రావు! నేరక గొప్పలకు పోయి, డబ్బుల కొరివితో తలంటు కున్నానని, తనలో తను కుమిలి పోతూ, పైకి మాత్రం పళ్లికిలించాడు. మున్ముందు భేషజాలకు పోకూడదని తన లెంపలు తనే వాయించుకున్నాడు, మనసులో!

Exit mobile version