[dropcap]”బో[/dropcap] బుద్దుండే వాడుగా కావాలంటే ఏమి ఏయాలనా?” అంటా మలన్ని అడిగితిని.
“బాగా సదవాలరా” అనే అన్న.
‘నాకి అంత వగ (యోగ్యత) లేదు. ఇది నా చేతిలో అయ్యేపని కాదు’ అనుకొని ఆడనింకా ముంద్రకి నడిస్తిని.
మూడు దోవలు కలిసే జాగ (స్థలం) ఆరు దోవలు కలిసే జాగ దాటి ఏటిగడ్డ ఎక్కితిని. ఆడ నేరలి (నేరేడు) మాను కింద నగతా నగతా వుండే నారాయణమ్మ కనిపిచ్చె.
“అమ్మా.. అమ్మా.. నారాయణమ్మ బో బుద్దుండే వాడుగా కావాలంటే ఏమి చేయాలమ్మా” అంటా అడిగితిని.
“ఈ జగతు గురించి జనం గురించి తెలుసుకోవాలరా” అనె ఆ యమ్మ.
‘అవును కదా!’ అనుకొంటా ఆయమ్మకి దండాలు చెప్పి కాను వబ్బ పక్క కదిలితిని. ఆడ కాటికి కాళ్లు సాపిండే సాకన్న తాత కనిపిచ్చె.
“సాకన్న తాతా బో బుద్దుండే వాడుగా కావాలంటే ఏమి చేయాల?” అంట్ని.
“దుడుంటే సాలు రా, ఇంగేం చేసే పనిలే” అనె.
“అదెట్ల తాత”
“బో బుద్దుండే వాళ్లంతా ఏడ వుంటారు… ఏం చేస్తారు పా!”
“ఇంగేం చేస్తారు తాత… వాళ్లంతా పెద్ద పెద్ద పదవుల్లా వాళ్ళ పనుల్లా వుంటారు”
“కదా! మడి వీళ్లని నడిపేది ఎవరు పా?!”
“ఆ.. రాజకీయ నాయకులు, దుడ్డుండే వాళ్లు”
“ఆ… ఆ.. ఇబుడు అర్థము అయెనా?”
“అయె తాత. దుడుంటే దొడ్డప్ప అవ్వచ్చు, బో బుద్దుండే అప్పా అవ్వచ్చు… ఎట్లో నా అబ్బ వాణ్ణి వీణ్ణి ఏమారిచ్చి చేను, చెట్టు బాగా సంపారిచ్చి పెట్టి పోయిండాడు. నాకి ఇంగేమి దిగులు లేదు. ఇంతలోనే నేను కూడా బో బుద్దుండే వాడుగా అయిపోవచ్చు” అనుకొంటా నగుకొంటా ఊరి దోవ సాగితిని.
***
బో బుద్దుండే వాడు = మేధావి