Site icon Sanchika

బొలీవీయా నదీతీరాలలో మా నడక

[box type=’note’ fontsize=’16’] ప్రపంచవ్యాప్తంగా నదీతీరాలలో తమ నడకలో భాగంగా బొలీవియా లోని నదీతీరాన సాగించిన తమ పర్యటన అనుభవాలను వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]బొ[/dropcap]లీవియాలోని టిటికాకా సరస్సు అద్భుతమైనది. నీటిపై తేలియాడుతూ ఓలలాడించే భూమిపై ఈ టిటికాకా సరస్సు అందచందాలు తప్పక చూడదగినవి.

టిటికాకా సరస్సు పెరూ, బొలీవియాల సరిహద్దులలో వుంది. ఇది ఆండీస్ పర్వత భాగాలలో వుంది. ఇది ‘incas’ అనే జాతి వారి పుట్టుక స్థలం అని చెప్తారు.

టిటికాకా అంటే స్పానిష్‌లో అతి పెద్ద, లోతైన మంచినీరు అని అర్థం. ఇది దక్షిణ అమెరికాలోని అతి పెద్దదైన సరస్సు. ఇది సముద్రమట్టానికి 3,812 మీటర్ల (12,507 అడుగులు)  ఎత్తులో వుంది.

ఇందులో విశేషం ఏంటంటే ‘incas’ రాక మునుపు 1000 – 1500 సంవత్సరాల క్రితం ఈ నీటి అడుగుభాగంలో ఒక దేవాలయం దొరికింది. ఆర్కియాలజీ విభాగానికి చెందిన 2000 మంది ఇక్కడ ఈ దేవాలయన్ని tiwanaku అనే జాతివారు కట్టారని ధృవీకరించారు.

టిటికాకా సరస్సుని చూచి, బొలీవియా దేశాన్ని కూడా చూడవచ్చునని మేము ఈ సరస్సుని చూసేందుకు వెళ్ళడానికి ప్లాన్ చేశాము.

***

మేము దిగిన హోటల్‌లో ఎనిమింది అమెరికన్లు ఇక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసి 10-సీటర్ వెహికల్ మాట్లాడుకుంటున్నారు రిసెప్షన్‍లో.

మేము కూడా వారితో జాయిన్ అవుతామని అడిగాము. వారు సంతోషంగా ఒప్పుకున్నారు. వారందరూ back packers. ఎంతో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసేవారిని back packers అంటారు. కేవలం వెయ్యి రూపాయలతో మేము ఆ ట్రిప్‍కి ప్లాన్ చేశాము.

తెల్లవారు జామునే రెండు గంటలకి మేము అక్కడి నుండి బయల్దేరాలి. 19 గంటల ప్రయాణం. మేము బయల్దేరేటప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు – అంతా ఫుడ్ బస్ టెర్మినల్‍లో తినవచ్చునని చెప్పారు.

సరే అక్కడి నుండి Punoకి వెళ్ళాము. అక్కడికి చేరేసరికి రాత్రి పది గంటలయింది. అక్కడే పడుకున్నాము. రెండు గంటలకి బయల్దేరి నాలుగు బ్రెడ్ ముక్కలు, కాఫీలతో ఆ రోజు మొత్తం ఆ టాక్సీలో కూర్చుని Punoకి చేరాము. మేము పడుకోగానే ఎంత నిద్ర అంటే, అబ్బా అస్సలు మధ్యలో మెలకువ రాలేదు. అంత గాఢ నిద్ర.

పొద్దున్నే తొమ్మిది గంటలకి మా పడవ ప్రయాణం. మళ్ళీ బ్రెడ్ తిని, టీ త్రాగేసి ఆ పడవలో షికారులా వెళ్ళాము. “అంతా పాకేజి కాబట్టి నువ్వు వంటసామాను గాని, కారంపొడి గాని, పచ్చళ్ళు గాని ఏమీ తేవద్దు. రోజంతా నడవాలి, బరువు వద్దు” అని మావారు అంటే, రెండు టీ షర్ట్‌లు, ఒక ప్యాంట్ పెట్టుకుని ఒక చిన్ని బ్యాక్‍ప్యాక్‍ తీసుకుని వెళ్ళాము.

బోట్ చూడగానే ఆ వున్న బడలిక అంతా ఎగిరిపోయింది. “హైలో హైలెస్సా హంస కధా నా పడవ ఓ హోయి ఉయ్యాల లూగినది ఊగిసలాడినది” అని పాడుకుంటూ నిజంగా హంస ఆకారపు బోట్‍లో హంసతూలికా తల్పము మీద పడుకున్న భావన. నీలి మేఘాలతో, గాలి కెరటాలతో దోబూచులాడుతూ మా ప్రయాణం సాగింది. ఒక ఎలిజబెట్ మహారాణిలాగా పోజు పెట్టి నేను ఆ తూలికా తల్పంలో ఊగిసలాడాను.

మేము మధ్యలో Puno నుండి ఫ్లోటింగ్ ఐలాండ్స్‌కి వచ్చాము. ఇవి మన కాశ్మీరులో లాగ మొత్తం పంటలు పండిస్తున్నారు. ఒక స్థలంలో రెల్లు గడ్డితో, వరి చొప్పతో వారి ఇల్లు కట్టుకున్న తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ ఫ్లోటింగ్ ఐలాండ్స్‌లో మొత్తం నేలంతా వరిగడ్డితో పరవబడి వుంది. టిటికాకా సరస్సు ప్రాంతంలో వున్న ప్రజలు అంతా టూరిజం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నో వేల మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు.

ఇక్కడ అన్ని ఊలుతో చేసిన బొమ్మలు, పూసలతో అల్లిన బొమ్మలు, చేతి కంకణాలు, ఊలు బొమ్మలతో పాటు చెవుల లోలాకులు, అన్ని రకాల కుచ్చు టోపీలు, ఊలు టోపీలు, స్వెటర్స్, శాలువాలు వున్నాయి. చేత్తో తయారు చేసిన ఎన్నో కట్టెబొమ్మలు అమ్ముతున్నారు. లేస్‍లతో ఉన్న  కర్చీఫులు, డైనింగ్ టేబుల్ సెట్లు చాలా రకాలు ఉన్నాయి. అందరూ కొన్నారు. నేను కూడా లోలాకులు, కర్చీఫ్స్ కొన్నాను.

వీరు నివసించే గుడిసెలకి ఈ రెల్లు గడ్దిని ఒకదానిపై ఒకటి చేర్చి కట్టి roof top వేశారు.

ఇక్కడ ఎక్కడ చూసినా గడ్డి! నేను, మా వారు ఆలోపల గుడిసెలో కూర్చుని అలా కాసేపు గడిపి బయటకు వచ్చాము. అక్కడ కూడా తినడానికి బ్రెడ్ మాత్రమే వుంది. అక్కడ రెండు గంటలు గడిపాము. క్రీ.పూ. 200 సం.లో purata అనే కొండజాతి వారు, తర్వాత tiwuanka అనే సాంప్రదాయముతో ఈ altiplano మరియు బొలీవియాలో నివసించారు.

ఇక్కడ UROS లేదా URU ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఫ్లోటింగ్ ఐలాండ్స్ అన్నీ మనుషులు నిర్మించుకున్నారు. ఈ సరస్సులో వున్న గడ్డీ, గాదామునంతటిని తెచ్చి ఈ భూమిలాగా తయారు చేసుకున్నారు. UROS లో వున్న URU ప్రజలు అమేజాన్ నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. క్రీ.పూ. 200 సం. నుండి వీరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

ఈ ఫ్లోటింగ్ ఐలాండ్స్‌ని అప్పుడప్పుడు వారికి అనుగుణంగా మార్చుకుంటూ వుంటారు. ఇక్కడ ‘వాచ్ టవర్స్’ వంతెన లాంటిది వేసి మెట్లు పైకి ఎక్కి చుట్టూ చూడవచ్చును. 1986లో పెద్ద తుఫానుతో ఇవన్నీ కొట్టుకుపోయినా, మళ్ళీ కట్టుకున్నారు. మేము అక్కడి నుండి Amantani అనే మరో ద్వీపానికి వెళ్ళాము. అక్కడ మాకు ముందే… ఈ పది మంది అమెరికన్స్‌తో ఒక గైడ్ వున్నారు. ఈ గైడ్ మాకు చెప్పారు – “మీరు దిగగానే మీరు ఒక ఇంటికి వెళ్తారు, మీకు వారు ఆతిథ్యం ఇస్తారు” అని! మేము అక్కడ దిగగానే మాకు 12 మంది స్వాగతం పలికారు. అక్కడి వారు మన లంబాడీలు వేసుకునే దుస్తులులాగా వేసుకున్నారు. పైన తెల్లటి షర్ట్స్, క్రింద ఎర్రటి లంగాలు వేసుకొని వారి ఆభరణాలతో నిలుచుకున్నారు. మా గైడ్ ప్రతి ఒక్కరికి ఒక్కో గెస్ట్‌ని ఇచ్చి పంపారు. అందులో భార్యాభర్తలం మేము ఇద్దరమే. మిగతా అందరూ సింగిల్స్. మాకు ఒకావిడని పరిచయం చేసి, “ఈవిడ మీకు ఆతిథ్యం ఇస్తుంది” అని చెప్పారు. మేము ఆవిడతో పాటు బయల్దేరాము.

అది ఒక గ్రామము. అక్కడ 4000 మంది మాత్రమే వున్నారు. మేము ఈ అమ్మాయితో కలిసి వరి మాగాణులలో నడుస్తూ వారి ఇంటికి వెళ్ళాము.

మేము వారి ఇంటికి చేరగానే వారు ఒక మేడ మీదకి తీసుకునివెళ్ళాను. వారికి మన భాష రాదు, మాకు స్పెయిన్ భాష రాదు. మేము అక్కడికి చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలు అయింది. ఆకలి నకనకలాడుతూ వుంది. నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడు ఫుడ్ తెస్తుందా అని ఎదురు చుస్తూ కూర్చున్నాము.

నాలుగు గంటలకి రెండు కప్పుల నీరు పట్టే ఒక బౌల్‌లో సూప్, ఒకటిన్నర అంగుళం సైజులో మొక్కజొన్న కండె, ఒక ఆలూ ఉడికించినది తెచ్చి పెట్టారు. అబ్బా ఇంత ఆకలికి నకనకలాడుతుంటే ఒక కప్ సూప్ ఏ మూలకో వెళ్ళిపోయింది. ఆలూ నేను తినను. చిన్న ముక్క మొక్కజొన్న కండె ఏ మూలకి నా ఆకలి తీర్చలేదు. ప్రొద్దున్న నుండి ప్రయాణం బడలిక, ఆకలి. ఈ లోపల నాలుగున్నర గంటలకి మేము విలేజ్ టూర్ బయల్దేరాము. మళ్ళీ మొక్కజొన్న తోటలు, వరి మళ్ళు దాటి ఐదు కిలోమీటర్లు నడిచాము. అక్కడ సన్ మూన్ టెంపుల్… ఎప్పుడో inca రాజులు కట్టిన శిథిలాలకి ట్రెకింగ్ తీసుకువెళ్ళారు. అక్కడ సూర్యాస్తమయం చూశాము. టిటికాకా సరస్సు ప్రపంచంలోనే “అత్యంత ఎత్తునున్న నౌకాయాన సరస్సు” (highest navigable lake). ఇక్కడికి ఆకలితో బయల్దేరి ఆరు కిలోమీటర్లు నడిచేసరికి తల ప్రాణం తోక కొచ్చింది. ఆ గైడ్‍ని నేను రిక్వెస్ట్ చేశాను – రాత్రి భోజనం ఆలూ లేకుండా ఒక మొక్కజొన్న కండెని ఇవ్వమని చెప్పండి అని!

“రాత్రికి full moon light dinner మీకు వాళ్ళు పెడ్తారు. worry not” అన్నాడు. నైట్‍కి చాలా పెద్ద డిన్నర్ వుంటుందని చెప్పారు. అక్కడ్కి చిరుతిండ్లు గానీ, కారం పొడిగానీ, బిస్కట్లు గానీ ఏమి పట్టుకొని వెళ్ళలేదు. నైట్‍కి బిగ్ డిన్నర్ అన్నారు కదా! అని మావారిని “మళ్ళీ ఆ చేలల్లో ఇంటికి ఏం వెళ్తాం, ఇంకా రెండు కిలోమీటర్లు నడవాలి, ఇక్కడే వుండి డిన్నర్ చేసుకుని వెళ్దాం” అని అడిగాను. “నో, నో, ట్రెక్కింగ్ చేసి చెమటలు పట్టేసాయి. ఈ డ్రెస్ మార్చాలి, రూమ్‍కి వెళ్ళాలి” అని చెప్పారు.

ఓకే అని కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ రెండు కిలోమీటర్లు నడిచాము. రాత్రి ఏడు గంటలకి మళ్ళీ చీకట్లో నడిచాం. వెన్నెల వుంది కదా, టార్చ్‌లైట్ వద్దులే అన్నారు. కొద్ది దూరం వెళ్ళేసరికి కప్పల బెకబెకలు. భయం. ఎక్కడ పాములుంటాయేమోనని! చివరికి గట్టు చేల మీద జారుతూ పడుతూ లేస్తూ ఆ డిన్నర్‍కి వెళ్ళాము. నేను చికెన్ తప్ప మిగతావి తినను. అక్కడ చూస్తే వారు ఏంటేంటో నాన్-వెజ్ ఐటమ్స్ పెట్టారు. మళ్ళీ ఆకలి. రోజు మొత్తం 20 నుంచి 25 కిలోమీటర్లు ఏమీ తినకుండా నడవడంతో నా ఉద్దేశంలో నాకు నీరసం వచ్చేసింది.

మావారు మాత్రం వారిచ్చిన పానీయం, ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. అక్కడి సాంప్రదాయ పద్ధతితో పదిమంది వచ్చి డాన్స్ చేశారు.

మావారు కూడా డాన్స్ చేసారు. రాత్రి పది గంటలకి తిరుగుప్రయాణమయ్యాం. ఆ పంట చేనులో బిక్కుబిక్కుమంటూ వెళ్ళి పడుకున్నాం.

ఉదయాన్నే బ్రెడ్, సూప్ ఇచ్చారు. మళ్ళీ ట్రెక్కింగ్. సూర్యోదయం చూడడానికి 14కిమీ దూరం నడిచాం. అది నడిచి మేం పడవ దగ్గరకి వెళ్ళి తిరుగు ప్రయాణమయ్యాం.

మా వారు ప్యాకేజ్ టూర్ అన్నారు కదా అని తెచ్చుకున్న తినుబండారాలు అన్నీ పెరులో పెట్టి ఆకలితో అలమటించిపోయాను.

మళ్ళీ Cuscoకి వచ్చాము. ఇక్కడ ఒక ఫుల్ చికెన్ ఆర్డర్ చేసి ఇద్దరం తినేశాము.

Cuscoలో ఆ రాత్రి వారి సాంప్రదాయ నృత్యాలు చాలా బాగున్నాయి. మేము బ్రెజిల్ కార్నివాల్‍కి వచ్చాము. అక్కడ్ని నుంచి బొలీవియా చూసాము. మేము రెండవ రోజున Cuscoలో ‘inca’ చరిత్రకి సంబంధిమ్చిన అన్ని కట్టడాలు చూశాము.

ఇక్కడ వున్న జంతువు బొచ్చుతో ఉన్న Alpaca. ఆండీస్, పెరూ, బొలీవియా, ఈక్వేటర్, చిలీలో ఉన్నాయి ఇవి. ఈ జంతువు సముద్రమట్టానికి 3500 – 5000 మీటర్ల (11000 – 16000 అడుగులు) ఎత్తులో వుండే స్థలాలలోనే వుంటుంది. అలాగే వింటర్ అనే జంతువు! లామాలు పెంపుడు జంతువులు. వీటిని 5000 సంవత్సరాల క్రితం నుంచి పెంచుతున్నారు.

కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుండి లామాలపై, వింటర్ జంతువులపై ఎన్నో సూదిమందులు ప్రయోగిస్తున్నారు. వైరస్ నుంచి మనల్ని కాపాడడం కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఇది తన ఒంట్లోకి వైరస్ చొరబడకుండా అడ్డుకుంటోంది. బెల్జియంలో వింటర్ ఒక హీరో. కరోనా కుటుంబానికి చెందిన సార్స్, మెర్స్ వైరస్‍ల ఔషధ తయరీలో భాగంగా వింటర్‍పై ప్రయోగాలు చేశారు.

దీనికి ఎందుకు కరోనా సోకడం లేదని ఆరా తీస్తే లామా రక్తంలో వున్న అతి సూక్ష్మమైన యాంటీబాడీలు కరోనా వైరస్ కణాల్లో చొరబడకుండా అడ్డుకుంటున్నాయని తెలిసింది. దీనితో వాక్సిన్ తయారుచేయాలని ఆలోచిస్తున్నారు.

అలాగే ఈ మయన్ సంస్కృతిని గమనిస్తే, అక్కడ వీరు సూర్యుడిని, చంద్రుడిని ఆరాధిస్తున్నారు. మన భారతీయ సమాజంలో భావిస్తున్నట్లుగా వున్న సంస్కృతి, ఆ లంబాడీ వేషధారణ అంతా ఇండియాకి సంబంధించినదిగా నాకు అనిపించింది.

 

మయన్ సంస్కృతిని మెక్సికోలోనూ, చిచేన్ ఇట్జాలో చూశాను. ఇది ప్రపంచ వింత. ఈ పిరమిడ్‌కీ, భారతీయ దేవాలయాల నిర్మాణ వాస్తు సాంప్రదాయానికి చాలా దగ్గర పోలిక వుంది. ఇదే మాచు పిచూ ‘sacred space’లో కూడా వుంది.

‘చిదంబరం’లో వున్న శివాలయంలో శూన్య రూపాన్ని ఆరాధిస్తాము. అదే విధంగా అక్కడ ‘చిచేన్ ఇట్జా’లో కూడా ‘sacred space’ శూన్య రూపాన్ని ఆరాధిస్తారు.

మయన్ సంస్కృతిలో ‘chilam balam’ అని వుంది. అదే మనం ‘చిదంబరం’ అని పిలుస్తున్నాము. ‘Kultanlini’ అని అక్కడ అంటే, మనం ఇక్కడ ‘kundalini’ అని పిలుస్తున్నాం. ‘Yokhah’ అంటే మనం ‘yoga’ అని అర్థాలుగా వాడుతున్నాము.

చైనా, ఆగ్నేయాసియాతో సాంస్కృతిక సంబంధాలు వున్న భారతీయులకు, నౌకానిర్మాణ నిపుణులైన భారతీయులకు పసిఫిక్ మహాసముద్రం ద్వారా పెరూ, మెక్సికోలకు… ఈ పాతాళ దేశాలకు చేరటం అంత కష్టం కాదేమో.

భారతీయ ప్రాచీన ఖగోళ శాస్త్ర గ్రంథాలను పరిశీలిస్తే ఇది భూగోళానికి క్రింది భాగం కాబట్టి పాతాళ లోకం అనేవారు.

‘మయుడు’ రచించిన సూర్య సిద్ధాంత గ్రంథంలో సూర్యుడు ఉదయించే దేశం అని వివరిస్తాడు.

అలాగే భాస్కరాచార్యుడు, సూర్యాస్తమయ దేశాలు సిద్ధపుర (పాతాళ దేశం అయిన అమెరికా) భూమికి దిగువన అనీ, అది సాయంకాలమనీ వివరిస్తాడు.

మహాభారత ఇతిహాసంలో మయసభను నిర్మించింది మయుడు. అలాగే రామాయణంలో లంకా నగరాన్ని నిర్మించిందీ మయుడే.

‘మయమతం’ అనే వాస్తు గ్రంథం చాలా ప్రసిద్ధి చెందినది. ఈనాటి ప్రఖ్యాత వాస్తుశిల్పి, శిల్పచార్యుడు డా. గణపతి స్తపతి అనేక అధ్యయనాలు చేసి, ‘మయ నాగరికత నిర్మాణశైలి, భారత నిర్మాణశైలి చాలా దగ్గరి పోలికలు వున్నాయ’ని కనుగొన్నారు.

పెరులో ఉన్న మాచు పిచు అనే ‘inca’ జాతీ కట్టడంను సందర్శించినా, మనవాటి నిర్మాణ రీతులు, వాస్తుశాస్త్ర ప్రమాణాలు గుర్తిస్తే అన్నీ భారత దేశానికి చెందినవిగా గుర్తించవచ్చు.

ఇక్కడి సూర్యుని, చంద్రుని విగ్రహాలు అన్నీ మన దేశానికి చెందినవిగా అన్పిస్తాయి. నిజంగా దీనికి సంబంధించిన అన్ని గ్రంథాలు అధ్యయనం చేస్తే ఖచ్చితంగా ఈ ‘mayan’ మరియు ‘inca’ సంస్కృతి మన భారతీయ సాంప్రదాయానికి చాలా దగ్గరి పోలికలు వున్నాయని తెలుస్తుంది.

ఇవన్నీ చూసి ఆనందిస్తూ మేము బ్రెజిల్ కార్నివాల్‍కి వెళ్ళాము.

Exit mobile version