[dropcap]తె[/dropcap]లంగాణ నుంచి కథలు వ్రాసిన తొలి బహుజన మహిళ బొమ్మ హేమాదేవి. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగర జీవితాలను భిన్న కోణాలలో ప్రతిబింబిస్తూ పలు నవలలు, వందకు పైగా కథలు వ్రాశారు. ఈ సంపుటిలో 15 కథలున్నాయి. అన్నీ కూడా 1970-80ల మధ్యలోని హైదరాబాద్ మధ్యతరగతి జీవితాలను రికార్డు చేసినాయి.
***
“ఇక్కడ వెలుగులోకి తెస్తున్న కథలన్నీ హైదరాబాద్‌లోని మధ్యతరగతి జీవితాలను ప్రతిఫలింపజేశాయి. భార్యాభర్తల మధ్యన ఉండే చిన్న చిన్న గొడవలు, అపోహలు, అల్ప సంతోషాలు, నగర జీవితంలోని భిన్న పార్శ్వాలు, ఉమ్మడి కుటుంబాలలోని కష్టాలు, ఇష్టాలు; డబ్బుకు దాసోహమై కుటుంబాన్ని పట్టించుకోని డాక్టరు గురించి, సంసారంలోని ఒడిదుడుకులు, నెలాఖర్లో ఉద్యోగస్తుల ఆర్థిక స్థితిగతులు, ఎదుర్కునే ఇబ్బందులు, ఆఖరికి నగరంలోని దొంగతనాల గురించి కూడా ఆమె రాసినారు. స్త్రీ దృక్కోణంలో, స్త్రీల పట్ల సహానుభూతితో రాసినారు.
మనసుకు హత్తుకునే కథనంతో తెలంగాణకే పరిమితమైన నుడికారంతో, సామెతలతో రచనలు చేసినారు” అన్నారు సంగిశెట్టి శ్రీనివాస్ తమ సంపాదకీయంలో.
***
“1960 దశకం నుంచి రచనలు చేయడం ప్రారంభించి తనలో దాగిన రచనాసక్తిని పెంపొందించుకుంటూ స్వయంకృషితో విస్తృతంగా రచనలు చేసి పాఠకుల ప్రశంసలు అందుకున్న తొలితరం తెలంగాణ రచయిత్రి బొమ్మ హేమాదేవి.
తన కళ్ళ ముందున్న మనిషి మనుగడనూ, వాస్తవ ఘటనలనూ వస్తువుగా తీసుకుని కథలుగా మలచడం వీరికి ఇష్టంగా ఉండేది.
ఈ సంపుటిలోని 15 కథల్లో సర్వసాధారణంగా కనిపించే అంశాలు – కథలన్నీ దాదాపు మధ్యతరగతి కుటుంబాలకూ, జీవితాలకూ సంబంధించినవే కావడం. ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లోని, వైవాహిక జీవితాల్లో తరచూ డబ్బు ఇక్కట్లు ఎదురవుతుండటం కనిపిస్తుంది. ఈ కథల్లోని ‘భర్త’ పాత్రలన్నీ మంచి సంస్కారంతో ఉంటాయి. నేరుగా సమాజానికి సేవ చేసినట్లుగా ఉండకపోయినా, భార్యాభర్తల మధ్యన, కుటుంబీకుల మధ్యన సమాజం, పేదరికం, పొదుపుల గురించి చర్చలు జరుగుతుండడం కనిపిస్తుంది.
ప్రధానంగా వీరి కథల్లో స్త్రీ పాత్ర ప్రాధాన్యత నిండుగా ఉంటుంది. మగవారి పక్షాన కథ నడిచి అక్కడక్కదా స్త్రీ పాత్రలు తారసిల్లడం కాకుండా ఇరువురి పాత్రా సమాంతరంగా నడుస్తుంది. రచయిత్రి తన ఎదుట ఉన్న తెలంగాణ సమాజాన్ని పరిశీలించి కథలు రాసినట్టుగా అనిపిస్తుంది” అన్నారు అనిశెట్టి రజిత తమ ముందుమాటలో.
***
బొమ్మ హేమాదేవి కథలు
రచన: బొమ్మ హేమాదేవి
ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు
పుటలు: 152, వెల: ₹ 100/-
ప్రతులకు:
- తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 500010. ఫోన్: 9849220321
- అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు