బొమ్మలు

0
2

[dropcap]అ[/dropcap]న్నీ బొమ్మలే! రచయిత్రి జ్యోత్స్నాదేవి చిన్నప్పటి నుండీ మదిలో కనిపించిన ప్రతి చిత్రాన్నీ కథలలోకి మలచి ఎందరినో ఆలోచింపజేసి చివరి దశలో మంచం మీద అతి కష్టం మీద దిండును కిటికీ దాకా లాక్కుని ఆ కిటికీ లోంచి మరోసారి సూర్యోదయాన్ని తిలకిస్తూ ఆ రోడ్డు మీద సాగిపోతున్న ఆటగాళ్ళనీ, వీధి కుక్కలనీ, చిన్నపిల్లలనీ, ఆటోలనీ చూస్తూ కూర్చుంటే అవతలి ప్రక్క నుండి ఎవరైనా చూస్తే మరో చిత్రమైన బొమ్మ కనిపిస్తుంది. టీ ఎస్టేట్‌లో పచ్చగా ఉన్న ప్రాంతంలోంచి మలుపులు తిరిగే రోడ్ల లాగా ఆవిడ ముఖం మీద మడతలు ఎటు సాగుతున్నాయో తెలియవు. చిన్న పిల్లవాడి క్రాఫు లాగా జుట్టు; జీవితంలో ఎంత సత్యం ఉన్నదో తెలియదు కానీ అటువంటి కిటికీ కున్న ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌కు బార్డర్ అయితే ఎంతవారికైనా ఆ బొమ్మ ఒక జీవిత సత్యమే. ఆ బొమ్మ ప్రతి రోజూ అలాగే కనిపిస్తుంది.. మాట్లాడదు. ఆలోచిస్తుంది.. అని ఎవరికీ తెలియదు!

***

ఓ చిన్నపిల్లను ప్రక్కన నడిపించుకుంటూ ఒకాయన వెళుతున్నాడు. ఆ పిల్ల అలా తనని వింతగా చూస్తూ నాన్న వేలు పట్టుకుని ముందుకు సాగిపోతోంది. ఇటువైపు ఆ కిటికీని, అందులోని జ్యోత్స్నాదేవిని అదే పనిగా చూస్తోంది. ఆవిడని చూపిస్తూ వాళ్ళ నాన్నని ఏదో అడుగుతోంది. ఆయన నోటి మీద వేలు పెట్టాడు. పిల్లను ఎత్తుకుని ఏదో చెవిలో చెప్పాడు. ఆ పిల్ల ఆయన భుజం మీద నుండి కొద్దిగా పాకి మరల ఆవిడను చూస్తోంది..

అదే వయసులో జ్యోత్స్న వాళ్ళ నాన్నను ఇలాంటి పేవ్‌మెంట్ మీదనే ఆపేసింది. తల్లి అడుక్కుంటుంటే ఆమె ప్రక్కన ఓ సత్తు పళ్ళెం పట్టుకుని  ఓ చిన్న కుర్రాడు కూర్చున్నాడు. జ్యోత్స్నకు ఒక నాణెం ఇచ్చి వాళ్ళ నాన్న ఆ పళ్లెంలో వెయ్యమన్నాడు. అలా చేసింది కానీ అక్కడి నుంది కదలలేదు.

“ఈ పిల్లాడు ఏం చేస్తాడు ఆ డబ్బుతో?”

ఆయన చెయ్యి పట్టుకున్నాడు.

“పద” అన్నాడు.

జ్యోత్స్న చిన్నప్పటి నుండే ఎంతో పెంకిది.

“చెప్పు” అంది.

“నీ లాగా చాక్లెట్ కొంటాడు”

“ఇక్కడే ఎందుకుంటాడు?”

“నువ్వు పద. ఇంటికి వెళ్ళాక చెబుతాను”

“నాన్నా.. వీళ్ళు అడుగుతున్నా వాళ్ళెవరూ ఆగకుండా వెళ్ళిపోతున్నారెందుకు?”

“ఇంటికి పద”

“మనమే ఎందుకు వేశాం?”

“ఇంటికి పద”

బలవంతంగా ఇంటికైతే వెళ్ళేది కానీ అలా ఆలోచిస్తూ ఉండేది. ఏమీ తొందరగా తినేది కాదు.

“తినమ్మా..” అమ్మ బ్రతిమాలుతూ అనేది.

“రోడ్దు మీదా..”

“రోడ్డు మీద?”

“రోడ్దు మీదా.. ఆ కుర్రాడు ప్లేటుతో కూర్చుంటాడు..”

“ఎవరూ? వాడా? ఆ.. కూర్చుంటాడు”

“అతను ఇంటికి వెళ్లాడా?

నాన్న పేపరు మొహం మీద నుంచి తీసి చూసాడు.

“ఆ.. వెళ్ళిపోయి ఉంటాడు. అలా రాత్రి కూడా ఎవరూ అక్కడ కూర్చోరు. ఇదిగో, నువ్వు తిను ముందు”

ఆలోచిస్తూ తినేది.

“అమ్మా..”

“ఏమ్మా..”

“ఆ కుర్రాడితో నేను ఆడుకోవచ్చా?”

***

గోడ మీద రకరకాల పక్షులు, పూలచెట్లు, ఏవో పండ్ల బొమ్మలు ఉన్నాయి. డాక్టర్ ఒక్కొక్క దానినీ ఒక కర్రతో చూపిస్తూ వాటి పేర్లని చెప్పమంటున్నాడు. అన్నీ కరెక్ట్‌గా చెబుతోంది. తన గది లోకి తీసుకుని వెళ్ళి కళ్ళ లోకి టార్చ్‌లైట్ వేసి పరీక్షగా చూసాడు.

“ఏమీ గాభరా పడేందుకు లేదండీ..” చెప్పాడు. “..పిల్ల కొద్దిగా సెన్సిటివ్. కొద్దిగా నలుగురూ ఆడుకునే చోట కలిసి ఆడించండి”

నాన్న ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ రాత్రి నిద్రలోంచి లేచింది.

అప్పటి వరకు పడుకోని నాన్న తలుపు లోంచి గమనిస్తూనే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మెల్లగా లోపలికి వచ్చాడు.

“కల గన్నావా?”

“లేదు”

“ఎందుకలా లేచావు? మంచి నీళ్ళు కావాలా?”

“వద్దు”

“ఏం కావాలి?”

తల అడ్డంగా ఊపింది.

“ఏమి ఆలోచిస్తున్నావమ్మా?”

“డాక్టరు..”

“డాక్టరు? ఆయన మంచి డాక్టరమ్మా! ఇంజెక్షన్ ఇవ్వలేదు కదా?”

“కాదు.. డాక్టరు..”

“డాక్టరు?”

“గోడ మీద ఒక్కొక్క బొమ్మ చూపించి అదేంటి? అని అడిగాడు”

“అవును. అన్నింటి గురించీ చక్కగా చెప్పావు కదా?”

“చెప్పాను. అన్నిటి గురించీ అడిగి చివరకి ఒక బొమ్మ గురించి అడగలేదు.”

అమ్మ లేచి వచ్చినట్లుంది. నాన్నకు ప్రక్కగా వచ్చి నిలుచుంది.

“ఏ బొమ్మ?”

“ఒక చెట్టు మీద కూర్చునున్న కోతిపిల్లను నాకు కర్రతో చూపించి అడగనే లేదు”

ఇద్దరూ ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు.

“అయితే ఆ కోతిపిల్ల నీకిప్పుడు కనిపిస్తోందా?”

“అవును”

అమ్మకి కోపం వచ్చింది.

“నువ్వే ఓ కోతిపిల్లవని తెలిసిపోయింది డాక్టరుకి. అందుకే అడగలేదు. నోరు మూసుకుని పడుకో. దెబ్బలు పడతాయి..”

***

కాలాన్ని మించిన కోతిపిల్ల మరొకటి లేదు. ఒకలా నడుస్తుందనుకుంటే మరొకలా కదులుతుంది. ఒకటి రుచిగా ఉందనిపించినప్పుడు ఎందుకో మరొకటి తినమంటుంది. ఎందుకు ఓ తంతు జరుపుతుందో తెలియదు. ఎందుకు గంతులేస్తుందో తెలియదు. కోతిపిల్ల కళ్ళలోకి చూస్తే మీదకి దూకుతుంది. కాలానికి కళ్ళెం వేయలనుకుంటే అరవకుండానే కరచి పోతుంది.

ఎదురుగా ఉన్న రోడ్డుకు ఆనుకుని వరుసగా ఇళ్ళు; మధ్యలో ఒక పాడుబడ్డ ఇలు నేనూ ఉన్నానని చెబుతూ ఉంటుంది. దాని కాంపౌండ్ గోడ మీద అందరికంటే ముందు ఇద్దరు కుర్రాళ్లు వచ్చి కూర్చుంటారు. ఏం మాట్లాడుకుంటారో తెలియదు. నిన్న ఏం జరిగిందో నెమరేస్తారో లేక ఈ రోజు ఏం చేయాలని చెప్పుకుంటారో, దించిన తలలు ఎత్తకుండా మాట్లాడుకుంటారు. కొద్ది సేపు హాయిగా నవ్వుకుంటారు. ఓ కుక్కను తీసుకుని ఓ పెద్దాయన అక్కడి వరకూ వచ్చి అదే పనిగా అందరినీ చూస్తూ నిలబడతాడు. ఆయన కదలి వెళ్ళగానే ఈ కుర్రాళ్లిద్దరూ వెళ్ళిపోతారు.

జ్యోత్స్నాదేవికి ఇప్పుడు రాబోయే బొమ్మ (దృశ్యం) ఎంతో ప్రధానం. ఈ బొమ్మని ఎన్నిసార్లైనా గ్రుడ్లు ఆర్పకుండా చూస్తుంది. ఆ బొచ్చు కుక్క అప్పటి వరకూ ఏదో వెతుకుతున్నట్లు తిరిగినా, ఒక్కసారిగా నిటారుగా నిలబడి అరవటం ప్రారంభిస్తుంది. దానికొక కారణం ఉంది. ఓ చాకు లాంటి కుర్రాడు అప్పుడు అక్కడికి వస్తాడు. అనుకుంటుండగానే వచ్చేసాడు. కుక్కతో ఉన్న పెద్దమనిషి మొబైల్‍లో మాట్లాడుతున్నాడు. కుర్రాడు వచ్చి అక్కడ పాంట్ రెండు జేబుల్లో చేతులు పెట్టి నిలుచున్నాడు. నీలం రంగు పాంటు, గోధుమ రంగు షర్టు. ప్యాంటు లోపకికి దోపిన షర్టును సరిగ్గా మరల దోపాడు. మరల సరి జేసాడు. ఇంకోసారి సెట్ చేసాడు. కుక్క అరుస్తోంది. మరల సరి చేసుకున్నాడు. ఒక వైపు తగ్గినట్టనిపించి మరల ఇటు తగ్గించాడు. కుక్క మరల అరిచింది. దానికి అది నచ్చలేదు. ఈసారి రెండు వైపులా బయటకి లాగాడు. అటూ ఇటూ చూసి మరల టక్ చేసాడు. కుక్క అతని చుట్టూ తిరిగి చిత్రంగా అరిచింది. ఈ సారి ఆ సంగతి వదిలేసాడు. దువ్వెన తీసి దువ్వటం మొదలుపెట్టాడు. మొబైల్‍ను అద్దంలా వాడుతున్నాడు. పెద్దాయన ఆ కుక్కని తీసుకుని బయలుదేరాడు. బహుశా ఆయనకు కుక్క గురించి బాగా తెలుసు. ఇటువంటివి దానికి అస్సలు నచ్చవేమో! ఇప్పుడు కుర్రాడొక్కడే ఉన్నాడు. ఆ కుక్క ఇటు తిరిగి అరుస్తూనే నిష్క్రమించింది. దువ్వి, దువ్వి అలసిపోయాడు. దువ్వెనని లోపల పెట్తి మరల షర్టును గమనించాడు. కొద్ది సేపు అటూ ఇటూ కదిలాడు.

***

జీవితమూ ఇంతే. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో ఏదో అనుకున్నారనీ ఈ మనసు ఏదో అనుకుంటూ మరేదో సద్దాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఆ సద్దుబాటుతోనే కాలం జాలిగా చూస్తూ ఎటో సద్దుకుంటుంది. ఈ గుద్దులాటలోనే ఏదో చేద్దామనే పద్దు అలా పెరిగిపోయి కళ్ళ ముందు వెక్కిరిస్తూ ఉంటుంది..

ఈ బొమ్మ చూసినప్పుడల్లా జ్యోత్స్నాదేవి తనివి తీరా గతాన్ని గుర్తు చేసుకుంటుంది.

“అయామ్ బార్డర్” అన్నాడు ఆ కుర్రాడు! నాలుగడుగులు వెనక్కి వెళ్ళి చూసింది. కాలేజీలలో పోకిరీలుంటారన్నది నిజమే. కానీ వీడు మరీ చిత్రంగా ఉన్నాడు. అబ్దుల్ కలామ్‌లా జుట్టు పెంచాడు. కుర్తాకీ, షర్ట్‌కీ మధ్య రకంగా ఒకటి తొడిగాడు. టక్ చేసుకునే పని లేదు. దాని గురించి చింత లేదు. పాంటు జేబులు రెండు చిన్న సైజు సంచుల్లా కనిపించాయి.  చెప్పులు చూస్తే ఇద్దరు వేరు వేరు మనుషుల నుండీ కొట్టేసి తొడుక్కొచ్చినట్లున్నాయి. ఒక్క క్షణం తనని కాదనుకుని అటూ ఇటూ చూసింది.

“బార్డరా? అంటే?”

“అది నా టైటిల్!”

“ఈ కాలేజీయేనా?”

“అవును. ఎప్పుడూ రాను”

“ఓ. ఈ రోజు పుట్టిన రోజా?”

ఇద్దరూ మైదానం వైపు నాలుగడుగులు వేసారు. “నిన్న రాత్రి మన కాలేజీ మాగజైన్‍లో మీ కథ చదివాను.”

“ఓ”

“కలవాలని వచ్చాను”

“కథ బాగుందా?”

“నన్ను కదిలించింది”

“ఓ. థాంక్స్”

“మీరు ఏ స్థాయిలో కళలను ఆస్వాదిస్తారో చూద్దామని వచ్చాను.”

ఆగింది. వీడేంటి? స్థాయిల గురించి మాట్లాడతాడు?

“నేను రచనలు చేస్తాను. కళల గురించి పెద్దగా తెలియదు. స్థాయిల గురించి అసలు తెలియదు”

అతను ఆగిపోయి జేబు లోంచి మడతలుగా ఉన్న ఓ కాగితం తీసాడు. ఒక కొసను తనకిచ్చాడు.

“పట్టుకోండి” అన్నాడు. అటువైపు నుండి దానిని లాక్కుంటూ వెళ్ళాడు. ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప పెయింటింగ్ ఇలా నలిపినప్పుడు రకరకాల బొమ్మలతో దర్శనమిస్తోంది.

“చెప్పండి” అన్నాడు.

“ఏం చెప్పాలి?”

“నేను అందరినీ అడిగే ప్రశ్నే! దీనికి బార్డర్ ఎక్కడివ్వాలి?”

“మీ బొమ్మా?”

“కాదు. నేను వేసిన పెయింటింగ్”

“అంటే మీదే కదా?”

“కాదు. దీనికి మీరు కథ వ్రాస్తే నాదవుతుంది”

కళ్ళజోడు సద్దుకుంది జ్యోత్స్న. ఆలోచనలో పడింది. ఈ కాగితం కదులుతుంటే అందులోని నది మీద మబ్బులు కదులుతున్నట్లున్నాయి. ప్రస్తుతం మెరుస్తున్న ఎండ ఇందులోకి దూరిపోయి ఇది నా బొమ్మే అని చెబుతున్నట్లున్నది.

“ఇంత పలుచగా ఈ కాగితాన్ని.. ఏమో, కాన్వాస్ అనుకుంటాను, ఇందుకని సెలెక్ట్ చేసారా?”

“ఒక కథను చదువుతున్నప్పుడు కలిగే ఆలోచనను ఈ కథలోని పాత్రగా మీరు చేర్చలేరు. అవునా?”

“మరో కథ వ్రాయగలను”

“అవును. కానీ నా బొమ్మలోకి ఎవరైనా పాత్రలా వచ్చెయ్యగలరు”

ఆశ్చర్యం వేసింది.

“ఇంతకీ చెప్పలేదు” అన్నాడు.

“ఏంటి?”

“బార్డర్ ఎక్కడ దిద్దాలి?”

జాగ్రత్తగా చూసింది. క్రింది వైపు నది ప్రవహిస్తూ ఉన్న చోట కొన్ని బండలున్నాయి. అక్కడ చిన్నగా ఆ చిత్రమైన కాగితాన్ని మడిచి చూసింది. వెంటనే అతను అదే మోతాదులో నాలుగు ప్రక్కలా మడిచి తిరిగి చూడమని పట్టుకున్నాడు. కళ్ళు జిగేలుమన్నాయి. మూడు మబ్బు తునకలూ మూడు వైపులా చూస్తున్నట్లు తిరిగాయి. పై భాగమంతా నల్లని నీడలా గిరజాలలా మారింది. చెట్టు కొమ్మ నీటి మీదకి వాలిన తీరు నాసికలా ఉంది. సూర్యకాంతి చెక్కిళ్ళను మెరిపిస్తున్నట్లుంది. నదిలోని మిగిలిన బండలు పెదాలుగా మారాయి.

“ఒక్క కళ్ళజోడు తీసేస్తే ఇది మీ ముందర అద్దంలా ఉంది. అవునా?”

మెల్లగా అబ్బాయిలూ, అమ్మాయిలూ అక్కడికి చేరుతున్నారు. ఈ వింతను తనివి తీరా చూస్తున్నారు.

“ఈ బార్డర్ కరెక్ట్” అన్నాడు.

“మీ కళ గొప్పది, వస్తాను” అని నమస్కారం పెట్టింది.

“నేనడిగింది మర్చిపోయారు” అన్నాడు, ఆ చిత్రాన్ని ఎంతో చాకచక్యంగా మడిచేస్తూ.

“ఏంటది?”
“కళకు కళతోనే కళ”

“అర్థం కాలేదు”

“కథ వ్రాయాలి – ఈ బొమ్మకు!”

***

ఎదురుగా ఉన్న ఆ బస్ స్టాప్‍లో ఎందుకో ఎవరూ లేరు. మెల్లగా ఆఫీస్ టైమ్ అయ్యే వేళకి ఎలా వస్తారో తెలియదు, గబ గబా వచ్చి నిలబడి పోతారు. ప్రస్తుతానికి ఓ కూరగాయల బండీ వాడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. జ్యోత్స్న అలా చూస్తునే కూర్చుంది. ఆవిడ వెనుక తలుపు తీసి అక్కడ పెట్టవలసినవి పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. తనని కేక వెయ్యటం, పలుకరించటం లాంటివి ఉండవు. సూర్యుడు మెల్లగా లేస్తున్నాడు. బస్ స్టాప్ లోకి ఓ అమ్మాయి మొబైల్ పట్టుకుని వచ్చి నిలబడింది. చున్నీ జారిపోయి పడిపోవాలి అన్నట్లు ఎడమ భుజాన ఉంచింది. ఈ అమ్మాయి రాగానే గబగబా నలుగురు వచ్చేసారు. కాకపోతే ఆమె బస్ స్టాప్‌కి అటు చివర ఉంది. ఇటు చివర ఓ కుర్రాడు మొబైల్‌లో మాట్లాడుతూ ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆమె కూడా అదే పని చేస్తుంది. ఈ వ్యవహారం బాగుంటుంది. నేరుగా మాట్లాడడం బాగుండదు కాబట్టి నాలుగడుల దూరంలో ఉంటూ సేటిలైట్‌ని వాడుకుంటూ ఒకరినొకరు చక్కగా చూసుకుంటూ మాట్లాడుకోవటంలో ఏదో వింత అనుభవం.. ఇరువురి మధ్య ఆకాశం ఇలా కలుసుకుంటుంది..

కాలేజ్‌లో క్లాస్ అయిపోయాక మినీ హాలు పక్కగా నడుస్తూ ఏదో వినిపించి ఆగిపోయింది.

“ఆకాశం.., ఇది కథ పేరు”.. అతను చెబుతున్నాడు. ఆ చిత్రాన్ని బోర్డుకు తగిలించాడు. “మబ్బులు బరువైనవి, ఎలాగో ఏర్పడిపోతాయి, నిండు కుండలు. ఆకాశంలో పుట్టినా, ఆ ఆకాశాన్నే తగ్గించుకుంటూ దగ్గరయ్యాయి. గుసగుసలు చెప్పుకున్నాయి. నీటిలో ఇరువురి ప్రతిబింబాలనీ ఆవిష్కరించుకున్నాయి. వద్దన్నా మృదంగాలు మ్రోగాయి. ఉరుములు ఉరిమాయి. ఆ నీటి లోని బొమ్మల మీద అక్షతలలా వాన చినుకులు కురిసాయి. మరల ఉరిమే ముందర మెరుపులు ఫొటోలు తీశాయి. ప్రజలలో పడ్డాయి. నదికి నది చేరింది. మదిని మది ముద్దాడి మురిసిపోయింది. ప్రవాహం సాగిపోయింది..” అని ఆపి ఆ చిత్రాన్ని అప్పుడు బార్డర్‌గా మడిచినట్లు మడిచి చూపించాడు.

“ఇప్పుడు కథ ముందుకు వెళుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇదంతా స్త్రీ అనే బొమ్మ – కాన్వాస్ మీద సాగిపోయేది! పురుషుడు కేవలం పాత్రగా మిగిలిపోతాడు..”

మెల్లగా చప్పట్లు కొడుతున్నారు అందరూ. గోడకి ఆనుకుని కుడి కాలు గోడకి చేర్చి చేతుకు కట్టుకుంది జ్యోత్స్న. అతను చెబుతున్న తన మాటలు వింటుంటే రాయి వంటి తనలోంచి చెక్కు చెదరని ఓ శిల్పాన్ని కేవలం గుసగుసల వంటి శబ్దమే చేస్తూ ఆవిష్కరించినట్లుంది! అందరూ బయటకి వస్తుంటే గబగబా సద్దుకుని మెట్ల వైపు పరుగు తీసింది. అందరూ తనని తోసుకుంటూ దాటేసారు. కొద్దిగా ప్రక్కకు జరిగి ఆగింది. ఎవరో వెనుకగా వచ్చి ఆగినట్లు అనిపించింది. కళ్ళు మూసుకుంది.

“నా అసలు పేరు సుందర్..”, అతని గొంతు వినిపించింది. “..మీ స్థాయిని అందుకోలేననుకున్నారా? కావచ్చు. నా బార్డర్లు నాకుంటాయి”

జ్యోత్స్న ఏమీ మాట్లాడలేదు. తన కుడి చేయి అతని చేతిలోకి తీసుకున్నాడు. భయం వేసింది. ఆ చిత్రాన్ని చేతిలో పెట్టాడు. ప్రక్కగా వచ్చాడు.

“దీనికి మీ చేతిలోనే కళ.. నా దగ్గర బార్డర్లు లేని కల!” అంటూ మెట్లు దిగేసాడు.

***

బస్ స్టాప్ దగ్గర కోలాహలం ఎక్కువైంది. స్కూటర్ మీద ఒకతను అక్కడ వాళ్ళావిడని దింపుతాడు. ఆవిడ దిగి చీర సద్దుకునే లోపు హెల్మెట్ తీసి చుట్టూతా చూస్తాడు. ఒకసారి పైకి చూస్తాడు. ఆవిడని ఎవరూ చూడకూడదని ఈశ్వరుని బహుశః ప్రార్థిస్తాడు కామోసు! చాలా ఉపదేశాలు చేస్తాడు. ఖచ్చితంగా కొత్తగా పెళ్ళయిన పాతకాలం వాళ్ళు! ఆమె అన్నిటికీ తలాడిస్తుంది. అతను వెళ్ళిపోగానే బ్యాగ్ లోంచి మొబైల్ తీస్తుంది..

సుందర్ కొన్నాళ్లు నిరుద్యోగి గానే ఉన్నాడు. తను లెక్చరర్‍గా చేరింది. రచనలు మానలేదు. సుందర్ బొమ్మలు, తన రచనలు సృష్టికి ప్రతిసృష్టిగా మారిపోయాయి. పత్రికా లోకం విస్తుపోయింది. సుందర్ సినిమా రంగంలో కెమెరామెన్‌గా స్థిరపడిపోయాడు. అందలం ఎక్కేసాడు. తననీ సినిమాలకి వ్రాయమన్నాడు. జ్యోత్స్న ఒప్పుకోలేదు. రకరకాల షెడ్యూల్సు ఉండేవి. వేళాపాళలుండేవి కావు. ఎన్నో చెప్పుకోదగ్గ అవార్డులు తీసుకున్నాడు.

ఓ రాత్రి బెడ్ మీద పడుకున్నప్పుడు ఎందుకో ఎన్నడూ రాని ఆలోచనలు కదిలాయి జ్యోత్స్నలో. సుందర్ గుండె మీద చేయి వేసి పడుకుంది.

సుందర్  బాగా అలసిపోయి ఉన్నట్లున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. అతని గుండె చప్పుడు కూడా రెడీ, లైట్, కెమెరా, యాక్షన్ అంటునట్లు కొట్టుకుంటున్నది. తనకి నిద్ర పట్టడం లేదు. సుందర్ ఒక నిద్ర అయ్యాక కొద్దిగా కదిలాడు.

“సుందర్..” మెల్లగా అంది జ్యోత్స్న.

“ఊ.. హు..” అది అతని అలవాటు.

“సుందర్..”

వెంటనే కళ్ళు తెరిచాడు. చటుక్కున లేచి కూర్చున్నాడు.

“యస్ జో!”

తనూ కూర్చుంది.

“ఒకటడుగుతాను”

“లేచే ఉన్నావా?”

“నో జోక్స్”

“చెప్పు”

“రకరకాల సినిమాలకు రకరకాల షూట్స్ చేస్తావు”

“కరెక్ట్”

“రకరకాల అమ్మాయిలను ఎన్నో భంగిమలలో, అర్ధనగ్నంగా కూడా క్లోజప్‍లు తీస్తావు”

సుందర్ కళ్ళు మూసుకున్నాడు.

“చూడకూడని విధంగా కూడా”

“అది అనడం ఇష్టం లేకే అలా అన్నాను. అంత నిజం.. అదే..”

“నగ్నసత్యం!”

“కామెడీ వద్దు సుందర్. కళ్ళు మూసుకుని మరీ గుర్తు తెచ్చుకుంటున్నావా?”

“ఇది కామెడీ! లేదు స్మరించుకుంటున్నాను. ఇంతకీ ఏమిటి నీ బాధ?”
“నీకు ఇబ్బంది కలగలేదా? మగాడివి. ఏమీ అనిపించలేదా?”

బెడ్ మీద నుండి లేచాడు. తప్పుగా అడిగానా అనుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న సిగరెట్ పాకెట్ తీసి కిటికీ దగ్గరకి వెళ్ళి, ఒకటి తీసి రజనీకాంత్ లాగా నోటితో పట్టుకుందామని ప్రయత్నం చేసాడు. అది క్రింద పడింది. పళ్ళికిలించాడు. మెల్లగా తీసి నోట్లో పెట్టుకుని ముట్టించాడు.

“అవన్నీ బొమ్మలు జో..!”, అన్నాడు. “..నీ ప్రశ్న సరైనదే. నాలాగ ఎందరో. నువ్వు నాకేమైనా సమస్యా అని అడిగావు. నాకదేమీ లేదు.”

ఆలోచించింది. అంటే..

విరగబడి నవ్వాడు. “ఆ బొమ్మల్లోకి ప్రవేశించటం పెద్ద కష్టం కాదు..”, చాలా చక్కని గొంతుతో చెప్పాడు. “..ఒక్క విషయం మరచిపోకు జో!”

“ఏంటది?”

“నా బొమ్మలోకి ప్రవేశించగలిగే దమ్ము నీకొక్కతికే ఉంది. మనం ఆ స్థాయి బొమ్మలం.”

సిగరెట్ నోట్లో పెట్టుకునే అల్మీరా తెరచాడు. పడుకోబెట్టి ఉన్న పుస్తకాన్ని తీసి చూపించాడు. అది తన నవల. ‘ఆలికి ఆరు’ అన్న టైటిల్ బంగారు వన్నెలో మెరుస్తోంది.

“ఇది మరిచిపోయావా?” అడిగాడు.

“ఇది నా చిత్రాలలోని చరిత్ర. ఇదిగో.. దాపరికపు సిగ్గు దొంతరల లోంచి తీక్ష్ణంగా పైకి లేపిన కళ్ళు – విచ్చుకుంటున్న విరుల కోసం. అప్పుడే వదలిన అరుణ కిరణం! స్పర్శకు అదును, స్పర్ధకు పదును.. వసంతం సంతలో కొనేది కాదు!”

జ్యోత్స్న బొమ్మ గుర్తు తెచ్చుకుంటోంది. సుందర్ కాగితాలు తిప్పుతున్నాడు.

“వే‘సవతులు’ రానీ, వేసవి ఆమె ఓర చూపు! వెచ్చని బంధం గ్రీష్మంలోని చల్లదనం!”

పేజీలు తిప్పుతూ తనను పరీక్షిస్తున్నాడు. జ్యోత్స్న దీర్ఘంగా శ్వాస తీసుకుంటోంది.

“మేఘాలు అమోఘంగా ద్రవించి నీ కనుల కొలనును చేరి కలిసిన పడతి కనుల విరిజల్లు – ఇంతి నీ ఉదాత్తమైన భావాలకు కట్టబడిన వంతెన!”

ఈ బొమ్మ ఆ బెడ్ రూమ్ లోనే ఉంది. ఇద్దరూ దాని వైపు చూసారు. కొద్ది సేపు ఆగాడు సుందర్. సిగరెట్ పొగ కిటికీ బయటకు ఊదాడు. కిటికీ రెక్కలను పట్టుకున్నాడు.

“శబ్దం, నిశ్శబ్దం, ఒకరినొకరు పలుకరించుకుంటూ కనురెప్పలు వాలుస్తూ, తేలుస్తూ సాగే గీతం ఆ శారద సహజ సంగీతం, నూరు శరత్తులను బేషరతుగా ఒక ఋతువులోనే ఊరించే సుధార్ణవము నీ నిత్య నవవధువు, నీ మనోనిగ్రహరూపిణి, నీ గృహిణి!”

జ్యోత్స్న ఎందుకో సిగ్గుతో తల వంచుకుంది. అతను చదువుతూనే ఉన్నాడు. “అనంతసీమలో ఏమందువోననని సీమంతానికి దాచిన హేమంతం అటు తిరిగి సిగ్గుతో క్రిందకి దింపిన వాలు చూపులు నీ జయమానమైన గర్భిణి ఉత్తరోత్తరా చిత్రములకు సరిక్రొత్త చిత్రలేఖిని!”

ఒక్కసారి తల పైకెత్తింది. సుందర్ కూడా ఆ చూపుకు కొద్దిగా ఆలోచించాడు. ఐనా పేజీలు తిప్పాడు. చదువుతున్నాడు..

“ఆ చూపు నిన్ను చల్లగా, శిశువును వెచ్చగా చూస్తూ శిశిరాన్ని రెండు చేతులా కప్పివేస్తూ సాగిపోయే శీతోష్ణం!”

పుస్తకాన్ని మూసి బెడ్ మీదకు వచ్చాడు. జ్యోత్స్నని ఒడిలోకి తీసుకున్నాడు.

“జో..”

“కొట్టు”

“ఎందుకు?”

“పిచ్చి ప్రశ్న వేసినందుకు”

“జో.. కొడతాను. ప్రశ్న పిచ్చిది కాదు. కెమెరాతో ఉన్నప్పుడు కనుల ముందు షడ్రుచులూ ఉంటాయి. నీ ఆరు చూపులూ తలచుకుంటే అవన్నీ ఆవిరైపోతాయి. అయినా ఆ స్థాయి వంట మనమిద్దరమే చేసుకోగలం!”

కొద్దిసేపు నిశ్శబ్దం కమ్ముకుంది. జ్యోత్స్నకి నిదుర వస్తున్నట్లుంది.

“పడుకో..”, అన్నాడు.

“ఊ..”

“అవునూ.. ఈ ఆలోచన ఇవాళే ఎందుకు కలిగింది?”

“ఊ.. మరి నాలో ఒక బుల్లి డాక్టరు పెరుగుతున్నాడు”, చెప్పింది.

***

ఇంటి ముందు పేవ్‌మెంట్ మీదకి ఓ పెద్ద మనిషి కాబ్ లోంచి దిగాడు. చక్కని సూటు, బూటు, బలే టిప్ టాప్‌గా ఉన్నాడు. కాబ్ వాడు వెళ్ళిపోయాడు. ఈయన నళ్ళ కళ్లద్దాలను ఒకసారి తుడిచి మరల పెట్టుకున్నాడు. ఆయన నిలబడ్డ చోటను ఆనుకుని రోడ్డు మీద ఒక గుంట ఉంది. ఓ చిన్న సైకిల్ మీద ఓ బుల్లి కుర్రాడొచ్చి, ఏదో పనున్నట్లు ఆగి, బైసికిల్ స్టాండ్ వేసి ఆ గుంట లోకి దిగి నాలుగుసార్లు గెంతాడు. ఆ బురద నీరు మొత్తం ఈయన సూటు మీద పడి నాశనం చేసేసింది. ఆయన గోల చేసి వాడిని పట్టుకునే లోపు వాడు చలాకీగా ఆ బైసికిల్ ఎక్కి తుర్రుమన్నాడు.

ప్రశాంత్ కూడా వెర్రి అల్లరి చేసేవాడు. బొమ్మలు, వ్రాతలు వద్దనుకొని డాక్టర్ చదివించాలనుకున్నారు. వాడి అల్లరి చూసి వీడేం చదువుతాడు అని చర్చించుకున్నారు. రైలు కదలక పోతే బోగీలో ఉన్న వాళ్ళందరినీ మీరెందుకు పనికొస్తారని తిట్టేవాడు. ఒకసారి జ్యోత్స్న అలిగి తన గదిలో తలుపు వేసుకుని పడుకుంది. ఏదో శబ్దమయి లేచి చూసింది. గోడ పైన వెంటిలేటరు వెనుక ప్రశాంత్ గాడు తొంగి చూస్తూ నవ్వుతున్నాడు. అయ్య బాబోయ్ అనుకుంటూ ఆదుర్దాగా తలుపు తీసి ఇవతలికి వచ్చింది. సుందర్ ఓ చెక్క టేబిల్ మీద కెక్కి వాడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని చేసిన పని అది!

అన్నీ బొమ్మలే! కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి!

తన పిచ్చి గానీ, ఇప్పుడు అందరూ మొబైళ్ళలో చూసేవి బొమ్మలే! పిల్లలకి తలిదండ్రులు బొమ్మలు, వాళ్ళకి వీళ్ళు బొమ్మలు.. కల్పన లోంచి సృజించిన బొమ్మలు. నిజజీవితానికి రంగులు పూసి, రంగరించిన రోజులవి. నిజజీవితాన్ని కేవలం బొమ్మలలోకి మార్చేసి అందరూ దిష్టిబొమ్మలలా మారిపోయిన కాలం ఇది.

నేల మీద చాప మీద పడుకుని మోకాళ్ళ మీద వాడిని కూర్చోపెట్టుకుని కథలు చెప్పేది! కళ్ళు పెద్దవి చేసి నవ్వేవాడు. బండి చప్పుడవగానే గబగబా దిగేసి తలుపు దగ్గరకు వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి మోకాళ్ళ మీద కూర్చునేవాడు. చెయ్యి అడ్డంగా తిప్పేవాడు. నాన్న కాదు అని దానికి అర్థం. అలా నాలుగైదు సార్లు తిరిగి చివరికి సుందర్ వచ్చినపుడు వాడి గోలకి అడ్డు, అదుపూ ఉండేవి కావు!

ఆలోచనలలో రోజు గడిచిపోయింది. ఎందుకో ఈ రోజు పెద్దగా ఏదీ తినాలనిపించలేదు. అలానే నిదురపోయింది. ఎప్పుడో సూర్యాస్తమయం సమయంలో మరల లేచి కొద్దిగా ఫ్లాస్క్ లోని టీ తాగి కిటికీ లోంచి చూస్తోంది జ్యోత్స్నాదేవి. ఆమె విశ్వాన్ని తన కిటికీ లోంచి చూసి ఇలా కూడా చూడవచ్చు అని చెప్పే పుస్తకాలన్నీ తయారు చేసింది. అవన్నీ ఆ గదిలో తన వెనుక గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. ‘మేమున్నాము’ అంటున్నాయి. ఒక్కసారి తనివి తీరా చూసుకుంది. పెద్ద పెద్ద కప్పులు ఇంటి పై కప్పును తాకుతున్నాయి. రోడ్డుకు అవతలి ప్రక్క తనలాంటి వృద్ధురాలు ఆటో లోంచి దిగింది. ఇప్పటికి ఎన్నిసార్లు ఆస్పత్రిలో చేరిందో ఏమో పాపం.

ప్రశాంత్ చాలా గొప్ప డాక్టరయ్యాడు. స్వయంగా నర్సింగ్ హోమ్ కట్టించాడు. సుందర్ చివరి రోజులలో అందులోనే ఉన్నాడు. తను రోజూ సాయంత్రం వెళ్ళేది. రాత్రి అక్కడే పడుకునేది. నిద్రలో ఉన్న సుందర్‌ని చూస్తూ ఎందుకో ప్రక్కనున్న టేబిల్ మీద తల వాల్చింది. బుగ్గకి ఏదో తగిలి తీసి చూసింది. ఏదో కాగితం.. చదివింది – సుందర్ వ్రాసినట్లుంది. “జో! నన్ను తీసుకెళ్ళేవాడు ఎంత ప్రయత్నిస్తున్నా వాడి వల్ల కావటం లేదు! దానికి కారణం ఉంది – వాడినీ, నన్నూ కలిపి బొమ్మ గీయాలనుకున్నాను!” ఎందుకో అంతలోనే చిరునవ్వు నవ్వింది జ్యోత్స్న.  పెన్ను తీసి వ్రాసింది – “బార్డర్‌కి చేరావు సుందర్! బార్డర్ లేనిదో బొమ్మ లేదు. మనం గొప్పవాళ్ళం. జననం, మరణం అనే వాటిని రెండు చిరునవ్వుల జరీ బార్డర్‌గా చేసి జీవితం అనే చిత్రాన్ని విచిత్రంగా మలచాము.”

ప్రశాంత్ మరో డాక్టర్‌తో లోపలికి వచ్చాడు. తన భుజం మీద చెయ్యి వేసాడు.

“మమ్మీ..”, అన్నాడు. “..మన కోసం.. అంటే మనం కాబట్టి ఇన్ని రోజులు ఈ టూల్స్‌తో అలా ఉంచాం. ఏమంటావు? ఆలోచించు..”

దీర్ఘంగా నిటూర్చి తల ఊపింది జ్యోత్స్న.

***

సూర్యుడు అస్తమిస్తున్నాడు. చిన్ని ప్రశాంత్‌ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కథలు చెబుతూ సుందర్ కోసం నిరీక్షించినట్లు మోకాళ్ల నొప్పులను తలచుకుంటూ దేనికో నిరీక్షిస్తోంది.. ఎదురుగా బస్ స్టాప్ లోని  బెంచీ మీద ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఒకడికి చేతిలో ఏదో కొత్త కెమెరా ఉంది. దానిని ఫోకస్ చేస్తూ తన వైపే పెట్టినట్టున్నాడు. అతనిలో ఎందుకో సుందర్ కనిపించాడు. బేలగా నవ్వింది జ్యోత్స్నాదేవి! అతనే ఉండి ఉంటే ఖచ్చితంగా ఇలాగే ఫొటో తీసేవాడేమో! తీసి బొమ్మ చూపిస్తే ఏమి వ్రాసేది?

‘మబ్బులు ఆడిన ముద్దులాటగా మాయమవుదాం నేస్తం!

పబ్బములు గడిపితిమిగ, ఇక సాయమవుదాం నేస్తం!’

***

మరోసారి ఆ ఇంటి ముందు సూర్యోదయమయింది. మరో రోజు ప్రారంభమయింది. రోజూ చిన్న పిల్లతో వాకింగ్‌కి వచ్చే ఆయన ఆ పిల్లని తీసుకుని వచ్చాడు. వేలు పట్టుకుని ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసే ఆ పిల్ల కిటికీ మూసి ఉన్నందుకు ఆగిపోయింది. ఆయనా ఆగాడు. పద పద అన్నాడు. కొంత దూరం వెళ్ళి ఆగాడు. పిల్ల కిటికీ దగ్గరే ఉంది. మెల్లగా అక్కడికి వెళ్ళాడు. ఆ పిల్ల కొద్దిగా గోడ అంచున కాలు పెట్టి కిటికీ రెక్కను తోసింది. ఎంతో ఆసక్తితో రోజూ చూసే ఆవిడని చూడాలని చూసింది. వెనక్కి తిరిగి ఆయనకు తన చిన్న వేలితో చూపించింది. ఆయన జాగ్రత్తగా చూసాడు. రకరకాల పుస్తకాల చాటున, బొమ్మల మాటున ఓ పెద్ద బొమ్మ ఉంది. సుందర్, జ్యోత్స్న ఇద్దరూ చక్కగా బొమ్మల్లాగ ఆ కిటికీ దగ్గర ఎవరా అన్నట్లు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here