Site icon Sanchika

బూడిద కుప్పలో దాగిన ఆణిముత్యాలు ఆదిపురుష్ పాటలు

[‘ఆదిపురుష్’ సినిమా పాటలని విశ్లేషిస్తున్నారు వేదాల గీతాచార్య,]

[dropcap]అ[/dropcap]సలు ఈ సినిమా పేరు చెప్పగానే జనాలు కొట్టొస్తారు. లేదా విమర్శిస్తారు. కొంతమందికి ఒక రకంగా నచ్చింది. మరికొందరికి అస్సలు నచ్చలేదు. రామాయణం ఆధారంగా ప్రభాస్ లాంటి దేశాన్ని ఏకం చేస్తున్న స్టార్ హీరోతో సినిమా అనగానే అంచనాలు కాంతి వేగంతో ఆకాశంలోకి ప్రయాణం మొదలెట్టేశాయి. వాటన్నిటినీ సినిమా టీజర్ పాతాళంలోకి తొక్కేసింది. విడుదలను ఆర్నెల్లు వెనక్కి నెట్టి మరీ ఏవో రిపేర్లు చేసినా, చేశామని చెప్పినా ఈ సినిమా నిలబడలేదు.

కానీ సినిమా రిలీజుకు ముందు ఒక రెండు నెలలు మటుకూ కాస్త ఏవో నమ్మకాలు కలిగాయి. దానికి కారణం ఈ సినిమాలో పాటలు.

జై శ్రీరామ్ నినాదం బాగా ట్రెండ్ అవుతున్న కాలంలో అదే శీర్షికతో వచ్చిన పాట బాగా హిట్టయింది. తర్వాత వచ్చిన పాటలు కూడా బాగానే అందుకోవటంతో సినిమా విడుదలకు ముందు కొంత నెగటివిటీని తగ్గించుకుంది. కానీ సినిమా చూసి బైటకు వచ్చాక.. ఆ కథ అందరికీ తెలిసిందే.

క్రమంగా పాటలు కూడా జనం మర్చిపోయినట్లున్నారు. సినిమా మీద ఉన్న నెగటివిటీ అంత ఎక్కువగా ఉంది.

నేను వివిధ ఆడియో డివైజులు పరీక్షిస్తుంటాను. దాని కోసం నాకు అప్పుడప్పుడూ వివిధ రకాలైన గ్యాడ్జెట్స్ వస్తుంటాయి. ఆ పని కోసం పాటలు ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఆ వినటం కూడా ఏ పాట పడితే ఆ పాట కాకుండా కొన్ని ప్రత్యేకమైన పాటలు ఎంచుకుని అన్ని రకాల డివైజులను పరీక్షిస్తుంటాను. దాదాపు చాలాసార్లు ఆ పాటలే వింటాను. దాని కోసం బోర్ కొట్టకుండా ఉండటానికి నాకు బాగా నచ్చిన పాటలనే, రిపీట్ వేల్యూ ఎక్కువగా ఉన్న పాటలే ఎంచుకుంటాను. లేకపోతే చేయాల్సిన అసలు పని దెబ్బైపోతుంది. ఎంచుకున్న వాటిలో ఆదిపురుష్ పాటలు కూడా ఉన్నాయి. బేస్ టెస్ట్ చేయటానికి శివోహం పాట వాడతాను కొన్ని ఇళయరాజా పాటలతో పాటూ.

క్రమంగా దానితో పాటూ నా కాలక్షేపం సమయాల్లో ఈ సినిమా పాటలు వినటం ఎక్కువైంది. వింటున్న కొద్దీ మధురంగా అనిపించసాగాయి. ఎంత వింటే అంత నచ్చుతున్నాయి. అటు సాహిత్యం, ఇటు సంగీతం అద్భుతంగా అమరాయి.

నిజానికి ఈ సినిమాకు సంగీత దర్శక ద్వయం అజయ్-అతుల్ మాత్రమే పూర్తి స్థాయిలో మనసు పెట్టి పని చేశారేమో అనిపిస్తుంది.

మొత్తం ఆల్బమ్ లో ఐదు పాటలున్నాయి.

అవి వరుసగా (నేను Apple Music వింటాను. అతి తక్కువ ఖరీదులో lossless audio ఇచ్చేది Apple Music)

  1. జై శ్రీరామ్
  2. శివోహమ్
  3. ప్రియ మిథునం
  4. హుప్పా హుయ్యా
  5. రామ్ సీతారామ్

ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా సాగుతాయి. జై శ్రీరామ్ ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తుంది. శివోహమ్ మంచి intensity ఉన్న పాట. సరిగ్గా వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రియ మిథనం అద్భుతమైన మెలోడీ. హుప్పా హుయ్యా హుషారెక్కించే పాట. రామ్ సీతారామ్ రామాయణ కాలానికి తీసుకు వెళ్ళే పాట.

సంగీత దర్శకులు ఇతర రామాయణాధారిత సినిమాల సంగీతానికి భిన్నంగా వెళ్ళినా ఎక్కడా శ్రావ్యత తగ్గదు. ధ్వని బాగుంది. Instrumentation added a different texture to each song. గీత రచయిత (తెలుగులో రామజోగయ్య శాస్త్రి) పనితనం బాగా కనిపిస్తుంది. పాడిన వారు కూడా మనసు పెట్టే పాడారనిపిస్తుంది.

జై శ్రీరామ్ పాటలో

మహిమాన్విత మంత్రం నీ నామం అంటూ రామనామ మహిమను చెప్పి, సూర్యవంశ ప్రతాపం, శౌర్యమే నీ స్వరూపం, జగతికే ధర్మ దీపం – నిండైన నీ విగ్రహం… ఇలా రామో విగ్రహవాన్ ధర్మః అన్న మాటను ఈ విధంగా చెప్తారు. పాట చివరలో కనీసం ఒక్కసారి అయినా జై శ్రీరామ్ అనకుండా ఉండలేము. శ్రీరాముడి గొప్ప లక్షణాలను ఈ తరానికి చేరువయ్యేలా చెప్పే పాట ఇది.

శివోహమ్ పాట వినటంతో పాటూ చూడాలి కూడా. చూస్తే తెలుస్తుంది ఎంత ఎఫర్ట్ పెట్టారో అని. రావణుడి సహజ నైజమైన తీవ్రమైన ఉద్వేగాలు ఈ పాటలో మనకు కనిపిస్తాయి. సంగీతం కూడా అదే రకంగా ఉంటుంది. సాహిత్యం చాలా గొప్పగా నడుస్తుంది. శివుడి మీద సినిమాల్లో వచ్చిన గొప్ప పాటల్లో ఒకటిది. సైఫ్ అలీఖాన్ కూడా కొంత వరకు లీనమై నటించాడు ఈ పాటలో.

మచ్చుకు ఈ క్రింది వాక్యాలు చూడండి.

అనన్య భక్తి భావమే ఆరాధన ప్రవాహమై ఆకాశగంగా తీరులా వర్షించే శివుని శిరసుపై నిరంజనానురక్తియై నీరాజన ప్రకాశమై గిరీశు జఠా తలమున వెలింగె చంద్రవంకయై

పాట పాడిన విధానం కూడా మనను ఒకరకమైన భక్తి మత్తులోకి తీసుకు వెళుతుంది. ఉద్వేగం ఈ పాటకు ఆయువు పట్టు.

ఇక మూడవ పాట ప్రియ మిథునం. ఇది కూడా చూస్తూ వినాల్సిన పాట.

సీతారాముల మధ్య ఉన్న ప్రేమకు అద్దం పట్టిన పాట. విజివల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. But not our regular aesthetics. కానీ సీతారాములు ఒక డ్యుయెట్ పాడుకుంటే ఇంత బాగా ఉంటుందా అనే విధంగా చిత్రించారు. ముందే చెప్పినట్లు అద్భుతమైన మెలోడీ ఈ పాట. వాక్య నిర్మాణాలు కూడా సీతారాముల హృదయాన్ని చదివినట్లు ఉంటుంది. ప్రభాస్, కృతీ సనన్‌ల కళ్ళలో అనురాగం బాగా కనిపిస్తుంది జాగ్రత్తగా గమనిస్తే.

అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం

అభిరాముని పుణ్యమెగా అవనిజకి సౌభాగ్యం

పాటలో హుక్ వచ్చేసి

జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే! జగాలను ఏలే రామచంద్రుని హృదయాన్ని ఏలేది సీతమ్మ కదా. వారి ప్రేమ అమరం. పైగా సుందర కాండలో హనుమ అనుకున్నట్లు సీతను చూస్తే రాముని చూడక్కరలేదు. రాముని చూస్తే సీతను చూడక్కరలేదు.

ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై

ఇరువురిదొక దేహం ఒక ప్రాణం

మన కథనం తరముల దరి దాటే స్వరమై

పలువురు కొనియాడే కొలమానం

అర్థం అందరికీ తెలిసేలాగనే ఉంది. దీనికి సమకూర్చిన ట్యూన్, నేపథ్య సంగీతం మనలను ఒక దైవీభావనలో ఓలలాడుస్తాయి.

నాలుగో పాట హుప్పా హుయ్యా. ఇది సినిమాలో లేదు. వీడియో సాంగ్‌లో చూపిన విజువల్స్ కూడా సినిమాలో, ట్రైలర్‌లో కనిపించేవే కానీ, ఈ పాటకు వేరే నేపథ్యం ఉండి ఉండాలి.

రా వానర సంతోష వేళరా గంతుల్లో తేలరా డుండుం డుండుం

శ్రీరాముడే మన జట్టు కట్టెరా ఎలుగెత్తి చాటరా డుండుం డుండుం

శ్రీరాముడు వానర రాజు సుగ్రీవుడితో మైత్రి చేసుకున్న సమయం కాబోలు. శ్రీరాముడు తమతో జట్టుకట్టాడని వానరాల్లో అంబరాన్ని అంటే సంబరాలు ఈ పాట.

హుక్ లైన్స్…

అడ్డురాదే గడ్డుకాలం

జగదాభిరాముడే అభయమునీయ (ఇది వినేటప్పుడు goosebumps guaranteed)

శ్రీరాముడు అభయం ఇస్తే ఇక మనకు ఏ భయమూ ఉండదు. గడ్డుకాలం కూడా గడగడా వణికి పారిపోతుంది. అదే విషయం ఈ వాక్యాలలో ఉంది. నాకు ప్రత్యేకించి నచ్చింది… 👇🏽

రామ ప్రేమకు అంకితం మనం రాజ మైత్రికి బద్దులం మనం

స్పర్శమాత్రం స్వామి దీవెనం కలుగజెయ్యదా కార్యసాధనం

రాజమైత్రికి బద్ధులై మొదట రామునికి జయధ్వానాలు చేసినా ఆ పైన ఆ స్వామి గొప్పతనం తెలిసి ఇంకా ఆయనకు బద్ధులై ఉండటమనే విషయం స్పష్టమవుతుంది. ఇది మనకు సుందర కాండలో  స్పష్టంగా కనిపిస్తుంది. సుందరకాండలో కథనం నడుస్తున్న కొద్దీ హనుమ శ్రీరాముడి గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. దూతోహం కోసలేంద్రస్య దగ్గర నుంచీ దాసోహం కోసలేంద్రస్య వరకూ చేసే ప్రయాణం ఈ పాటలో కనిపిస్తుంది. కాకపోతే వానర సేన విషైకంగా.

చివరి పాట రామ్ సీతారామ్.

ఆదియు అంతము రామునిలోనే

మా అనుబంధము రామునితోనే

ఆప్తుడు బంధువు అన్నియు తానే

అలకలు పలుకులు ఆతనితోనే

అంతా రామమయం. ఆయనే అన్నీ అని మొదలౌతుందీ పాట.

రామనామమను రత్నమే చాలు

గళమున దాల్చిన కలుగు శుభాలు

మంగళప్రదము శ్రీరాముని పయనమూ

ధర్మ ప్రమాణము రామాయణము

అర్థం వేరే చెప్పాల్సిన పని లేదు కదా. ఈ పాట సినిమా టైటిల్స్ అప్పుడు వస్తూ మనను భక్తి భావంలోకి తీసుకు వెళుతుంది.

కానీ మొదటి సన్నివేశాలు చూడగానే ఆ మూడ్ కాస్తా ఖరాబ్ కావటం చాలామందికి తెలిసిందే.

కానీ we have to give due where it deserves అన్నట్లుగా ఈ సినిమా సంగీతం, దానికి సమకూరిన సాహిత్యం ఈ తరానికి శ్రీరాముడి గొప్పతనాన్ని తెలియజేయటమే కాదు, హాయైన ఐదు పాటలు మనకు ఇచ్చింది. బూడిద కుప్పలో దొరికిన ఆణిముత్యాలలాగా.

నాకు మనసు చికాకుగా ఉన్నప్పుడల్లా ఈ పాటలు వింటున్నాను. మనసు తేలికై మళ్ళా పనులు చేసుకునే ఉత్సాహం వస్తోంది.

అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన పాట ప్రియ మిథునం. సీతారాముల అనురాగాన్ని చాలా బాగా చూపిస్తారు. సాహిత్యం కూడా పిల్లలకు నోటికి నేర్పదగ్గట్లు చక్కగా సమకూరింది.

Arguably… album of the decade.

Exit mobile version