Site icon Sanchika

బ్రాహ్మీమయమూర్తి

[dropcap]వి[/dropcap]శ్వనాథ సత్యనారాయణ గారి ఉద్గతికి సాహిత్యంలో ఆయన పెరగటానికి మూలాలను అన్వేషించవలసి ఉన్నది. యవ్వనంలో పద్య విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఆయన పది వేల పద్యాలను రాసి చింపేశారట. తెలుగు పద్య నిర్మాణంలో అన్ని మెళకువలను ఎత్తుగడలను, దుష్కరములైన యతి ప్రాసలను తన అభ్యాసంలో స్వాయత్తం చేసుకొని.. ఆధిపత్యం వహించారు. సాహితీ సమితిలో 1920 ప్రాంతాల్లో ఆయన చేరినప్పుడు శివశంకరశాస్త్రి మొదలైనవారు ఆత్మీయంగా ప్రేమించి స్వాగతం చెప్పారట. ఈ విషయం నాకు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి చెప్పారు. 1925 ప్రాంతాల్లో నర్తనశాల రాసినప్పుడు అది చూచి భాసుని వంటి నాటకం వంటి నాటకాన్ని రాశావని పింగళి లక్ష్మీకాంతం గారు మెచ్చుకొన్నారట. మా స్వామి, కిన్నెరసాని పాటలు ఆంధ్ర ప్రశస్తి మొదలైన రచనలతో విశేషమైన వైవిధ్యం ప్రతిభా ప్రకాశం కలిగిన రచనలు చేస్తూ ఎదిగిపోయారు. సాహితీ సమితిలో ఆయన ఉనికి చాలాకాలం కొనసాగలేదు. సాహితీ సమితికి అధ్యక్షులుగా అంటే సభాపతిగా శివశంకరశాస్త్రిని శాశ్వతంగా నియమించే ప్రతిపాదన వచ్చినప్పుడు దానిని ఆయన తిరస్కరించారు. తనతోపాటు అడవి బాపిరాజు, నాయని సుబ్బారావు, నండూరి సుబ్బారావులతో కలిసి సాహితీ సమితి నుంచి నిష్ర్కమించారు. ఈ సన్నివేశం తరువాత సాహితీసమితిలో ఉన్నవారికి బయటకు వచ్చినవారికి అంటే ముఖ్యంగా విశ్వనాథకు వైరుధ్యం పెరిగింది. ఆయనను గూర్చిన దుష్ప్రచారమూ పెరిగింది. 1932-33లలో రచించిన వేయి పడగలు, రాజా విక్రమదేవవర్మ చొరవతో అడవి బాపిరాజుగారి నారాయణరావుతో పాటు బహుమతి పొందటం ఆయన పేరు ప్రతిష్ఠలు పెంచింది. 1935లో బందరులో జరిగిన వేయిపడగలు అభినందన సభలో (దీనిలో అడవి బాపిరాజుగారు కూడా పాల్గొన్నారు) భావరాజు నరసింహారావు గారు విశ్వనాథను కవి సమ్రాట్‌ అని సంబోధించారు. అప్పటినుంచి ఆయనకు అది సహజమైన బిరుదమై నిలిచింది. తరువాత నోరి నరసింహశాస్త్రి గారికి, పైడిపాటి సుబ్బరామశాస్త్రిగారికి కవి సమ్రాట్‌ అనేది బిరుదంగా లభించినా.. అవి చరిత్రలో నిలువలేకపోయాయి. తరువాత సాహిత్య రంగంలో ఒక వర్గం విశ్వనాథకు అనుకూలంగా, మరొక వర్గం ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యాయి. ఆయన మీద విరోధుల ఒత్తిడి బాగా పెరిగింది.

తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని

చవులూరి చవులూరి వనిత కిన్నెరసాని

అన్న కిన్నెరసాని పాటలలోని తెలుగు సత్కవిరాజు అన్న ప్రశంసాపదం ఆయన ఆత్మ ప్రత్యయాన్ని తెలియజేస్తుంది. తరువాత వేనరాజు ప్రస్తావనలోని అంశాలు ఆయన విశ్వాసానికి చిహ్నాలుగా నిలిచాయి. ఆ విధంగా తన్నుతాను గూర్చి అభిమానంతో ఆత్మవిశ్వాసంతో పలుకవలసి వచ్చింది. అందువల్ల శ్రీమద్రామాయణ కల్ప వృక్షం అవతారికలో అల నన్నయ్యకు లేదు అన్న పద్యం ఆవిర్భవించింది.

1932 ప్రాంతంలో పింగళి కాటూరులు సౌందరనంద కావ్యాన్ని గురువుగారైన చెళ్లపిళ్లవారికి అంకితం చేస్తూ..

కేతన తోడి పొత్తునకు కేల్గలుపన్‌ తలపోసి కాదు అని తిక్కనగారికి దశకుమార చరిత్రను అంకితం చేసిన కేతనతో తాము సమానం కాదన్నట్టుగా సూచన ఉన్నది. ఈ విషయం కూడా విశ్వనాథకు నచ్చలేదు. అందువల్లనే అల నన్నయ్యకు లేదు అన్న పద్యం ఆరంభంలో నన్నయకు తిక్కనకు కూడా తన వంటి శిష్యులు లేరని అన్నారు. అంటే చెళ్లపిళ్ల వారి శిష్యులు కేతన వంటివారి కంటే.. ఎన్నో రెట్లు అధికులని సూచన ఉన్నది.

సాహిత్య చరిత్రలో నన్నయ గారి సహకవిని గూర్చి ప్రసక్తి ఉన్నది కానీ, శిష్యుల ప్రసక్తి లేదు. తిక్కనగారి విషయంలో మాత్రం కేతన ప్రసక్తి సూచనగా ఉన్నది. అది ఈ పద్యానికి మూలభూతమైన కారణమని నేను అనుకొంటున్నాను. ఈ పద్యంలో తనను గూర్చి తన వంటి శిష్యుడు ఆ మహాకవులకు లేరని చెప్పుతూ ‘అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పేశల చాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళ వంశస్వామికున్నట్లుగా’ అని చెళ్లపిళ్లవారి శిష్యుడైన తన గొప్పతనాన్ని చెప్పుకొన్నారు. ఈ పద్యంలోని విశేషణంలో రెండు అంశాలున్నాయి. అలఘు స్వాదు రసావతారము ఒకటి. ధిషణాహంకార సంభారం మరొకటి. మొదటి విశేషణానికి సమృద్ధమైన ఆస్వాద్యమైన రస స్ఫురణము అని అర్థం. తన కావ్యములో అడుగడుగునా రసానుభవం కలిగించే లక్షణం ఉండటం ప్రతిభాజన్యమైన అంశం.

ఏ కవి కావ్యానికైనా సమృద్ధమైన రస స్ఫురణ.. రసజ్ఞుడు కోరే ప్రధాన లక్షణం. రసహీన కావ్యం నిర్గంధ కుసుమం రసముతోపాటు కవి యొక్క షేముషి బహు శాస్త్ర సంయోజనము. కావ్యానికి విలువను సమకూర్చే అంశం. కేవల రస స్ఫురణ ఆధునిక కాలంలోని ఖండ కావ్యం వంటిది. మహాకావ్యాలు బహు శాస్త్ర రహస్యాలతో నిబిడీకృతమైనవి. కల్పవృక్షంలో రెండవసారి అవతారికలో చేర్చిన పద్యంలో

‘ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి తొల్చినన్‌

సదమల వృద్ధికిన్‌ సకల శాస్త్ర రహస్య వివేకమబ్బినన్‌..’

అన్న పద్యంలో సంస్కృతాంధ్ర కావ్యాలే కాక విశ్వసాహిత్యంలో పరిచితములైన అంశాలు ప్రాచీన, ఆధునిక శాస్త్రాలలోని మర్మాలు మనో వికాసానికి హేతువులుగా ఉండే లక్షణం పాఠకునికి అవసరమని సూచిస్తూ.. తన కావ్య వైశిష్ట్యాన్ని వివరించారు.

వరలక్ష్మీ త్రిశతిలో మూడు భాషలలోని ముగ్ధ భావములు ఏరుకొని.. తెచ్చుకొని.. దాచికొనిన చోటు అన్నచోట సంస్కృతాంధ్రములు దాటిన ఇతర భాషా సారస్వత సౌందర్యముల సంగతి ప్రస్తావింపబడింది. ఈ పద్యంలోని విశేషణంలోని కావ్యానికి రెండు రెక్కల వంటి ప్రతిభా వ్యుత్పత్తులను గూర్చి అయోధ్యలోని అభిషేక ఖండంలోని ఖండాంత పద్యంలో వివరింపబడింది.

సంస్కృతాంధ్ర సారస్వత సరసతా విశేష వి

శేష శేముషీభర రసస్విన్న భాష..

అన్నచోట కూడా మన వారసత్వంగా వచ్చిన సంస్కృతాంధ్ర సారస్వతముల సరసత రసముతో కూడిన అంశము, శేముషీ భర.. సకల శాస్త్ర రహస్యములతో కూడిన అంశము.. తన కవిత్వము లేదా భాష అనడం రెంటి సంయోగము చేత రసస్విన్నమని చెప్పుకొన్నారు. ఈ విశేషాన్ని అనుసరించి చూస్తే విశ్వనాథ కవిత్వానికి ప్రతిభా విశేషాలు సమానమైన పక్షాలుగా నిరంతరం ఊర్థ్వ అభిముఖంగా ప్రయాణం చేసే సుందర కవితాసంభారంగా భావించినట్టు తనను ప్రశంసించుకొన్నట్టుగా ఈ పద్యం విస్పష్టం చేస్తున్నది. ఇది ఆత్మవిశ్వాస ప్రకటనమ కానీ, దురహంకారం కాదు.

మరొక పార్శ్వంలో అల నన్నయకు లేదు.. పద్యంలోని బ్రాహ్మీమయ మూర్తి అన్న విశేషం తాత్త్వికంగా తన జీవుడు ఆత్మానుభవ మార్గంలో పొందిన పరిణత స్థితిగా కూడా సూచిస్తుంది. భగవద్గీత బ్రాహ్మీమయత్వాన్ని ప్రస్తావించింది. ఈ బ్రాహ్మీ మయత్వము ఐహిక ప్రపంచంతో సంబంధం లేని నిత్య బ్రహ్మ భావనాస్థితి. ఇది యోగులకే సాధ్యమైన అంశం.

కల్పవృక్షం చివర విశ్వనాథ జగదనిత్య భావనానిరతుడనని చెప్పుకొన్నాడు. ఆద్యమైన జీవ లక్షణాన్ని తొలగించమని ఈశ్వరుని వేడుకొన్నాడు. ఈ అంశాలు బ్రాహ్మీమయ స్థితి చేరుకొన్న లక్షణాన్ని నిరూపిస్తున్నది. విశ్వనాథలోని కవిత్వ పరమార్థాన్ని అది లక్ష్యంగా సాగిన జీవుని ప్రయాణాన్ని సూచిస్తున్నదే కానీ, లౌకికమైన దురహంకారాన్ని కాదు.

Exit mobile version