[dropcap]”బ్రా[/dropcap]మ్ముడు (బ్రాహ్మణుడు) అనేది జాతి వాచక పదము కదనా?”
“కాదురా, అది తత్వ వాచక పదమురా”
“ఏమా తత్వమునా?”
“జ్ఞాని, మూల స్వరూపం తెలిసినవాడు, యదార్థం తెలిసిన వాడు అనిరా, ఈ అర్హత వుండేవాళ్లంతా బ్రామ్ములేరా”
“మడి (మరి) రెడ్డి, నాయుడు, కాపు, మాల, మాదిగా ఇవినా?”
“ఇవీ జాతులు కాదురా”
“ఇంగేమినా?”
“అది వాళ్లు వాసము (నివసించే) చేసే జాగాలురా. ఒగడు కత్తి పట్టాడు, ఇంకొకడు ఉలి పట్టాడు, మరొకడు కొడవలి పట్టాడు. వీళ్లకి దానికి సంబంధించిన (అంటే వాళ్ల పనికి) జ్ఞానం, యదార్థం, మూల స్వరూపం, ఏమని బాగా తెలుసురా. వాళ్ల ఆ జ్ఞానమే, శ్రమ. శ్రమ నిరంతర శ్రమగా, పరిశ్రమగా, వ్యవసాయ పరిశ్రమగా మారి మానవాళిని ముందుకు నడిపెరా”
“అంటే ఆ జ్ఞానం, ఈ జ్ఞానం రెండూ ఒగటేనా… నా?”
“అవునురా”
“అయితే ఈ కులాల కుంపటిండ్లు, మతాల మిద్దె మేడలు ఏల వచ్చెనా, ఎట్ల వచ్చెనా?”
“రేయ్! ఆపరేషన్ ఎవరు చేస్తారురా?”
“ఇంగెవురునా, డాక్టరు చేస్తారునా”
“కదా”
“ఊనా”
“డాక్టరు కాని డాక్టరు కొడుకు ఆపరేషన్ చేస్తే ఏమవుతుందిరా”
“ఏమవుతుంది అంటావ్ ఏమినా, అసలు వాడు ఆపరేషన్ చేసేకి ఎట్ల అవుతుంది?
“అయ్యెల్దు కదా”
“ఊహూ”
“ఇట్లా నాయాళ్లు చేసిన పనేరా ఈ కులాల కుంపటిండ్లు, మతాల మిద్దె మేడలు.”
***
బ్రామ్ముడు = బ్రాహ్మణుడు