Site icon Sanchika

బ్రహ్మలిపి

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నము ఒంటిగంట వరకే ప్రపుల్లకుమార్ భోజనము ముగించుకొని మహబూబ్‍నగర్ పోవడానికి సిద్ధమయ్యి ‘శ్రీ’ అంటూ తన భార్య శ్రీగౌరిని కేక వేస్తున్నట్లుగా పిలిచాడు.

డైనింగ్ టేబుల్‍పై తాను తన భర్త భోజనాలను చేసిన కంచాలను, నీళ్ళు, మజ్జిగ త్రాగిన గ్లాసులను తీసుకొని కిచెన్‍లోని సింక్‍లో వేసి వాటన్నింటిని కడుగుచున్న శ్రీగౌరి “ఆఁ వస్తున్నాను” అని తానూ బిగ్గర గొంతుతోనే పలుకుతూ సమధానమిచ్చి ‘ఈయనకెప్పుడు కళ్ళముందరే ఉండాలి. ప్రతిపని క్షణాల్లోనే పూర్తి కావాలి. ఉద్యోగములో ఉన్ననాడు అంతే; రిటైర్‌మెంట్ అయినాక కూడా అంతే’ అని మనసులో అనుకుంటూ అన్నింటిని కడిగి వేసినాకనే కిచెన్‍లో నుంచి వెలుపలికి పోవాలని నిశ్చయించుకొని తన పనిలోనే మునిగిపోయింది.

రెండు, మూడు నిమిషాలు వేచి చూచిన ప్రపుల్ల ఇక ఆగలేక పదేసి సెకండ్ల చొప్పున విరామముల నిచ్చి మూడుసార్లు మరింత మరింతగా బిగ్గర గొంతుతో పిలచిననూ శ్రీగౌరి స్పందన లేకపోవడముతో తానే కిచెన్‍లోకి పోబోతుండగా మధ్యలోనే శ్రీగౌరి కిచెన్ ద్వారములో నుంచి వెలుపలికి రావడము కనబడడముతో ఆగిన ప్రపుల్ల, “ఏం చేస్తున్నావ్ ఇంతసేపు? గొంతు చించుకొని ఎన్నిసార్లు అరచినా పలుకవేం?” కోపముగా, విసుగ్గా అడిగాడు తన భార్యను.

“నీ మొదటి కూతకే వస్తున్నాని పలికాను. నీకు వినబడలేదా?” తన భర్తకు వినబడియేయుంటుంది కాని తన భర్తకు తొందరెక్కువ కావున విన్ననూ మళ్ళీ మళ్ళీ పిలచినాడని నిశ్చయముగా తెలిసిన శ్రీగౌరి అన్నది.

“తెలుసుగదా! రెండు గంటల బస్‍కే మహబూబ్‍నగర్ పోతానని”.

ఇంకా చాలా సమయముందని తనకూ తెలుసు. తను ఎప్పుడెఫ్ఫుడు వెళ్ళాలానని తానే తొందరపడుతున్నానని తెలుసు. తానే నిగ్రహించుకోలేకపోయి తన భార్యను పిలిచినాడని కూడా తెలుసు.

“ఇంకా గంట సమయముంది కదా! తొందరెందుకు? డ్రెస్ తీసి టేబుల్‍పై పెట్టాను కూడా!” అన్న శ్రీగౌరి తన భర్త అప్పటికే డ్రెస్ వేసుకొని చేత బ్యాగ్ కూడా పట్టుకుని పోవడానికి సిద్ధముగా నిలబడియున్నాడని గమనించి,

“ఇంకా సమయం ఉంది కదండి. ఇప్పుడే వెళ్ళి ఆ బస్ స్టేషన్‍లో వేచియుండే దానికంటే కాస్సేపు ఇక్కడనే కూర్చుని పోయేముందు నీళ్ళు, టీ త్రాగి నింపాదిగా పోవచ్చుగా! అంత తొందరెందుకు?” భర్త తొందరపాటు తనకెన్నోసార్లు అనుభవపూర్వకముగా తెలిసియుండినను తొందరపడవలసిన అవసరము అప్పుడు లేదన్నట్లుగా సూచించింది.

“ఇంట్లో కూర్చుని కాలహరణము చేసేదాని కంటే ఏదో ఒక పత్రిక కొనుక్కొని బస్ స్టేషన్‍లోనే బస్ వచ్చేవరకు అక్కడేయున్న ఒక బెంచ్‍పై కూర్చుని చదువుకుంటూ కాలక్షేపము చేయవచ్చు” ఆమె సూచన సరియైనది కాదన్నట్లు తన ఆలోచననే సరియైనదన్నట్లుగా అని, “సరే ఇక నేను వస్తాను” అంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ద్వారము వైపుకు మళ్ళీ అడుగులు వేయడము ప్రారంభించగానే శ్రీగౌరి, “మీ ఇష్టమండి. మీకెప్పుడు అవసరము లేకున్నా ప్రతి చిన్నదానికి కూడా తొందరపాటుతో కూడిన మీ ఆలోచనయే గాని నా మాట ఎప్పుడైనా విన్నారా? వింటారా? మంచిది వెళ్ళిరండి. బాబును, కోడలమ్మను అడిగినానని చెప్పండి. చిరంజీవి మన ముద్దుల మనమడు ఆదిత్యకు నా ఆశీస్సులను చెప్పండి” అంటూ ద్వారము దాకా భర్తను అనుసరిస్తూ వచ్చింది.

కాని ప్రపుల్ల వడివడిగా వెళ్ళి గేట్ తీసి రోడ్‍పైకి వచ్చాడు,

“పిల్లలకని ప్యాక్ చేసిన స్వీట్ డబ్బాలను బ్యాగ్‍లో పెట్టుకున్నారు కదా! తొందరలో మరచిపోయినారా?” తొందరలో ఎన్నోసార్లు తన భర్త స్కూల్ హెడ్‍మాస్టర్‍గా యున్నప్పుడు హెడ్‍మాస్టర్‍ కార్యాలయమందలి ‘అల్మరా కీ’లను మర్చిపోవగానే తానే స్వయముగా ఆ ‘కీ’ లను తీసుకొని ఆటోలో స్కూలుకు పోయి తన భర్తకు ఇచ్చి వచ్చిన అనుభవముతో అడిగింది. ‘కీ’ లను మర్చిపోయిన విషయము తాను కూడా గమనించనపుడు భర్తే ఇంటికి తిరిగివచ్చి ‘కీ’లను మరచిపోవడముతో కల్గిన కోపమును తనపైననే ప్రదర్శించిన అనుభవముతో కూడా అడిగింది.

“ఉదయమున బ్రేక్‍ఫాస్ట్ చేసిన వెంబడే పెట్టుకున్నాను” అని సమాధానమిచ్చి వేగముగా దగ్గరేయున్న కూడలి కడయున్న చిన్న ఆటోస్టాండ్ దగ్గరకెళ్ళి అక్కడయున్న మూడు ఆటోలలో ఒక ఆటోడ్రైవర్‍తో బేరమాడి ఆ ఆటోను కట్టించుకొని దానిలో బస్ స్టేషన్‌కు బయలుదేరినాడు. కిలోమీటర్ లోపు దూరములోనే బస్ స్టేషన్ ఉన్ననూ అది ఎంతో దూరములో ఉన్నట్లుగా దానిని చేరుకోవడానికి ఎంతో సమయము పడుతున్నట్లు అతనిలో ఫీలింగ్ కలుగుచున్నది. ఒక మనిషిగాని, ఒక వాహనముగాని అడ్డురాగా ఆటోడ్రైవర్ ఆటో వేగాన్ని ఏమాత్రము తగ్గించినా లేదా బ్రేక్ వేసినా తీవ్ర ఆలస్యమైపోతుందన్న ఆందోళనకు అతడు గురి కాసాగాడు. క్షణమాత్ర ఆలస్యాన్ని కూడా సహించలేకపోతున్నాడు.

“ఏమయ్యా! నీకింతకు ఆటో నడపడమొచ్చునా లేదా? చాలా స్లోగా నడుపుచున్నావ్. మధ్య మధ్యన ఆపుచున్నావు” అసహనముగా అడిగాడు.

”ఎంత వేగముగా నడపాలో అంతే వేగముగా నడుపుచున్నాను సార్. మీరు చూస్తూనే ఉన్నారుగా?” తాను తక్కువ వేగముతో నడపడము లేదని ఏదైనా, ఎవరైనా అడ్డువచ్చినప్పుడే వేగము తగ్గుచున్నదన్నదానిని ప్రపుల్లకు గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు ఆటోడ్రైవర్.

“ఏం నడుపుచున్నావో ఏమో?” ఆటోడ్రైవర్ మాట యథార్థమేనని తెలిసిన ప్రపుల్ల ఇంకేమి అనలేక అన్నాడు. అయినా, “ఇంతకూ నువ్వు ఆటో కొత్తగా నడుపుచున్నావా?” ఎందుకన్నాడో అన్నాడు అనాలోచితంగానే.

“ఐదేళ్ళ నుంచి నడుపుచున్నాను సార్. మిమ్మల్ని కూడా ఎన్నోసార్లు మీ స్కూల్‍కు తీసుకెళ్ళాను” ఆటోడ్రైవర్ గుర్తు చేయడముతో జ్ఞాపకము రాగా మనసులోనే తన అనాలోచిత ప్రశ్నలకు సిగ్గుపడి ఏమి తిరిగి అనలేక, “సరే! సరే!” అని అంటుండగానే బస్ స్టేషన్ రావడముతో ఆటో నేరుగా ప్రయాణికులు లోపలికి మరియు బయటకు వెళ్ళు ద్వారము గుండా లోనికి ప్రవేశించి ప్రయాణికులు నిరీక్షించే హాలు యొక్క మెట్ల దగ్గర ఆగడముతో, ప్రపుల్ల ఆటోలో నుండి దిగి, డ్రైవర్‍కు డబ్బులిచ్చి మెట్లమీదుగా హాల్లోకి ప్రవేశించి అందులోనున్న బుక్‍స్టాల్ దగ్గరకు వెళ్ళి ఆ నెల విపుల మరియు చతుర మాసపత్రికలను కొని మహబూబ్‍నగర్‍కు వెళ్ళే బస్‍లు నిల్చొనే మొదటి ప్లాట్‍ఫామ్ కడకుపోయి దగ్గరలో యున్న ఒక బెంచ్‍పై కూర్చుని కొనుక్కున్న వాటిలో నుంచి విపులతీసి ఒక అనువాద కథను చదువుకుంటూ కూర్చున్నాడు.

***

“త్వరత్వరగా వ్రాయాలి” ప్రపుల్లకుమార్ కోడలు అరుణశ్రీ తన మనుమడైన ఆదిత్యచే హోంవర్క్ చేయిస్తుండగా గడపలో కాలుపెట్టాడు. ఆమె గొంతుకలో థ్వనించిన హెచ్చరికను అర్థం చేసుకున్న అతడు

“త్వరత్వరగా వ్రాయడమెందుకమ్మా?” అని అడిగినాడు.

తన మామ గొంతు వినబడడముతో తల ఎత్తి మామను చూచి దిగ్గున లేచి, ”రండి మామయ్య రండి” అంటూ అరుణశ్రీ తన మామ చేతిలోని బ్యాగ్ అందుకునే లోపున మనమడు తాతయ్యను చూచిన సంతోషముతో తాను కూడా దిగ్గున లేచి గెంతివచ్చినట్లుగా ప్రపుల్ల దగ్గరకు వచ్చి “తాతయ్యా” అంటూ తాతయ్య చేతిని అందుకున్నాడు.

ప్రపుల్ల అ పక్కనేయున్న సోఫాలో కూర్చుని తన మనవడిని తన ప్రక్కనే కూర్చునబెట్టుకున్నాడు. బ్యాగ్ తీసుకున్న అరుణశ్రీ లోనికి వెళ్ళి పదినిమిషాల లోపున ‘టీ’ కప్పుతో వచ్చి తన మామయ్యకు ఇచ్చేంతవరకు అతడు మనవడితో అడుతూ ఉండగా, “అత్తమ్మను కూడా వెంబడించుకొని రావల్సినది మామయ్య” అని అన్నది.

”కార్తీక పౌర్ణమి నాటి కేదారగౌరి నోముకు పిల్లలెలగో వస్తారు. కావున సంక్రాంతి ముందరపోదామని అన్నదమ్మా. వేసవి సెలవుల తర్వాత వీడిని ఇంతవరకు చూడలేదని చూడలన్న కోరికను వాయిద వేసుకోలేక వచ్చేశానమ్మా” కోడలికి సమధానమిచ్చి ‘టీ’ త్రాగినాడు.

“ఈ సంవత్సరము కూడా ప్రతి సంవత్సరములాగానే అందరికి బట్టలు కొనిపెట్టాము మామయ్య. పౌర్ణమికని మేమిద్దరము మూడు దినముల సెలవుకై అప్లై చేసి సాంక్షన్ కూడా చేయించుకున్నాము. పౌర్ణమి ఇంకా పదిదినములే యున్నది కదా! అంతవరకు మీరు ఇక్కడనే యుండండి. అందరము కలిసియే వెళ్దాము” అన్నది అరుణశ్రీ.

“అంతవరకు ఉండలేనమ్మా. ఈ రాత్రికి ఉండి ఉదయమే వెళ్తాను. అది సరే. వీడినెందుకు త్వరత్వరగా వ్రాయమని హెచ్చరిస్తున్నావ్? నిదానముగానే వ్రాయనివ్వు” సమాధానము చెప్పి, మనవడిని త్వరగా వ్రాయమనడాన్ని ప్రశ్నించి, అలా చేయవద్దన్నట్లుగా సలహా కూడా ఇచ్చాడు.

“మామయ్య మీ మనవడు చాలా స్లోగా వ్రాస్తాడు. ఒకే ఒక్క పేజీ వ్రాయడానికి ఒక్కోసారి వీడికి రెండుగంటలకు పైగా టైమ్ పడుతుంది” తానెందుకు తన కుమారుడిని హెచ్చరించిందో తెలిపింది అరుణశ్రీ.

”పట్టనీయవమ్మా. నిదానమే ప్రధానము కదమ్మా!” అన్నాడు ప్రపుల్ల.

“స్లో రీడింగ్ స్లో రైటింగ్ వలన మిగతా స్టూడెంట్స్ కంటే వెనుకబడడా?” అడిగింది అరుణశ్రీ.

“వెనకబడతాడాని కచ్చితముగా చెప్పలేము కాని, నష్టము జరిగే అవకాశమైతే ఉంటుంది” రాబోయే పరిణామాన్ని అనుభవపూర్వకబుద్ధితో చెప్పినట్లుగా చెప్పాడు.

”ఎలా?” అడిగింది అరుణశ్రీ.

***

ఆనాడు పదవ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేదినం. ప్రపుల్ల ఉదయము ఆరుగంటల వరకే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి తన క్లాస్‍మేట్ మరియు ప్రాణమిత్రుడు, శేషు రాకకై ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ప్రపుల్ల తండ్రి కైలాసపతి, తల్లి రాజమణి కూడా స్నానాదులు ముగించుకొని శేషు రాకకై ఎదురుచూస్తున్నారు. పొరుగింటి వాడైన శేషు బస్‍స్టేషన్‍కు పోయి బుక్‍స్టాల్‍లో ఆనాటి ఈనాడు దినపత్రిక తీసుకువస్తానని సైకిల్‍పై పోయినాడు. దాదాపు అరగంట గడిచినాక శేషు రానే వచ్చాడు. శేషు ముఖములో కనపడవలసినంత సంతోషము కనపడకపోవడముతో ప్రపుల్ల మనస్సులో భయం, ఆందోళనలు ఒక్కసారిగా చెలరేగినాయి.

“ఏరా శేషు! ఇద్దరూ పాస్ అయినారా?” కైలాసపతి తన గొంతులో ఎలాంటి ఆందోళన ధ్వనింపజేయకుండా అడిగినాడు. కాని అతని మనస్సులో ఒక మూల తన కుమారుడి ఫలితము ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉండనే ఉంది.

“ఆఁ పాస్ అయ్యాం మామయ్య” ఉత్సాహ నిరుత్సాహముల కలయిక శేషు గొంతులో అందరికి స్పష్టముగా వినపడింది. ప్రపుల్ల తల్లిదండ్రులను శేషు అత్తా మామయ్యలని సంభోధిస్తాడు. అదే విధముగా శేషు తల్లిదండ్రులను ప్రపుల్ల కూడా అత్తా మామయ్యలనే సంభోదిస్తాడు.

“పాస్ అయినపుడు ఎంతో సంతోషముతో ఉండవలసినది పోయి మామూలుగా ఉన్నావేమిరా?” సందేహము తీర్చుకోవాలన్నట్లుగా అడిగాడు కైలాసపతి.

“అదేం లేదు మామయ్యా, సంతోషముగానే ఉన్నాను” శేషు మాటలో నిజాయితీ లోపించడం గమనించాడు కైలాసపతి.

“ఇంతకూ ఏ క్లాస్‍లో పాస్ అయ్యారు?” తాను గమనించిన దానిని దృఢపరచుకోవాలనుకున్నాడు.

“నేనేమో ఫస్ట్ క్లాస్‍లో పాసయ్యాను…” అని శేషు ఆగగా,

“మరి ప్రపుల్లకు ఫస్ట్ క్లాస్ రాలేదా?” తన సందేహమునకు బలమైన కారణమేదో ఉన్నదని దానిని వెంటనే తీర్చుకోవాలన్న ఆదుర్దాతో అడిగాడు కైలాసపతి.

“రాలేదు మామయ్య” బాధగా చెప్పాడు శేషు.

“మరి సెకండ్ క్లాస్ అన్నా రాలేదా?” సెకండ్ క్లాస్ అయినా వచ్చియుంటే బాగుండును అని ఒకవైపు మనసులో అనుకుంటూ ‘రాలేదు’ అన్నమాట వినవలసి వస్తుందేమోనన్న బాధతో అడిగాడు కైలాసపతి.

”రాలేదు మామయ్య” శేషు అనడముతో మరింతగా తనలో హెచ్చిన బాధను కంఠధ్వనిలో కాని, ముఖకవళికలలోకాని కనబడనీయకుండగ,

“థర్డ్ క్లాసే వచ్చిందన్నమాట” శేషు చెప్పడముతో తనలోని తనకు తెలియకుండగనే అణచివేసుకొని, “వాడేం వ్రాశాడో?” అన్న కైలాసపతిలో నిస్పృహ ధ్వనించింది. కాని కనబడనీయలేదు.

“మామయ్య! ప్రపుల్ల చాలా బాగా వ్రాసియేయుంటాడు” శేషు ఎంతో నమ్మకముగా అన్నాడు.

“బాగా వ్రాసియుంటే నీకు ఫస్ట్ క్లాస్ ఇచ్చినవాళ్ళు వీడికి థర్డ్ క్లాస్ ఇస్తారా?” బాధ, కోపము మరియు తోటి క్లాస్‍మేట్ అదియును పొరుగింటిలోనే ఉన్న పిల్లవాడు ఫస్ట్ క్లాస్‍లో రాగా తన పిల్లవాడు థర్డ్ క్లాస్ వచ్చాడన్న అవమాన భారముతో కూడిన ధ్వనితో అన్నాడు కైలాసపతి.

“లేదు మామయ్య. తప్పనిసరిగా చాలా బాగా వ్రాసియేయుంటాడు. అనుమానం లేదు. ఎంత బాగ వ్రాసియుంటాడంటే నాకన్నా ఎంతో బాగా వ్రాసియుంటాడు?” మరింత దృఢ నమ్మకముతో అన్నాడు శేషు.

“వీడు నీకన్నా బాగానే వ్రాసియుంటాడని ఎలా చెప్పగలవు?” శేషు మాటలను నమ్మలేక ప్రశ్నించాడు కైలాసపతి.

“మామయ్య మా క్లాస్‍లో ప్రతి సబ్జెక్ట్ లో మన ప్రపుల్లనే ఫస్ట్. ఒక్కోసారి మా టీచర్‍లకే తట్టని అంశాలను కాని, అర్థంకాని అంశాలను కాని వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు వీడే అందిస్తాడు. ఏ సబ్జెక్ట్ టీచర్ ఎప్పుడు ఏ ప్రశ్నవేసిన సరియైన సమాధానం వెంటనే చెప్పేవాడు వీడొక్కడే. ఏ ఒక్కనాడు కూడా అలా చెప్పలేకపోయిన సంఘటన ఒక్కటి లేదు. మిగతా మేమందరం ప్రతిసారి చెప్పలేకపోయాం. అంతేకాదు ఇంగ్లీష్, మ్యాథ్స్ మరియు సైన్స్ ముఖ్యముగా ఫిజికల్ సైన్స్‌లలో మా టీచర్‍లు చెప్పిననూ మాకర్థము కాని అంశాలను మాకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పేది మన ప్రపుల్ల ఒక్కడే. అందుకే నాకంటే బాగా వ్రాసియుంటాడని చెప్పగలను” తన నమ్మకానికి గల కారణాన్నివివరించాడు.

”నువ్వన్నట్లు అన్ని సబ్జెక్టులలో వీడు మీ అందరికంటే క్లెవర్ అయ్యి ఉండవచ్చు. కాని వీడు మాత్రము నీకన్న బాగా వ్రాసిలేడన్నది మాత్రము నా దృఢనమ్మకము” అన్నాడు కైలాసపతి.

***

రెండేళ్ళ ఇంటర్మీడియేట్ కోర్స్ పూర్తి చేశాక ప్రపుల్ల, శేషులిద్దరు కూడా ఏడాది టీచర్ ట్రైనింగ్‍ను కూడా పూర్తి చేశారు. టీచర్ ట్రైనింగ్ అనంతర పరీక్షల నోటిఫికేషన్ ఇంకనూ రావలసియున్నది. కావున వారిద్దరూ వాటికై కంబైన్డ్‌గా ప్రిపేర్ అవుతూనే వున్నారు. ఇంతలో జాతీయ బ్యాంకులలో క్లర్క్ మరియు క్యాషియర్ పోస్ట్‌ల భర్తీకై నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆ రెండు పోస్ట్‌లకు కావలసిన అర్హత పదవ తరగతి లేదా దానికి సమానామైన దానిలో ఫస్ట్ క్లాస్‌నందు ఉత్తీర్ణత. ఆ నోటిఫికేషన్‍ను చూసిన శేషు అప్లై చేశాడు, ప్రపుల్ల చేయలేకపోయాడు. టీచర్ ట్రైనింగ్ అనంతర పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోగా బ్యాంక్ పరీక్ష అయ్యినది. ఈ బ్యాంక్ పరీక్షకు ప్రిపేర్ కావడానికి శేషుకు ప్రపుల్ల ఇంగ్లీష్ మరియు మాథ్స్ సబ్జెక్ట్ లలో తాను చేయగల్గిన సహాయము చేశాడు. మూడు మాసాలలోపునే బ్యాంక్ పరీక్షా ఫలితాలు రావడము శేషు క్లర్క్‌గా మహబూబ్‍నగర్ నందలి ఒక్ బ్రాంచిలో పోస్టింగ్ కావడము జరిగినది. శేషు ఉద్యోగములో చేరిన మరుసటి దినమునాడు టీచర్ ట్రైనింగ్ పరీక్షలు ప్రారంభమయినాయి. కాని వెంటనే టీచర్ పోస్ట్‌లకై డి.ఎస్.సి నోటిఫికేషన్ విడుదల కాలేదు. అంతేకాక్ టీచర్ ట్రైనింగ్ అనంతరం పరీక్షలు పూర్తి అయ్యేసరికి డిగ్రీ కోర్సుల విద్యాసంవత్సరము సగముపైగా పూర్తి కావడముతో మరుసటి విద్యాసంవత్సరము నందే ప్రపుల్లకుమార్ డిగ్రీకోర్స్‌లో ప్రవేశించడము జరిగింది. ఆ తర్వాత మూడు సంవత్సరములు డిగ్రీ కూడా పూర్తి అయినను డి.ఎస్.సి. నోటిఫికేషన్ వెలువడక పోవడముతో ప్రపుల్లకుమార్ బి.ఎడ్ ఎంట్రన్స్ వ్రాసినాడు. అందులో ప్రభుత్వ కోటాలోనే సీటు రావడముతో అందులో ప్రవేశించగా ఏడాది కాలములోనే పూర్తి కావలసిన ఆ కోర్సు పూర్తి కావడానికి రెండేళ్ళు పట్టింది. ఆ విధముగా టీచర్ ట్రైనింగ్ అయిపోయినప్పటి నుంచి ఆరు సంవత్సరములు గడచిననూ డి.ఎస్.సి నోటిఫికేషన్ పడలేదు. ఈ ఆరేళ్ళలో శేషు మొదటి ప్రమోషన్ పొందగానే శేషు తల్లిదండ్రులు తమ దగ్గరి బంధువులలోని అమ్మాయితో వివాహము చేశారు. ఆ విధముగా శేషు ఉద్యోగి అయ్యి వివాహితుడు కూడా అయ్యి జీవితములో స్థిరపడినాడు.

డి.ఎస్.సి నోటిఫికేషన్ ఇంకనూ విడుదల కాకపోవడముతో ప్రపుల్ల పి.జి ఎంట్రెన్స్‌కు ప్రిపేర్ అవగా సీటు రావడముతో హైద్రాబాద్‍లోని ఒక్ పి.జి. కాలేజ్ నందు జాయిన్ చేసినాడు. పి.జి. మొదటి సంవత్సరపు పరీక్షల నోటిఫికేషన్ రాక మునుపే డి.ఎస్.సి నోటిఫికేషన్ వెలువడడముతో అప్లై చేసి చేస్తున్న పి.జి కోర్స్ ను వదలిపెట్టి ప్రతిదినము కనీసము పన్నెండు గంటలపాటు చదివి వ్రాసినను, సంవత్సరాలుగా డి.ఎస్.సి. నోటిఫికేషన్ వెలువడకపోవడము వలన పోటీపడి అభ్యర్థుల సంఖ్య అత్యధికముగా పెరగడమువలన తీవ్రపోటీ ఏర్పడింది. పోస్ట్‌ల సంఖ్య పరిమితము, వివిధ క్యాటగిరిలు, కటాఫ్ మార్కులు, అదే సంవత్సరము అంతటి మునుపు సంవత్సరములలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల ఉత్సుకతల వలన అ డి.ఎస్.సి ద్వారా ప్రపుల్ల టీచర్ ఉద్యోగమును పొందలేకపోయినాడు. పి.జి మొదటి సంవత్సరపు పరీక్షలు వ్రాయకపోవడముతో ఆ పి.జి.ని తిరిగి పూర్తి చేయడానికి మరో రెండు సంవత్సరాలు పట్టగా ఆ విధముగా రెండు సంవత్సరాల పి.జి.కి మూడు సంవత్సరాలు పట్టింది. పి.జి. ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తికాగానే మరో డి.ఎస్.సి నోటిఫికేషన్ విడుదల కాగా ప్రపుల్ల జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్న వాడి అహర్నిశలు కష్టపడగా కృతార్థుడై ఉద్యోగములో చేరినాడు. మరో ఏడాది గడిచిన తర్వాత వివాహితుడైనాడు.

***

ప్రపుల్ల కుమార్, శేషులిద్దరికి ఏబది ఎనిమిది ఏళ్ళు ఒకే సంవత్సరము నందు ఒకే నెలలో నిండడముతో ఇద్దరు ఒకేసారి పదవి విరమణ చేశారు. ప్రపుల్ల కుమార్ అప్పర్ ప్రైమరి హెడ్‍మాస్టర్‍గా, శేషు బ్యాంక్ అధికారిగా పదవి విరమణలను చేసిన సందర్భమున ఒక వారము దినముల తర్వాత వారు జన్మించిన ఊరినందు వారి బ్యాచ్‍మేట్స్ అందరు కలిసి సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేసినారు. తమ సీనియర్ జూనియర్‍లతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో పనిచేసే ఉపాధ్యాయులను, వివిధ వృత్తులలో స్థిరపడిన బ్యాచ్‍మేట్‍లను గ్రామ సర్ప్ంచ్ మొదలుకొని గ్రామ ప్రముఖులందరిని ఆహ్వానించగా ఒకరిద్దరు తప్ప అందరూ పాల్గొన్న ఆ సభలో సర్పంచ్ మాట్లాడుతూ,

“ఈ కార్యక్రమ నిర్వాహకులు పాల్గొంటున్న వారందరికి పేరుపేరున నమస్కారములు. పదవి విరమణ పొందిన ప్రపుల్లకుమార్ గారు, శ్రీ శేషు గారు వీరిరువురు నాకన్న కేవలము ఒక్క సంవత్సరమే సీనియర్స్. వీరిద్దరి ఇండ్లు ప్రక్కప్రక్కనే ఉండడముతో ఎప్పుడు కలిసియే చదువుకునేవారు. నేను ఆరవ తరగతిలో హైస్కూల్‍లో చేరినప్పటి నుండి నా తొమ్మిదవ తరగతి పూర్తి అయ్యేవరకు వీరిద్దరిని గమనిస్తూనేయుంటిని. నేను గమనించిన అంశములలో ఒక్క అంశమును మాత్రము నిర్మొహమాటముగా చెప్పదలచుకున్నాను. నన్ను ఎవ్వరూ తప్పుగా అర్థము చేసుకోరాదు. ముఖ్యంగా శేషుగారు తప్పుగా అర్థము చేసుకోరాదు. వీరిద్దరిలో ప్రపుల్లకుమార్ గారే ప్రతి సబ్జెక్ట్ నందు శేషుగారి కంటే క్లెవర్ అని మ టీచర్‍లతో అనిపించుకునేవారు. ప్రపుల్లకుమార్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడము వలన వారి జ్ఞానము ఎంతోమంది విద్యార్థులకు ఎంతో మేలు చేసియే ఉంటుందని నేను నమ్ముచున్నాను. అలాగే శేషు గారు జ్ఞానులు కాదని నా ఉద్దేశము కాదు. వారు కూడా తన తెలివితేటలతోనే మొదటి అటెంప్ట్‌ లోనే అది కూడా పందొమ్మిదేళ్ళ వయస్సులో పడిపడగానే బ్యాంక్ పరీక్షలో కృతార్థులై బ్యాంక్ ఉద్యోగియై ఈనాడు బ్యాంక్ అధికారి హోదాలో పదవీ విరమణ చెందుతున్నారు. నాకు ఊహ తెలిసిన నాటి నుండి నేను విన్నదేమిటంటే వారిద్దరి మనసులు ఒకటే. ఏనాడు మనస్పర్థలకు తావివ్వకుండా ఒకే ఇంటి కుటుంబ సభ్యులా అని అనిపించుకునేలా సాగుతున్న వారి మితృత్వము మనందరికి అదర్శము. నా దృష్టిలో ఏబది ఎనిమిదేళ్ళ మితృత్వానికే ఈ సన్మానకార్యక్రమము కాని వారి పదవీ విరమణలకు కాదని వారు తమ శేషజీవితాన్నిపరిపూర్ణమైన ఆరోగ్యముతో గడుపుతూ ప్రశాంత జీవనమును గడపగల్గే భాగ్యాన్ని ఆ పరమశివుడు వారికి ప్రసాదించాలన్ని ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశమిచ్చిన నిర్వాహకులందరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను” అని ముగించగానే ప్రతి ఒక్కరు చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఆ తర్వాత సభాద్యక్షుని మొదలుకుని, ప్రముఖులందరిని పేరుపేరున సంభోధిస్తూ నమస్కరించి, “సర్పంచ్ గారు నా ప్రపుల్లతో నన్ను పోల్చి ప్రపుల్ల ప్రతి సబ్జెక్ట్ నందు నా కంటే క్లెవర్ అన్నమాట అక్షరాల సత్యము. ఒకే క్లాస్‍లో ఉన్నప్పటికిని మా సబ్జెక్ట్ టీచర్‍లతో పాటు ప్రపుల్ల కూడా నాకు టీచరే. ఈనాటికి కూడా ఎన్నో విషయాలను తనని అడిగి తెలుసుకుంటూనే ఉన్నాను. నేను బ్యాంక్ పరీక్షలో కృతార్థుడను కావడానికి తన బోధన నాకెంతో ఉపయోగపడింది. ఇది ముఖస్తుతి ఏ మాత్రంకాదు. పచ్చినిజం, పరమసత్యం కూడా. బ్యాంకు పరీక్షకు కూడా ఇంగ్లీషు మరియు మాథ్స్ నందు కోచింగ్ ఇవ్వగల్గిన నా క్లాస్‍మేట్ నాతో సమానముగా పదవతరగతిలో ఫస్ట్ క్లాస్‍లో ఎందుకు ఉత్తీర్ణుడు కాలేకపోయినాడని ఇప్పటికి మా ఇద్దరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఉన్న సందేహము. పదవతరగతి ఫలితాలు పత్రికలో వెలువడిన నాడే మా మామయ్యగారు అనగా నా ప్రపుల్ల తండ్రి అయిన కీ.శే. కైలాసపతిగారు ‘బాగా వ్రాసియుండడు’ అన్నమాటకు అర్థము చాలాకాలానికి నాకు తెలిసినది ఏమంటే…..

***

“మీరు నిమిషానికో అక్షరము వ్రాస్తే ఎట్లా? మీరిప్పుడు ఆరవతరగతిలో ప్రవేశించినారు. వచ్చే సంవత్సరము మీరు ఏడవ తరగతిలో ప్రవేశిస్తారు. ఏడవ తరగతి వార్షిక పరీక్షలు ఐదవ, ఆరవ తరగతి వార్షిక పరీక్షలలా ఉండవు. ఏడవ తరగతి వార్షిక పరీక్షలను ‘కామన్‍ ఎగ్జామినేషన్స్’ అని అంటారు. జిల్లా కేంద్రము నుండి పరీక్షాపత్రాలొస్తాయి. మీరు సమధానములు వ్రాసిన ఆ సమాధాన పత్రాలు జిల్లాకేంద్రములోనే మూల్యాంకనము చేయబడతాయి. ఏ ఊరి విధ్యార్థుల సమాధాన పత్రాలు ఏ ఊరి ఉపాధ్యాయులచే మూల్యాంకనము చేయబడుతాయో మూల్యాంకనము చేసే ఉపాధ్యాయులకే తెలియనివ్వరు. కావున నిర్ణీత సమయములో మీరు ప్రతి ప్రశ్నకు సమధానము వ్రాయగల్గితేనే మీరు కృతార్థులు కాగల్గుతారు. వాటిలో అత్యధిక ప్రశ్నలకు వ్యాసరూప సమాధానములనే మీరు వ్రాయవలసియుంటుంది. కావున మీరు వేగముగా వ్యాయగల్గితేనే అన్ని ప్రశ్నలకు సమధానములను వ్రాయగల్గుతారు. అన్ని ప్రశ్నలకు సమాధానములను వ్రాయలేకపోయినట్లయితే పాస్ కావడానికి కావలసిన మినిమమ్ మార్కులను సంపాదించలేకపోతారు. మీరు ఇంత మెల్లగా వ్రాస్తే మొత్తము ప్రశ్నలకు సమాధానాలను వ్రాయలేరు. కావున మీరు మహవేగముగా వ్రాయడము నేర్చుకోవాలి. కావున మీకు ప్రతి శనివారము చివరి పీరియడ్ నందు స్పీడ్ రైటింగ్ పోటీ పెడతాను. కావున నేటి నుండియే అభ్యాసము చేయండి” అని విశ్వనాథం టీచర్ గారు తరగతిలో ప్రకటించినాడు. ఆనాటి నుండి ప్రతి విద్యార్థి తన శక్తిమేరకు వేగముగా వ్రాయడమును అభ్యాసము చేయ నారంభించినాడు.

అప్పటికే ప్రతి సబ్జెక్ట్ నందు అందరికన్న ఫస్ట్ యుండే ప్రపుల్లకుమార్ తెలుగు, ఇంగ్లీషు, హింది మూడింటి అక్షరాలను, పదాలను, వాక్యాలను టైమ్ పీస్ పెట్టుకొని వేగముగా వ్రాయడము సాధన చేయడము ఆరంభించినాడు. అయినను ఆరవ తరగతి పూర్తి అయ్యేవరకు ప్రతి శనివారము నాడు జరిగే పోటీలో ఎన్నోసార్లు ఫస్ట్ రాలేకపోయినాడు. ఒక శనివారము నాడు విశ్వనాధం టీచర్ గారు సామాన్య శాస్త్రము లేదా సాంఘిక శాస్త్రము నుండి ఏదో ఒక పాఠము నుండి ఒకటో రెండో పేజీలలోని పాఠాన్ని చూచి వ్రాయమన్నాడు. ఇంకో శనివారము నాడు తాను డిక్టేట్ చేస్తుండగా తన వేగాన్ని అందుకుంటూ ఒక్క అక్షరముగాని ఒక్క పదముగాని తప్పకుండగా వ్రాస్తేనే ఫస్ట్ వచ్చినట్లుగా ప్రకటించేవాడు. ఒక్కొసారి తెలుగు పద్యాలను డిక్టేట్ చేసేవాడు. మరోసారి ఇంగ్లీషు వాక్యాలను గాని లేక కవితలను గాని డిక్టేట్ చేసేవాడు. మా తరగతిలోని ప్రతి ఒక్కరికన్న ఫస్ట్ గా ఎక్కువ మార్కులు వచ్చినను, ప్రతిసారి తానే ఫస్ట్ రావాలన్న కాంక్ష ప్రపుల్లకు తీవ్రము కావడముతో ఏది వ్రాసినా వేగముగా వ్రాస్తూ ఉండేవాడు. వేగముగా వ్రాయలేక ఉండేవాడు కాడు. ఆ విధముగా వేగముగా వ్రాస్తూ పోవడముతో మేము తొమ్మిదవ తరగతిలోకి వచ్చేసరికి తన చేతివ్రాత ’బ్రహ్మలిపి’గా మారిపోయి ఎన్నో సందర్భాలలో తాను వ్రాసిన తన పదాలు తనకే అర్థము కాని విధముగా వ్రాసే పరిస్థితి తనకేర్పడింది. త్వరితముగా వ్రాసే ఆ అలవాటు అతనిని ప్రతి విషయములో త్వరపడేటట్లుగా చేసింది. త్వరపడడము అతని సహజాత అలవాటుగా మారింది. అతడు పదవ తరగతి పరీక్షలో ప్రతి ప్రశ్నకు సమాధానము వ్రాసినాడు. నాకెన్నడు అబద్దము చెప్పడు. ఆ అలవాటు మూలాన తనకబ్బిన అ ‘బ్రహ్మలిపి’ మూల్యాంకనము చేయువారికి తాను వ్రాసిన సమాధానములు సంపూర్తిగా అర్థము కాకపోవడముతో తక్కువ మార్కులు వేసియుంటారు. నా ఈ మాటకు నా దగ్గర ఎలాంటి ఆధారము లేవు. కాని ఈ పరమ సత్యము అనుమానము అక్కరలేదు. అతని చేతివ్రాతయే అతని పాలిట ‘బ్రహ్మలిపి’ అంటే బ్రహ్మవ్రాతయై ఎన్నో సంవత్సరాలు వృథా కాగా ఎంతో ఆలస్యముగా ఉద్యోగియై నాకన్న తక్కువ సర్వీసు చేసి నాతోబాటు ఈనాడు పదవీ విరమణ చేస్తున్నాడు” అని ముగించాడు శేషు.

Exit mobile version