Site icon Sanchika

బ్రహ్మవైవర్త పురాణంలో హస్తిముఖుడు

[2024 సెప్టెంబర్ 07 వినాయక చవితి పర్వదినం సందర్భంగా – ‘బ్రహ్మవైవర్త పురాణంలో హస్తిముఖుడు’ అనే రచనని అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]పా[/dropcap]ర్వతీదేవి నలుగుపిండితో బాలుడిని చేసి ప్రాణంపోసి వాకిట కావలిగా పెట్టటం, పరమేశ్వరుడు ఆ బాలుడి శిరస్సు ఖండించి ఏనుగు తల అంటించటం.. ఈ కథంతా మనం ప్రతి వినాయక చవితి పండుగకూ చదువుతూనే ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే! ఈ వినాయక వ్రతకల్పం కథ వామనపురాణం లోనిది. అది కాకుండా బ్రహ్మవైవర్త పురాణంలో వినాయకుడి పుట్టుకకు కారణమైన మరో కథ ఉంది. ఇంకా వినాయకుడి పత్రిగా తులసి ఆకులను ఉపయోగించకూడదు అనటానికి కారణమైన కథ, ఆయన ఏకదంతుడు అవటానికి కారణమైన కథ కూడా ఉన్నాయి. అవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ బ్రహ్మవైవర్త పురాణం వశిష్ఠ మహర్షి అంబరీషుడికి ఉపదేశించినట్లుగా ఉండి, 12 వేల శ్లోకాలతో చెప్పబడుతుంది.

వినాయకోత్పత్తి:

పార్వతీదేవికి సంతానం కావాలనే కోరిక ఎంతో కాలంగా ఉంది. బ్రహ్మ దేవుడిని ధ్యానించగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. తన ఆవేదన గురించి చెప్పింది. “కల్పక శాస్త్రంలో పుణ్యకవ్రతం అని ఒక వ్రతం ఉంది. దీనినే పతి ప్రణయ సిద్ది వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం చేసిన స్త్రీకి భర్త సంపూర్ణ అనురాగంతో పాటు సంతానం కూడా సిద్ధిస్తుంది. సనత్కుమారుడిని (బ్రహ్మ మానసపుత్రుడైన సనక సనందనాదులలో ఒకడు) పురోహితుడిగా చేసుకుని వ్రతం ఆచరించు తల్లీ! నీ కోరిక తప్పక నెరవేరుతుంది” అని చెప్పి అదృశ్యుడయ్యాడు బ్రహ్మ.

పార్వతీదేవి సనత్కుమారుడిని పిలిపించి తనకు పురోహితుడిగా ఉండి తన చేత వ్రతం చేయించమని కోరింది. ఆ ప్రకారం శివపార్వతులిద్దరూ గంగానదిలో స్నానం చేసి, పట్టువస్త్రాలు ధరించి వ్రతం చేశారు. తర్వాత ముత్తైదువులను పూజించారు. వ్రతం ముగిసిన తర్వాత “వ్రతం నిర్విఘ్నంగా సాగించినందుకు ఏం దక్షిణ కావాలో అడుగు!” అన్నది.

“సంతోషం. పురోహితుడికి కోరిన దక్షిణ ఇవ్వటం వ్రతంలో చివరి అంశం. నీ భర్తను నాకు దక్షిణగా ఇవ్వు” అన్నాడు సనత్కుమారుడు.

పార్వతి తెల్లబోయింది. “అయ్యా! ఇదేమి కోరిక? నేను వ్రతం చేసినదే పుత్రులు కావాలని కదా! భర్తను దక్షిణగా సమర్పిస్తే సంతానవతిని ఎలా అవుతాను? అందుకు బదులుగా మణిభూషణాలు, పట్టుపీతాంబరాలు, సువర్ణం, భూములు నీ ఇష్టం వచ్చినది మరేదైనా కోరుకో!” అన్నది.

“అమ్మా! నీకు తెలియనిదేమున్నది? వేదాలలోనూ, శాస్త్రాలలోనూ ఈ వ్రతవిధానం గురించి చెప్పబడిఉంది. అందులో భర్తను పురోహితుడికి దక్షిణగా ఇవ్వాలని ఉంది కదా! నీకు తెలియదని అనుకోనా? లేక నన్ను పరీక్షిస్తున్నావని అనుకోనా?” అన్నాడు.

“మౌనీ! శాంభవి శక్తి స్వరూపిణి. ఆమెకి ఆగ్రహం తెప్పించకు. పరమేశ్వరుడిని దక్క మరేదైనా కోరుకో!” అన్నాడు ఇంద్రుడు.

“అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడవచ్చునా? ‘జ్ఞాన మిచ్చేత్ మహేశ్వరాత్’ అని కదా ఆర్యోక్తి! మహాజ్ఞాన స్వరూపుడైన ఈశ్వరుని నేనెలా వదలుకుంటాను? దేవతలే నియమాలు పాటించకపోతే మానవులకు ఆదర్శప్రాయులు ఎలా కాగలరు?” అన్నాడు.

ఎవరెన్ని చెప్పినా సనత్కుమారుడు పట్టు వదలలేదు. పార్వతి శ్రీకృష్ణుడిని ప్రార్ధించింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైయ్యాడు. సమస్య పరిష్కరించవలసినదని కోరింది.

“సోదరీ! నువ్వు చెప్పింది నిజమే! కానీ వ్రతవిధానం తప్పకూడదు కదా! ఏ వ్రతంలో నైనా అర్ఘ్యపాద్యాలు, స్నాన, వస్త్ర, గంధ, ధూప, దీప, నైవేద్యాలు, దక్షిణ సమర్పించటం మొదలైనవన్నీ ముఖ్యమైన అంశాలే! ఏ అంశం లోపించినా కామ్యము (కోరిక) నెరవేరదు. నువ్వు సనత్కుమారుడు కోరిన దక్షిణ విధిగా ఇవ్వవలసినదే! అయితే, ఇలాంటి ఇబ్బందులు ఎరిగే వ్రతవిధాన కర్తలు కొన్ని సవరణలు కూడా చేశారు. భర్తృదానం తర్వాత, తత్తుల్యమైనది ఏదైనా సమర్పించి భర్తను తిరిగి పొందవచ్చు. ముందు వ్రతం సమాప్తి కానివ్వు” అని చెప్పాడు శ్రీకృష్ణుడు.

పార్వతి కాదనలేక భర్తను పురోహితుడికి దక్షిణగా శాస్త్రోక్తంగా సమర్పించింది. “సనత్కుమారా! గోవులు పవిత్రమైనవి. యజ్ఞయాగాదులకు అవసరమైన పంచగవ్యాలు (ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుపేడ, గోమూత్రం) గోవు నుంచే వస్తాయి. అంతేకాదు గోవులను సేవించినవారు అంతిమంగా స్వర్గాన్ని పొందగలరు. గోదానాన్ని మించిన దానం లేదు. కనుక గోవుని తీసుకుని పరమశివుడిని తిరిగి పార్వతికి ఇచ్చివేయి” అని ఆదేశించాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడి ఆనతి ప్రకారం సనత్కకుమారుడు పార్వతి దగ్గర నుంచీ గోవుని తీసుకుని పరమేశ్వరుడిని తిరిగి ఇచ్చేసాడు. వ్రతం ముగిసింది.

శివపార్వతులు పచ్చని వృక్షాల మధ్య, కొండ చరియలలోను, జలపాతాల వద్ద యథేచ్ఛగా విహరించారు. క్రీడించారు. కొన్ని రోజులకు పార్వతికి కుమారుడు జన్మించాడు.

బాలుడికి మహావైభవంగా ‘బాలసారె’ (బారసాల) ఏర్పాటు చేశారు. దేవతలు అందరినీ ఆహ్వానించాడు శివపార్వతులు. బాలుడిని స్నానం చేయించటానికి గంగ యమునలు పుణ్యజలాలు తెచ్చారు. విశ్వకర్మ అమూల్యమైన ఆభరణాలు తెచ్చాడు. ఘృతాచి, తిలోత్తమ వంటి అప్సరసలు నాట్యం చేశారు. లక్ష్మి దివ్య మాలలు, పీతాంబరాలు ఇచ్చింది. నారద తుంబురులు గానం చేశారు. సరస్వతి వేదమంత్రాలతో ఆశీర్వదించింది. దేవతలంతా వారి వారి ఆశీస్సులను అందించారు. శని మాత్రం బాలుడిని చూడకుండా తల వంచుకుని కూర్చున్నాడు.

“ఏమయ్యా! తల దించుకుని కుర్చున్నావు? నా పుత్రుడు అంత చూడరానివాడా! ఈ తిరస్కారం నేను సహించలేను. ఈ అపచారానికి నువ్వు కుంటివాడివి అయిపో!” అంటూ కోపంగా శపించింది పార్వతి.

“తల్లీ!.. తల్లీ!.. క్షమించి శాంతించు. నేను ఎవరి వంక కన్నెత్తి చూస్తానో వారు నశించి పోతారని నాకు శాపం ఉంది కదా! నీ పుత్రుడి మీద శని దృష్టి తగలకూడదనే నేను తల వంచుకుని కూర్చున్నాను. అంతే తప్ప తిరస్కారంతో కాదు” అన్నాడు శని.

“అయ్యో! తొందరపడి శపించానే!” అని బాధపడింది పార్వతి. ఇదంతా చూస్తున్న సూర్యుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. “ఆదిశక్తిననే అహంకారంతో నిష్కారణంగా నా కుమారుడిని శపించావు. నా కుమారుడి లాగానే నీ కుమారుడికి కూడా అంగవైకల్యం ప్రాప్తించుగాక!” అన్నాడు.

ఈ పరిణామాలకి దేవతలంతా నివ్వెరపోయి చూస్తుండిపోయారు. ఆనందంగా జరగాల్సిన శుభకార్యం విషాదంగా అయింది. పార్వతి కళ్ళ వెంట అశ్రువులు రాలాయి. సూర్యుడి ఆనతి మీద శని బాలుడి ముఖం వంక తీక్షణంగా చూశాడు. వెంటనే ఉమాసుతుడి శిరసు తెగిపోయి, గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుడి ఒడిలో పడి, ఆయనలో లీనమైపోయింది.

మృతుడైన కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది పార్వతి. శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. “శక్తిమంతులకు శాంతం లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఆగ్రహం అనర్థదాయకం. చింతించకు భవానీ! నీ పుత్రుడిని సజీవుడిని చేస్తాను” అని చెప్పి “ఉత్తరదిక్కుగా తల పెట్టి నిద్రిస్తున్న ఏ జీవి తలనైనా తీసుకురండి” అని సేవకులను ఆజ్ఞాపించాడు.

ప్రమధులు ఆఘమేఘాల మీద భూలోకానికి వెళ్లి వెతుకుతూ ఉంటే ఒకచోట ఐరావతం సంతానం అయిన ఏనుగు ఒకటి ఉత్తరదిక్కున తల పెట్టి పడుకుని ఉండటం కనిపించింది. దాని తల ఖండించి తీసుకువచ్చారు. బాలుడి మొండానికి ఆ ఏనుగు తల అతికించి ప్రాణం పోశాడు శ్రీకృష్ణుడు. బాలుడు ఎప్పటిలా ఉయ్యాలలో కేరింతలు కొడుతూ ఆడుకోసాగాడు.

“చందమామ వంటి ముఖం పోయి హస్తిముఖుడు అయినాడా నా పుత్రుడు?” అన్నది పార్వతి విచారంగా.

“విచారించకమ్మా! నేటినుంచీ నీ కుమారుడు వినాయకుడు అని పిలువబడతాడు. గణాలకు అధిపతి అవుతాడు. సర్వదేవతలకూ పూజనీయుడౌతాడు. అందరి చేతా తొలిపూజలు అందుకుంటాడు. ఏ పూజకైనా తొలుత ‘అధౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణపతి పూజాం కరిష్యే!’ అని విఘ్నాలు లేకుండా ముగియటానికి గణపతిని పూజిస్తారు. గణపతి ఆరాధన లేని పూజ నిష్ప్రయోజనమౌతుంది. ఇది నేను ఇస్తున్న దీవెన!” అన్నాడు శ్రీకృష్ణుడు.

పార్వతి సంతోషించింది. శ్రీకృష్ణుడికి నమస్కరించింది. సుఖాంతం అయినందుకు ఆనందిస్తూ దేవతలంతా వారి వారి నెలవులకు వెళ్ళిపోయారు.

గణపతి పూజకు తులసీదళాలు పనికిరావు:

ఒకసారి వినాయకుడు గంగానదీ తీరాన పద్మాసనం వేసుకుని, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అతిలోక సౌందర్యవతి అయిన తులసి విహరిస్తూ అక్కడికి వచ్చింది. ఆమె శ్రీకృష్ణుడి ప్రేయసి అయిన రాధాదేవి అంశతో జన్మించింది. అక్కడ కుదురుగా కుర్చుని జపం చేసుకుంటున్న గణపతిని చూసి ఆమె మనసు చలించింది. మోహపరవశురాలైంది. చిలిపిగా గంగాజలం అయన మీద చిలరించింది. పూలు చల్లింది. నాట్యం చేసింది. “సంధ్యాసమయం కావస్తుంటే ఇంకా ధ్యానం ఏమిటి? లే!” అంటూ పూలకొమ్మతో తట్టిలేపింది. ధ్యానభంగం అయిన గణపతి కళ్ళు తెరిచిచూశాడు.

ఎదురుగా శృంగార చేష్టలు చేస్తూ తులసి కనిపించింది. మహాతమకంతో కింది పెదవి పై పంటితో కొరుకుతూ కోరిక వ్యక్తపరిచింది. “నేను బ్రహ్మచారిగానే ఉండదలిచాను. నువ్వు నీకు తగిన వరుడిని చూసుకో!” అని కళ్ళు మూసుకున్నాడు.

“నిండు యవ్వనంలో ఈ వైరాగ్యం ఏమిటి? అటు చూడు. పక్షులన్నీ తమ జంటను చేరి ఆనందిస్తున్నాయి. మనం కూడా చేయిచేయి పట్టుకుని విహరించుదాం” అన్నది.

“అమ్మా! పరస్త్రీ మాతృసమాన పూజ్యురాలు. నీకీ భావన ధర్మం కాదు. దయచేసి ఇక్కడ నుంచీ వెళ్ళిపో!” అన్నాడు. తులసి ఎన్నో విధాల బ్రతిమిలాడినా అతడు ఆమె వంక కన్నెత్తి చూడలేదు. చివరకు ఆమె కోపించి “నీ తపస్సు ఆగిపోయి నీకు వివాహం అవుతుంది. కానీ సాధ్వి యైన భార్య నీకు లభించకుండు గాక!” అని శపించింది.

“ధ్యానభంగం చేయటమే కాక నన్ను అకారణంగా శపించావు. నువ్వు కూడా చలనరహితమైన వృక్షంగా అయిపో!” అని ప్రతిశాపం ఇచ్చాడు గణపతి.

తులసిని ఆవహించిన వ్యామోహపు మత్తు దిగిపోయింది. పశ్చాత్తాపంతో అయన పాదాలమీద పడి, క్షమాపణ వేడుకుంది. వినాయకుడు శాంతించి “వృక్షానివి అయినా నీ పత్రాలు, పుష్పాలు పూజనీయమౌతాయి. శ్రీమన్నారాయణుడకు ప్రియమైన దానివి అవుతావు. కానీ నా పూజకు మాత్రం నీకు అర్హత లేదు. గణేశచతుర్థి రోజున తప్ప, ఇతర దినాలలో పూజార్హత పొందుతావు. ఇకవెళ్ళు” అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

అప్పటినుంచీ మానవలోకంలో సూర్యోదయాన్నే తులసిమొక్కను పవిత్రంగా భావించి పూజించటం ఆచారంగా వస్తున్నది. వినాయక చవితి నాడు మాత్రం తులసీ ఆకులను పత్రిగా వినియోగించరు.

వినాయకుడి ఏకదంతం:

ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరంలో సరస సల్లాపాలు ఆడుకుంటున్నారు. బయట ద్వారం దగ్గర వినాయకుడు కావలి కాస్తున్నాడు. ఆ సమయంలో పరశురాముడు శివదర్శనం కోసం వచ్చాడు. “పరమశివుడు ఏకాంతంగా భార్యతో ఉన్నారు. ఈ సమయంలో లోపలకు వెళ్ళకూడదు. దయచేసి కొంతసేపు ఓపిక పట్టండి” అన్నాడు వినాయకుడు.

“నేను ఈశ్వర భక్తుడను. మహర్షిని. పార్వతీపరమేశ్వరులకు నేను కూడా పుత్రుడు వంటివాడనే! దారి విడు” దర్పంగా అన్నాడు పరశురాముడు.

“తల్లిదండ్రుల అభ్యంతర మందిరంలోకి పుత్రులైనా వెళ్ళటం సభ్యత కాదు” అని చెప్పాడు.

అయినా పరశురాముడు లెక్క చేయలేదు. చొరవగా లోపలికి ప్రవేశించబోగా వినాయకుడు ఆయుధంతో ఎదుర్కొన్నాడు. పరశురాముడు అనేక బాణాలు వేశాడు. వాటన్నిటినీ తుత్తినియలు చేశాడు గణపతి. అతడిని తొండంతో చుట్టివేసి తొండాన్ని పొడవుగా పెంచి సప్తముద్రాలలో ముంచి తీశాడు. పరశురాముడు ఉక్కిరిబిక్కిరి అయాడు. చివరికి అతడిని తొండంతో విసిరివేశాడు. పరశురాముడు వెళ్లి మధురలో తెలివి తప్పి పడిపోయాడు.

తెలివివచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నీలిమేఘచ్చాయతో, పీతాంబరాలు ధరించి, శిరసున నెమలి పింఛంతో, వేణువు ఊదుతూ చెట్టుని అనుకుని నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు కనిపించాడు. వెంటనే చేతులు జోడ్చి నమస్కరించి, స్తోత్రం చేశాడు పరశురాముడు. కృష్ణ దర్శనంతో అతడి అలసట అంతా చిటికెలో మాయం అయి, శరీరంలోకి జవసత్వాలు వచ్చినట్లయి, నూతనోత్సాహం కలిగింది.

మళ్ళీ కైలాసం వెళ్లి గణపతి మీద పరశువుని విసిరేశాడు. అది పరశురాముడికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమోఘ ఆయుధం. తండ్రిమీద గౌరవంతో పరశువు సమీపిస్తుంటే వినమ్రుడై నిలబడ్డాడు గణపతి. అది అతడి కుడి దంతాన్ని సగానికి విరగగొట్టింది. దంతం నేల మీద పడగానే భయంకరమైన ధ్వని పుట్టింది. ఆ భీకర శబ్దానికి ముల్లోకాలు కంపించాయి. మూడులోకాల వాసులూ భయంతో తల్లడిల్లారు. అది విని శివపార్వతులు ఏకాంత మందిరంలో నుంచీ బయటకు వచ్చారు.

ఎదురుగా దంతం విరిగిపోయి, రక్తంతో తడిసిపోయినన కుమారుడి ముఖం చూడగానే పార్వతికి దుఃఖంతో పాటు పట్టరాని ఆగ్రహం కలిగింది. కళ్ళు ఎర్రబడ్డాయి. శూలం చూపిస్తూ “నా కుమారుడు శాంత స్వభావుడు కనుక నిన్ను విడిచిపెట్టాడు. కానీ నేను వదలను” అంటూ పరశురాముడి మీదకు వచ్చింది. అడుగు ముందుకు వేసింది.

ఆదిశక్తి ఆగ్రహావేశాలు చూడగానే పరశురాముడి ప్రాణాలు ఎగిరిపోయినట్లు అయినాయి. “శ్రీకృష్ణా! పాహిమాం!” అంటూ రెండు చేతులూ పైకెత్తి ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై “భవానీ! శాంతించు. నీకు గణపతి, స్కందుడు ఎలాగో అలాగే ఈ రాముడు కూడ పుత్రసముడు. తల్లిప్రేమతో ఇతడిని మన్నించు” అని శాంతింపజేశాడు.

అతడి వైపు తిరిగి “రామా! నువ్విలా కనిపించిన వారందరి పైనా యుద్ధానికి దిగరాదు (అప్పటికే పరశురాముడు క్షత్రియులపై 21 సార్లు దండెత్తి అందరినీ మట్టుబెట్టాడు). ఆవేశపడి అధికులతో విరోధం తెచ్చుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. వీరందరూ శాంత స్వభావులు గనుక సరిపోయింది. నీ పాప పరిహారం కోసం జగన్మాతను, గణపతిని స్తుతించు. వారి అనుగ్రహం సంపాదించు” అని చెప్పాడు శ్రీకృష్ణుడు.

పరశురాముడు దుర్గాస్తోత్రంతో జగన్మాతను, గణేశ స్తోత్రంతో గణపతిని స్తుతించి, “నా అజ్ఞానాన్ని మన్నించండి. నన్ను కరుణించండి” అని ప్రార్ధించాడు. పార్వతి శాంతించి, పుత్ర వాత్సల్యంతో అతడిని దీవించింది. శ్రీకృష్ణుడు కూడా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.

ముగింపు:

మనం వినాయక పూజ చేసేటప్పుడు “ఓం తులసీపత్రం పూజయామి” అని పత్రితో పాటు తులసిని కూడా సమర్పిస్తాము. ఇంతక్రితం చెప్పినట్లు వినాయక వ్రతకల్పం కథ వామనపురాణం లోనిది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం గణపతి పూజకు తులసి పనికిరాదు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఒక్కోచోట ఒక్కోరకంగా ఎందుకు చెప్పారు? అనే సందేహం వస్తుంది సాధారణంగా. ఎందుకంటే సృష్టి వివిధ కల్పాలలో సాగి వస్తున్నది. ప్రతి కల్పంలోనూ పూర్వ సంఘటనలు స్వల్ప మార్పులతో జరుగుతూ ఉంటాయి. అందువల్ల పలుకథలు ఒక పురాణంలో చెప్పిన దానికి భిన్నంగా మరొక పురాణంలో ఉంటాయి.

ఇదేవిధంగా ప్రహ్లాదుడిని కాపాడటం కోసం విష్ణువు స్తంభం నుంచీ వచ్చినట్లుగా భాగవతంలో ఉంటుంది. కానీ కూర్మపురాణంలో విష్ణువు స్వయంగా హిరణ్యకశిపుడి నగరానికి వచ్చి అతడిని సంహరించినట్లుగా ఉంటుంది. కలియుగంలో ప్రస్తుత కాలంలో జరిగే సంఘటనలు కూడా భవిష్యత్ పురాణంలో ఉన్నాయి.

యజ్ఞయాగాదులు అడుగంటి పోయి ధర్మచ్యుతులైన కలియుగంలోని మానవులు తేలికగా అర్థం చేసుకుని, మోక్షం పొందటానికి వీలుగా పురాణాలను పద్దెనిమిది భాగాలుగా విభజించి ‘అష్టాదశ పురాణాలు’గా రచించారు వ్యాసమహర్షి. ‘పుర’ అంటే ‘ప్రాచీనమైన’ అని అర్థం. వేదాలకన్నా ప్రాచీనమైనవి పురాణాలు. వీటి గురించి ఇంకా లోతులకు, చర్చలకు, వాదోపవాదాలకు పోకుండా పురాణాల లోని వ్యక్తులు మనకి ఆదర్శప్రాయులనీ, మార్గదర్శకులనీ గ్రహించాలి. వారి గొప్ప లక్షణాలను అలవరచుకోవాలనీ, మానవులంతా ధర్మంగా జీవించాలనీ వ్యాసులవారి అభిమతంగా మనం అర్థం చేసుకోవాలి.

Exit mobile version