(అత్యంత జనాదరణ గల టీవీ స్టూడియో: తేజస్విని టీవీ!!)
“మీ స్క్రీన్ల పై ఫ్లాష్ అవుతున్న ఉదారమైన ప్రజా సంక్షేమ చర్యతో, దేశంలో ఒక్కసారి పెన్సిళ్ళ, పెన్నుల, రీఫిళ్ళ, ఇతర రాతకోతలు చేసే సాధనాల కొరత ఏర్పడిందట!!
ఎప్పుడో పదిహేను రోజుల కింది బడ్జెట్‌లో విషయాన్ని ఫ్లాష్ న్యూసూ, బ్రేకింగు న్యూసూ అంటారేమిటీ అని విస్తుపోకండి, అదే మా ప్రత్యేకత!
పిల్లల వస్తువే కదా అని అందరూ నిర్లక్ష్యం చేసి పట్టించుకోలేదు, అది మా దుర్భిణిలో పట్టుకున్నాం, మీ ముందు ఉంచుతున్నాం, ఇవాళ్టికైనా!!
ఇక చూడండి!!
కొంతమంది మేధావులు ఈ హఠాత్పరిణామ కారణాన్ని, రాత్రింబగళ్ళు బుర్రలు పగల గొట్టుకొని అయినా సరే, ఛేదించి తీరాలని నిర్ణయించుకున్నారని అధికార వర్గాల ద్వారా మాకు తెలిసింది.
కానీ తరువాత వారు ఆ నిర్ణయం, అంటే కొంపతీసి, నిజంగా బుర్రలు పగల గొట్టుకుంటే ఈ దేశం గతి, పురోగతి చూసే నాథుడే ఉండడని, ఆ ఉద్దేశం మానుకుని, తలలు గట్టిగా దువ్వుకొని మాత్రం ఈ విషయంలో ముందు కెళ్ళాలని నిర్ధారించారని ఇప్పుడే మా ప్రతినిధి, గాలిగుమ్మటం పోగేశ్వరరావు ఇచ్చిన అప్‌డేట్ ద్వారా తెలిసింది.
కారణం ఇప్పటికే కనుక్కున్నారని కూడా తాజా భోగట్టా!
ఆ మహత్కారణం చెప్పే ముందు, ఒక చిన్న బ్రేఏఏక్!!!
(ఒక పది నిమిషాలు గడిచాకా, వంద వ్యాపార ప్రకటనలు వచ్చాకా, పౌరాణిక సినిమాల్లో దేవత లాగా, యాంకర్ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, టై కట్టుకొని మరీ!!)
“వెల్‍కమ్ బ్యాక్!!
నేను బ్రేక్‌కి ముందు చెప్పబోతూ ఆపేసిన అసలు కారణం చెప్పేస్తున్నాను!
అది ఇంకేమీ లేదు, ఇంతటి గొప్ప ప్రజోపయోగమైన రాయితీ ప్రకటించిన ప్రభుత్వం వారిని అభినందిస్తూ, కోటానుకోట్ల ప్రజలు, భారాతిభారమైన తమ కృతజ్ఞతలను గాఢాతిగాఢమైన పదాలలో, కథలు, కవితలు, నానీలు, రుబాయీలుగా రీములు రీములు వ్రాయటమే – అని నడుములు కట్టుకొని, తలలు పట్టుకొని, మేధస్సును మథించిన ప్రత్యేక బృందం నివేదిక సారాంశం!!
ఈ ప్రకటనతో, వచ్చిన ప్రథమ ప్రతిస్పందన స్కూళ్ళల్లో పిల్లలదే, కాలేజీల్లో త్వరలో కాబోయే పెద్దలైన పిల్లలదే అని కూడా వారు పేర్కొన్నారట!!
అవును మరి, పిల్లలేనా పెన్సిళ్ళు, షార్ప్‌నర్లూ వాడేది?! ఇంజనీరింగ్ వారు, ఎంబీబిఎస్ వారు ఇంకా మాట్లాడితే ఆఫీసుల్లో కూడా వాడబడేవే కదా ఈ ప్రస్తుతం విశ్వవిఖ్యాతమైన షార్ప్‌నర్లు!!
ఆనందం పట్టలేక వారు కేరింతలతో నృత్యాలు, వగైరాలు చేస్తుంటే, స్కూలు ఆవరణలన్నీ దద్దరిల్లుతున్నాయట, దేశం నలు మూలలా!!
‘ఏమిటా తక్కువ మోతాదు ఆనందం, మొద్దుల్లారా, ఆ మాత్రం దేశభక్తి లేదా, లేక కావాల్సినంత ఉన్నా, నృత్యం ద్వారా ప్రదర్శించలేరా’, అని సీనియర్లు, వారి జూనియర్లను మందలించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయట, చెదురుమదురుగా!!
ఆ యా పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రిన్సిపాళ్ళకూ, అడ్మినిస్ట్రేటర్‍లకు తల ప్రాణం తోకకు వస్తోందట, సర్దిచెప్ప లేక!
‘దీని తరువాత మాకు పెద్ద చిక్కే రాబోతుందిరా, భగవంతుడా’, అని స్కూళ్ళలో ఆర్ట్, డాన్సు టీచర్లు వాపోతున్నట్టు ఇంకొక భోగట్టా!
ఎందుకంటే, ఈ సామూహిక నృత్యోత్సవాల తర్వాత పిల్లల్లో విపరీతమైన నమ్మకం పెరిగిపోతోందట, వారికి డాన్సు అద్భుతంగా వచ్చని!
దాంతో ఎవరిని సెలెక్టు చేస్తే, ఏం తంటా వస్తుందో, వదిలి వేయబడ్డవారి నుంచి అని, ఆ టీచర్ల దిగులట!!
ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఈ వ్రాత సాధనాల కొరతతో, అందరూ పలకా బలపాలను ఆశ్రయిస్తున్నారట!!
ఈ పరిస్థితి కొంతకాలం ఇలాగే కొనసాఆఆఆగు తుందనీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఉత్పత్తి పెంపకాలు, అవసరమైతే విదేశాల నుంచి దిగుమతుల ద్వారా, ఈ సమస్యను ఎదుర్కోవాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం!!
అయితే, ఈ దిగుమతులు, ప్రభుత్వం అన్ని లావాదేవీలు చేస్తున్నట్టే, ‘నాచీ’ దేశంతో చేయరాదనీ, వారివన్నీ నాసిరకం ఉత్పత్తులనీ, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళన మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసినదే!!
నిన్ననే, ఈ ఉదంతంపై పాలక పక్ష ప్రముఖులు, ‘ఇంత విషయానికి ఎంతో పొంగిపోయే’ మన ప్రజల మనస్తత్వమే, దేశానికి చిరకాల రక్ష యని ఉద్ఘాటించి, ప్రజలను అభినందించిన విషయం గమనార్హం!!
కాని ఈ విషయం పై కూడా ప్రతిపక్షం వారి వైఖరి, యథా పూర్వమే!
అనగా ప్రభుత్వం ఏ మంచి పని చేసినా, నెరుసులు వెతకటమే, కొరతలు వల్లె వేయటమే, అన్నట్టే ఉన్నది.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పెదవి విరుస్తూ, ఇదీ ఒక పెద్ద తగ్గింపేనా, విద్యార్ధుల చేతిరాతలు బొత్తిగా పాడైపోతాయి ఈ దెబ్బతో అన్నారు!
అదెలాగా, అని అడిగే లోపలే, అర్ధాంతరంగా వేరే ముఖ్యమైన మీటింగు ఉందని లేచి వెళ్ళి పోయారు, వ్యాఖ్యానం చెప్పకుండానే!
ఈ విషయంలో మేము కూడా నిస్సహాయులమే అని చెప్పటానికి చింతిస్తున్నాం!!
కానీ ప్రతి మందుకీ సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు, ఈ పరిణామానికి కూడా పార్శ్వ ఫలితం ఒకటి దేశంలో బయలుదేరింది అని తెలుస్తోంది!
అది ఏమిటంటే, అఖిల భారత క్షురక సంఘాల వారు తమ ప్రధాన సేవాయుధమైన బ్లేడ్ల మీద పూర్తిగా పన్ను ఎత్తి వేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించటమే!!
తల పైని జుట్లను ఒడుపుగా కత్తిరించి, తలలు అందంగా ఉండటానికీ, తల లోని గుజ్జు చురుకుగా పనిచేయటానికి చేసే తమ వంతు పాత్రనీ, తద్వారా తమ దేశ సేవనీ గుర్తించాలని కూడా వారు పేర్కొన్నారని తెలుస్తోంది!
శ్రీవారి క్షేత్రమైన తిరుమల లోని తలనీలాల సమర్పణలో కీలక పాత్రధారులు, కళ్యాణ కట్టల సంఘాలన్నీ వీరికి మద్దతు ప్రకటించినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
చివరిగా
ఈ ఉదార చర్య పరిణామాలు, వగైరా అంశాల మీద అఖండమైన తెలివితేటలతో నివేదిక ఇచ్చిన ప్రత్యేక బృందం యొక్క ఉత్తమ సేవను గుర్తించి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘గులాబీ’ అవార్డును కూడా ప్రకటించడం, ఒక సంతోషించదగ్గ శుభవార్త!
గులాబీ అవార్డు ఇచ్చిన పాలకులకూ, అందుకొన్న మేధావులకూ, సలాములు, వందనాలు, మా శాల్యూటులు!
ఇంతటితో ఈ ప్రత్యేక నివేదిక సమాప్తం!
చిట్టచివరిగా, కాని అత్యంత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే,
మర్చిపోకుండా చూడండి,ఈ విషయంలో దేశంలోనే అత్యుత్తమ కవరేజ్ ఇచ్చినందుకు మా సీఈఓ శ్రీ రమానాథ్ అందుకోబోయే పురస్కార ప్రదాన ప్రత్యక్ష ప్రసారం,ఇవాళ రాత్రి 7 గంటలకు!!
చూస్తూనే ఉండండి, చూడకుండా ఉండకండి,
నిత్య వార్తా స్రోతస్విని, మీ టీవీ ‘తేజస్విని!!’ “
***
మనలో మన మాట!
ఇది కేవలం, వివిధ పోకడలు ఇట్లా ఉంటాయని చెప్పడానికి సరదాగా వ్రాసినది మాత్రమే!
టీవీ వాళ్ళకు కోపం వస్తుందేమో అని అంటే, కోపం ఎందుకు వస్తుందీ, రానే రాదు, రాకూడదు అని వివరణ!
ఎందుకంటే, గంటగంటకీ ఎటూ పోకుండా చూస్తూనే ఉండండి అన్న వారి నినాదాన్ని అక్షరాలా పాటిస్తున్న వాడు రాసింది కాబట్టి!
దీనికి ఋజువేది అంటారా, ఎంత ఇదిగా, అదే పనిగా వారి ఛానెల్ చూస్తే తప్ప ఇట్లా రాయగలరండీ ఎవరైనా?! మీరే చెప్పండి!
కనుక వారూ సంతోషిస్తారు ఈ టీవీ భక్తుణ్ణి చూసి – సుత’రామూ’ కోపగించుకోరు.
భక్తి అనగానే రాములవారి పేరు దానంతట అదే వచ్చింది చూశారా! అదీ సహజ భక్తి అంటే!!
మరి పాలక వర్గానికి కోపం వస్తే?!
భలే వారే, ఇంత కీలక అంశం మీద నలుగురికీ తెలియ చెప్తే కోపంట, కోపం! వారికెందుకు వస్తుందీ!
మీరు నా ఆశల అరిశెల మీద నీళ్ళు చల్లేస్తున్నారు!!
నా కృషికి గులాబీ కాకపోయినా, ఏ ‘టచ్ మీ నాట్’ అవార్డైనా ఇస్తారని నేను ఆశిస్తుంటే!!
ఇంకొక్క మాట – వారికి అసలే రాదనటానికి, (కోపం!) ఇంత చిన్న విషయాన్ని తప్పుగా అనుకోరనటానికీ!
వారు ఉదారులు, సహృదయ శిఖామణులు!!
కానీ మీరు కారని తేలినా వారితో ప్రమాదమే అని అంటారా, మాయాబజార్‌లో కృష్ణుడి లాగా?!
అప్పుడు చూసుకోవచ్చులెండీ!
ఏ మాయల ఘటోత్కచుడో దొరక్కపోడు!
అయినా ఇట్లా అన్నిటికీ భయపడుతుంటే, రాయడానికి ఇంకేమి మిగులుతుందీ?!
ఆడే నోరూ, వ్రాసే చేయీ, తిరిగే కాలు అంత తేలిగ్గా మానవు లెండి, వాటి నిత్య కార్యక్రమాల్ని!
మీకు చెప్పేదేముందీ, సర్వజ్ఞులు!
సెలవ్!!