ఆలోచింప చేసే కథా సంపుటి ‘బ్రేకింగ్ న్యూస్’

0
1

[దేశరాజు గారి ‘బ్రేకింగ్ న్యూస్’ అనే కథా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, కథకుడు శ్రీ దేశరాజు నవంబర్ 2021లో వెలువరించిన కథాసంపుటి ‘బ్రేకింగ్ న్యూస్’. ఈ సంపుటిలో 18 కథలున్నాయి. పుస్తకం శీర్షికకి అనుగుణంగా, ఇండెక్స్‌కి ‘హెడ్‍లైన్స్’ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. అన్ని కథలకు సత్య బిరుదురాజు గీసిన చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ సంపుటి లోని కథలలో సమాజంలో జరుగుతున్న మోసాలను, అవకతవలను ప్రస్తావించారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, అసంతృప్తులు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన అంశాల చుట్టూ అల్లిన కథల సంపుటి ఇది.

2016లో పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఎదుర్కున్న ఇబ్బందుల నేపథ్యంలో రచించిన కథ ‘డీహ్యుమనైజేషన్’. నోట్లు మార్చుకునేందుకు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఏటిఎం‍ల ముందు క్యూలు గట్టిన జనాలు, బ్యాంకుల ముందు గంటల కొద్దీ నిలబడిన మధ్యతరగతి మనుషులు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు.. అల్లల్లాడిన సామాన్యులు.. ఈ కథలోని ఆఖరి సంఘటన చదువుతుంటే మనుషుల్లోని అమానవీయత గోచరించి కథకి పెట్టిన శీర్షికలోని ఔచిత్యం తెలుస్తుంది పాఠకులకి.

కార్పోరేట్ కాలేజీలో చదివే పిల్లలు ఒత్తిళ్ళకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో రాసిన కథ ‘టపటపలాడుతున్న రెక్కలు’. తన కూతురు మంచి చెడులను సమన్వయం చేసుకుంటూ పోగలదా అని తనని తాను ప్రశ్నించుకుంటాడతను. క్రితం రోజు కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య అన్న వార్త టీవీలో చూసినప్పటి నుంచి తన కూతురు గురించే ఆలోచిస్తూ మథనపడుతూంటాడు. బాల్కనీలో టబ్‍కింద చిక్కుక్కున పావురాన్ని ప్రతీకగా వాడుతూ, తన కూతురు కూడా చిక్కులను తప్పించుకుంటూ స్వేచ్ఛగా ఎగిరిపోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. చివరలో కాలింగ్ బెల్ కొట్టిందెవరన్న ప్రశ్నకి జవాబుని పాఠకులకే వదిలేస్తారు.

లోకజ్ఞానం వ్యవహారజ్ఞానం నేర్పని చదువుల వల్ల పిల్లల కోళ్ళ ఫారం లోని కోడిపిల్లల్లా తయారవుతారని చెబుతుంది ‘ఫారమ్ కోడిపిల్ల’ కథ. చక్కని కథ. మార్కులు, ర్యాంకులే ముఖ్యం కాదు, చుట్టు ఉన్న పరిస్థితులను, జనాలను పరిశీలించడం రావాలి. సందిగ్ధ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా నెగ్గుకురావాలో తెలియాలి. దురదృష్టవశాత్తు, ఇప్పటి విద్యావ్యవస్థలో ఇలాంటి మార్గదర్శనం లోపిస్తోంది. జీవితంలో నెగ్గుకురావడానికి కావల్సిన భరోసానిచ్చే చదువు అందరికీ అందాలని సూచించే మంచి కథ ఇది.

నడి వయసు దాటిన భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమనీ, ఒకరి పట్ల మరొకరి ఉండే కన్‍సర్న్‌ని, పిల్లలు దూరంగా ఉంటే ఎదురయ్యే వెలితిని చెప్పిన కథ ‘బ్రేకింగ్ న్యూస్’. తీవ్రమైన కడుపునొప్పి పరీక్షలు చేయించుకుంటాడు భర్త. కాలేయంలో సమస్య అనీ, వెంటనే కాలేయ మార్పిడి చేయాలని చెప్తారా ప్రైవేటు ఆసుపత్రిలో. కంగారు పడిన ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. విషయం చెప్పకుండా ఓ వీకెండ్‍ పిల్లల్ని పిలిపించుకుంటారు. ఆపరేషన్‍కి ముందు తృప్తిగా చూసుకుని పిల్లల్ని వాళ్ళ స్థలాలకు పంపేస్తారు. ఆపరేషన్ రేపనగా, టివిలో వచ్చిన ఓ బ్రేకింగ్ న్యూస్ వాళ్ళ బెంగని, దిగులుని దూరం చేస్తుంది.

ఆశల రెక్కలు’ పోరాటంలో ఓ కాలు పోగొట్టుకున్న సైనికుడి కథ. మానసికంగా క్రుంగిపోయిన ఆ సైనికుడిలో ఓ మానసిక వైద్యుడు ప్రేరణ నింపిన వైనం గొప్పగా ఉంటుంది. జీవితంలో సందేహాలు ఎదురైనప్పుడు, నిరాశ చుట్టుముట్టినప్పుడు మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ చక్కని కథ తెలుపుతుంది.

కుటుంబాలలో, ఆఫీసుల్లో, ఒకరి అధికారానికి లోబడి ఉండి, లోలోపల రగిలిపోతూండే వారికి ప్రతీకలుగా బల్లులను పేర్కొంటూ అల్లిన కథ ‘అనేకానేక బల్లులు ఒకేఒక్క ప్లాష్‍బ్యాక్’. సమాజంలోని కొన్ని కఠిన వాస్తవాలను ప్రదర్శిస్తుందీ కథ. ఒకప్పుడు ఆదర్శవాదులుగా ఉన్నవారు కాలక్రమంలో మారిపోతూ – తమ మునుపటి నడతకు భిన్నంగా నడుచుకునే వ్యక్తులు ఈ కథలో తారసపడతారు.

డబుల్ రోస్ట్’ కథ సమాజంలోని ఆధునిక పోకడలను కళ్ళకు కడుతుంది. ఇంట్లో భార్యని లోకువగా చూడడం, సోషల్ మీడియాలో పరిచయమైన ఆడవాళ్ళపై అతి అభిమానం చూపడం, వాళ్ళపై తేలిక అభిప్రాయం ఏర్పచుకోడం వంటి లక్షణాలున్న మగవారికి నమూనా ఇందులోని భర్త పాత్ర. ఆ భర్తని ఝాడించి వదిలిపెట్టిన ఓ ఫేస్‍బుక్ మిత్రురాలు! కొన్ని జాడ్యాలకు అలాంటే వారే సరైన మందు మరి!

వృద్ధాప్యంలో – పిల్లలకు దూరంగా ఉండాల్సిన వచ్చినప్పుడు – దంపతులిద్దరూ సిటీకి కాస్త దూరంగా ఉన్న వృద్ధాశ్రమంలో చేరి తమ ఆసక్తులను వృద్ధి చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. తన స్నేహితుడికి కూడా ఇదే సలహా ఇస్తారాయన. మొదట సంశయించినా, చివరికి మిత్రుడికి దగ్గరగా అదే వృద్ధాశ్రమానికి చెందిన మరో భవనంలోకి వచ్చేస్తారా దంపతులు కూడా. వృద్ధాప్యంలో తమవైన అభిరుచులతో జీవితాన్ని ఉత్సాహంగా గడిపే అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ రెండు జంటల కథ ‘చివరి నిర్ణయం’. సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైన కథ ఇది.

ఏది దారి’ అనే కథ దిగువ మధ్యతరగతి తల్లిదండ్రుల సంశయాలనీ, ద్వైధీభావాన్ని వెల్లడిస్తుంది. పిల్లల్ని క్రికెటర్లుగానో, నాట్యకళాకారిణి గానో చేసేసి పేరు ప్రతిష్ఠలతో ఆటు డబ్బు సంపాదించే మార్గంలో నడిపించాలనుకునే తల్లిదండ్రులకు సున్నితమైన హెచ్చరిక చేస్తుందీ కథ.

ఆఫీసులకే అంకితమైపోయి ఇంటిని పట్టించుకోని కొడుకూకోడలికి ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవడం ఎంత అవసరమో; ఆధునిక విలాసాలనీ అత్యాధునిక సాంకేతికతని మానవతతో ముడిపెట్టడం ఎంత ఆవశ్యకమో నచ్చచెప్తారా తల్లిదండ్రులు. వస్తువ్యామోహం కన్నా – కుటుంబం కలిసిమెలిసి ఉంటూ ఒకరితో ఒకరు సరదాగా ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇల్లు స్వర్గం అవుతుందని చెబుతుంది ‘గృహమేగా స్వర్గసీమ’ కథ.

పునరుజ్జీవం’ గొప్ప కథ. మరణించిన ఆత్మీయుల గురించి దిగులుపడి క్రుంగిపోకుండా, వారికిష్టమైన, వారు సంతోషంగా చేసే పనులని కొనసాగిస్తూ వారు లేని లోటును అధిగమించవచ్చనే చక్కని సూచన ఈ కథ ద్వారా లభిస్తుంది.

జీవితం మీద మమకారం పెంచుకున్న వాళ్ళకి తెలిసినంతగా అసలైన పండగ అంటే మామూలు వాళ్ళకి తెలియదంటుంది ‘పండగొచ్చింది’ కథ. ‘నలుగురి మనసులు విచ్చుకున్నప్పుడు వచ్చే మాటలు నాలుగు కాలాల పాటు జీవితాలని నిలబెడతాయి’ అనే వాక్యం లోతైనది. బహుశా నేటి తరంవారికి చాలా కావల్సినది.

‘జ్ఞానం’ చిన్న కథ. పెద్దయి, జీవితంలో ఎంత ఎదిగినా, చిన్నప్పుడు చదువు నేర్పిన మాస్టార్లను గౌరవించాలని చెప్పే కథ. ‘జ్ఞానగుళిక’ వాట్సాప్ ఫార్వార్డ్‌లపై అల్లిన వ్యంగ్యాత్మాక కథ.  ‘వాన ముద్దు’, ‘అన్నయ్య రావాలి’ కథలు ఆసక్తిగా సాగుతాయి.

ఈ సంపుటి లోని అన్ని కథలకంటే భిన్నమైనది ‘దెయ్యాల పండుగ’ కథ. హాస్యానందం పత్రికలో ప్రచురితమైన ఈ కథలో తనని ఎకసెక్కం చేసే భర్తకి భార్య చిన్న గుణపాఠం చెప్పడం బావుంది.

మెరుగైన సమాజం కోసం, ఉత్తమమైన జీవన విధానం కోసం, మనుషుల్లో మంచి చెడుల వివేచన కోసం ప్రయత్నిస్తూ తమని తాము దిద్దుకుంటూ, తోటివారిని ప్రభావితం చేసి మార్చగలిగే కొందరు వ్యక్తుల కథలివి.  పాఠకులను ఆలోచింపజేస్తాయి.

***

బ్రేకింగ్ న్యూస్ (కథా సంపుటి)
రచన: దేశరాజు
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్
పేజీలు: ‎ 127
వెల: ₹ 140.00
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/BREAKING-NEWS-DESARAJU/dp/B09P1NFVPH/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here