[dropcap]భ[/dropcap]ర్త నించి విడిపోయిన తల్లితో బ్రతుకుతున్న కూతురు(నాయిక)…. ఆమె (తల్లి) చనిపోయేసరికి తప్పనిసరిగా తండ్రి దగ్గరకి చేరుతుంది. కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఉన్న తండ్రి…. కూతురు బాగా చదువుకోవాలని.. ఏ వ్యక్తి ఉన్నత స్థితికైనా చదువే ఆధారమని నమ్మే సగటు తండ్రి అతను.
కూతురుకి చదువు పట్ల శ్రద్ధ లేక మార్కులు తక్కువగా వస్తున్నాయని… తండ్రి ఆ కాలేజ్‌లో ఉన్న ఒక టీచర్ దగ్గరకి తన కూతుర్ని ట్యూషన్‌కి పంపుతాడు. అతను ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడని తండ్రికి చెప్పటానికి ప్రయత్నిస్తే… తండ్రి కూతురుకి సానుభూతి చూపించి ఆ టీచర్ని దండించాల్సిందిపోయి… కూతుర్నే మందలించేసరికి నాయికకి ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక… తన ముగ్గురు మగ మిత్రులకి చెబుతుంది.
అక్కడినించి నడిచే డ్రామాలో… వాళ్ళు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు ఆమె తండ్రికి చెప్పి.. అతని దగ్గరనించి డబ్బు తీసుకుని ఆ అమ్మాయిని తన నృత్య కార్యక్రమాలకి పంపించటం…. అనుకోకుండా ఇంకో విలన్ల గ్రూప్ ఆ అమ్మాయిని నిజంగా కిడ్నాప్ చెయ్యటం.. వాళ్ళు ఈ కుర్రాళ్ళ నించి డబ్బు డిమాండ్ చెయ్యటం…. ఆ ప్రక్రియలో వాళ్ళు పడే తిప్పలు… చివరగా ఆ కుర్రాళ్ళు నాయికని… ఎవరి ఇల్లే వారికి సేఫ్ అని… తన ఇంటికి తనని తిరిగి వెళ్ళిపొమ్మని సలహా ఇస్తారు.
కూతుర్ని పోలీసుల సహాయంతో వెతికించే ప్రయత్నంలో ఉంటాడు నాయిక తండ్రి. పోలీస్ అధికారి అయిన అతని స్నేహితుడు… విషయాన్ని లోతుగా ఆలోచించకుండా… కూతురికి అవసర సమయంలో సహాయం చెయ్యకుండా… తండ్రే ఆ అమ్మాయికి సమస్యలు సృష్టించటం వల్లనే ఆ అమ్మాయి… బాధ్యతారహితంగా తిరుగే ఆ కుర్రాళ్ళనే నమ్మి ఆపద కొని తెచ్చుకున్నది అనేసరికి… ప్రిన్సిపల్ అయిన నాయిక తండ్రి తన తప్పు తెలుసుకుంటాడు.
ఈ సినిమాని ఒక వర్ధమాన రచయిత చెప్పే కథగా ప్రారంభించి… సినిమాలో రెండు.. మూడు వర్తమాన కాలపు సమస్యలని స్పృశించటం జరిగింది. అవి… పిల్లలకి ఇష్టం లేని రంగంలో తల్లిదండ్రులు బలవంతంగా దింపటం వల్లనే వాళ్ళు పక్కదారుల్లో వెళుతున్నారనీ…. ఆ ప్రక్రియలో ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారనీ….
ఆడపిల్లలతో చదువులు చెప్పే టీచర్లు తప్పుగా ప్రవర్తిస్తున్నారనీ… అది పిల్లలు ఇంటికొచ్చి చెప్పినా తల్లిదండ్రులు అవసరమైన శ్రద్ధ చూపించకపోవటం వల్ల పిల్లలు ఎదుర్కునే సమస్యలని చూపించారు.
ఎన్నుకున్న సబ్జక్ట్ బాగానే ఉన్నది కానీ… రెండు.. మూడు సమస్యలని ఒకే సినిమాలో ఒకదాని తరువాత ఒకటి హడావుడిగా హాండిల్ చేసిన విధానం వల్ల ఎక్కువ మెలోడ్రామా నడపాల్సి వచ్చిందనిపించింది.
నాయిక పట్ల సానుభూతితో కొన్ని మంచి పనులు చేసినా… జూలాయిల్లాగా తిరగటం.. జీవితం పట్ల ఒక సీరియస్‌నెస్ లేకపోవటం అనే లక్షణాలతో ఈ కాలపు హీరోలని ఎందుకు చూపిస్తున్నారో తెలియదు.
వయసు వచ్చినా తల్లిదండ్రుల సంపాదనల మీద బ్రతకటానికి సిగ్గుపడని నాయకుల పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి. బ్రతకటానికి స్వార్జితమైన సంపాదన అవసరమనే సందేశం సినిమాల్లో చూపిస్తే బాగుండును అనిపిస్తున్నది.
గాలితనంగా తిరుగుతూ నాయికని ఉద్ధరించటానికి మాత్రం హడావుడిగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడటం ఒక హీరోయిజం అని చూపించటం ఎంత వరకు సమంజసం?
నాయికా-నాయకులుగా నివేత థామస్, శ్రీవిష్ణు నటించారు.
ఈ సినిమా ‘Amazon prime’ లో ఉన్నది.