Site icon Sanchika

బుద్ధం శరణం గచ్ఛామి

[dropcap]జీ[/dropcap]వితం దుఃఖభరితం, దుఃఖానికి కారణం కోరికలు, మానవుడు దుఃఖాన్ని తొలగించుకోవాలంటే కోరికలను నశింపజేసుకోవాలి, ఇదీ విముక్తి పొందే మార్గం – అనే ‘నాలుగు పరమ సత్యాలు’ గౌతమబుద్ధుడు ప్రాథమికంగా బోధించాడని చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో చదువుకొన్నాం.

ప్రాపంచిక సుఖాలు అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని, దుఃఖభూయిష్టమైన కర్మల నుండి విమోచన కలగడానికి మార్గం ఏది, సత్యానికి అసత్యానికీ ఉన్న భేదం ఏమిటి మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ, సర్వసంగ పరిత్యాగియై పర్యటిస్తూ, తపస్సు చేస్తూ, సాధన చేస్తూ చిట్టచివరకు ఒకానొక రావిచెట్టు నీడన 49 రోజుల ధ్యానం తర్వాత జ్ఞానాన్ని పొందాడని చదువుకొన్నాం.

ఆ ‘బుద్ధగయ’ను చూడాలని, ‘బోధివృక్షం’ నీడన క్షణకాలమైనా గడపాలన్న ఆశ ఇటీవల తీరింది.

గయ స్టేషన్ వద్ద రచయిత్రి

కానీ, ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ ప్రభావం అన్నిరంగాలపై పడినట్లుగానే పర్యాటక రంగంపై కూడా తన తీవ్రతను చూపింది. ఫిబ్రవరి 6 వరకు బుద్ధగయ లోని ఆలయాలన్నిటినీ బీహార్ ప్రభుత్వం మూసివేత విధించిందని తెలిసి నిరాశ పడ్డాను.

సంబోధి ద్వారం

ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తున్న మా అబ్బాయికి ‘బుద్ధ గయ’కు బదిలీ అయినప్పటి నుండి ఎదురుచూసి, తీరా అక్కడికి వెళ్ళేసరికి బైట ఉన్న కట్టడాలను బైట నుండి చూడడమే కానీ, ప్రధాన ‘బుద్ధుని ఆలయం’లో ప్రవేశం లేదని తెలిసింది. అయితే అదృష్టవశాత్తు 7వ తేదీ నుండి ఆంక్షలు తొలగించడంతో చిరకాల వాంఛ నెరవేరింది.

దాదాపు 2500 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి జ్ఞానబోధ గావించి, తన ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రపంచాన్నే ప్రభావితం చేసిన శాక్యముని గౌతముడు ‘బుద్ధుడు’గా మారిన ప్రదేశం బుద్ధగయ. బీహార్ రాష్ట్రం ముఖ్య పట్టణం పాట్నాకి నూట పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

శుద్ధోదన మహారాజు, మహా మాయాదేవికి జన్మించిన సిద్ధార్థుడు తల్లి మరణానంతరం తనను పెంచిన తల్లి ‘గౌతమి’ పేరును చేర్చుకొని సిద్ధార్ధ గౌతముడయ్యాడు. అతని జన్మ సమయంలోనే జ్యోతిష్యులు తెలిపినట్లు, ప్రపంచ స్ధితికి దూరంగా తండ్రి పెంచినా, ఒకానొక సంఘటన కారణంగా కల్లోలిత మనస్కుడై, భార్య యశోధరను, కుమారుడు రాహులుని వదిలి, సర్వసంగ పరిత్యాగియై, సత్యాన్వేషియై పయనమయ్యాడు.

ఎన్నెన్నో ప్రదేశాలు పర్యటించి, ఎందరెందరో తపస్సంపన్నులను కలిసి, తన సందేహాల గురించి చర్చించాడు. ఆవేదనతో, అంతర్ముఖుడై తీవ్రమైన సాధనతో శరీరాన్ని శుష్కింపజేసుకొని ఎముకల గూడుగా తయారయ్యాడు. ఏదైనా అతి పనికిరాదని గ్రహించి, క్షుద్పిపాసియై ‘సుజాత’ అనే స్త్రీ సమర్పించిన క్షీరం స్వీకరించాడు.

చివరకు బోధివృక్షం నీడన (మగధ) జ్ఞానోదయమై, సారనాథ్ చేరి తాను పొందిన జ్ఞానాన్ని పూర్వం తనతో పాటు తపస్సు చేసిన ఐదుగురు పరివ్రాజకులకు బోధ చేసాడు. తన జీవితమంతా 45 సంవత్సరాల పాటు బోధనలు ప్రజలందరికీ బోధించాడు. తర్వాత శిష్యుల ద్వారా బుద్ధుని బోధనలు మానవాళికి చేరి, పాళీ భాషలో ఉండడంచే సామాన్య జనులకు సైతం అవగాహన కలిగింది. కాలక్రమేణా అవి గ్రంథస్థం అయ్యాయి.

రెండు వందలేళ్ళ తర్వాత, కళింగ యుద్ధానంతరం వికలమనస్కుడైన అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించి, సమయమంతా బౌద్ధవృక్షం వద్దే వైరాగ్యంతో గడపడంతో ఆగ్రహించిన మహారాణి వృక్షాన్ని నరికించారని, అయినా తర్వాత అది మళ్ళీ చిగురించిందని, అశోకుని కుమార్తె సంఘమిత్ర విస్తృతంగా బౌద్ధ ప్రచారం చేస్తూ ఆ వృక్ష భాగాన్ని శ్రీలంక తీసుకొని నాటించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది.

సిద్ధార్థుడు తపస్సు చేసిన వేదిక, జ్ఞానోదయం తర్వాత కూర్చున్న ప్రదేశం, రెండు పాద ముద్రలు, పవిత్ర స్నానం చేసిన కొలను, ఆలోచనాత్మకుడై వేసిన అడుగులు (చంక్రమణ)…. అన్నీ తాజా పుష్పాలతో అందంగా అలంకరించబడి ఉన్నాయి. మౌనంగా భక్తితో దర్శించుకొంటున్నారు దేశ విదేశ యాత్రికులు.

బోధి వృక్షం క్రింద జ్ఞానోదయమైన తర్వాత ఆలోచనామగ్నుడై భారీ వర్షాన్ని సైతం గమనించక, ధ్యానంలో మునిగి ఉన్న బుద్ధునికి పెద్ద సర్పం (ముచిలింద్) పడగ పట్టిందట. అక్కడ సరస్సు మధ్యలో ఏర్పరచి ఉన్న బుద్ధ విగ్రహాన్ని చూడవచ్చు.

(వివిధ దేశాల వారు నిర్మించిన మందిరాలు, విగ్రహాలు)

80 అడుగుల ఎత్తు బుద్ధ విగ్రహం

టిబెటన్లు నిర్మించిన “కర్మ టెంపుల్”

కేవలం ఉద్యోగధర్మమో లేదా డబ్బు కోసమో హడావుడిగా చెప్పే గైడ్స్‌లా కాకుండా – ఆసక్తి, అవగాహన ఉన్న ‘ప్రహ్లాద్ కుమార్’ అనే అతను చాలా చక్కగా ఓపిగ్గా వివరించడం బాగా సంతోషంగా అనిపించింది. కానీ ప్రధాన ‘మహాబోధి విహార్’ మందిరం లోకి కెమెరాలు, మొబైల్స్ అనుమతించక పోవడంతో బైటనే ఫ్రీ లాకర్ రూం లలో ఉంచి వెళ్ళడం వల్ల లోపలి అద్భుతమైన విశేషాలను వీడియో లేదా ఫోటోలు తీయలేక పోయాం. కానీ అక్కడ లభించే ‘జీరా వగైరా దినుసుల పొడి’తో తయారుచేసిన వేడి వేడి బ్లాక్ టీ గురించి మాత్రం చెప్పుకోవాలి. భయంకరమైన చలిలో, కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ మేం ఇబ్బంది పడుతుంటే – ఎందరో బౌద్ధ భిక్షువులు (మాలాగా స్వెట్టర్ మఫ్లర్‌లు లేకుండా) తాపీగా నడుచుకొంటూ, పాళీ భాషలో వినవస్తున్న ప్రవచనాల్లాంటివి వింటూ నడుస్తూ, చెట్టు కిందో రాతి మీదో కూర్చొని ధ్యానమగ్నులవడం చూసి ఆశ్చర్యపోయాం.

పూర్వం మనసులో అనుకొన్నవి తీరినప్పుడు ఆ ప్రాంగణానికి వచ్చి చిన్న చిన్న స్తూపాలు, మందిరాలు వంటివి కట్టడంతో కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. నిజానికి ఇప్పుడు ఇంకా స్థలం కూడా లేదు.

అందుకే పూలు, బిస్కెట్, చాక్లెట్ వంటివి లేదా ‘జలం’ బుద్ధ భగవానునికి సమర్పించడానికి స్టీల్ గ్లాసులు వరుసగా పెట్టబడివున్నాయి. అన్ని కట్టడాలపై వివిధ ముద్రలతో, భంగిమలతో ఉన్న బుద్ధుని చిత్రాలు చెక్కబడి వున్నాయి.

ఇక లోపల ఉన్న ప్రధానమైన ‘స్వర్ణ బుద్ధ విగ్రహాన్ని’ చూసి తీరవలసిందే కానీ వర్ణించలేం. చాలా రోజుల తర్వాత తెరవబడడంతో ‘బంగారం’ పూత పూస్తున్నారు. కానీ బంగారు రంగు కంటే ఆ పెదాలపై కనీ కనిపించని చిరునవ్వు, ఆ కళ్ళలోని అపారమైన దయ కరుణ, ఆ మోము లోని అనంతమైన ప్రశాంతత మిక్కుటమైనది. మొత్తం ‘ఆ’ మూర్తి నుండి వెలువడుతున్న కాంతి ప్రవాహం, శాంతి సందేశం, భక్తి భావమో.. వైరాగ్య భావమో తెలీని నిశ్శబ్దం మౌనంగా మనల్ని ఆవరించుకొంటుంది. (క్షణం కంటే ఎక్కువ సేపు ఆ కళ్ళ లోకి చూడకండి అన్నాడు మా గైడుడు ఎందుకో!) బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, (తర్వాత చేర్చబడిన) సంఘం శరణం గచ్ఛామి.

 

కొన్ని బుద్ధ ప్రతిమల్ని కొనుక్కుని ఆ ప్రదేశాన్ని వదల్లేక వదల్లేక వెనుతిరిగాం.

కనీసం ఇండియన్ ఆర్మీ వారి OTA (Officers Training Academy) భవన సముదాయం, క్రమశిక్షణతో ఉన్న సైనికులు, పాత టాంకర్లు, కొన్ని కట్టడాలు, బొమ్మలు, చిత్తరువులు, విజయ చిహ్నాలుగా ఉన్న ఫోటోల్ని మొబైల్‌లో తీసుకోవాలనుకొన్నా…., మా అబ్బాయి సీరియస్‌గా వారించాడు. రాత్రి అయ్యేసరికి మా క్వార్టర్స్ పరిసరాల్లో చాలా మామూలుగా తిరుగుతున్న లేళ్ళు, కుందేళ్ళు, నక్కల్ని చూసాను. తోడేళ్ళు, పెద్ద పెద్ద పాములు కూడా తిరుగుతుంటాయట. కానీ అవి ఎవరికీ హాని చేయడం ఇంతవరకూ జరగలేదట.

కుమారునితో రచయిత్రి

ట్రైనింగ్ బ్లాక్స్‌కి ‘నలందా’, ‘తక్ష్సిల్’, ‘రాజ్గిర్’ అని పేర్లుంచడం చూసి ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగింది. క్షణం తీరిక లేకుండా, శ్రమ పడుతూ, దేశరక్షణ కోసం కఠిన శిక్షణ తీసుకొంటున్న మన సైనిక వీరులను చూస్తే ఎంతో గొప్పగా అనిపించింది. జై జవాన్, జై భారత్ అని గర్వంగా అనిపించింది.

పూర్తిగా చూసిన తృప్తి కలగడం పోయినా, మరో రెండేళ్ళ వరకు మళ్ళీ మళ్ళీ రావొచ్చు అన్న ఆశతో వెనుదిరిగాను.

బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, (తర్వాత చేర్చబడిన) సంఘం శరణం గచ్ఛామి. 🙏🙏🙏

Exit mobile version