[dropcap]కే[/dropcap]రుమంటూ శబ్దం విని కళ్ళు తెరిచింది యశోద. పక్కలో పిల్లాడు. పక్కకి చూసింది. అక్కడే పడుకుని ఉన్న పరిచారికలూ, పక్కింటి మామ్మగారైన రాజ్యలక్ష్మమ్మ గారూ, ఎదురింటి చుక్కమ్మా అందరూ హడావిడిగా లేచారు.
“ఎప్పుడయ్యిందీ” అన్నది రాజ్యలక్ష్మమ్మ గారు.
అందరూ ముఖముఖాలు చూసుకున్నారు.
“తల్లివి నీకయినా తెలియలేదా?”
యశోద తెల్లమొహం వేసింది.
“మంత్రసాని సుబ్బలక్ష్మి ఏదీ?”
“ఇక్కడ అయిపోయిన తరవాత పక్క వీధిలో మీనాక్షి గారింటికి వెళతానని చెప్పింది. వెళ్ళుంటుంది.”
“ఇంతకీ పుట్టిన సమయం అన్నా నందుడు గారికి చెప్పిందో లేదో కనుక్కో రంగాజమ్మా” అన్నది రాజ్యలక్ష్మమ్మ గారు పరిచారికతో. “అల్లాగే” అంటూ లేచి వెళ్ళి నందుడు దగ్గరికి వెళ్ళి కనుక్కుని వచ్చి ” అర్ధరాత్రి, రోహిణీ నక్షత్రం, అష్టమి తిథి అని చెప్పారు” అని చెప్పింది రంగాజమ్మ. వేళ్ళతో లెక్కలు గట్టి “అంతా బ్రహ్మాండంగా వుంది” అని యశోదతో చెప్పి, “మరీ అల్లా నిద్దర్లు పోతే ఎలా” అని పరిచారికలని గదమాయించి
చుక్కమ్మతో “పిల్లాణ్ణి స్నానం చేయించాలి, నీళ్ళు పెట్టించు” అన్నది. చుక్కమ్మ వెంటనే లేచి పరిచారికతో వెళుతూ ఉంటే “అసలే ఆకాశానికి రంధ్రం చేసినట్టు వర్షాలు. పొడి కట్టెలు చూసి పొయ్యిలో వెయ్యండి. లేకపోతే పొగ, పురిటి కందుకీ, తల్లికీ మంచిది కాదు” అంది రాజ్యలక్ష్మమ్మ గారు.
“బాలింతరాలువి నువ్వు కదలొద్దు” అని యశోదకి చెప్పి పిల్లాణ్ణి చేతుల్లోకి తీసుకుంది.
“ఏదీ ఒక్కసారి చూపించండి” అన్నది యశోద.
“ముద్దైన పిల్లాడు, కానీ…. నల్లగా ఉన్నాడు” అంటూ రాజ్యలక్ష్మమ్మ గారు పిల్లాడి ముఖాన్ని యశోదకి చూపించింది.
యశోదకి కాస్త కష్టం వేసింది మనసులో, “నీలమేఘఛ్ఛాయ మావాడు, అప్పుడెప్పుడో శ్రీరాముడికి ఉన్న రంగు” అంటూ పిల్లవాణ్ణి తీసుకోబోయింది.
“ఇప్పుడొద్దు, స్నానం చేయించి ఇస్తాను, కాసేపు విశ్రాంతి తీసుకో” అని యశోదకి చెప్పి పిల్లవాడిని తీసుకుని మెల్లిగా స్నానశాలలోకి వెళ్ళింది రాజ్యలక్ష్మమ్మ గారు. అక్కడ చుక్కమ్మ, పరిచారికలని అందరినీ గదమాయించి సద్దుతోంది.
అక్కడికి వెళ్ళి అమర్చి ఉన్న పీటల మీద కూర్చుని కాళ్ళు జాపి చీరని మోకాళ్ళదాకా లాగి పిల్లవాడిని కాళ్ళ మీద పడుకోబెట్టుకుంది రాజ్యలక్ష్మమ్మ గారు. మెల్లిగా నూనెపోసి, సున్ని పిండి వేసి వొళ్ళంతా రుద్దుతూ ఉంటే చక్కగా సేవ చేయించుకుంటూ కుయ్యి అని కూడా అనకుండా పడుకుని ఉన్న పిల్లవాడిని చూసి చుక్కమ్మ ఆశ్చర్య పోయింది. “పిల్లాడు బావున్నాడు కదా” అని అనకుండా ఉండలేకపోయింది. “బావున్నాడు, ఇంకా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉన్నాడు. వీడికి మహారాజ యోగం జీవితం మొత్తం ఉంది. వీడిలో అందరినీ ఆకట్టుకునే, అందరినీ మాయచేసే కళలు చాలా ఉన్నయ్యి, కానీ…. నల్లగా వున్నాడు” అంది రాజ్యలక్ష్మమ్మ గారు.
“మీకు ఇవ్వన్నీ ఎలా తెలుసు” అని చుక్కమ్మ అడిగితే “సీతారావమ్మ గారికి ఇరవైఏళ్ళ నుండి శిష్యురాలిని, ఈమాత్రం చెప్పలేనా” అని రాజ్యలక్ష్మమ్మ గారు నీళ్ళు పొయ్యమని చెయ్యి చూపించగానే వేడి నీళ్ళు చెయ్యి మీద పోశారు. వేడి సరి చూసి “ఇంకపోయండి” అని చెప్పగానే చెంబు తరవాత చెంబు పోస్తుంటే హాయిగా పోయించుకున్నాడు పిల్లవాడు. నీళ్ళు పోస్తూ, చుక్కమ్మ మెల్లిగా పాట ఎత్తుకుంటే, రంగాజమ్మ కూడా గొంతు కలిపింది. పిల్లవాడు కూడా “ఊ ఊ” అన్నాడు.
“పొట్టనిండా పాటలు పెట్టుకుని పుట్టినట్టున్నాడు వీడు” అంటూ నవ్వింది రాజ్యలక్ష్మమ్మ గారు.
బోర్లాకూడా పడుకోబెట్టి పోసి చివరి చెంబు తల చుట్టూ తిప్పి “శ్రీరామ రక్ష” అని పిల్లవాణ్ణి చుక్కమ్మకి అందించింది. చుక్కమ్మ వెంటనే పిల్లవాడిని యశోద చీరతో వళ్ళంతా తుడిచింది. ఈలోపల రాజ్యలక్ష్మమ్మ గారు లేచి సాంబ్రాణి ధూపాన్ని తీసుకు వచ్చిన రంగాజమ్మ చేతిలోంచి తీసుకుని అక్కడ పెట్టిన కుంపటి మీద కొద్దిగా వేసి పిల్లవాడి తలకి ఆ ధూపం తగిలేటట్టు చూసింది.
అప్పుడు వచ్చింది అసలు ప్రశ్న. మామూలుగా పిల్లవాడికి నుదుటన బొట్టు పెడతారు. బుగ్గమీదా, కణతలమీదా చాదో, కాటుకో పెడతారు. బొట్టు ఎట్టాగైనా పెట్టచ్చు, కానీ చాదుతోనే వచ్చింది. కాల మేఘ కాంతితో వెలిగిపోయే వాడికి కాటుక పెడితే? నీల మేఘ శరీరుడికి నల్ల చాదు పెడితే? ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు రాజ్యలక్ష్మమ్మ గారికి. చుక్కమ్మని తిలకమూ, చాదూ పట్టుకు రమ్మని పురమాయించి పిల్లవాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆడించటం మొదలెట్టింది.
పిల్లవాణ్ణి చూస్తున్నకొద్దీ మనస్సు వాడిమీద లగ్నం అవటం గ్రహించింది రాజ్యలక్ష్మమ్మ గారు.
“ఆరిభడవా, నీ మాయలు అప్పుడే మొదలెట్టావా, నీ పని పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారులే” అంది. ఈలోపల చుక్కమ్మ పట్టుకొచ్చిన తిలకం డబ్బా లోంచి చిన్న పుల్ల మీదకి తీసిన తిలకం పెట్టబోతూ, “కస్తూరి కలిపారా” అని అడిగింది. చుక్కమ్మ” అయ్యో మర్చేపొయ్యా” అని లేచి వెళ్ళి కొద్దిగా కస్తూరి వెదికి తిలకం డబ్బాలో వేసి తిప్పి పుల్లని తీసుకొచ్చి ఇస్తే ఆ పుల్లని తీసుకుని నోట్లోనుంచి ఉలూల ధ్వనులు చేస్తూ రాజ్యలక్ష్మమ్మ గారు పెడుతూ ఉంటే ఆ బుడ్డివాడు నవ్వాడు. కస్తూరి తిలకం పెట్టుకున్న ఆ దివ్య సుందర విగ్రహాన్ని చూస్తూ వొళ్ళు మైమరిచి చటుక్కున ముద్దు పెట్టింది రాజ్యలక్ష్మమ్మ గారు.
దేవతలూ, మునులూ చూసి మైమరిచే సుందరుణ్ణీ, సర్వాభరణ భూషితురాలైన శ్రీమహాలక్ష్మి స్వయంవరంలో చూసి, ఆయన సౌందర్యానికి దాసోహమై వరించినవాణ్ణీ, జగన్మోహన మైన నవ్వు గలవాణ్ణీ, బృందావనాన్నీ, యమునా తీరాన్నీ అంతా తన శోభచేత ప్రకాశింప జేయబోయే అందగాడినీ, సకల సౌందర్య నిధానమైన పిల్లవాణ్ణి ముద్దు పెట్టగానే చుక్కమ్మ పకాలున నవ్వింది.
“ఏమిటి అంత నవ్వుతున్నావు”
“ఏమీ లేదు, నల్లటి పిల్లవాడు అన్నారు గదా”
“అయితే”
“అంత ముద్దు ఎట్లా వొస్తున్నాడా అని?”
“ఊ సరే , ముందర చాదు ఇయ్యి. “అనగానే చుక్కమ్మ చాదు ఇచ్చింది.
“అసలే పిల్లవాడు నలుపు, ఈ నల్లటి చాదు పెడితే ఇంక ఎలా కనిపిస్తుందీ, దిష్టి ఎలా తగలకుండా ఉంటుందీ, చూద్దాం ఎట్లా వుంటుందో” అని బుగ్గమీదా, నెమరు కణతల మీదా చిన్నగా గుండ్రాలుచుట్టింది. మెల్లిగా ఇంకోసారి చూసి, సరిదిద్ది “ఎలావుంది చెప్పు, దిష్టి తగలకుండా వుంటుందా, చూడు” అని చుక్కమ్మకి చూపించింది పిల్లవాణ్ణి.
చుక్కమ్మ చూసింది. ఏ మణి భూషణాలూ లేకుండా కూడా, ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న పిల్లవాణ్ణి చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు చుక్కమ్మకి. అలాగే చూస్తూ మాటలు లేకుండా ఉండి పోయింది చుక్కమ్మ.
“ఈవిడ ఈలోకంలో లేదుగానీ, నువ్వు చూడవే రంగాజమ్మా” అని పిలిస్తే వచ్చి” మీరు ఊహించింది సరి, చాదు సరిగ్గా కనిపించటల్లేదు” అని అన్నది రంగాజమ్మ. ఈ హడావిడికి లోకంలో పడిన చుక్కమ్మ కూడా మళ్ళీ ఇంకొక్కసారి చూసి, మళ్ళీ ఇంకొక్కసారి మైమరచి పోబోయి ఆగి, “అవును నల్లటి వాడికి నల్లటి చాదు అంత నప్పలేదు. దిష్టి కొట్టకుండా కూడా పనికి రాదు” అన్నది.
రాజ్యలక్ష్మమ్మగారు ఆలోచిస్తోంది. ఇల్లాంటి గొడవ ఎప్పుడూ పడలేదు ఆవిడ. కానీ, తగినంత ప్రతిభా, దాన్ని మించిన వ్యుత్పత్తీ, వాటిని సానబెట్టిన సీతారావమ్మగారి శిష్యరికమూ, ఆవిడని ఏ ప్రశ్న కైనా జవాబిచ్చేదానినిగా నిలబెట్టాయి. దీర్ఘంగా ఆలోచించింది.
“గంధం అరగదియ్యి” అని రంగాజమ్మకి పురమాయించి “కస్తూరి గుండా, వసంతమూ, విభూతీ, అటునించి సాయంత్రం రాములవారికి వేసిన వనమాలా పట్టుకురా” అని చుక్కమ్మని తొందరచేసింది. క్షణకాలం అయ్యేసరికి గిన్నెలో గంధమూ, పళ్ళెంలో విభూతి పండూ, కస్తూరి డబ్బా, పక్కన వసంతం గిన్నె, ఆపక్కన రాముడికి వేసిన వనమాలా సిద్ధం అయ్యాయి.
మళ్ళీ నోటితో ఉలూల ధ్వని చేస్తూ, పిల్లవాణ్ణి చూసి ఇంకొక్కసారి మురిసిపోతూ, వొళ్ళంతా దూమెరుగ్గా, విభూతి రాసింది. ఇందాక పెట్టిన కస్తూరీ తిలకం చుట్టూ చిన్న చిన్న బిందువులని వసంతంతో చక్కగా తీర్చింది. బుగ్గన శ్రీగంధంతో మళ్ళీ చక్రాంకితం చేసింది. కణతల మీద, కస్తూరిని పొడి చేసి దాన్ని రెండు పక్కలా పెట్టింది. మెడ మీదా, భుజాల మీదా చందనం రాసింది. పొట్ట మీదా చేతుల మీదా ఏమి చెయ్యాలా అని ఒక క్షణం పరకాయించి చాదుని చిన్న చిన్న వృత్తాలతో తీర్చింది. మెల్లిగా అక్కడ ఉన్న రాములవారి వనమాలని తీసి పిల్లవాడికి ఎంత సరిపోతుందో చూసి, తుంపి, ఆ తుంపిన దండ పిల్లవాడి మెళ్ళో వేసింది రాజ్యలక్ష్మమ్మ గారు.
ఈలోపల పిల్లవాడు చటుక్కున ఉచ్చపోయటం మొదలెట్టాడు. అది ఆవిడ మెడ మీదా చేతుల మీదా పడింది. “మనవడు మంచి బహుమానమే ఇచ్చాడు అలంకరించినందుకు” అని చుక్కమ్మా, రంగాజమ్మా నవ్వుతుంటే “బడ్డు వెధవా” అని ముద్దుగా కసురుకుంటూ రాజ్యలక్ష్మమ్మ గారు కూడా నవ్వారు. పిల్లవాడు కూడా చిరునవ్వులు చిందించాడు. వెన్నెలంతా కురిసిపోయింది. పుచ్చపువ్వులు విచ్చిపోయాయి.
” ఇంట్లో ఉన్న, వాడని పంచె పట్టుకురా” అని రంగాజమ్మకి పురమాయిస్తే అరనిమిషంలో సిద్ధం చేసింది. దాన్ని కొద్దిగా చింపి పిల్లవాడికి నాలుగు గోచీలూ , రెండు చెవులని కప్పే బట్టలూ, మిగతావి మీదకప్పే వస్త్రాలూ తయరుచేసింది చుక్కమ్మ. పిల్లవాడికి గోచీ పెట్టి, తలపాగా లాగా చిత్రంగా చుట్టి, వొంటి మీద బట్ట కప్పి ఎల్లా వున్నాడోనని ఒకసారి మళ్ళీ చూసి, తల ఊపి, “బావున్నావురా కన్నా” అని ఆపుకోలేక తన మెడలో ఉన్న మణి హారాన్ని తీసి పిల్లవాడి మెడలో వేసి నుదుటన ఒక ముద్దు ఘట్టిగా పెట్టుకుంది రాజ్యలక్ష్మమ్మ గారు.
“ఎలా వున్నాడు” అంటూ నుంచున్న చుక్కమ్మకి పిల్లవాణ్ణి అందిస్తూ లేచి నిలబడింది ఆవిడ. జగజ్జేగీయమానంగా వెలిగిపోతూ, జాజ్వల్య మానంగా ప్రకాశిస్తూ, జనమనో మోహనుడైన వాణ్ణి చేతిలోకి తీసుకున్న చుక్కమ్మ కూడా ఆగలేక ముద్దు మీద ముద్దు పెడుతుంటే ” పిల్లాణ్ణి పొట్టు పొట్టు చేసి అలంకారం అంతా చెడగొట్టావు” అంటూ మళ్ళీ చేతిలోకి తీసుకుని అలంకారం అంతా సద్ది మెల్లిగా యశోద దగ్గిరికి తీసుకెళ్ళింది.
ఇందాక చూసిన చూపు లో కనిపించిన అందమూ, పిల్లవాడి చూపులో కనిపించిన ధీమా, వాడి దేహాకృతిలో ఉన్న వయ్యారమూ ఇంకా మనసులో తిరుగుతూ మగత నిద్రలో ఉన్న యశోద,స్నానాలగదినుంచీ వస్తున్న వాళ్ళ శబ్దం విని లేచి కూచుంది.
పిల్లవాణ్ణి తీసుకొచ్చి యశోద ఒళ్ళో పడుకోబెట్టింది రాజ్య లక్ష్మమ్మ గారు. పిల్లవాడికి విభూతి మైకప్పూ, కస్తూరి బొట్టూ, దాని చుట్టూ వసంతపు బొట్లూ, బుగ్గన చందన గంధమూ, కణతల మీద కస్తూరి పొడీ, పొట్ట మీదా, చేతుల మీదా, చాదూ ఆపైన వనమాలా, మెరుస్తూన్న మణి హారమూ, ఆ గోచీ, ఆ తలకట్టూ, ఆమధ్యలో చిరునవ్వు నవ్వుతున్న బాలకృష్ణుణ్ణి చూసి నోట మాట పెగలక అల్లాగే చూస్తూ ఉండిపోయింది యశోద.
దిగ్భ్రాంతురాలై ఉన్న యశోదని కదిపి లోకంలోకి తీసుకొచ్చి “ఇదిగో మన పిల్లవాడు నల్లని వాడే నిస్సందేహంగా, కానీ నవనవోన్మేషంగా కనిపించేవాడు. నిస్సందేహంగా నవ జలధర శ్యాముడే గానీ, సకల సౌందర్య సారమూర్తి. నీలమేఘ శ్యాముడే గానీ, నిఖిల భువన సుందరుడు. అంత ఇంత అని చెప్పలేని, పట్టరాని అందం మన ఇంట్లో పడింది. ఇక నించీ మన పని ఈ అందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే. వీలైనన్ని రంగులతో అలంకరించు ఈ మధుర తర అమృత ప్రవాహాన్ని. కర్ణికారాలతో, కదంబ కుసుమాలతో, దొరికిన అన్ని పూవులతో, గడ్డి పూవులతో సహా, వీడి తల నింపేసెయ్యి. నీకున్న నగా నట్రా వీడికి ఏమీ సరిపోదు. వీడికి నూట ఎనిమిది ఆభరణాలూ చేయించాలిసిందే. ఈ మొగవాళ్ళకి ఏమీ తెలీదు. కావాల్సి వస్తే శఠం పట్టు. ఉపవాస దీక్ష పట్టు. నేనూ నందయ్యకి చెబుతాను, అన్ని ఆభరణాలూ చేయించి, వీలైనన్ని ప్రతిరోజూ వెయ్యి. కానీ రోజూ, ముప్పూటలూ వీడికి దిష్టి తీస్తూ ఉండు. ఈ పిల్లవాడు ప్రపంచాన్ని ఏలే మహారాజు అవుతాడు, నా మాట గుర్తు పెట్టుకో” అంది రాజ్యలక్ష్మమ్మ గారు.
“సరే వస్తా” అని ఇంటికి బయలుదేరి వెళ్ళ బుద్ధి కాక, కాలు సాగక, “పురిటి మంచం మీద కూర్చో కూడదు అంటారు కానీ, ముసలి వాళ్ళకు పట్టింపు ఉండదులే, నువ్వు విశ్రాంతి తీసుకో నేను పిల్లవాణ్ణి చూస్తానులే” అంటూ పిల్లవాణ్ణి ఒళ్ళోకి లాగేసుకున్న రాజ్యలక్ష్మమ్మగారిని చూసి ఏమీ అనలేకుండా ఉన్న యశోదని చుక్కమ్మ సముదాయించింది. వీళ్ళందరినీ మాయచేస్తున్న ఆ చిన్న దొంగ నవ్వాడు.