బుల్లి పైలట్

2
2

[dropcap]అ[/dropcap]ది గన్నవరం విమానాశ్రయం. ఆ రోజు అక్కడో విశేషం జరుగబోతోంది. నేరుగా సింగపూర్ వెళ్ళే విమానం మొదటిసారిగా అక్కణ్ణుంచి బయలుదేరబోతోంది. ప్రయాణీకులంతా సమయానికి వచ్చారు. ఎయిర్ హోస్టెస్‌లు, సహ పైలట్ విమానాన్ని నడిపే ముఖ్య పైలట్ కొరకు ఎదురుచూడసాగారు. ఒక పావుగంట సమయం గడవగానే పది సంవత్సరాల బాలుడు పైలట్ దుస్తుల్లో విమానం వైపు రాసాగాడు. అందరూ అతణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. పైలట్ దుస్తులు సరదాగా వేసుకున్నాడని అనుకున్నారు. కానీ విమానాన్ని నడపబోయేది ఆ అబ్బాయేనని ఊహించలేకపోయారు. ఆ విమానాన్ని నడిపె పైలట్ తనే! ఆ అబ్బాయి పేరు వివేక్. సిబ్బంది వివేక్‌ను విమానంలోకి ఆహ్వానించారు. వారికి చేతులు ఊపుతూ కాక్‌పిట్‌లోకి వెళ్ళాడు వివేక్. అతని వెనకాలే సహ పైలట్ లోపలికి వెళ్ళాడు. సహ పైలట్ పెద్దవాడు. తనకు యాభై సంవత్సరాల వయసు ఉంటుంది! వివేక్ తన ఎత్తుకు తగినట్లుగా, అద్దంనుంచి బయటిప్రాంతం కనిపించేలా సీట్ ఎత్తును పెంచుకున్నాడు.

“లిటిల్ పైలట్ గారు…విమానం నడపడం మీకిది మొదటిసారా?” తన సీట్లో కూర్చుంటూ సహ పైలట్ ప్రశ్నించాడు.

“భలేవారే! నేనిప్పటికే ఎన్నో విమానాలు ఒంటిచేత్తో నడిపాను. బహుశా మీరు నా గురించి విని ఉండరు. అన్నట్లు ఇంకో విషయం…నన్ను లిటిల్ పైలట్ అని పిలవద్దు. కేవలం వయసులో మాత్రమే చిన్నవాడిని, విమానాలు నడపడంలో కాదు. పైలట్ అని పిలవండి ఇక.”

“అలాగే పైలట్ గారు” సహ పైలట్ తన తప్పు సరిచేసుకున్నాడు.

వివేక్ తన ముందున్న రకరకాల మీటర్లను పరిశీలించాడు. సహ పైలట్ ను కూడా కొన్ని మీటర్లు చూడమని ఆజ్ఞాపించాడు. మీటర్లలోని వివరాలను బట్టి విమానం స్థితి సరిగానే ఉందని అర్థమైంది. ఇక విమానాన్ని టేకాఫ్ చేయాలి(గాలిలోకి లేపాలి). ఎలా టేకాఫ్ చేస్తాడోనని సహ పైలట్ ఆసక్తిగా చూస్తున్నాడు.

 ’విమానం గాల్లోకి లేవబోతోందని, అందరూ తమ తమ సీట్ బెల్ట్ లను పెట్టుకోవాల’ని ప్రకటన చేశారు.

విమానం రన్‌వే పై పరిగెత్తడానికి అవసరమైన మీటల్ని పైలట్ నొక్కాడు. విమానం రన్‌వే పై మెల్లగా కదలడం మొదలుపెట్టి వేగం పుంజుకుంది. అవసరమైనంత వేగం అందుకున్నాక, గాల్లోకి లేచేందుకు వీలుగా వివేక్ తన ముందున్న ఒక ’లివర్’ను పైకి లాగాడు. విమానం ముందుభాగం ఒక్కసారిగా గాల్లోకి లేచింది. అలాగే ఏటవాలుగా ఎత్తుకు వెళ్ళసాగింది.

’ఎంతో అనుభవమున్నవాడిలా నడుపుతున్నాడు. వయసు చూసి అనవసరంగా అపోహపడ్డాను.’ సహపైలట్ మనసులో అనుకున్నాడు. అప్పటివరకూ పైలట్ సామర్ధ్యంపై అనుమానాలున్న ప్రయాణీకులు కూడా, విమానం వెళ్ళే తీరు గమనించి సంతోషించారు.

“పిల్లాడు కాదు.. పిడుగే!”

“అయినా నైపుణ్యం లేకుంటే పైలట్‌గా ఎందుకు నియమిస్తారు?” ఇలా ప్రయాణీకులు రకరకాలుగా మాట్లాడుకోసాగారు.

విమానాన్ని అలా గాల్లోకి ఎత్తుకు తీసుకువెళుతూనే వివేక్ గ్రౌండ్ కంట్రోల్ (విమానాన్ని నిర్దేశించే కేంద్రం) తో మాట్లాడుతూ, విమానం స్థితిని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. విమానం పూర్తి ఎత్తుకు చేరుకున్నాక, వివేక్ విమాన పరిస్థితిని వివిధ మీటర్లలో పరిశీలించసాగాడు. అలాగే గ్రౌండ్ కంట్రోల్ అధికారులు విమానం వెళుతోన్న ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండబోతోందో చెప్పసాగారు. విమానం ఇప్పుడు ఏటవాలుగా కాకుండా భూమికి సమాంతరంగా ప్రయాణం చేస్తోంది. ప్రయాణీకుల్లో కొద్దోగొప్పో ఉన్న భయం కాస్తా ఎగిరిపోయింది. అలా ఒక గంటసేపు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం సాగింది.

ఇంతలో గ్రౌండ్ కంట్రోల్ అధికారి ఒకరు ఆదుర్దాగా మాట్లాడుతూ, “మిస్టర్ పైలట్…. సింగపూర్ విమానాశ్రయంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఒక విమానం టేకాఫ్ తీసుకోబోయి, నిల్చుని ఉన్న ఇతర విమానాలను ఢీకొట్టింది. అక్కడున్న రన్‌వే లన్నీ విమానాల శకలాలతో నిండి ఉన్నాయి. మీ సింగపూర్ ప్రయాణం తాత్కాలికంగా రద్దు చేయబడింది. మీరు దగ్గర్లోని విమానాశ్రయాలను సంప్రదించి విమానాన్ని దింపేయండి. ఏం చేయాలో తర్వాత చెబుతాం.” అని చెప్పాడు.

“అయ్యో… ఇప్పుడెలా?” సహ పైలట్ కాస్త ఆదుర్దా చెందాడు.

వివేక్ మాత్రం వెంటనే ’రాడార్’లో దగ్గర్లోని విమానాశ్రయాల కొరకు వెదికాడు. విమానం అప్పుడున్న స్థలానికి కోల్‌కతా, కటక్, యాంగూన్ విమానాశ్రయాలు సమీపంలో ఉన్నాయి.

ముందుగా కటక్ విమానాశ్రయ అధికారులను సంప్రదించి తమ స్థితి చెప్పాడు.

“సారీ, మిస్టర్ పైలట్…రెండు గంటల వరకు రన్‌వే లు ఖాళీ అవ్వవు. మీకు అనుమతి ఇవ్వలేం.” అని చెప్పారు వాళ్ళు.

వెంటనే యాంగూన్ విమానాశ్రయం వారిని అడిగాడు.

“మిస్టర్ పైలట్… రన్‌వే ఖాళీగానే ఉంది. కానీ ఇంకో అరగంటలో ఒక విమానం దిగేందుకు అనుమతి నిచ్చాం. మీరొచ్చేసరికి రన్‌వే ఖాళీగా ఉండదు. సారీ..” అని సమాధానం ఇచ్చారు వాళ్ళు.

సహపైలట్‌కు ఎంతో టెన్షన్‌గా ఉంది. చెమటలు పడుతున్నాయి. కానీ తన ఆందోళనను బయటపడనివ్వలేదు. వివేక్ మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.

యాంగూన్‌లో కుదరదనగానే కోల్‌కతా విమానాశ్రయాన్ని అడిగాడు.

“అన్ని రన్‌వేలు ఖాళీగానే ఉనాయి. కానీ దిగేందుకు వీలుకాదు. ఎందుకంటే దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంది. అదంతా పోయేందుకు కనీసం రెండుగంటలైనా పడుతుంది.” వారు చెప్పిన సమాధానం విని దిక్కుతోచలేదు.

మూడు విమానాశ్రయాలతో మాట్లాడిన విషయం, పైలట్ ఎప్పటికప్పుడు గ్రౌండ్ కంట్రోల్ తో చెబుతూనే ఉన్నాడు.

“ఓకే పైలట్… మీరు తిరిగి గన్నవరం వచ్చేయండి. మీకోసం రన్‌వే ఖాళీగా ఉంచుతాం.” గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు సూచించారు.

“అలాగే…ఇప్పుడే విమానాన్ని వెనక్కి తిప్పుతున్నాను.” అంటూ విమానాన్ని గన్నవరం వైపు మరల్చాడు వివేక్.

అయితే అప్పుడే జరిగిందొక సంఘటన. విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకటి హటాత్తుగా ఆగిపోయింది. అది గమనించిన సహపైలట్ బిగ్గరగా కేక వేశాడు.

“మనమే కంగారు పడితే ఎలా? ఒక ఇంజన్ ఆగిపోయినా ఇంకోటి ఉందని సంతోషపడాలి. బెదిరిపోకండి.” వివేక్ సహ పైలట్‌కు ధైర్యం చెప్పాడు.

అంతేగాక, “ఈ విషయం ప్రయాణీకులకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. కంగారు పడకుండా విమాన అదుపుపై దృష్టి పెట్టండి.” అని సూచించాడు.

’కేవలం కొన్ని సాంకేతిక కారణాల వలన తిరిగి గన్నవరం వస్తున్నామ’ని ప్రకటించారు.

ఆ ప్రకటన వినగానే ప్రయాణీకుల్లో అలజడి మొదలయ్యింది. కొందరు భయపడిపోయి లేచి హడావుడిగా తిరగడం మొదలుపెట్టారు. ఎయిర్ హోస్టెస్‌లు వారిని సముదాయించి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. విమానం గన్నవరం వైపు ప్రయాణించసాగింది. అయితే వివేక్ అప్పుడే ఒక విషయాన్ని గుర్తించాడు. మిగిలిన ఒక్క ఇంజన్ కూడా సమర్ధవంతంగా పనిచేయడం లేదు. దాని పనితీరు అలాగే ఉంటే గన్నవరం చేరడం కూడా కష్టమనిపించింది.

వివేక్ గ్రౌండ్ కంట్రోల్‌తో మాట్లాడుతూ, “మిగిలిన ఇంజన్ కూడా ఆగిపోయేలా ఉంది. అందరినీ క్షేమంగా భూమి మీదకు తీసుకురావాలంటే అత్యవసరంగా ఎక్కడో ఒకచోట విమానాన్ని దించేయాలి.”

“అంటే క్రాష్ ల్యాండింగ్ చేస్తావా?” గ్రౌండ్ కంట్రోల్ ప్రశ్నించింది.

“అవును. క్రాష్ ల్యాండింగే!”

“పరిస్థితి తీవ్రంగా ఉంటే, క్రాష్ ల్యాండింగ్ చేసే పని సహ పైలట్ కు అప్పగించు. అతను వయసులో ఎంతో పెద్దవాడు, అనుభవమున్నవాడు కదా!” గ్రౌండ్ కంట్రోల్ సూచించింది.

“నో..మీరు నన్ను అవమానిస్తున్నారు. ఎన్నో గంటలు విమానాలను నడిపిన అనుభవం నాకుంది. క్రాష్ ల్యాండింగ్ నేను చేయగలను.” వివేక్ దృఢంగా చెప్పాడు.

“సరే పైలట్..ఏం జరిగినా మీదే బాధ్యత.”

“అలాగే.”

విమానం ఎత్తును తగ్గించి చదునుగా ఉండే భూబాగాల కొరకు పైలట్ పరిశీలించసాగాడు. ఒక చోట విశాలమైన బీడుభూమి కనిపించింది. అక్కడే క్రాష్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

’అత్యవసరంగా విమానం దిగబోతోందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, కాస్త కుదుపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున… సీట్ బెల్ట్ కచ్చితంగా పెట్టుకోవాల’ని ప్రకటన వెలువడింది.

ప్రయాణీకులలో ఉత్కంఠ పెరిగింది. ఎందుకు దిగవలసి వస్తుందో తెలియదు! కొందరు ప్రయాణీకులు కిటికీలలోంచి బయటకు తొంగి చూడసాగారు.

పైలట్ అనుకున్నవిధంగా బీడుభూమిలో విమానాన్ని దింపాడు. విమానం టైర్లు ఒక్కసారిగా నేలను బలంగా తాకగానే ప్రయాణీకులంతా ఎగిరిపడ్డారు. విమానం టైర్లన్నీ ఊడిపోయాయి. విమానం ఈడ్చుకుంటూ కొద్దిదూరం వెళ్ళి ఆగిపోయింది. ఎయిర్ హోస్టెస్ లు అత్యవసర ద్వారాలను తెరచి అందరినీ బయటకు పంపారు. చివరగా సహపైలట్, పైలట్ బయటకు వచ్చారు.

ఎవరికీ స్వల్పగాయం కూడా కాలేదు. అప్పటివరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణీకులు భయం వదిలేసి, లిటిల్ పైలట్‌ను పొగడడం మొదలుపెట్టారు. పైలట్ క్రాష్ ల్యాండింగ్ చేయడానికి ముందే, విమానం దింపే ప్రదేశం గురించి గ్రౌండ్ కంట్రోల్‌కు చెప్పి ఉండడంతో అంబులెన్స్, అగ్నిమాపకదళం వచ్చి ఉన్నాయి. విమానం ల్యాండ్ కాగానే అవి సమీపానికి వచ్చాయి. అయితే లిటిల్ పైలట్ చాకచక్యం వలన వాళ్ళకు పనిలేకుండా పోయింది.

ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చింది. అందులోంచి గన్నవరం విమానాశ్రయ అధికారి ఒకరు దిగారు. అతను నేరుగా పైలట్ దగ్గరకు వచ్చి, “మిస్టర్ పైలట్….మీ అద్భుత ప్రతిభతో ప్రయాణీకులను కాపాడారు. చాలా సంతోషం… అయితే మీకో దుర్వార్త.” అన్నాడు.

“ఏమిటది?” లిటిల్ పైలట్ ధీమాగానే అడిగాడు.

“ఏం లేదు…మీ వయసు వారిని ఇకనుంచి పైలట్లుగా పంపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరవై సంవత్సరాలు నిండిన వారినే ఇక పైలట్లుగా తీసుకుంటాం.”

***

’నో….నో…అలా కుదరదు. నేను ఎప్పటికీ పైలట్ గానే ఉంటాను…విమానాలను నడుపుతూనే ఉంటాను.’

అలా కేకలు వేస్తూ నిద్రలోంచి మేల్కొన్నాడు ఐదవ తరగతి చదువుతోన్న వివేక్. తన పక్కనే విమానాల బొమ్మలు, ’విమానాలను ఎలా నడపాలి?’ అనే పుస్తకం ఉన్నాయి.

“ఏంట్రా..ఆ అరుపులు.” అంటూ వివేక్ తల్లి రాణి గదిలోకి వచ్చింది.

“ఏమీలేదు.” అంటూ తల అడ్డంగా ఊపాడే తప్ప తన కల విషయం చెప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here