సీతాకోకచిలుకలు

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా సీతాకోకచిలుకల గురించి, వాటిలోని రకాల గురించి, మనుషులకు అవి చేసే మేలు గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

“అమ్మమ్మా! అమ్మమ్మా! ఎక్కడున్నావు?” అంటూ ఇల్లు ఎగిరిపొయ్యెలా గావుకేకలు పెట్టారు ఆర్యన్, పరి. ఈ చిచ్చర పిడుగులు సెలవలికి అమ్మమ్మ ఇంటికి ముంబై మహా నగరం నుండి వచ్చారు.

“ఇక్కడున్నా”

“ఇక్కడంటే ఎక్కడ?”

“ఇక్కడంటే తోటలో” అని గట్టిగా బదులిచ్చారు అమ్మమ్మ అంబిక.

 తోటలోకి పరిగెత్తి వెళ్లారు పిల్లలు.

“ఇవ్వాళ త్వరగా నిద్రలేచారే మా చిన్ని పాపలు” అంటూ దగ్గరకి తీసుకొని ముద్దుపెట్టుకున్నారు అమ్మమ్మ.

“పాలు తాగారా?”

“ఓ తాగాము. అత్త ఇచ్చారు” అన్నారు కోరస్‌గా.

“అమ్మమ్మా తాత ఏరి?”

“అదిగో ఆ మూల జామచెట్టు దగ్గరున్నారు.”

“తాతా!” అంటూ పరిగెత్తారు పరి, ఆర్యన్.

“ఆర్యన్, పరి రండి” అని పిలిచారు తాత జగన్.

“తాతా! ఇక్కడేమి చేస్తున్నారు?”

“జామచెట్టుకు ఎరువు వేస్తున్నా” అన్నారు జగన్.

తాత తోటలో పూలచెట్లు లేవా?” అంది పరి.

“చాలా పూల చెట్లు, పూల తోట ఉంది. రండి చూపిస్తా. అమ్మమ్మ అక్కడికే వెళ్ళింది” అన్నారు జగన్.

“అవునా? మేము చూడలేదే” అన్నారు పిల్లలు. తాత చెయ్యి పట్టుకుని పూలతోటలోకి వెళ్లారు. అక్కడ అమ్మమ్మ మంగి, స్వామితో పని చేయిస్తున్నారు.

“అమ్మమ్మా! మన పూలతోటలో ఏమేమి చెట్లున్నాయి?” అడిగింది పరి.

“బోలెడు రకాలున్నాయి. మల్లె, జాజి, చమేలీ, రాధామాధవం, గన్నేరు, గులాబీ, చామంతి, బంతి, ఒకటేంటి దాదాపు 30 రకాల పూలమొక్కలున్నాయి” అంటూ పరి చెయ్యి పట్టుకుని ఒకొక్క మొక్క చూపిస్తున్నారు.

ఇంతలో ఆర్యన్ “హే! సీతాకోకచిలుకలు! బటర్ ఫ్లయ్స్!” అని వాటివెంట పరుగెత్తాడు.

పరి అమ్మమ్మ చెయ్యి వదిలి ఆర్యన్ వెంట “సీతాకోకచిలుకలు!” అంటూ వెళ్ళింది. “ఆర్యన్, పరీ చూసి నడవండి. బీ కేర్‌ఫుల్!”

రంగురంగుల సీతాకోకచిలుకలు చూసిన ఆనందం పట్టలేక “అమ్మో! ఎన్ని రంగులో! ఆర్యన్ ఇక్కడ చూడు.”

“పరీ! ఇటు చూడు ఎన్ని సీతాకోకచిలుకలో”

“ఎక్కడ?” అని పరిగెత్తింది పరి.

పిల్లల కేకలు, సందడికి పూల తేనె తాగుతున్న సీతాకోకచిలుకలు రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా అటుఇటు ఎగరటం చూసిన పరి ఆనందంతో చప్పట్లు కొట్టింది.

ఆర్యన్ వాటి వెనుకగా పరుగెత్తి రెండు చేతులతో రెండు పెద్ద సీతాకోకచిలుకలు పట్టుకుని “పరీ! అమ్మమ్మా! తాతా! ఇదిగో చూడండి నేను సీతాకోకచిలుకలు పట్టుకున్నా” అని వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.

“నాకు ఒకటి ఇవ్వు!” అని ఆర్యన్ దగ్గర్నుండి లాక్కోవాలని ట్రయ్ చేసింది పరి.

“ఆర్యన్! వాటిని వదిలి పెట్టు” అని అమ్మమ్మ కోపంగా అరిచింది. “విడిచిపెట్టు. రైట్ నౌ!”

వెంటనే వాటిని గాలి లోకి వదిలాడు.

“అమ్మమ్మా! This is too bad. నాకోటి కావాలి” అని పరి మారం చేసింది.

“దగ్గర రా! ఇస్తాను” అని పిలిచింది అమ్మమ్మ. వచ్చిన పరిని గట్టిగా రెండు చేతుల మధ్య పట్టుకుంది అంబిక.

“వదులు! వదులు! అమ్మమ్మా. ఇట్స్ పైనింగ్! తాతా టెల్ హర్!”

“వదలను. ఇప్పుడు తెలిసిందా? గట్టిగా పట్టుకుంటే నెప్పిగా ఉంటుందని. పాపం సీతాకోకచిలుకలు కూడా నెప్పి నెప్పి అని అరిస్తే ఆర్యన్ వినలేదు. నువ్వు కావాలన్నావు.”

“వాట్? సీతాకోకచిలుకలు అరిచాయా?” అన్నాడు ఆర్యన్ అశ్చర్యంతో.

“అవును. ప్రాణం ఉన్న వేటికైనా నొప్పి ఉంటుంది మనలా.”

“అవునా?”

“అవును.”

“అమ్మమ్మా! అవి జస్ట్ సీతాకోకచిలుకలు. లాట్ ఆఫ్ ఫన్” అన్నాడు ఆర్యన్.

“యా! లాట్ ఆఫ్ ఫన్! వాటితో నో యూజ్!” అంది చేతులూపుతూ పరి.

“నో. యూ ఆర్ రాంగ్! వాటితో చాలా ఉపయోగం ఉంది. రండి టిఫిన్ తింటూ విందురుగాని” అంది అమ్మమ్మ.

ఇంతలో అత్త శ్వేత పిల్లలకు టిఫిన్, పండ్లు, పాలు తీసుకొచ్చారు. పిల్లలు అమ్మమ్మతో కలిసి తోటలోని అరుగుల మీద కూర్చుని సీతాకోకచిలుకలు గురించి వింటున్నారు.

“ఆర్యన్ నీ సైన్సు క్లాస్‌లో టీచర్ చెప్పిన పాఠం గుర్తుందా? బటర్‌ఫ్లయ్ లైఫ్ సైకిల్.”

“గుడ్డు, పురుగు, ప్యూపా, రంగురంగుల బటర్‌ఫ్లయ్” అన్నారు పిల్లలిద్దరూ.

“సీతాకోకచిలుకలు ఎన్ని రకాలు?”

“ఒకటి, రెండు” అంది పరి.

“మే బి టెన్!” అన్నాడు ఆర్యన్.

“మీకు తెలిసింది అన్నే. సీతాకోకచిలుకలు,మత్స్ అనేక రకాలున్నాయి. అవి ఆరోగ్యకరమైన వాతావరణం, పర్యావరణానికి గుర్తులు. రసాయనాలు ఎక్కువగా వాడేచోట అవి బతకలేవు. అలాగే వాటికి సహజ సిద్ధమైన అడవులు, పూల తోటలు ఇష్టం. అవి పూల పుప్పొడిని ఒకచోట నుండి ఇంకో చోటికి తీసుకెళ్లి ఫలదీకరణం, పోలినేషన్‌కి హెల్ప్ చేస్తాయి. అంటే ఒకేరకం మొక్కలు అనేక చోట్ల ఉండేలా పర్యావరణం బాలన్స్‌కి సాయపడతాయి. నేచర్‌లోని అనేక చిన్న చిన్న జీవులకు ఫుడ్‌గా ఉపయోగపడుతున్నాయి. అంతే కాదు కొన్ని వేల సంవత్సరాలుగా భూమి మీద ఉన్నాయి. ఓల్డెస్ట్ సీతాకోకచిలుకలు, మత్స్ ఫాసిల్స్‌ని స్టడీ చేస్తే మనకి ఆ టైంలో ఉన్న రసాయనాలు, వాతావరణ మార్పులు తెలిసే అవకాశం ఉందిట. అనేక దేశాల్లో ప్రత్యేకించి సీతాకోకచిలుకలు, మత్స్ కోసం పూలతోటలు పెంచి వాటిని టూరిస్టులు చూసేలా చేస్తారు. అంటే సీతాకోకచిలుకలు టూరిజం. రైటర్స్, ఆర్టిస్టులు సీతాకోకచిలుకలు మీద పాటలు వ్రాసారు. వాటి అందమైన బొమ్మలు గీశారు. సీతాకోకచిలుకలు ఫ్రీడమ్‌కి గుర్తుగా చెబుతారు. సీతాకోకచిలుకలు చూసి ఆనందించాలి. వాటిని బంధించి ఏడిపించకూడదు. అంతే కాదు మన చుట్టూ ఉన్న పరిసరాలు గ్రీన్‌గా ఉంచుతూ అంటే మొక్కలు, పూలచెట్లు నాటి, చెట్లు, అడవులు నరకకుండా చూస్తే మనకి బోలెడన్ని సీతాకోకచిలుకలు” అన్నారు అమ్మమ్మ.

“సారి అమ్మమ్మా! ఇంకోసారి సీతాకోకచిలుకలు పట్టుకోము” కోరస్‌గా అన్నారు పరి, ఆర్యన్.

“మేము ముంబై వెళ్ళాక మమ్మీకి చెప్పి బోలెడు పూలమొక్కలు మా బాల్కనీలో పెంచుతాము. అప్పుడు సీతాకోకచిలుకలు మా ఫ్రెండ్స్ అవుతాయి కదా?” అంది అమాయకంగా చిన్నారి పరి.

“అవును బంగారు. వాటిని పట్టుకోకుండా వాటి మధ్యలో నుంచుని ఆడుకోండి” అన్నారు తాత జగన్.

“పిల్లలు పదండి మీకు, సీతాకోకచిలుకలకు కలిపి ఫొటోస్ తీసి మీ అమ్మకు పంపిస్తాను” అంది అత్త శ్వేత.

“హే! ఫొటోస్! సీతాకోకచిలుకలు” అని పరుగెత్తారు పరి, ఆర్యన్.

సీతాకోకచిలుకలతో పోజ్‌లు ఇచ్చారు.

“సారీ! సీతాకోకచిలుకలు” అని అనేక సారీలు చెప్పారు భావితరం పర్యావరణ రక్షకులు పరి,ఆర్యన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here