నిరాశ పరచిన “కేరాఫ్ కంచరపాలెం”

4
6

[box type=’note’ fontsize=’16’] “చిన్న సినెమాలను ఆదరించాల్సిందే. యేకాస్త ముందడుగు వేసినా ప్రోత్సహించాల్సిందే. కాని ముందూ వెనుకా చూసుకోకుండా ఆకాశానికెత్తేస్తే మేలు కంటే కీడే యెక్కువ జరుగుతుంది” అంటూ ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]1[/dropcap]948లో ఇటాలియన్ దర్శకుడు డెసికా వొక గొప్ప ప్రయోగం చేశాడు. స్టూడియో బయట, నిజమైన ప్రదేశాల్లో, నిజమైన అక్కడి మనుషులను (అంటే trained నటులు కాని) తీసుకుని అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ “ది బైసికెల్ తీవ్స్” తీశాడు. అది ఇప్పటికీ ప్రపంచంలో 100 గొప్ప చిత్రాలలో వొకటిగా నిలిచి వుంది. “కేరాఫ్ కంచరపాలెం”లో వెంకటేశ్ మహా కూడా విశాఖలోని కంచరపాలెంలో నటులు కానివారితో ఈ సినెమా తీశాడు. వ్యాపారాత్మకత లేకుండా, సంగీతం కూడా జానపదాన్ని, తత్త్వాలనీ వాడుతూ మంచి ప్రయత్నం చేశాడు. కొత్తవాళ్ళైనా దాదాపు అందరూ బాగానే చేశారు. ఇది ఇతని మొదటి ప్రయత్నమైతే ఇతన్నుంచి ముందు ముందు మెరుగైన చిత్రాలు ఆశించవచ్చు.

చిన్న సినెమాలను ఆదరించాల్సిందే. యేకాస్త ముందడుగు వేసినా ప్రోత్సహించాల్సిందే. కాని ముందూ వెనుకా చూసుకోకుండా ఆకాశానికెత్తేస్తే మేలు కంటే కీడే యెక్కువ జరుగుతుంది.

ఇప్పుడొచ్చిన కేరాఫ్ కంచరపాలెంను కొన్ని విషయాల్లో మెచ్చుకున్నా మొత్తం మీద నిరుత్సాహమే యెక్కువ.

వొక స్కూల్ లో సుందరం సునీతలు పరస్పరం స్నేహం పెంచుకుంటారు. ఆమెకు “భలే భలే మగాడివోయ్” అన్న మరో చరిత్ర లోని పాటను పాడటం కోసం పాటల పుస్తకం సంపాదించి పెడతాడు. కూతురు పట్ల అతి కట్టడి చేసే మనస్తత్వం వున్న ఆ అమ్మాయి తండ్రి ఆమెను ఢిల్లీలోని బళ్ళో జేర్పించేస్తాడు. తమ యెడబాటుకు కారణమైన వినాయకుని (తండ్రి చేసినదే) పాడు చేస్తాడు ఉక్రోషంతో సుందరం.

మరో పక్క firebrand భార్గవి వో పేట రౌడి జోసెఫ్ ను ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి నిలకడగా వుందామని వుద్యోగంలో కూడా చేరతాడు. ఈలోగా తమ మతాలు వేరని ఆమె తండ్రి ఆత్మహత్య బెదిరింపుతో, (emotional blackmail) తమ మతపు/కులపు అబ్బాయితో ఆమె వివాహం వొప్పించి చేయించేస్తాడు.

యవ్వనప్రాంగణం దాటేసిన గడ్డం (అతన్ని అందరూ అలానే పిలుస్తారు. మోహన్ భగత్) పనిచెస్తున్న లిక్కర్ షాపులో రోజూ వో ముసుగేసుకున్న అమ్మాయి సలీమా (పరుచూరి ప్రవీణ) వస్తుంటుంది మందు కొనడానికి. దూరంగా రోడ్డుకవతల నిలబడుతుంది. గడ్డం ఆమెకు రోజూ మందు అందిస్తూ క్రమంగా ఆమె ప్రేమలో పడిపోతాడు. ఆమె వో వేశ్య అని తెలిసినా అతని ప్రేమలో మార్పుండదు. కాని ఆమె మతం వారు ఆమెకు వార్నింగ్ ఇచ్చిన అనంతరం ఆమె శవంగా తేలుతుంది.

రాజు (సుబ్బారావు) కిప్పుడు 49యేళ్ళు. వో ప్రభుత్వ కార్యాలయంలో అటెండరు. అతని పై అధికారిణి రాధ (రాధ) అతన్ని తమతో సమానంగా చూస్తూ, భోజన బల్ల దగ్గర తమతో పాటే కూర్చోమంటుంది. అలా క్రమంగా వారిద్దరూ దగ్గరవుతారు.

ఇప్పుడు మీకు ఈ కథలన్నీ చాలా ఆదర్శవంతంగా అనిపించడంలేదు. యెంతగా అంటే నమ్మడానికి వీలు లేనంతగా. ఆదర్శాలూ, నీతి వాక్యాలూ బాగుంటాయి, కాని కథ ముందు కథను చెప్పాలి. అందులో పాత్రలు తమ సహజ స్వభావానికి తగ్గట్టుగా నడుచుకోవాలి తప్ప రచయితకు అనుకూలంగా కాదు. అది యేకకాలంలో ప్రేక్షకుడి మెదడునూ, హృదయాన్నీ తాకాలి. ముఖ్యంగా రెండోది. అప్పుడది చెరగని ముద్ర వేయడమే కాకుండా ఆలోచింపజేస్తుంది కూడా. ఆ చిన్న పాప నటన పెద్దవాళ్ళలా వుంది. టీవీల లోనే ఈ అతికి విసిగి పోయి వున్నాం. ఆమె అలాంటి పాటలు పాడటం ఆ వయసుకు మించిందే అయినా తండ్రి అంత చిన్నదానికే బడి, వూరు మాంపించడం అతి అనిపించుకుంటుంది. భార్గవి-జోసెఫ్ ల ప్రేమ సహజంగా వుంది. కాని అంత నిప్పులుగక్కే అమ్మాయి తండ్రి emotional blackmail కి లొంగిపోవడం నమ్మబుధ్ధి కాదు. అంతే చక్కగా కుదిరింది గడ్డం-సలీమాల ప్రేమ కథ. ముఖ్యంగా ఈ కథలో చెప్పకుండానే కొన్ని విషయాలు చక్కగా చెబుతాడు దర్శకుడు. కథకుడు అలాగే వుండాలి కదా. కాని ఇక్కడ కూడా సలీమా అనుమానాస్పద మృతి ఇరికించినట్ట్లుంది. ఇక నడివయసు ప్రేమ కథ “పరిపక్వంగా” వుంది. అంటే ప్రేమలో పడ్డట్టు కాకుండా, వొక లావాదేవీ (transaction) లా అనిపిస్తుంది, మిగతా ప్రేమ కథలతో పోలిస్తే.

ఈ చిత్రం ఇంకా చూడనివారు ఈ పేరా దాటెయ్యవచ్చు. వొక ప్రేమ కథను చెప్పాలన్నా దానికి time and space వుండాలి. ఆ ప్రయత్నమైతే వుంది. “మనమంతా” లాంటి చిత్రాలలో లాగా చివర్న అన్ని కథలకూ వో ముడి పెడతాడు. అదేమిటంటే ఆ పాత్రలన్నీ రాజు పూర్వాశ్రమంలోవి. కాని కులమతాలు, వర్గం వగైరాలు ప్రేమకు, మానవత్వానికీ యెలా ఆటంకాలు అన్నది చెప్పడానికి ఇది సరైన పధ్ధతేనా? అతను అవివాహితుడుగా మిగలాలంటే ఆ అమ్మాయిలందరూ ఆ విధంగా అంతర్ధానమవ్వాల్సిందేనా? మరొక విషయం: అందరికీ బాల్యకాలపు స్మృతులుంటాయి. కాని వాటిని నెమరువేసుకునేటప్పుడు బాల్యపు చర్యగా గుర్తిస్తాం తప్ప తెలిసీ చేసిన ప్రేమ అంటామా? ఆ పాపను ఈడ్చుకెళ్తుంటే కనీసం ఆపలేని నిస్సహాయ వయసు. ఇంటిదగ్గర తల్లిదండ్రుల కష్టాలు యెరుగడు. తండ్రి చేసిన విగ్రహాని పాడుచేసి అప్పులపాలైన అతని ఆత్మహత్యకు కారణమవుతాడు. దాని తాలూకు అపరాధ భావన వుండదు, రౌడీగా మారడం తప్ప. (చిత్రం లో చూపబడలేదు. చివర్న కూడా రాజు తన బాల్యకాలపు “ప్రేమ” ను గుర్తు చేసుకుంటాడే తప్ప తండ్రి ఆత్మహత్యను కాదు. ఇది చిన్న విషయం కాదు. హిచ్‌కాక్ ది “సైకో” లో మరియన్ క్రేన్ నలభై వేల డాలర్లు బ్యాంక్ లో కట్టకుండా తీసుకుని ఉడాయిస్తుంది. కాని వొక మోటెల్లో ఆమె హత్య కాబడుతుంది. ఇప్పుడు ఆ డబ్బు విషయం చిత్రంలో చివరిదాకా ప్రేక్షకుడి మనసులో తిరుగుతూనే వుంటుంది, అదేమైందని? యెందుకంటే చనిపోకముందే ఆమె మనసు మార్చుకుని, వెనుతిరిగి ఆ డబ్బు వాపసిద్దామని నిర్ణయించుకుని వుంటుంది. ఇంత వివరంగా యెందుకు వ్రాస్తున్నానంటే ఆ ఆత్మహత్య చిన్న విషయం కాదు, దాని ప్రభావం చర్చించకుండా, ఆ ప్రేమ కథ గుర్తుపెట్టుకున్నట్టుగా చూపించడం అన్యాయమే.)

రాధ కూడా తన స్వశక్తి మీద నిలబడ్డ ధైర్యవంతురాలు. కాని పెళ్ళి దగ్గర కాస్త బేలగా చూపించారు, ఆమె కూతురు చేత ఆ భారీ డైలాగులు చెప్పించడానికి. ఇదంతా కథ చెబుతున్నట్టుగా కాకుండా మన తలలో యేదో యెక్కించడానికి వండిన వంటలా వుంటుంది. స్త్రీ పాత్రలు ధైర్యవంతురాళ్ళు అని సంతోషించాలా, లేక వూరికే అలా give up అయిపోతారని విచారించాలా? అసలు నాలుగు కథలు చెప్పి చివర్న వాటన్నిటినీ కలిపి కుట్టే ప్రయత్నం ఇది కొత్తది కాదు గాని, సమర్థవంతంగా జరగలేదు. ఈ మధ్యే వచ్చిన “మనమంతా” ఇంకా చాలా రెట్లు నయం. హిందీలో “లిప్ స్టిక్ అండర్ బుర్ఖా” (కొన్ని చోట్ల విభేదాలున్నా) నయం.

నెట్‌ఫ్లిక్స్‌లో “లస్ట్ స్టోరీస్” వచ్చింది. నాలుగు వేర్వేరు కథలు నలుగురు దర్శకులు. రెండు గంటల నిడివి. అదొక పధ్ధతి. రెండు గంటలలో వొక కథ చెప్పడమే కష్టం, ఇన్ని యెందుకు పెట్టుకోవాలి? కులాల కారణంగా ప్రేమకు యెదురయ్యే కష్టాలు, హిందీలో “బాబి” తెలుగులో “మరో చరిత్ర” లాంటివి క్లాసిక్స్ గా వున్నాయి. ఇక దళిత కోణం కూడా కలుపుకుంటే మరాఠీ లో “సైరాట్” అనే వో అద్భుతముంది. ఆ ప్రేమికుల జీవితంలో సమాజంతో జరిగే ఘర్షణలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మానసిక వికాసాలూ-వెతలూ, సమాజంలో పోకడ యెన్ని వున్నాయి. ఇందులో అన్నీ అలా అలా ముట్టీముట్టకుండా వున్నాయి.

ఇక మెచ్చుకోవాల్సినవి కూడా వున్నాయి. సుందరం తండ్రిగా చేసిన కిషోర్, మోహన్ భగత్, ప్రవీణా, కార్థిక్, సుబ్బారావు ల నటన బాగుంది. స్వీకార్ సంగీతం బాగుంది. ప్రాంతీయ టాలెంట్ ని వాడుకోవడమూ బాగుంది. ఇంకో గొప్ప విషయం యేమిటంటే, రాజు దేవుడిని నమ్మడు. కాని సింహాచలం వెళ్ళడానికి రాధకు సాయం పడతాడు, తను మాత్రం గుడిలోకెళ్ళడు. మానవతావాదులు, నాస్తికులు యెంతమంది ఇలా చేయగలుగుతారు? Live and let live యెంతమందికి రుచిస్తుంది? అభినందనీయం. మొదటి ప్రయత్నం ఇలా వుంటే మహా వెంకటేష్ ముందు ముందు మెరుగైన చిత్రాలు అందిస్తాడని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here