Site icon Sanchika

సెలెబ్రిటిగా ఎదిగిన ఒక తెలుగు అమ్మాయి

[dropcap]“N[/dropcap]o country can ever truly flourish if it stifles the potential of its women and deprives itself of the contributions of half of its citizens.” – Michelle Obama.

ఏ సమాజంలో స్త్రీ అణచివేతకు గురి అవుతుందో ఆ సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. స్త్రీ శక్తిమంతంగా ఎదిగినప్పుడే ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా సాధ్యం అవుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా స్త్రీలు ఎదిగినప్పుడే ఒక దేశం అయినా, సమాజం అయినా అభివృద్ధి సాధించేది.

ఏదన్నా సాధించాలంటే కలలు కనే కళ్ళు ఉండాలి.. మనసుకు రెక్కలు మొలవాలి. ఆశయాల చిగురులు వేయాలి. ఇవి అన్నీ ఆధునిక స్త్రీకి ఉన్నాయి. అందుకే అనేక రంగాలలో దూసుకుపోతూ తన ఉనికి ప్రపంచానికి చాటుతోంది. అలాంటి మహిళామణుల్లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఉంటున్న రాజేశ్వరి ఒకరు.

హైదరాబాద్‌లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, విద్యావంతురాలై, ఉద్యోగ నిమిత్తం అమెరికా లాంటి అగ్ర దేశానికి వెళ్ళి, నేడు ఆ అమెరికాలోని డల్లాస్‌లో ఒక సెలెబ్రిటిగా ఎదిగింది ఒక తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి పేరే రాజేశ్వరి.

చల్లా వారి కుటుంబంలో పుట్టి, ఉదయగిరి వారి కుటుంబానికి కోడలుగా వెళ్ళిన ఉదయగిరి రాజేశ్వరి చిన్నప్పటి నుంచే వేదికలెక్కి నటనకు శ్రీకారం చుట్టింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ‘A గ్రేడ్’ ఆర్టిస్టుగా రేడియో నాటకాలలో అనేక పాత్రలకు తన స్వరంతో ప్రాణం పోసి, జెమిని, ఈటీవీ మొదలైన ఛానెల్స్‌లో యాంకర్‌గా, నటిగా, interviewer గా తనదైన ముద్ర వేసుకున్న రాజేశ్వరికి కళలంటే ప్రాణం. అందులోనూ రంగస్థల నాటకాలు అంటే మరీ ఇష్టం. రేడియో అంటే చెప్పక్కరలేదు. అందుకే అమెరికాలాంటి దేశంలో కూడా తన ప్రతిభకి , తన అభిరుచికి తగిన స్థలం కోసం అన్వేషించింది. డల్లాస్‌లో తెలుగు Radio గురించి విన్నది. ‘ఇది నాకు తగినది’ అనుకుంది. మెల్లగా కుడికాలు పెట్టి శుభసంకేతం పంపింది. 2006 నుంచి డల్లాస్ లోని తెలుగు Radio తో అనుబంధం కొనసాగిస్తూ సుమారు ఐదేళ్లుగా ప్రతి శని, ఆదివారాలు తానే స్వంతంగా తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ 2022 మే 5 వ తేదీన ఆ Radio ని స్వంతం చేసుకుంది. అమెరికాలోని తెలుగువారికి తెలుగు కార్యక్రమాల రూపకల్పన చేసి Radio Surabhi అనే పేరుతో కామధేనువు లాగే అద్భుతమైన తెలుగు కార్యక్రమాల వరాలు కురిపించడానికి తనని తాను సన్నద్ధం చేసుకుంది. సుమారు 20 మంది ఉత్తమాభిరుచులు కలిగిన స్నేహ బృందంతో 24/7 తెలుగు కార్యక్రమాల రూపకల్పన చేసి తన Radio Surabhi ని ఒక fm స్టేషన్ గా తీర్చి దిద్దుకుంది.

రాజేశ్వరి సామాన్యురాలు కాదు. ఏ తెలుగు వారు చేయని సాహసం చేసిన వీర వనిత. విజయావారి మిస్సమ్మ సినీమానే రంగస్థల నాటకంగా మలచి అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించి జయకేతనం ఎగురవేసింది. ద్రౌపది లోని అంతః సంఘర్షణ అద్భుతంగా పోషించి, అద్భుతమైన ద్రౌపది నాటకాన్నిన భూతో న భవిష్యతి అన్నట్టు దర్శకత్వం వహించి డల్లాస్ లోని ఎందరో కళాకారులను తెరపైకి తీసుకువచ్చి విజయవంతంగా ప్రదర్శించి తెలుగు నాటకానికి అంతర్జాతీయ కీర్తిని ఆపాదించి పెట్టింది.

ఎం.సి.ఏ చదివిన రాజేశ్వరి ప్రస్తుతం Med Case Company లో Senior Operations Lead గా ఉంది. భర్త రాధేష్ ఉదయగిరి, కుమార్తె సన్నిధి, కుమారుడు సంప్రీత్.. తనకు అన్నివిధాలా కుటుంబ సభ్యుల సహాయం ఉంది అని గర్వంగా చెప్పుకుంటారు.

Yours lovingly, Business Tracs అనే Gemini కార్యక్రమాల ద్వారా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి అనతి కాలంలోనే ప్రేక్షకుల అభిమానం అందుకున్నారు. శాంతినివాసం, ప్రియురాలు పిలిచె, ఎడారిలో కోయిల అనే serials కాక ఎన్నో సింగిల్ ఎపిసోడ్స్‌లో నటించి తన ప్రతిభ చాటుకున్నారు. ఇడియట్, శివమణి వంటి అనేక చిత్రాల్లో కథానాయికలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన సత్తా చాటుకున్న రాజేశ్వరి ఉద్యోగరీత్యా 2005లో అమెరికా వెళ్ళి డల్లాస్‌లో స్థిరపడ్డారు.

రాజేశ్వరి రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి కుమార్తె కావడం కొసమెరుపు.

Exit mobile version