సెల్ ఫోన్ల దొంగ

0
2

[dropcap]అ[/dropcap]దొక చిన్న పల్లెటూరు. ఒకప్పుడు పచ్చని పైరులతో దాన్యరాశులతో ఊరంతా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామం అయినందున ఆ ఊరికి నాగరికత వ్యాపించింది. ఇంటింటా లాప్‌టాప్‌లు, ఇంటర్‌నెట్లు, సెల్ ఫోన్లు వంటి ఆధునిక వస్తువులన్నీ చేరాయి. సాయంత్రం కాగానే అందరూ టీవీల ముందు వాలిపోతున్నారు. గోదూళి వేళ గోవుల మువ్వల సవ్వడి కాని పక్షుల కూజితాలు గాని వినే నాధుడే లేడు.

ఇలా ఉండగా ఒకరోజు మాధవయ్య కొడుకు సెల్ ఫోన్ పోయింది. ఎవరో దొంగలెత్తుకెళ్లారని ఊరుకున్నారు. వారం రోజులు గడిసే సరికి ఊళ్ళో సగం మంది ఫోన్లు పోయాయి. దొంగలెవరో అర్థం కాలేదు. అంతకు ముందెప్పుడు ఆ ఊరిలో దొంగతనాలు జరగలేదు. అప్పటికి రాత్రిపూట కాపలా కాస్తున్నారు. పగలు కూడ జాగ్రత్తగా ఉంటున్నారు. అయినప్పటికీ దొంగల్ని కనిపెట్టలేకపోయారు.

ఇలా ఉండగా రాము అనే పిల్లవాడు తెచ్చిన వార్త అందరిని ఆశ్ఛర్యములో ముచ్చెతింది. అసలు నిజమా అని నమ్మకం కలగలేదు. రాము ఏం చెప్పాడంటే అడవిలోఒక చెట్టు తొర్రలో బోలెడు సెల్ ఫోన్లు ఉన్నాయని. ఊర్లో పోయాయనుకున్న సెల్ ఫోన్లు అవే అయి ఉండవచ్చు అని పెద్దవాళ్ళు అనుకున్నారు. అయినా అక్కడికి ఎవరు తీసికెళ్లి ఉంటారు అని ఆశ్చర్యపోతూ అందరూ హుటాహుటిన అడవికి బయల్దేరారు. గ్రామస్తులంతా ఉరుకుల పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. ఆశ్చర్యం ఆ చెట్టు తొర్ర నిండా సెల్ పోనులే. అది వీళ్ళు ఇళ్లలో పోయాయినుకున్న సెల్ ఫోనులే.

వీళ్ళిలా చూస్తుండగానే ఒక పిచ్చుక ఓ సెల్ ఫోన్‌ను పట్టుకొని ఎగురుకుంటూ వచ్చింది అక్కడకు. చెట్టు తొర్రలో సెల్ ఫోనును పడేయబోతు జనాలందరిని గమనించి ఆగిపోయింది. గ్రామస్తులంతా పిచ్చుకను ఆశ్చర్యంగా చూశారు. “ఓహో సెల్ ఫోనుల దొంగవు నీవా? ఎందుకు దొంగతనం చేస్తున్నావు? అసలు నీ ముక్కుతో అంత బరువున్న సెల్ ఫోనును ఎలా పట్టుకుంటున్నావు” అని గ్రామ పెద్ద అడిగాడు.

దానికి ఆ పిచ్చుక “అయ్యా నేను దొంగను కాను. నేను మునీశ్వరుడికి నా బాధను చెప్పినప్పుడు నా ముక్కుకు ఫోన్ పట్టుకునే బలన్నిచ్చాడు. ఆ శక్తితోనే ఫోన్లను తీసికివచ్చి ఇందులో పడేస్తున్నాను” అంటూ చెప్పుకుపోతున్నది.

“అది సరేగాని ఎందుకు ఫోన్లు ఎత్తుకుపోతున్నావు. అది చెప్పు” ఒక యువకుడు విసుగ్గా అడిగాడు

“మీకు గుర్తుందా, ఒకప్పుడు ఈ ఊరిలో ఎన్ని పిచ్చుకలు ఉండేవో. చెట్లలో ఇంటి చుర్లలో మేం గూళ్ళు పెట్టుకొని జీవించేవాళ్ళం. ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ల పుణ్యమా అని మా తాతలు తండ్రులు అందరూ చనిపోయారు. వేలల్లో ఉండాల్సిన పిచ్చుకలు పదుల సంఖ్యలో ఉన్నాయి. మీరు నాగరికత అనుకుంటున్న ఫోన్ల వలననే మా జాతి అంతరించి పోతున్నది. మీకందరికీ చేయిలెత్తి మొక్కుతున్నా, మమ్ములను బతుకనివ్వండి. మేము మీకు సాయపడుతాం” అంటూ కన్నీళ్లతో ప్రార్థించిందా ఆ పిచ్చుక.

గ్రామస్తులకు విషయం అర్థమయింది. పేపర్లో కూడా ఎన్నో వ్యాసాలను చదివారు దీని గురించి. ‘ఇకనుంచి మన ఊరిలో సెల్ ఫోన్లను బహిష్కరిద్దాం. ల్యాండ్ ఫోన్లనే వాడుదాం, పిచుకలను కాపాడుకుందాం’ అని అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here