చదరంగంతో చదువు

0
4

[dropcap]ఆ[/dropcap] రోజు శనివారం. స్కూల్లో ఆఖరి పిరియడ్ జరుగుతున్నది. దాదాపు చాలా తరగతులకు గేమ్స్ పిరియడ్ అది. తరగతుల్లోని పిల్లలు చాలామంది తమ పుస్తకాల సంచులతో సహా ఆట స్థలానికి పరుగెత్తారు. పెద్ద పాఠశాల కావడంతో పిల్లల సంఖ్యా ఎక్కువగా వున్నది. ఆట స్థలం కూడా బాగా విశాలంగా వుంటుంది. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు, మరో యస్.డి.ఎస్ ఉపాధ్యాయుడు ఇద్దరూ అక్కడే వుండి ఆటలాడే పిల్లల్ని గమనిస్తున్నారు. అంతే కాకుండా వాలీబాల్, సాఫ్ట్‌బాల్ లాంటి ఆటలాడే పిల్లలకు తగు సూచనలు కూడా ఇస్తున్నారు. అక్కడే ఒక పక్కగా ఆడపిల్లలు కోకో అట ఆడుకుంటున్నారు. మరి కొంతమంది జట్లు జట్లుగా చేరి రింగ్ ఆట ఆడుతున్నారు. మొత్తానికి ఆటస్థలమంతా కోలాహలంగా వున్నది. కొంతమంది ఆడపిల్లలు మరి కొంతమంది మగ పిల్లలు మాత్రం గేమ్స్ రూమ్ కొచ్చారు. అక్కడ మరో వ్యాయామ ఉపాధ్యాయుడున్నారు.

“మాస్టారూ మేం మా బురువు చూసుకుంటాం” అంటూ ఆడపిల్లలు ఒకరి తర్వాత మరొకరు తమ బరువు చూసుకుంటున్నారు. మాస్టారు కూడా దగ్గరకొచ్చి వాళ్ల బరువును పరిశీలించారు. ఇద్దరమ్మయిలు వయసు తగ్గ బరువున్నారు. మూడో అమ్మాయి రమ్య మాత్రం బరువు చాలా తక్కువగా వున్నది.

“తొమ్మదో తరగతి కొచ్చావు రమ్యా. నీ వయసుకు తగ్గట్టుగా బరువు ఎత్తూ వుండాలి. కొంచెం బాగా తిను. రోజూ కోడిగుడ్డు తిని పాలు తాగావంటే బరువు పెరుగుతావు” అని సలహా ఇచ్చారు మాస్టారుగారు.

“మాస్టారూ కొంచెం మా ఎత్తు కూడా చూడండి” అంటూ స్టాండుకి తల ఆనించి నిటారుగా నిలబడ్డారు. ఆ స్టాండ్ మీదే కొలతలు గీసివున్నాయి.

“నేనెంత ఎత్తు వున్నానో, నేనెంత ఎత్తు వున్నానో” అంటూ ఉబలాట పడ్డారు ఆ అమ్మాయిలు.

మాస్టారు ఆ ఆడపిల్లల ఎత్తును స్కేల్ వున్న స్టాండ్ పై కొలిచి “మేం అన్ని క్లాసుల పిల్లలకూ ఏడాదిలో రెండు సార్లు బరువు చూస్తాం. ఎత్తూ కొలుస్తాం. మీరేదో ఆరాటం కొద్దీ ఇప్పుడు మళ్లా చూసుకుంటున్నారు. ఈ సంవత్సరం మొదట్లోనే ఎత్తు చూశాం కదా ఇంతలోకే ఏం పెరగరులే” అంటూ వాళ్ల, వాళ్ల ఎత్తులు నోట్ చేసి చెప్పారు.

“ఏయ్ రమ్యా మనం క్యారమ్ బోర్డు తీసుకందాం. నలుగురం ఆడుకోవచ్చు” అన్నది భవాని.

“ఎప్పుడూ క్యారమ్సేనా ఈ రోజు పిన్ బోర్డు అడిగి తెచ్చుకుని ఆడదాం.”

“సరే ఏదో ఒకటి తీసుకోండి. మరలా హాల్ బెల్ కొట్టే టైమయిపోతుంది” అని హడావుడి పడుతూ పిన్ బోర్డు అడిగి తెచ్చుకుని గేమ్స్ రూమ్ వరండాలో కొచ్చారు.

“మాస్టారూ మేమిక్కడ కూర్చుని ఆడుకుంటాం” అని చెప్పారు.

***

గోపాల్, అశోక్ లిద్దరూ గేమ్స్ రూమ్‌లో మాస్టారినడిగి చెస్ బోర్డు తీసుకున్నారు. అక్కడున్న టేబుల్ మీద ఆ బోర్డు పెట్టుకున్నారు. అశోక్ తెల్లపావులు, గోపాల్ నల్లపావులూ తీసుకున్నారు. ఆట నియమం ప్రకారం తెల్ల పావులు తీసుకున్న అశోక్ ఆట ప్రారంభించాడు. మొదట్లో వ్యాయామ ఉపాధ్యాయుడే చదరంగం ఆట నియమాలు, ఏ పావును ఏ పద్దతిలో కదపాలో నేర్పించారు. మూలలకు నడిపే పావులనూ, గడి దూకించే గుఱ్ఱాన్నీ, ఏనుగు గమనాన్నీ, బంటు కదలికలనూ, పావుల్ని చంపడం శత్రురాజును బంధించటం ఇవన్నీ గుర్తుపెట్టుకోవటానికీ పిల్లలకు కొన్ని పిరియడ్లు పట్టింది. ఇవన్నీ అశోక్ బాగా శ్రద్ధగా విని గుర్తు పెట్టుకున్నాడు.

డ్రిల్ క్లాసప్పుడు తప్పనిసరిగా డ్రిల్ చేస్తూ ఎక్సర్‌సైజులు చేయాల్సివుంటుంది. మిగతా గేమ్స్ పిరియడ్ అప్పుడు ఆడుకోవచ్చు. అందుకని అశోక్ ఎప్పుడు గేమ్స్ పిరియడ్ వున్నా వెంటనే వచ్చి చదరంగం బల్ల అడిగి తీసుకుంటాడు. ఆట వచ్చిన మరో స్నేహితుడినీ పిలుచుకొస్తాడు. ఎక్కువగా గోపాల్, అశోక్‌లే ఆడుతూ వుంటారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టంగా ఆడే ఆట ఇది. అశోక్‌కు కూడా రాను రాను చదరంగం అంటే బాగా ఇష్టం ఏర్పడింది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగానూ, బాలల దినోత్సవం సందర్భంగానూ పిల్లలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలతో పాటు రకరకాల ఆటల పోటీలు పెడుతూ వుంటారు. పోటీలలో గెలుపొందిన వారికి మంచి బహుమతులు సర్టిఫికెట్‌లు కూడా ఇస్తూవుంటారు. చదరంగం ఆటలో ఈ మధ్య అశోక్ బహుమతి గెలుచుకంటున్నాడు. బహుమతి వచ్చినప్పుడల్లా ఇంకా బాగా ఆడాలి. ఎక్కడకెళ్లినా చదరంగంలో నేనే గెలవాలి అని అనుకుంటున్నాడు.

ఇంట్లో వున్నప్పుడు కూడా తనకు ఖాళీగా వున్న సమయంలో చదరంగం బల్ల ముందు కూర్చుంటున్నాడు.

“అమ్మా నీ పని త్వరగా కానివ్వమ్మా. ఒక్క ఆట ఆడదాం” అంటూ తల్లినీ ఆమెకు ఖాళీ లేకపోతే చెల్లినీ బలవంతగా ఆట ముందు కుర్చోబెడుతున్నాడు. తను స్కూల్లో నేర్చుకున్నదంతా వాళ్ళిద్దరికీ నేర్పేశాడు. తల్లి బాగానే ఆడగలుగుతుంది. కాని చెల్లికి ఇంకా బాగా రావడం లేదు అనుకుంటాడు. ఎందుకంటే చెల్లితో ఆడితే ఆట త్వరగా అయిపోయి చెల్లి పక్షపు రాజుకు చెక్ పెట్టేస్తున్నాడు. తన రాజు చేత కోట కట్టేస్తున్నాడు.

“పో అన్నయ్యా ఎప్పుడూ నా రాజే ఓడిపోతున్నాడు” అంటూ బుంగమూతి పెట్టేస్తుంది చెల్లి.

“రేపు నువ్వే గెలుస్తావుగా చూడు” అంటూ చెల్లిని సముదాయిస్తాడు అశోక్.

రోజు రోజుకూ చదరంగం మీద ధ్యాస ఎక్కువవుతుంది. ఈ ధ్యాసలో పడి చదువెక్కడ అశ్రద్ద చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు.

ఆ భయంతోనే అశోక్ వాళ్ల నాన్నగారు అశోక్ చదివే తరగతి ఉపాధ్యాయుల్ని కలిసి మాట్లాడటానికి పాఠశాలకొచ్చారు.

“అశోక్ తరగతులు శ్రద్ధగానే వుంటాడు. పాఠాలన్నీ జాగ్రత్తగా వింటాడు. బాగా చదువుతాడు, మార్కులన్నీ బాగానే వున్నాయిగా” అని జవాబిచ్చారు వాళ్లు.

ఆ సమయానికి వ్యాయామ ఉపాధ్యాయుడు కూడా స్టాఫ్ రూమ్ కొచ్చారు.

“నేను తొమ్మిదో తరగతి బి సెక్షన్‌లో చదివే అశోక్ వాళ్ల నాన్నను” అంటూ మాస్టారికి పరిచయం చేసుకున్నాడు.

“ఓహ్ అశోక్ ఫాదరా మీరు. అశోక్ చాలా మంచి కుర్రాడండీ, డిసిప్లిన్డ్‍గా వుంటాడు. అన్నట్లు మీవాడికి చదరంగమంటే మా చెడ్డ ఇష్టం. మేము ఇక్కడ మాకు వీలయినంత కోచింగ్ ఇస్తున్నాం. బాగా ఎత్తులు వేస్తున్నాడు. మీరెక్కడైనా మంచి కోచింగ్ సెంటర్‌లో కూడా కొన్నాళ్లు కోచింగ్ ఇప్పిస్తే బాగుంటంది. దీన్ని గురించి ఆలోచంచండి” అన్నారాయన.

“ఆ విషయం మేం కూడా గమనించామండీ. ఇంట్లో తన హోమ్ వర్క్ పూర్తి కాగానే చదరంగం బల్ల ముందు కూర్చుంటున్నాడు. ఇంట్లో వాళ్ల అమ్మకూ చెల్లికి కూడా బాగా నేర్పి తనతో ఆడిస్తున్నాడు. మీరు చెప్పిన విషయం కూడా ఆలోచిస్తాం లెండి.”

“వచ్చే నెలలో జిల్లాస్థాయి టోర్నమెంట్ జరగబోతుంది. దాంట్లో పాల్గొనటానికి నేనూ అశోక్ వెళ్తాం. అక్కడకు దీన్ని గురించి బాగా తెలిసిన వాళ్లు రావచ్చు. కోచింగ్ సెంటర్ల వివరాలు నేను వాళ్లనడిగి అశోక్‌తో చెప్తాను లెండి” అన్నారు మాస్టారుగారు.

మళ్లీ శనివారమొచ్చింది. ఆఖరి పిరియడ్ ఈ రోజు కూడా డ్రిల్లు క్లాసు లేదు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుక పేరేడ్ స్కూల్లో జరగబోతుంది. ఆ రోజున స్కూల్ కొచ్చే అతిథులకు యన్.సి.సి, స్కౌట్ అండ్ గైడ్స్‌ విద్యార్థులు విన్యాసాలతో స్వాగతం చెప్తారు అని విన్యాసాలకు తర్ఫీదు ఇస్తున్నారు. అశోక్ కూడా దాంట్లో పాల్గొన్నాడు. ఆ తర్వత పంపు దగ్గరకెళ్లి మంచి నీళ్లు తాగేసి గబగబా గేమ్స్ రూమ్ కొచ్చారు. హాల్ బెల్ కొట్టటానికింకా పావు గంట సమయముంది. ఒక్కసారి చదరంగం పావుల్ని కదుపుతామని ఇటొచ్చాడు. మాస్టారు అక్కడేవున్నారు.

గేమ్స్ రూమ్‌లో చెల్లాచెదురుగా పడివున్న ఆట వస్తువుల్ని సర్దిస్తున్నారు. వాలీబాల్‌కూ, టెన్నీస్ ఆటకూ వాడే నెట్‌లన్నీ సరిగా మడిచి వాటి స్థానాల్లో పెట్టిస్తున్నారు.

అశోక్‌ను చూస్తూనే “చెస్ బోర్డు కోసమేనా?” అన్నారు. “నీకో విషయం చెప్పాలి. నేనీ మధ్య ఒక చోట చదివాను. విమానం ఆట, రైలు ఆట కూడా చదరంగం గళ్ల మీద ఆడిస్తూ విదేశాల్లో చదువు చెప్తున్నారట. అంటే చదువులో వెనుకబడి వున్నవాళ్లకు ఆసక్తి కుదిరేటట్లు చేసి వాళ్లకు పాఠాలు బాగా అర్థమయ్యేటట్లు చెయ్యటమన్నమాట. నాకీ విషయం బాగా నచ్చింది. అలాగే మన దేశంలో కూడా చదరంగం గళ్లమీదే భారతదేశ పటాన్ని ప్రపంచపటాన్ని గీస్తున్నారట. దేశపటం అంటే నదులూ, కొండలూ అన్నీ వస్తాయిగా. నదులు పుట్టిన చోటుకు మన పావు వెడితే ఆ దారంట పోతూ సముద్రంలో మునిగిపోతామన్నట్లే. రోడ్లు బాటలు వున్న గళ్లకు పావుల్ని నడిపితే మనం సాఫీగా వెళ్లిపోవచ్చు. అలాగే రాజుల చరిత్రలు కూడా చదరంగం బోర్టు మీద గీస్తున్నారట. రాజు ఎక్కడెక్కడ యుద్ధాలు చేసుకుంటూ గెలుస్తూ పోతాడో ఆ దారట. పావులను కదిపితే పావు బతుకుతుంది. రాజు ఓడిపోయిన చోట్లోకి పావు వెడితే మన పావు ఓడిపోతుంది. నాకీ వియాలన్నీ బాగా నచ్చాయి. నువ్వీ అంశాలలో అరవై నాలుగు గళ్లను విషయాన్ని విభజించుకుంటూ చదరంగం బోర్డును తయారు చెయ్యి. ఉదాహరణకు నువ్వు విమానం ఆటను తీసుకో ఎలాగంటే రన్‌వే మీద నుండి బయలుదేరటం, గాలి చక్కగా వీచటం. పెద్ద పెద్ద పక్షులు అడ్డు రాకుండా వుండటం, తుఫానులు ఏవీ రాకుండా వుండడం. విమానంలో ఇంధనం నిండుగా ఉండటం అనుకూల అంశాలు. ఇదేమీ సరిగా లేకపోవటం ప్రతికూల అంశాలు. ఈ ప్రతికూల అంశాలలోకి పావును నడిపితే ఎదుటివాడు పావును లాగేసుకోవచ్చు. ఇలాగన్నమాట. నేను చదివిన విషయాలు నీకు టూకీగా చెప్పాను. దీని ప్రకారం నువ్వు ఆలోచించుకుని నీకు తోచిన అంశాలను తీసుకో. ఆ అంశాలతో చదరంగం బోర్డును తయారు చేసుకో. నీకు బోలెడు మేథస్సు పెరుగుతుంది. మన స్కూల్లోని ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలతో వున్న బోర్డులను ఇస్తే, ఆ బోర్డులను చూపిస్తూ పాఠాలు చెప్తారు. పిల్లలు ఎంత ఉత్సాహంగా పాఠాలు వింటారు. నువ్వు చెయ్యగలవు. ఆలోచించు” అంటూ భుజం తట్టారు. ఆ రోజుకు హాల్ బెల్ అవటంతో పిల్లలందరూ గబగబా సామాన్లు సర్దేశారు.

అశోక్ డ్రిల్లు మాస్టారు చెప్పిన విషయాన్నే ఆలోచించుకుంటూ ఇంటి దారి పట్టాడు. రెండు మూడు రోజులు అదే విషయాన్ని గురించి బాగా ఆలోచించాడు. మాస్టారు చెప్పిన విషయాలు ఇంట్లో తల్లీకీ తండ్రికీ చెప్పాడు. అశోక్ వాళ్ళ అమ్మకు కూడా బాగా ఉత్సాహంగా అనిపించింది. ఆమె కూడా దీన్నీ గురించే తీవ్రంగా ఆలోచించింది. ఇదొక రకంగా ఒక లాంటి ప్రాజెక్ట్ వర్క్ అనుకున్నది. ఎలాగయినా ఒక బోర్డు అయినా కొడుకు చేత పూర్తి చేయించాలనుకున్నది. అశోక్ వాళ్ల నాన్నగారి చేత కొన్ని చార్టులు తెప్పించింది. రంగురుంగుల స్కెచ్ పెన్నులూ, స్కేలూ అశోక్ దగ్గర వుండనే వున్నాయి. వైకుంఠపాళీ ఆట గీసి వున్న చార్టు, చదరంగం గళ్లు గీసి వున్న చార్టూ దగ్గర, పెట్టుకుని బాగా పరిశీలనగా అశోక్‌తో పాటు వాడి అమ్మ, నాన్నలు కూడా చూశారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక అంచనా కొచ్చారు. చర్చించుకున్నారు. అశోక్ మనసులో ఒక రూపం ఊహించుకున్నాడు. తన ఆలోచనలను అమ్మ నాన్నలకు చెప్పాడు. వాళ్ళు సరే అన్నారు. డ్రిల్లు మాస్టారు కేవలం తను చదివిన విషయాలను గుర్తుపెట్టుమని నోటితో చెప్పారు. విమాన ప్రయాణం గీసి వున్న చదరంగపు చార్టు కాని, భారతదేశ పటం గీసి వున్న చదరంగం చార్టుకాని తామెవ్వరూ చూడలేదు. తామే స్వయంగా గీసుకోవాలి. ఎక్కడా తప్పుపోగూడదు. అన్ని గళ్లు ఖచ్చితంగా వుండాలి. ఒక గడిలో గీసిన గుర్తు మరో గడిలో వుండకూడదు. గజిబిజిగా వుండకుండా అన్నీ స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా వుండాలి. చదరంగం పావుల నడకకు అనుకూలంగా వుండాలి. ఆ చదరంగమాట ఆసక్తిగా వుండాలి. ఆడిన వాళ్లకు ఆ విషయాన్ని గురించి బాగా అవగాహన కలగాలి. ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ చదరంగం గళ్లను గీయాలి. ఏ సబ్జక్టులోనైనా క్లిష్టమైన విషయాన్నయినా ఈ విధానం ద్వారా బోధిస్తే పిల్లలకు బాగా అర్థమవుతుంది అన్పించింది.

వారం రోజులు కష్టపడి అశోక్ వాళ్ల అమ్మా, నాన్నా సహాయంతో ‘విమాన గమ్యం’ అనే చదరంగపు బోర్డును తయారుచేశాడు. ఈ బోర్డు తప్పులేమీ లేకుండానే వచ్చింది. అశోక్‌కు బాగా ఉత్సాహమనిపించింది. ఆ బోర్డును గీస్తువుంటే అశోక్‌కు తన చేతిలోని పావులు ముందుకెలా వెళ్లాలో మరింత బాగా తెలిసింది. ఇంకొన్ని విషయాల మీద అంటే భారతదేశ స్వరూపం ఇంగ్లీషు ఉపవాచకంలోని సిండ్రిల్లా కథను ఆధారంగా చేసుకుని మరి రెండు చదరంగపు గళ్ల చార్టులను తయారు చేశాడు. బాగా సంతృప్తిగా అన్పించింది. వాటిని తీసుకెళ్లి డ్రిల్ మాస్టారికి చూపించాడు.

తన నోటితో చప్పిన విషయాలను ఇంత చక్కటి, అబ్బురపరిచే చార్టులను తయారు చేసి తీసుకొచ్చాడని మాస్టారు ఆనందంతో తనమునకలయ్యారు. అశోక్ తెలివితేటలకు ఎంతో ముచ్చటపడ్డారు. ఆ ఉదయపు స్కూల్ అసెంబ్లీ సమావేశమయ్యాక అశోక్‌నూ అతను వేసిన చార్ట్‌లనూ తీసుకుని హెడ్‌మాస్టారి దగ్గరకు తీసుకెళ్లారు. విషయంమంతా వివరించారు.

చదరంగపు గళ్ల ఆధారంగా తయారయిన చార్డులను చూసి హెడ్‌మాస్టారు ముగ్ధులే అయ్యారు. ఆయన ఇంగ్లీషు బోధిస్తారు. ఆ సాయంకాలమే స్కూల్‌లోని పిల్లల్ని ఉపాధ్యాయుల్నీ అందర్నీ సమావేశపరిచారు. చార్టుల్ని తయారు చేసిన అశోక్‌నూ, ప్రోత్సహించిన డ్రిల్ మాస్టారుగారినీ అందరి ముందుకు పిలిచి విషయం చెప్పారు. వారిద్దరినీ ఎంతగానో అభినందించారు. కాస్త ప్రోత్సాహమిస్తే ఎంత కష్టమయిన పనులయినా చేయగలరని ఇదే ఉదాహరణగా గుర్తు పెట్టుకోండని చెప్పారు. తన సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ఉపవాచకాన్ని బోధిస్తూ వుంటారు. అందులోని సిండ్రిల్లా కథను గుర్తు చేశారు. సిండ్రిల్లా తన జీవితంలో వచ్చిన అవరోధాలను దాటుకుంటూ  రాజకుమారుణ్ణి ఎలా పెళ్లాడిందో చెప్పారు. ఆమెకు ఇంట్లో తల్లి, సవతి చెల్లెళ్లు పెట్టిన కష్టాలున్న గడికి కానీ, ఆమె చెప్పు జారిపోయిన చోటికి గానీ పావు జరిపినా పావు ముందుకు పోలేదని వివరిస్తూ ఆ చరదరంగపు చార్టును బ్లాక్ బోర్డ్‌కు తగిలించి మరీ వివరించి చెప్పారు. వినే పిల్లల్లో చాలా మందికి ఆసక్తి కలిగింది. ఉపాధ్యాయిలందరూ అశోక్‌ని అభినందించారు. రేపటి తను క్లాసుల్లో కూడా ఈ చార్టుల్ని ఉపయోగించి పిల్లలకు బోధిస్తామని చెప్పారు.

స్కూల్లో జరిగిన విషయాలన్నీ అశోక్ ఇంట్లో అమ్మ, నాన్నలకు చెప్పాడు. వాళ్లు సంతోషించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు జిల్లాస్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ ఎగ్జిబిషన్‌లో ఈ స్కూల్ పిల్లలు కూడా తాము తయారు చేసిన అంశాలతో సహా పాల్గొన్నారు. వాళ్లు తయారు చేసిన మిగతా సైన్స్ అంశాలతో పాటు అశోక్ కూడా తను తయారు చేసిన చదరంగపు చార్టులతో పాల్గొన్నాడు. ఆ ఆటను ఆడే పద్దతిని కూడా సందర్శకులకు వివరించాడు. ఎంతో మంది ఉపాధ్యాయిలు వేల మంది విద్యార్థులు ఆ ఎగ్జిబిషన్‌లో పాల్గోంటారు. వాళ్లలో చాలా మందికి ఈ బోర్డులు బాగా నచ్చాయి. జిల్లా విద్యాశాఖాధికారిగారు కూడా బాగా మెచ్చుకున్నారు. పిల్లలు తయారు చేసిన అంశాలను పరీక్షించి మార్కులు వేసే జడ్జీలైతే ఒకటికి రెండు సార్లు అశోక్ నడిగి వీటి గురించి చెప్పించుకున్నారు. వాళ్లకూ ఎంతో నచ్చింది. ఆ సంవత్సరపు సైన్స్ ఎగ్జిబిషన్‌లో అశోక్ వేసిన చదరంగపు చార్డులకు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు.

చదరంగం మీదున్న ఇష్టంతో డ్రిల్ మాస్టారిచ్చిన ప్రోత్సాహంతో తానీ బోర్డులు తయారు చేశానని చెప్పాడు అశోక్. ఇలా చదరంగం ఆట ద్వారా చదువు నేర్పిస్తే అటు చదరంగం ఆటా ఇటు చదువూ సులువుగా పిల్లలకు అర్థమవుతుందని చాలా మంది ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

నానాటికి చదరంగం ఆట పట్ల అశోక్‌కు ఇష్టం పెరిగిపోసాగింది. రోజులు గడిచే కొద్దికీ పావులు కదపటంలో మరిన్ని మెళకువలు ఒంటబట్టించుకున్నాడు.

చదరంగం ఆట మీద వచ్చిన పుస్తకాలను తెలుసుకుని, పుస్తకాల షాపుకు ఆర్డర్ పెట్టి ఆ పుస్తకాలను తెప్పించి అశోక్ కిచ్చారు హెడ్ మాస్టారు.

రోటరీ క్లబ్ చదరంగపు పోటీలు నిర్వహించింది. విజేతగా అశోక్ మిగిలాడు.

***

అశోక్‌కు స్కూల్ చదువు పూర్తయింది. “కాలేజీలో చేరిన తర్వాత కూడా ఈ ఆటను కొనసాగించు. వెంటనే మంచి కోచింగ్ సెంటర్‌లో చేరు. నీ ఆట తీరు మరింత మెరుగు పడుతుంది. నీ వలన మన స్కూల్‌కు చాలా మంచి పేరు వచ్చింది. అలాగే నువ్వు చదవబోయే కాలేజీక్కూడా మంచి పేరు తీసుకురా” అంటూ అతణ్ణి సాగనంపారు స్కూల్ సిబ్బంది అంతా.

విశాఖపట్నంలో వున్న కోచింగ్ సెంటర్‌లో చేరాడు అశోక్. వాళ్ల నాన్నే వెంట పెట్టుకుని వెళ్లాడు. వాళ్ల నాన్నకే శ్రద్ధ ఎక్కువ కలిగింది. కోచింగ్ పూర్తి చేసుకొని తండ్రి కొడుకులు తిరిగి ఇంటి కొచ్చారు.

అశోక్ రాష్ట్ర అసోసియేషన్ వాళ్లు నిర్వహించే రాష్ట్రస్థాయి ఓపెన్ చదరంగం పోటీలో పాల్గొన్నాడు. అశోక్ ద్వితీయ బహుమతికి ఎంపికయ్యాడని తెలిసింది.

“అరరే బాడ్ లక్. నీకింకా కోచింగ్ సరిపోలేదు. లేకపోతే రెండవ స్థానం రావటమేంటి” అని అందరూ అశోక్‌ని ఓదార్చారు.

అందరూ అనుకున్నట్లుగా అశోక్ ఏమీ బాధ పడలేదు. అంత మంది ఆటగాళ్లను ఒకే చోట చూడగలగటం అందునా దాదాపు నాలుగొందల మందిని ఒకే చోట చూడగలిగామన్న తృప్తి వాళ్ల ఆట తీరును గమనించే అవకాశం దొరికినందుకు సంతోషించాడు. వాళ్లలో కొంత మంది అనుభవాలను తెలిసికోగలిగాడు.

చదరంగపు గళ్లలో వివిధ విషయాలను పిల్లల కోసం రూపొందిచాడని తెలుసుకున్న రాష్ట్ర అసోసియేషన్ వారు ప్రత్యేకంగా అశోక్‌ని అభినందించారు. ఆ యా విషయాలను పరిచయం చేయమని అశోక్‌నే అడిగారు.

కొద్ది రోజుల్లో జాతీయ స్థాయిలో పోటీలు జరుగబోతున్నాయి. వాటిలో పాల్గొనటానికి తయారవుతున్నాడు అశోక్. ఇప్పుడు చదరంగం ఆడే వాళ్ల మధ్య ప్రేక్షకుల మధ్య అశోక్ పేరు మార్మోగుతున్నది.

ఈలోపున ద్రోణవల్లి హారిక, కోనేరు హంపిలాంటి చదరంగపు ఆటగాళ్ల దగ్గర కొన్ని విషయలను అడిగి తెలిసికొని వచ్చాడు. విశ్వనాథ్ ఆనంద్ ఆడిన గేమ్‌కు సీడీలు తెప్పించుకుని చూస్తున్నాడు. తెలిసినవారు ఎంతో మంది ఈ జాతీయస్థాయి పోటీలలోని విజేత కావాలని అభిలషించారు.

మరో పక్క చాలా మంది స్కూల్ టీచర్లు అశోక్ దగ్గరకొస్తున్నారు. అశోక్ తయారు చేసిన పాఠ్యాంశాల, జనరల్ విషయాల చదరంగపు బోర్టులను గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. “మా కోసం కూడా కొన్ని చార్టులు తయారు చేసి ఇవ్వగలరా” అని అడుగుతున్నారు. ఇంకా “స్కూల్లోని పిల్లలతో మేమూ ఈ చార్టులిచ్చి చదరంగం ఆడిస్తాం” అని కూడా చెప్తున్నారు.

చదరంగం పావులతోని రాజు చేత కోట కట్టించటం అనే ఆటను ఎంత తెలివిగా ఆడుతున్నారో అంతే తెలివిగా ఈ చదరంగపు విభిన్న అంశాలతో కూడిన చార్టులను తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు అశోక్ మేధాశక్తి, అతని విషయ పరిజ్ఞానం గురించి చాలా దూరం వరకూ చెప్పుకోసాగారు. అశోక్ తయారు చేసిన చార్టులు ఒక అద్బుత పాఠ్యాంశంగా వర్ణిస్తున్నారు. స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశాలు రూపొందించే ప్రభుత్వ అకాడమి దృష్టికి కూడా ఈ విషయం వచ్చింది.

ఇంటర్నెట్‌లో చదరంగపు ఆటలు చూస్తూ తన బుద్ధికి మరింత పదును పెట్టుకుంటూన్నాడు. ఎట్టకేలకు జాతీయ స్థాయి చదరంగంపు పోటీలలో అశోక్ విజేతగా నిలిచాడు.

ఆ తర్వాత తన దృష్టిని అంతర్జాతీయ పోటీలపై పెట్టాడు. ప్రతి రెండేళ్లకోకసారి జరిగే చెస్ ఒలంపిక్స్‌లో విజేత కావాలన్నదే ఇప్పుడు అశోక్ లక్ష్యం. దాని కోసం వరల్డ్ చెస్ ఫెడరేషన్‌‌లో చర్చలు జరుపుతున్నాడు.

అంతర్జాతీయ పోటీల కోసం అంతర్జాతీయ ఆటగాళ్ల ఆటలను ఆన్‌లైన్‌లో చూస్తున్నాడు. 1999లో ప్రపంచ ఛాంపియన్ అయిన గారి కాస్పరోవ్ కంప్యూటర్ సృష్టి అయిన దీప్‌బ్లూ చేతిలో ఓడిపోయిన ఆటను మరింత శ్రధ్దగా చూశాడు. ఇలాంటి అంతర్జాతీయ ఆటగాళ్ల ఆటలను నిశితంగా పరిశీలస్తున్నాడు.

అశోక్ తాను ఎంత స్థాయి కెదిగినా తనకు సలహాలనిచ్చిన తన కెంతో ప్రోత్సాహించిన డ్రిల్ మాస్టారిని మాత్రం రోజూ జ్ఞాపకం చేసుకుని మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here