“బెదరు పాటు పెంచి భీతిని కలిగించి చదువు నేర్పఁ బూన సరియు కాదు” అంటూ, చదువు కన్న గొప్పవైన సాత్విక వర్తన, శ్రమైక జీవనం పిల్లలకి నేర్పాలంటున్నారు బుసిరాజు లక్ష్మిదేవి దేశాయి ఈ పద్యకవితలో.
ఆటవెలది:
చదువు బాల్యమందు చక్కనయినతోడు
చదువు లందు భయము నదరు కాదు
బెదరు పాటు పెంచి భీతిని కలిగించి
చదువు నేర్పఁ బూన సరియు కాదు.
ప్రతిభ రుచియు నెందు పరిఢవిల్ల గలదొ
బాలలదియె చదువ పాడి యగును
స్పర్ధ తోడ మరియు పంతమ్ము తోడను
బాలలను తరుముట పాడి గాదు.
సంఘమందు నెల్ల జనులకు వలసిన
చక్కనైన దైన చదువు చాలు
చదువు లందు నొకటి కొదువగ తలచుచు
నొకటి మేటి యనుట నొప్పుకాదు.
ఒప్పుగలుగు గుణములొద్దిక తోడను
మనుట నేర్పవలయు మనుజులకును
ఒకరి కొఱకు నెల్లరొకరు నెల్లరకును
మనిన శుభముఁ గలుగు మహిని సతము.
చదువు కన్న గొప్ప సాత్విక వర్తన
నొరులకెపుడు హాని నొసగకున్న
చదువు కన్న గొప్ప శ్రమియించు జీవన
మనుటయందు గలదె యతిశయమ్ము?