[dropcap]జీ[/dropcap]వన గమనంలో గమ్యం చూపుతూ
ఆశయ తీరాల ఒడ్డున చేర్చే చుక్కాని
బ్రతుకు తెరువు చూపు భాగ్యరేఖ ‘చదువు’
చీకటి బ్రతుకులలో చిరుదివ్వెలు వెలిగిస్తూ
జీవం పోసి పునర్జన్మనిచ్చే దివ్య ఔషధం
నిత్య చైతన్యం చెందే కాంతిరేఖ ‘చదువు’
కర్మాగారాలలో కాలుతున్న బాల్యాన్ని గుర్తించి
తన ఒడి లో చేర్చుకుని భవిష్యత్‌ను నిర్దేశించేది
బాలల బంగారు జీవితానికి జీవన రేఖ ‘చదువు’
అనాధ వీధి బాలలకు బాసగా నిలుస్తూ
పాఠశాలలో కుటుంబాన్ని పరిచయం చేసే
ఆత్మీయతను పంచే ప్రేమ రేఖ ‘చదువు’
ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగని నినదిస్తూ
బాల్యవివాహ వ్యవస్థను రూపుమాపేది
మహిళ బ్రతుకు బాటలో వెలుగు రేఖ ‘చదువు’