[box type=’note’ fontsize=’16’] సకల చరాచర సృష్టిలో వివిధ రూపాలలో గోచరించే “చైతన్యం” గురించి వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు ఈ వచన కవితలో. [/box]
[dropcap]చి[/dropcap]గురుల వగరులు తిన్న
గండుకోయిల గానానివి నీవు
మట్టిపొరల చీల్చుకవచ్చిన
చిన్నారి మొక్క ప్రాణానివి నీవు
ఆకాశాన అందంగా వెలిసిన
రంగుల హరివిల్లువి నీవు
వేసవి వేడిని చల్లబరిచిన
తొలకరి చిరుజల్లువి నీవు
మంచుకొండ అంచులనుండి
జారిన హిమపాతానివి నీవు
కొండకొమ్ము చివరలనుండి
దూకిన జలపాతానివి నీవు
జగతిని జాగృత పరిచిన
తెల్లని వన్నెల వెలుగువి నీవు
రేయిని బంగరు సొబగులద్దిన
చల్లని వెన్నెల జిలుగువి నీవు
నిశ్చలతను నిద్దురలేపి
కదలించిన కర్మవు నీవు
మౌనానికి మాటలు నేర్పి
పలికించిన గురువువి నీవు
వికసించిన కుసుమం నీవు
విహరించే భ్రమరం నీవు
ఎగిరెళ్లిన విహంగం నీవు
పడగెత్తిన భుజంగం నీవు
ప్రవహించే యేరువి నీవు
ఇరుజాతుల పోరువి నీవు
చైతన్యం,
అఖిల జగతి చలనం నీవు !
చైతన్యం,
సకల జీవజాతి ప్రాణం నీవు !!